హైదరాబాద్: 'పారిశ్రామిక వేత్త జనార్దనరావును మనవడే హత్య చేశాడు'- పోలీసులు ఇంకా ఏం చెప్పారంటే...

ఫొటో సోర్స్, gramadeep.org
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
హెచ్చరిక: ఈ కథనంలో కలచి వేసే అంశాలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూపు సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో జనార్దనరావు మనవడు కీర్తితేజను నిందితుడిగా పేర్కొంటూ పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.
జనార్దనరావు శరీరంపై 73 కత్తిపోట్లు ఉన్నట్లుగా స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే, ఈ విషయంపై వెస్ట్ జోన్ డీసీపీ ఎస్.ఎం. విజయ్‌కుమార్ బీబీసీతో మాట్లాడుతూ, ''జనార్దనరావు శరీరంపై చాలా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించాం. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. ఎన్నిసార్లు పొడిచారన్నది నివేదికలో తెలుస్తుంది.'' అని చెప్పారు.
మరోవైపు, జనార్దనరావు హత్య కేసులో ఆయన మనవడు కీర్తితేజను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి రిమాండుకు తరలించామని పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ బీబీసీకి చెప్పారు.

ఏం జరిగిందంటే..
జనార్దనరావు సొంతూరు ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వాలి గ్రామం. ఆయన 1939లో జన్మించారు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరుంది. 1965లో వెల్జాన్ హైడ్రయర్ కంపెనీని స్థాపించారు. దీంతోపాటు వెల్జాన్ డెనిసన్ లిమిటెడ్ కంపెనీలున్నాయి.
ప్రస్తుతం సోమాజిగూడలోని ఇంట్లోనే జనార్దనరావు ఉంటున్నారు. గురువారం రాత్రి ఆయన తన ఇంట్లోనే మనవడి చేతిలో హత్యకు గురయ్యారని పంజాగుట్ట ఏసీపీ మోహనరావు బీబీసీకి చెప్పారు.
''జనార్దనరావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె కొడుకు శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీ డైరెక్టరుగా నియమించాలని నిర్ణయించారు. మరో కుమార్తె సరోజినీ దేవి కొడుకు కిలారు కీర్తితేజకు రూ.4కోట్ల షేర్లు ఇచ్చారు. తాతతో మాట్లాడాలని కీర్తితేజ గురువారం రాత్రి జనార్దనరావు ఇంటికి వచ్చారు. కత్తితో జనార్దనరావు శరీరంలోని వివిధ భాగాలపై పొడిచి చంపాడు'' అని చెప్పారు పంజాగుట్ట పోలీసులు.

ఫొటో సోర్స్, Getty Images
తల్లిపైనా దాడి
ఘటన జరిగిన సమయంలో కీర్తితేజ తల్లి సరోజినీ దేవి ఇంట్లోనే ఉన్నారని, ఆమె టీ తీసుకు వచ్చేందుకు లోనికి వెళ్లిన సమయంలో ఘటన జరిగినట్లుగా గుర్తించామని ఏసీపీ మోహన్ రావు తెలిపారు.
ఆమెపైనా కత్తితో కీర్తితేజ దాడి చేశారని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
కీర్తితేజ తల్లిదండ్రులు గత కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నట్టు పోలీసులు చెప్పారు.
ఆస్తి విషయంలో గొడవలతోపాటు డైరెక్టర్ పదవి ఇవ్వకపోవడంతో దాడి జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించామని మోహనరావు బీబీసీకి వివరించారు.
కీర్తితేజ ప్రవర్తన సరిగా లేకపోవడంతో కంపెనీ డైరెక్టర్ పదవి ఇచ్చేందుకు జనార్దనరావు నిరాకరించినట్లుగా సమాచారం ఉందని పోలీసులు చెప్పారు. ఈ విషయంపై డీసీపీ ఎస్.ఎం.విజయ్ కుమార్ బీబీసీతో మాట్లాడారు.
''ఇతర కుటుంబసభ్యులకు కంపెనీ, ఆస్తి వ్యవహారాల్లో ప్రాధాన్యం ఇస్తూ తనను చిన్నప్పటినుంచి పట్టించుకోవడం లేదని జనార్దనరావుపై నిందితుడు కక్ష పెంచుకున్నట్లు తెలిసింది.ఆస్తులు పంపకాలు చేయాలని అడుగుతున్నా, చేయలేదని కోపం పెంచుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించాం.'' అని చెప్పారు.
మరోవైపు, కీర్తితేజ మత్తు పదార్థాలకు బానిసయ్యారనే ఆరోపణలపై ఏసీపీ మోహనరావు బీబీసీతో మాట్లాడారు.
''ప్రస్తుతం కీర్తితేజ రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించాం. నివేదికలు వచ్చాక డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నాయా.. లేదా.. అనేది తెలుస్తుంది.'' అని చెప్పారు.
వివిధ సంస్థలకు రూ.కోట్లలో విరాళాలు
జనార్దనరావుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ సంస్థలకు రూ.కోట్లలో విరాళాలు అందించిన పేరుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సహా వివిధ వైద్య, విద్యా సంస్థలకు రూ.కోట్లలో విరాళాలు అందించినట్లుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు.
అలాగే ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలోని ఒక భవనాన్ని కూడా జనార్దనరావు తన తల్లి వెలమాటి సౌభాగ్యవతమ్మ పేరుతో నిర్మించారు.
ఘటనపై జనార్దనరావు కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది. వారి స్పందన రాగానే ఇక్కడ ఇస్తాము.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














