గాజా: విడుదలైన ఐదుగురు తమ బందీలకు థాయ్‌లాండ్ ప్రభుత్వం ఎంత డబ్బు ఇస్తుందంటే...

థాయ్‌లాండ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత విలేఖరుల సమావేశంలో...

గత నెలలో గాజాలో హమాస్ విడుదల చేసిన ఐదుగురు థాయ్‌లాండ్ వ్యవసాయ కార్మికులు దాదాపు 500 రోజులు నిర్బంధంలో గడిపిన తర్వాత బ్యాంకాక్‌కు తిరిగి వచ్చారు.

2023 అక్టోబర్ 7న హమాస్ దాడుల సమయంలో కిడ్నాప్‌కి గురయినప్పుడు..పొంగ్సాక్ థేన్నా, సాథియన్ సువన్నాఖం, వాచారా శ్రీఔన్, బన్నావత్ సాథావో, సురాసక్ లామ్నావో దక్షిణ ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్నారు.

ఆదివారం ఉదయం బ్యాంకాక్ సువర్ణభూమి విమానాశ్రయంలో ఈ ఐదుగురు వ్యక్తులను తమ కుటుంబ సభ్యులు కలిసినప్పుడు భావోద్వేగానికి లోనయ్యారు. గుండెలకు హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు.

"ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు" అని విడుదలైన బందీ పోంగ్సాక్ అన్నారు.

"మేం ఇక్కడకు చేరుకోవడానికి సహాయం చేసిన అధికారులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.మీ సహాయం లేకపోతే మేం ఇక్కడకు తిరిగొచ్చేవాళ్లమే కాదు. చాలా సంతోషంగా ఉంది. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము."అని పోంగ్సాక్ చెప్పారు.

జనవరి 30 విడుదలై, వారు తిరిగి రావడం సంతోషించదగిన విషయమని ఆ దేశ విదేశాంగ మంత్రి మారిస్ సంగియంపోంగ్సా అన్నారు .

బన్నావత్ తండ్రి సోంబూన్ సాథావో మాట్లాడుతూ, తాను చాలా సంతోషంగా ఉన్నానని, తన కొడుకును కుటుంబమంతా కలిసి సంప్రదాయ థాయ్ వేడుకతో ఇంటికి స్వాగతిస్తుందని అన్నారు.

"నా కుమారుడు మళ్ళీ ఇంటికి దూరంగా వెళ్లాలని నేను కోరుకోను" అని ఆయన తండ్రి ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.

కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా బన్నావత్ ఇజ్రాయెల్‌కు వెళ్లారని, తొమ్మిది నెలల తర్వాత కిడ్నాప్‌కి గురయ్యారని అన్నారు.

తన భర్త బందీగా ఉన్న 15 నెలలు ఒక కష్టకాలమని బన్నావత్ భార్య వియాదా సాథావో బీబీసీతో చెప్పారు.

గాజా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, విడుదలైన థాయ్ బందీలలో ఒకరైన సాథియన్ సువన్నాఖం బంధువులు

స్థానిక సమయం ప్రకారం ఉదయం 7:30 గంటలకు బ్యాంకాక్‌లో దిగిన తర్వాత, ఆ ఐదుగురిని బంధువులు, ప్రభుత్వ అధికారులు కలుసుకున్నారు.

ఆరోగ్య పర్యవేక్షణకోసం గత 10 రోజులుగా వారు ఇజ్రాయెల్ ఆసుపత్రిలో ఉన్నారు.

ఆ ఐదుగురు ఇప్పుడు తమ సొంత పట్టణాలకు వెళతారు.

ప్రతి బందీకి 80 సంవత్సరాల వయస్సు వరకు 725 యూరోల జీతం ( సుమారు రూ. 65,630) ప్రతినెలా ఇవ్వడంతోపాటు, 14,510 యూరోలు ( సుమారు రూ. 13,13,500) అందజేస్తామని, ఇక వారు ఇజ్రాయెల్‌కు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదని థాయ్ కార్మిక మంత్రిత్వ శాఖ అధికారి బూన్‌సాంగ్ తప్‌చాయియుత్ తెలిపారు.

అయితే మరో థాయ్ బందీ ఆచూకీ ఇంకా తెలియలేదు.

"ఇంకా గాజాలోనేఉన్న ఆరో బందీ విడుదలకోసం మేం ప్రయత్నిస్తాం. ఆయన తిరిగొస్తారన్న నమ్మకం మాకు ఉంది. విజయం సాధించేవరకూ మేం కృషి చేస్తూనే ఉంటాం." అని థాయ్ విదేశాంగ మంత్రి అన్నారు.

హమాస్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, థాయ్ బందీ పొంగ్సాక్ థేన్నాను ఆయన తండ్రి గుండెలకు హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు.

బ్యాంకాక్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పినదాని ప్రకారం, అక్టోబర్ 2023 నుండి మొత్తం 46 మంది థాయ్ కార్మికులు ఇజ్రాయెల్‌లో మరణించారు. వీరిలో ఎక్కువ మంది హమాస్ దాడిలో మరణించగా, లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూప్ ప్రయోగించిన రాకెట్ల వల్ల కొందరు మరణించారు.

2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పుడు హమాస్ 251 మంది బందీలను పట్టుకుని, దాదాపు 1,200 మందిని చంపడం గాజా యుద్ధానికి దారితీసింది.

ఇజ్రాయెల్ దాడిలో కనీసం 47,500 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజాలోని హమాస్ నిర్వహణలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలోని మూడింట రెండు వంతుల భవనాలు ధ్వంసమయ్యాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

జనవరి 19న కుదిరిన ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో థాయ్ బందీల విడుదల భాగం కాదు. ఈ ఒప్పందం కింద ఇప్పటివరకు 21 మంది ఇజ్రాయెల్ బందీలు, 566 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేశారు.

మూడు వారాల వ్యవధిలో మొదటి దశ కాల్పుల విరమణ ముగిసే సమయానికి, 33 మంది బందీలు, 1,900 మంది ఖైదీలు విడుదల అవుతారని భావిస్తున్నారు. అయితే ఈ 33 మందిలో 8 మంది మరణించారని ఇజ్రాయెల్ చెబుతోంది.