శ్రీలంక: ఒక కోతి వల్ల మా దేశం మొత్తం కరెంటు పోయిందన్న మంత్రి...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జార్జ్ రైట్, కెల్లీ ఎన్జీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
దక్షిణ కొలంబోలోని ఓ విద్యుత్ కేంద్రంలోకి కోతి దూరడంతో దేశమంతటా కరెంట్ పోయిందని ఆరోపణలు వచ్చాయి.
విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో 2.2 కోట్లమంది ప్రజలతో పాటు వైద్య సేవలు, నీటి శుద్ధి సరఫరా వ్యవస్థలు ఆగిపోయాయి. తర్వాత విద్యుత్ సరఫరాను క్రమంగా పునరుద్దరించారు.
"గ్రిడ్ ట్రాన్స్‌ఫార్మర్‌లోకి ఓ కోతి రావడంతో సరఫరా వ్యవస్థలో అసమతౌల్యం ఏర్పడింది" అని విద్యుత్ శాఖమంత్రి కుమార జయకోడి చెప్పారు.
ఆదివారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం11 గంటల సమయంలో శ్రీలంకలో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో అనేకమంది జనరేటర్లపై ఆధారపడాల్సి వచ్చింది. విద్యుత్ సరఫరాను పునరుద్దరించడానికి కొన్ని గంటల సమయం పడుతుందని అప్పుడు అధికారులు తెలిపారు.
ఈ వ్యవహారాన్ని అధికారులు తేలిగ్గా తీసుకోవడంపై ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఫొటో సోర్స్, Getty Images
"ఒక పనికిమాలిన కోతి కొలంబోలోని సబ్‌స్టేషన్‌లో చేసిన పనికి శ్రీలంక పవర్ గ్రిడ్ కుప్పకూలి దేశమంతా కరెంట్ ఆగిపోయింది" అని మరియో నాఫల్ అనే వ్యక్తి 'ఎక్స్' లో పోస్ట్ చేశారు.
"ఒక కోతి- మొత్తంగా అలజడి. మన మౌలిక వ్యవస్థల గురించి పునరాలోంచాల్సిన సమయం వచ్చిందా" అని ఆయన ప్రశ్నించారు.
"కోతి ప్రతాపం ఎలా ఉంటుందో శ్రీలంక గతంలో రుచి చూసింది" అంటూ కోతిని హనుమాన్‌తో పోల్చి అభివర్ణిస్తూ మరో యూజర్ శ్రీని ఆర్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
"ఓ విద్యుత్ కేంద్రంలో కోతులు గొడవ పడితే దేశమంతా కరెంట్ పోవడం శ్రీలంకలో మాత్రమే ఉంటుందేమో" అని స్థానిక పత్రిక డైలీ మిర్రర్ ఎడిటర్ ఇన్ చీఫ్ జమిలా హుసేన్ రాశారు.
పవర్ గ్రిడ్‌ను ఆధునీకరించాలని, లేకపోతే తరచుగా విద్యుత్ అంతరాయాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇంజనీర్లు ప్రభుత్వాలను కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్నారని స్థానిక వార్తా పత్రికలో రాసిన కథనంలో వెల్లడించింది.
"విద్యుత్ సరఫరా లైన్లలో ఏ ఒక్క చోట చిన్న అంతరాయం ఏర్పడినా దేశమంతటా కరెంట్ పోయేంత పరిస్థితిలో జాతీయ పవర్ గ్రిడ్ ఉంది" అని పేరు వెల్లడించని సీనియర్ ఇంజనీర్ ఒకరు చెప్పారు.
2022లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత శ్రీలంక తరచుగా విద్యుత్ సరఫరాలో అంతరాయాల్ని ఎదుర్కొంటోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














