కెనడా: శ్రీలంక కుటుంబంలో తల్లిని, నలుగురు పిల్లలను చంపిన విద్యార్థి

- రచయిత, జొహన్నా చిషోల్మ్, నదైన్ యూసుఫ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
కెనడా రాజధాని ఒటావాలో శ్రీలంకకు చెందిన ఓ కుటుంబంలోని ఐదుగురిని ఒక విద్యార్థి హత్య చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
మృతుల్లో తల్లి, నలుగురు పిల్లలు ఉన్నారు.
బాధితులంతా కెనడాకు కొత్తగా వచ్చారు. చనిపోయిన వారిలో అందరి కంటే చిన్నబాబు వయసు రెండు నెలలు.
19 ఏళ్ల శ్రీలంక విద్యార్థి ఈ హత్యలు చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అతను గతంలో ఈ కుటుంబంతో కలిసి ఉన్నాడు.
“ఇది అమాయకులపై జరిగిన మతి లేని హింసాత్మక చర్య” అని ఒటావా పోలీస్ చీఫ్ చెప్పారు.
బుధవారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో ఒటావా శివార్లలోని బర్‌హెవన్ నుంచి ఎమర్జెన్సీ టీమ్‌కు వచ్చిన కాల్‌కు పోలీసులు సత్వరం స్పందించారు.
పోలీసులు అక్కడకు చేరుకోగానే అనుమానితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే అరెస్టు చేసినట్లు పోలీస్ చీఫ్ ఎరిక్ స్టబ్స్ చెప్పారు.
అధికారులు తర్వాత ఇంటిలోకి ప్రవేశించి బాధితుల్ని గుర్తించారు. వారిలో తల్లి, ఆమె నలుగురు పిల్లలు, వారితో మరో వ్యక్తి కూడా ఈ కుటుంబంతోనే నివసించేవాడు.
బాధితులు 35 ఏళ్ల దర్శిని బన్బరనాయకే, ఆమె నలుగురు పిల్లలు ఏడేళ్ల ఇనుక, నాలుగేళ్ల అశ్వని, రెండేళ్ల రినయానా, రెండు నెలల కెల్లీ అని పోలీసులు తెలిపారు.
వారితో ఉంటున్న వ్యక్తిని 40 ఏళ్ల అమరకూన్‌గా గుర్తించారు.
చనిపోయిన నలుగురు పిల్లల తండ్రికి తీవ్ర గాయాలయ్యాయని పోలీస్ చీఫ్ చెప్పారు. ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించామని, ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ దారుణానికి పాల్పడిన అనుమానిత వ్యక్తి 19 ఏళ్ల ఫెబ్రియో డి జోయ్సా గా గుర్తించారు. అతని మీద హత్యకు సంబంధించి ఆరు అభియోగాలు, హత్యాయత్నానికి సంబంధించి మరో అభియోగం కింద కేసులు నమోదు చేశారు.
బాగా పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీస్ చీఫ్ చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
ఒటావా ఇటీవలి చరిత్రలో ఈ ఘటన అతి పెద్ద హత్య కేసని పోలీసులు చెబుతున్నారు. ఇదొక విషాద ఘటన అని దేశ రాజధాని నగరం మీద దీని ప్రభావం ఉంటుందని అన్నారు.
“ప్రజల మీద ఈ ఘటన ప్రభావం కచ్చితంగా ఉంటుంది” అని పోలీస్ చీఫ్ చెప్పారు. హత్య జరిగిన ప్రాంతంలో స్థానికులు ఈ ప్రాంతానికి దూరంగా ఉంటారు అని ఆయన అన్నారు.
మొదట దీనిని సామూహిక కాల్పుల ఘటన అని అధికారులు సీబీసీ న్యూస్‌తో చెప్పారు. అయితే తర్వాత అవి ఆయుధంతో దాడి చేయడం వల్ల జరిగిన హత్యలుగా గుర్తించారు.
ఇది చాలా దారుణమైన హింసాత్మక ఘటన అని ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తెలిపారు.
‘‘నగర చరిత్రలోనే అత్యంత భయంకరమైన దారుణం ఇది’’ అని ఒటావా మేయర్ మార్క్ సట్‌క్లిఫే విచారం వ్యక్తంచేశారు.
‘‘మనమొక సురక్షిత ప్రాంతంలో నివశిస్తున్నందుకు గర్వపడాలి. అయితే ఈ వార్త ఒటావా ప్రజలందర్ని భయకంపితులను చేసింది’’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ ఘటన విషయంలో వేగంగా స్పందించిన ఎమర్జెన్సీ బృందాలకు ఆయన అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కోటిన్నర రూపాయల జీతం, ఇల్లు, ఇంకా ఇతర సౌకర్యాలు ఇస్తారట... స్కాట్లండ్ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- పనామా కాలువలో నీరు ఎందుకు ఎండిపోతోంది? దీనికి పరిష్కారం ఏమిటి?
- మెదడుకు చేటు చేసే 11 అలవాట్లు, వాటి నుంచి బయటపడే మార్గాలు
- అనంత్ అంబానీ: వేల జంతువులతో రిలయన్స్ నిర్వహిస్తున్న ‘వంతారా’ జూలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














