పురుషాంగం పునఃసృష్టించిన హైదరాబాద్ వైద్యులు.. సున్తీ తరువాత ఇన్‌ఫెక్షన్ కారణంగా అంగం కోల్పోయిన యువకుడికి శస్త్రచికిత్స

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
సున్తీ చేశాక ఇన్‌ఫెక్షన్ కారణంగా నాలుగేళ్ల వయసులోనే పురుషాంగాన్ని కోల్పోయాడు ఓ యువకుడు. అయితే పురుషాంగాన్ని పునః సృష్టించి ఆయనకు విజయవంతంగా అమర్చామని హైదరాబాద్ వైద్యులు చెప్పారు.
ఆసుపత్రి వైద్యులు, ఆ యువకుడి విజ్ఞప్తి మేరకు ఆయన పేరును బీబీసీ వెల్లడించడం లేదు.
సోమాలియాకు చెందిన 20 ఏళ్ల యువకుడు 2022 చివర్లో హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రికి వచ్చారు.
ఆసుపత్రికి వచ్చిన సమయంలో యువకుడికి పురుషాంగం లేకపోవడంతో, సర్జరీ కోసం తమను సంప్రదించినట్లు వైద్యులు చెప్పారు.
''అతనికి నాలుగేళ్ల వయసులో సున్తీ చేశారని ఆ యువకుడు మాకు చెప్పారు. ఆ సమయంలో ఇన్‌ఫెక్షన్ సోకి పురుషాంగం తీవ్రంగా దెబ్బతినడంతో వైద్యులు తొలగించారని చెప్పారు'' అని మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్ బీబీసీతో చెప్పారు.

సున్తీ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని, సరిగా చేయకపోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ సోకి ఉండవచ్చని, అందుకే దాన్ని తొలగించి ఉండొచ్చని ఆయన వివరించారు.
అప్పట్నుంచి ఆ సోమాలియా యువకుడికి పురుషాంగం లేదు. మూత్ర విసర్జనకు వీలుగా వృషణాల వద్ద ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయడంతో తాత్కాలికంగా ఇబ్బంది తప్పింది.
యుక్త వయసుకు వచ్చేసరికి మూత్రం పోసే విషయంలో ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయని వైద్యులు వివరించారు.
దీంతో పాటు వివాహం చేసుకుని, సంసార జీవితం గడపడానికి వీలుగా పురుషాంగం అమర్చుకోవాలని ఆయన భావించారని డాక్టర్లు వివరించారు.

రెండు దశల్లో సర్జరీలు
పురుషాంగం అమర్చే ప్రక్రియ రెండు దశల్లో సాగిందని వివరించారు మెడికవర్ వైద్యులు.
యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో ముందుగా మూత్రనాళం బయటకు వచ్చే ప్రదేశం వద్ద సర్జరీ చేసి, ఆ భాగాన్ని తెరిచామని సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ రవి కుమార్ చెప్పారు.
ఆ తర్వాత పురుషాంగం పునఃసృష్టించి అదే ప్రాంతంలో అమర్చాలని నిర్ణయించారు వైద్యులు.
డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు.
ముందుగా ముంజేతి ప్రాంతం నుంచి చర్మం, రక్త నాళాలు, కొవ్వు, నరాలు (రేడియల్ ఆర్టరీ ఫోర్ఆర్మ్ ఫ్లాట్) సేకరించారు.
దాన్ని పురుషాంగం తరహాలో ట్యూబ్ పెట్టి మౌల్డ్ చేశారు.
అలా తయారు చేసిన పురుషాంగాన్ని తీసుకు వచ్చి, మూత్ర నాళం వద్ద అమర్చి రక్తనాళాలు, చర్మం అతికించామని చెప్పారు వైద్యులు. దీన్ని మైక్రోవాస్క్యులర్ సర్జరీగా పిలుస్తారని తెలిపారు.
ఈ ప్రక్రియలో రక్తనాళాలను మైక్రోస్కోప్‌లో చూస్తూ అమరుస్తారు. పురుషాంగంలో ఒక ఆర్టరీ (ధమని), నాలుగు వీన్స్ (సిరలు) అమర్చినట్లు చెప్పారు.
ఏడాదిన్నర క్రితం దాదాపు పది గంటలపాటు సర్జరీ సాగినట్లు చెప్పారు వినయ్ కుయార్.
''సాధారణంగా తొడ నుంచి కూడా చర్మం, కొవ్వు, రక్తనాళాలు తీసుకోవచ్చు. దానివల్ల పురుషాంగం లావు బాగా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ముంజేతి వద్ద చర్మం తీసుకున్నాం'' అని డాక్టర్ వినయ్ కుమార్ బీబీసీతో చెప్పారు.
ఏడాదిపాటు అబ్జర్వేషన్‌లో ఉంచి పరిశీలించామని, ఇప్పుడు పురుషాంగంపై స్పర్శ వచ్చిందని తెలిపారు.
''సర్జరీ తర్వాత ఆయనకు మూత్రాశయంలో రాళ్లు ఉండటంతో ఇన్‌ఫెక్షన్ వచ్చింది. దీంతో కొన్ని చిన్న సర్జరీలు కూడా చేయాల్సి వచ్చింది. అందుకే ఎక్కువ సమయం పట్టింది'' అని బీబీసీతో చెప్పారు డాక్టర్ వినయ్ కుమార్.

ఫొటో సోర్స్, Getty Images
సెక్స్‌లో పాల్గొనేందుకు వీలుగా..
మూడు వారాల క్రితం ఆ యువకుడికి పెనైల్ ఇంప్లాంట్ అమర్చారు వైద్యులు. దీనివల్ల ఆ యువకుడు సాధారణంగానే సెక్స్‌లో పాల్గొనేందుకు వీలవుతుందని వివరించారు.
ఈ ఆపరేషన్ తర్వాత ఆయన ఓసారి సోమాలియా వెళ్లొచ్చారని, రెండేళ్లు ఆగాక పెళ్లి చేసుకుంటానని చెప్పారని డాక్టర్ వినయ్ కుమార్ చెప్పారు.
ఆ యువకుడితో మాట్లాడేందుకు మెడికవర్ ఆసుపత్రి వైద్యులను బీబీసీ సంప్రదించింది. కానీ, ఆయన మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని చెప్పారు.
''ఆ వ్యక్తికి ఇంగ్లిష్ కూడా రాదు. సోమాలి భాషనే మాట్లాడగలరు. మేం కూడా అనువాదకుడి సాయంతో ఆయనతో మాట్లాడేవాళ్లం'' అని వైద్యులు చెప్పారు.
‘వీర్యం విడుదల కాదు’
యువకుడికి పురుషాంగంలో పెనైల్ ఇంప్లాంట్ చేయడంతో శృంగారంలో సాధారణంగానే పాల్గొనగలడు. కానీ, వీర్యం విడుదల ఉండదని వైద్యులు చెబుతున్నారు."
"చిన్నప్పుడు పురుషాంగానికి వచ్చిన ఇన్‌ఫెక్షన్ లోపలి వరకు పాకడంతో వీర్య గ్రంధి దెబ్బతింది. దానివల్ల వీర్యం ఉత్పత్తిపై ప్రభావం పడింది" అని వైద్యులు చెప్పారు.
సంతానం కావాలంటే ఆ యువకుడు ఐవీఎఫ్ విధానాన్ని ఆశ్రయించాలన్నారు.
ఈ ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అయిందంటే..
సాధారణంగా ఈ తరహా సర్జరీలు స్త్రీ నుంచి పురుషునిగా మారాలనుకునే వారికి చేస్తుంటారని డాక్టర్లు చెబుతున్నారు.
''ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో మగవారిగా మారాలనుకునేవారు ఈ సర్జరీలు చేయించుకుంటుంటారు. భారత్‌లోని దిల్లీ, ముంబయిలో ఈ సర్జరీలు జరుగుతుంటాయని మాకు సమాచారం ఉంది. కానీ, ఇది కొంతవరకు అరుదైనది అనే చెప్పాలి'' అని డాక్టర్ వినయ్ కుమార్ అన్నారు.
ఏదైనా అనుకోని పరిస్థితుల్లో (క్యాన్సర్ లేదా ప్రమాదాలు జరిగినప్పుడు) పురుషాంగం తొలగించాల్సి వస్తే, ఈ తరహా సర్జరీ చేయొచ్చని చెప్పారు.
ఇలాంటి సర్జరీకి రూ.పది లక్షల వరకు ఖర్చవుతుందని వివరించారు. ఇన్‌ఫెక్షన్లు వంటివి రాకపోతే రూ.5 నుంచి రూ.8 లక్షల మధ్య కూడా పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














