అబ్బాయి తరఫువాళ్లకు బలవంతంగా మీసాలు, జుట్టు కట్ చేశారని రూ.11లక్షల జరిమానా విధించిన పంచాయతీ

- రచయిత, మోహర్ సింగ్ మీణా
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాజస్థాన్ లో వేర్వేరు గ్రామాలకు చెందిన రెండు కుటుంబాల తగాదాలో జిల్లా మహాపంచాయతి తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
ఇటీవల మహాపంచాయతి రోంసి గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి రూ. 11 లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇంత భారీ జరిమానాను విధించడానికి కారణమేంటి?
రోంసి గ్రామానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరిరి గ్రామంలో నివసిస్తున్న ఒక వ్యక్తి మీసాలను, జుట్టును బలవంతంగా కత్తిరించి, ఆ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీశారంటూ మహాపంచాయతి ఈ నిర్ణయం తీసుకుంది.
అంతే కాకుండా 15 రోజుల్లోపు ఈ జరిమానాను చెల్లించకపోతే గ్రామం మొత్తాన్ని కమ్యూనిటీ నుంచి వెలివేస్తామని హెచ్చరించింది.
మహాపంచాయతి ఒత్తిడితో రోంసీ గ్రామానికి చెందిన ఆ కుటుంబం రూ. 11 లక్షల జరిమానాను చెల్లించింది.


ఫొటో సోర్స్, BBC/ మోహర్ సింగ్ మీనా
అసలింతకీ ఎం జరిగింది?
కరిరి గ్రామస్థుడు బాబూలాల్, తన కొడుకు కమలేశ్‌కు రోంసీ గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో పెళ్ళి నిశ్చయించారు. ఈ సంబంధాన్ని కుదర్చడానికి బాబూలాల్ తన బంధువు శ్రీమాన్ పటేల్ సాయం తీసుకున్నారు.
ఇరు కుటుంబాలు ఒకరిని ఒకరు చూసుకోలేదు, కలుసుకోలేదు. అమ్మాయి అబ్బాయి కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. సంబంధం ఖాయమయ్యాక, ఫోన్ల ద్వారా మాట్లాడుకున్నారంతే.
నిశ్చితార్థం కోసం జనవరి 17 న బాబూలాల్ తన కుటుంబం, బంధువులతో కలిసి రోంసీ గ్రామానికి వెళ్లారు. కానీ కార్యక్రమం మొదలుకాక ముందే అబ్బాయి తరఫు వాళ్ళు సంబంధాన్ని వద్దనుకున్నారు.
ఇది మొత్తం రోంసీ గ్రామానికి అవమానకరమని ఆ గ్రామస్థులు భావించారు.
ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగి, అమ్మాయి తరపు వాళ్ళు, అబ్బాయి కమలేశ్ సోదరుడైన నరేశ్ జుట్టును, మీసాలను బలవంతంగా కత్తిరించారు. ఆ తతంగం మొత్తాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
దీంతో ఈ ఘటనను తమ గ్రామానికి అవమానంగా భావించారు అబ్బాయి తరఫు కరీరీ గ్రామస్థులు.
అయితే, ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ వివాదం ముదురుతుండడంతో పరిస్థితిని సర్ది చెప్పడానికి ఒక మహా పంచాయతీ పెట్టించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు.
‘‘పోలీసు కేసు పెట్టాలని మేము రెండు పక్షాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసాం. వాళ్ళు ఎంతకీ ఫిర్యాదు చేయట్లేదు. కాబట్టి మేము ఈ ఘటనలో జోక్యం చేసుకోలేము.’’ అని స్థానిక డిప్యూటీ ఎస్పీ మురారీ లాల్ బీబీసీతో చెప్పారు.
మహా పంచాయతీ జారీ చేసిన ఈ జరిమానా అదేశాలు చట్టపరంగా నేరమని, పోలీసులు దీనిపై స్వయంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చని రాజస్థాన్ హైకోర్టు లాయర్ అఖిల్ చౌదరి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, BBC/ మోహర్ సింగ్ మీనా
ఈ విషయాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన మహాపంచాయతి నిర్వహణ కోసం రూ. 1 కోటీ 5ం లక్షలను సేకరించినట్లు కరిరి సర్పంచ్ ప్రతినిధి పూరణ్ సింగ్ తెలిపారు.
మహా పంచాయతీ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు లక్షమంది హాజరయ్యారని పూరణ్ సింగ్ చెప్పారు.
మధ్యవర్తి శ్రీమాన్ పటేల్, కమలేశ్ (నరేశ్ సోదరుడు)ల వాంగ్మూలాను విన్నది. అనంతరం 21 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మధ్యవర్తిని, అమ్మాయి తరపు కుటుంబాన్ని ఈ కమిటీ దోషులుగా ప్రకటించింది.
‘‘అమ్మాయి తరపు కుటుంబం రూ. 11 లక్షల జరిమానాను చెల్లించాలి. 15 రోజుల గడువులో ఈ డబ్బులు చెల్లించనిపక్షాన రోంసీ గ్రామాన్ని మన కమ్యూనిటీ నుంచి బహిష్కరిస్తాం. దీంతోపాటు ఇద్దరు మధ్యవర్తులు ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున జరిమానా కట్టాలి. అబ్బాయి తరఫువాళ్లకు శిక్ష ప్రకటించిన ఇద్దరు గ్రామపంచాయతీ సభ్యులు కూడా ఒక్కొక్కరు రూ. 1100 జరిమానా కట్టాలి. వాళ్లిద్దరూ ఇకపై పంచాయతీల్లో పాల్గొనకూడదు.’’ అని ప్రకటించారు.
మహాపంచాయతీ కమిటీ తీసుకున్న నిర్ణయానికి అందరు సమ్మతం తెలపాలని, ఒకవేళ భవిష్యత్తులో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళితే ఆయా వ్యక్తులను కూడా దోషులుగా మీణా కమ్యూనిటీ పరిగణిస్తుందని హెచ్చరించింది పంచాయతీ.

ఫొటో సోర్స్, BBC/ మోహర్ సింగ్ మీనా
రోంసీ గ్రామంలో అమ్మాయి తరపు కుటుంబాన్ని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నం చేసింది. ఆ ఇంటి చుట్టూ చాలామంది కాపలాగా ఉన్నారు.
అమ్మాయి తాత బీబీసీతో మాట్లాడేందుకు అంగీకరించారు. ఆయన చెప్పినదాని ప్రకారం...
‘‘జనవరి 11న అబ్బాయి తండ్రి బాబూలాల్ బంధువు శ్రీమాన్ పటేల్ (మధ్యవర్తి) పెళ్లి సంబంధం గురించి మాతో మాట్లాడేందుకు ఇంటికి వచ్చారు. అమ్మాయిని చూసి, సంబంధం ఖరారు చేస్తూ ఒక కానుక కూడా ఇచ్చి వెళ్లారు.
మేము అబ్బాయినిగానీ, వాళ్ళ కుటుంబాన్నిగానీ చూడలేదు. అమ్మాయిని చూడాలని అనేకసార్లు బాబూలాల్‌ను మా ఇంటికి ఆహ్వానించాం. కానీ ఆయన ఎప్పుడు రాలేదు. ఇంకా మాటలన్నీ అయిపోయాక సంబంధం కుదిరిన తరువాత దాదాపు 20 మంది మా ఇంటికి వచ్చారు. ఏమైందో తెలీదు, సంబంధం వద్దనుకున్నారు. మేమెంత మాట్లాడేందుకు ప్రయత్నించినా మా మాట వినకుండా వెళ్లిపోయారు.’’ అని ఆయన అన్నారు.
కమలేశ్ సోదరుడు నరేశ్ మీసాలను, జుట్టును కత్తిరించినందుకు మీరు బాధపడుతున్నారా అని అడిగినప్పుడు..
‘‘నరేశ్ మమ్మల్ని దుర్భాషలాడాడు. మేం కోపంతో చేశామో, రెచ్చగొడితే చేశామో మీరే ఊహించుకోండి’’ అని అన్నారు.
మహా పంచాయత్ నిర్ణయం గురించి అడిగినప్పుడు...‘‘పంచాయత్ గురించి మాకు ఎవరు సమాచారం ఇవ్వలేదు. మా వాదన వినలేదు. కానీ వారి శిక్షను మేము అంగీకరిస్తున్నాం.’’ అన్నారు.
మరి జరిమానా డబ్బులు ఏమవుతాయి, ఎవరికీ చెందుతాయి అని పంచాయతీ కమిటీ సభ్యుడు మదన్ మోహన్‌ను అడిగినప్పుడు,
‘‘ఈ డబ్బులు అబ్బాయి తరఫు వాళ్లకు వెళ్లవు. రూ. 11 లక్షలు కరిరి గ్రామానికి ఇచ్చేస్తున్నాం. వారు దీన్ని దేవాలయాలకు, పాఠశాలలకు, ఇలా వాళ్లకు తోచినట్టుగా ఊరి మీద ఖర్చు చేసుకుంటారు. ఇది కాకుండా మధ్యవర్తుల నుంచి కూడా రూ. 2 లక్షలు రానున్నాయి. శిక్షను అంగీకరించి జరిమానా చెల్లించారు కాబట్టి రోంసీ గ్రామాన్ని మేము బహిష్కరించం’’ అని మదన్ మోహన్ తెలిపారు.
‘‘గతంలో అనేకసార్లు ఖాప్ పంచాయత్‌లు, కుల పంచాయత్‌లు వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. పంచాయత్‌లు విధించే జరిమానాలు చట్టవిరుద్ధమని కోర్టులు చాలాసార్లు ప్రకటించాయి. కుల సంఘాలకు ఖాప్ పంచాయత్‌లకు జరిమానా విధించే హక్కులేదు.’’ అని న్యాయవాది అఖిల్ చౌదరి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








