దక్షిణ కొరియా: ఎనిమిదేళ్ల బాలికను స్కూల్లోనే చంపిన టీచర్, అసలేం జరిగింది?

విద్యార్థిని మృతి

ఫొటో సోర్స్, News1

ఫొటో క్యాప్షన్, విద్యార్థినికి నివాళులర్పిస్తూ స్కూలుగేటు వద్ద స్థానికులు పూలను, బొమ్మలను ఉంచారు
    • రచయిత, కోయూవ్
    • హోదా, బీబీసీ న్యూస్

దక్షిణ కొరియాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలికను ఒక ఉపాధ్యాయురాలు కత్తితో పొడిచి చంపిన ఘటన ఆ దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

సెంట్రల్ సిటీ డేచాన్‌లో విద్యార్థినిని కత్తితో పొడిచి చంపినట్లు 40 ఏళ్ల మహిళా టీచర్ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.

స్థానిక కాలమాన ప్రకారం సోమవారం సాయంత్రం 6:00 గంటలకు పాఠశాల భవనంలోని రెండవ అంతస్తులో కత్తిపోట్లతో పడిఉన్న బాలికను గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు.

ఉపాధ్యాయురాలు కూడా బాలిక పక్కనే కత్తిపోట్లతో కనిపించారు. అయితే ఆమె తనను తాను గాయపరుచుకుని ఉంటారని పోలీసులు అంటున్నారు.

దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సంగ్-మోక్ మంగళవారం ఈ కేసుపై దర్యాప్తునకు ఆదేశించారు.

"ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని" అధికారులను కోరారు.

మూసివేసిన పాఠశాల గేటు బాలిక మృతికి నివాళిగా కొంతమంది స్థానికులు పూలు, బొమ్మలను ఉంచారు.

డిసెంబర్ 9న ఆ టీచర్ డిప్రెషన్ కారణంగా ఆరు నెలల సెలవు కోరారు, కానీ 20రోజులకే తిరిగి విధుల్లో చేరారు. పని చేయడానికి తగిన ఆరోగ్యంతో ఉన్నట్టు డాక్టర్ చెప్పారని ఆమె తెలిపారని డేజియోన్ విద్యా కార్యాలయం చెప్పింది.

ఆమెకు ఆ విద్యార్థినితో ఎలాంటి సంబంధం లేదని అధికారులు తెలిపారు.

కొన్ని రోజుల ముందు, ఆ ఉపాధ్యాయురాలు హింసాత్మకంగా ప్రవర్తించారని, తోటి టీచర్‌ తలని గోడకేసి కొట్టి గాయపరిచినట్టు యాజమాన్యం తెలిపింది. ఆ గొడవ గురించి దర్యాప్తు చేయడానికి సోమవారం ఉదయం విద్యా విభాగం నుంచి ఇద్దరు అధికారులు పాఠశాలను సందర్శించారు. ఆ తరువాతే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దక్షిణ కొరియా, డేజియోన్

బస్సు డ్రైవర్ చెప్పడంతో..

సోమవారం సాయంత్రం విద్యార్థినిని తీసుకెళ్లే బస్సు డ్రైవర్ బాలిక ఇంకా రాలేదని చెప్పిన తరువాత ఈ ఘటన వెలుగుచూసింది.

టీచర్ కోలుకున్న తర్వాత ఆమెను విచారిస్తామని పోలీసులు తెలిపారు.

సహోద్యోగిపై దాడి చేసిన తర్వాత, విద్యా కార్యాలయం ఆ ఉపాధ్యాయురాలిని సెలవుపై ఉంచి, ఇతర ఉపాధ్యాయులకు దూరంగా ఉంచాలని సిఫార్సు చేసింది. ఆమె ప్రవర్తనను పరిశీలించడానికి వీలుగా ఆమెను వైస్ ప్రిన్సిపాల్ డెస్క్ పక్కన కూర్చోబెట్టారు.

డిసెంబర్‌లో సెలవు తీసుకున్నప్పటి నుంచి ఆమె ఎటువంటి తరగతులకు బోధించడం లేదని, ఎనిమిదేళ్ల విద్యార్థినితో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని అధికారి తెలిపారు.

దక్షిణ కొరియా కఠినమైన తుపాకీ నియంత్రణ చట్టాలున్న సురక్షితమైన దేశం. కానీ ఈ మధ్యకాలంలో అనేక ప్రముఖ నేరాల సహా కత్తిపోట్ల వంటి నేరాలతో సతమతమవుతోంది.

"పాఠశాల మనకు సురక్షితమైన స్థలంగా ఉండాలి. ఇలాంటి సంఘటన చూడటం బాధాకరం" అని తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ అన్నారు. "తీవ్ర దిగ్భ్రాంతి, వేదనను అనుభవిస్తున్న బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)