బందీల విడుదలను హమాస్ హఠాత్తుగా ఎందుకు వాయిదా వేసింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పాల్ ఆడమ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయాల్సిన నిర్ణీత గడవు దగ్గరపడుతున్న వేళ, ఆ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు హమాస్ ఎందుకు ప్రకటించింది? బందీల విడుదలలో జాప్యాన్ని ఎందుకు పెంచుతోంది?
ఇది 'ఇజ్రాయెల్‌కు హెచ్చరిక' అని హమాస్ తన టెలిగ్రామ్ ఛానల్‌లో పేర్కొంది. ఇజ్రాయెల్ తన బాధ్యతలను నెరవేర్చేలా ఒత్తిడి చేసేందుకు మధ్యవర్తులకు మరింత సమయం ఇస్తున్నట్లు ప్రకటించింది.
అంతేకాదు, బందీల విడుదలకు నిర్ణీత గడువైన శనివారంనాడు యధావిధిగా జరగడానికి ఇంకా 'తలుపులు తెరిచే ఉన్నాయి' అని పేర్కొంది. కాగా, ప్రస్తుత ప్రతిష్టంభనకు పరిష్కారం కోసం సమయం ఇస్తున్నట్లు కూడా ఆ ప్రకటన తీరు చూస్తే తెలుస్తోంది.

బహిష్కరణ భయం..
గాజాలో నిరాశ్రయులైనవారు తిరిగి రావడానికి ఆలస్యం అయ్యేలా చేయడం, వారిపై వారిపై కొనసాగుతున్న కాల్పులు, గాజాలోకి మానవతా సహాయాన్ని అనుమతించడంలో ఇజ్రాయెల్ పెడుతున్న ఇబ్బందులను హమాస్ తన ప్రకటనలో ఏకరువుపెట్టింది.
ఇళ్లు ధ్వంసమై తలదాచుకోవడానికి చోటులేనివారి కోసం గాజాలోకి కారవాన్‌లను అనుమతించేందుకు ఇజ్రాయెల్ ఇష్టపడటం లేదని హమాస్‌తో సంబంధం లేని ఇతర పాలస్తీనా అధికారులు పేర్కొంటున్నారు.
ఓవైపు, పౌరులు గాజా విడిచి వెళ్లేలా ప్రోత్సహిస్తూ ఇజ్రాయెల్ కొన్ని మార్గాలను బహిరంగంగా ప్రకటిస్తోంది. అదే సమయంలో తాత్కాలిక ఆశ్రయాల మంజూరుకు అనుమతులు ఆలస్యం చేస్తుండటం పాలస్తీనియన్లలో బహిష్కరణ భయాలను పెంచుతోంది. డోనల్డ్ ట్రంప్ చర్యలు ఈ భయాన్ని మరింత పెంచుతున్నాయి.
గాజాను పునర్నిర్మించేటప్పుడు చాలామంది పాలస్తీనియన్లు బయటికు వెళ్లాలని మొదట సూచనగా చెప్పారు. ఇప్పుడు గాజాను అమెరికా ఆధీనంలోకి తీసుకుంటానని చెప్పడంతో అంతా మారిపోయింది. గాజాను అందరూ విడిచివెళ్లాలని అమెరికా అధ్యక్షుడి డిమాండ్‌గా మారింది.
ట్రంప్ ఇలాంటి ఆలోచనలో ఉండటంతో గాజాలో రెండో దఫా కాల్పుల విరమణ చర్చలు ఎంతవరకు కరెక్టు, ఇవన్నీ దేనికి? అని హమాస్ అనుకుంటూ ఉండవచ్చు.
ట్రంప్ సీరియస్‌గా ఉంటే.. గాజాను ఇజ్రాయెల్ ఖాళీ చేయిస్తుందని పాలస్తీనియన్లకు తెలుసు. ప్రజలకు వారి ఆశ్రయం దూరం చేస్తే సరిపోదు, పూర్తిగా ఖాళీ చేయించడానికి బలగాలు అవసరం పడతాయి.
బందీలుగా ఉన్న వారందరినీ శనివారం నాటికి తిరిగి అప్పగించకపోతే, కాల్పుల విరమణను రద్దు చేయాలని ప్రతిపాదిస్తానని ట్రంప్ హెచ్చరించారు. కానీ, ఇజ్రాయెల్ తన ప్రతిపాదనను తిరస్కరించవచ్చని కూడా అన్నారు.
యుద్ధం పునఃప్రారంభం అయ్యే ప్రమాదం ఉంటే మిగిలిన బందీలను ఎందుకు విడుదల చేయాలని హమాస్ అనుకోవచ్చు. బందీల బంధువులు, స్నేహితులకు ప్రస్తుత ప్రతిష్ఠంభనతో పాటు ట్రంప్ బహిరంగ వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ దూకుడు తగ్గించాలి: బందీల బంధువులు
"ఈ ప్రకటనలు హమాస్‌ను మరింత మొండిగా మారుస్తాయి" అని హమాస్ చేతిలో ఇప్పటికీ బందీగా ఉన్న ఒమర్ షెమ్ తోవ్ బంధువు డూడీ జల్మనోవిచ్ అన్నారు.
ట్రంప్ దూకుడు తగ్గిస్తే బాగుంటుందని జల్మనోవిచ్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు, మిగిలిన బందీల విడుదలను ఆలస్యం చేస్తామని హమాస్ బెదిరించడంపై ఇజ్రాయెల్‌కు సందేహాలున్నాయి.
వారాంతంలో బక్కచిక్కిపోయిన బందీలను విడుదల చేయడం వారిలో భయాన్ని పెంచింది. ఇతర బందీలను హమాస్ మరింత దారుణమైన పరిస్థితుల్లో చూపించకూడదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పగటిపూట ఆయుధాలతో కవాతు చేస్తున్న హమాస్ ఫైటర్ల చిత్రాలతో పాటు, మాజీ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ నుంచి వచ్చిన హెచ్చరికలు ఇజ్రాయెల్‌కు తెలుసు. యుద్ధంలో ఎంతమంది ఫైటర్లు మరణించారో అంతమందిని హమాస్ తిరిగి రిక్రూట్ చేసుకుందని భావిస్తున్నట్లు బ్లింకెన్ చెప్పారు.
ఈ చర్చల ప్రక్రియ విఫలమవుతుందని చాలామంది అంచనా వేస్తున్నప్పటికీ, అలా జరుగుతుందని ఇపుడే చెప్పడం తొందరపాటు. అయితే, ఈ ప్రక్రియ మాత్రం మరింత ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ఫొటో సోర్స్, Reuters
నెతన్యాహు ఏమన్నారు?
"బతికున్న, చనిపోయిన బందీలందరినీ తిరిగి తీసుకొచ్చే వరకు మేం బలమైన, స్థిరమైన చర్యలను కొనసాగిస్తాం" అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ష్లోమో మన్సూర్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
దేశాన్ని నిర్మించిన వారిలో ష్లోమో మన్సూర్ ఒకరని నెతన్యాహు తెలిపారు. 2023 అక్టోబర్ 7న జరిగిన దాడుల్లో ష్లోమో చనిపోయారని, ఆయన మృతదేహాన్ని గాజాకు తీసుకుపోయారని చెప్పారు.
"ఆయన మృతదేహాన్నిఇజ్రాయెల్‌కు తిరిగి తీసుకువచ్చే వరకు మేం విశ్రమించం, నిశ్శబ్దంగా ఉండబోం" అని నెతన్యాహు అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














