ఎంఆర్ఐ: స్కానింగ్‌కి వెళ్లి శవమై బయటికొచ్చిన మహిళ, పేస్‌మేకర్ ఉన్నవాళ్లకు ఇది ప్రమాదకరమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇటికాల భవాని
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్కానింగ్ కోసం ఎంఆర్‌ఐ మెషీన్‌లోకి వెళ్లిన మహిళ శవమై బయటికొచ్చిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో ఫిబ్రవరి 4న జరిగింది.
ఏలూరు జిల్లాలోని ప్రత్తికోళ్ల లంకకు చెందిన 60 ఏళ్ల నల్లగచ్చు రామతులసమ్మ ఎంఆర్‌ఐ స్కానింగ్ తీస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. స్కానింగ్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే రామతులసమ్మ చనిపోయారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై ఏలూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది?
రామతులసమ్మ కొద్దికాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్ చేసే సమయంలో తల తిరుగుతోందని చెప్పడంతో, ఎంఆర్‌ఐ స్కానింగ్ తీయించుకోవాలని డాక్టర్లు సూచించారు.
దీంతో, రామతులసమ్మను ఆమె భర్త కోటేశ్వరరావు ఏలూరు పట్టణం, ఆర్ఆర్ పేట ఏరియాలోని సుస్మిత డయాగ్నస్టిక్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తుండగా ఆమె చనిపోయారు. ఎంఆర్‌ఐ మెషీన్‌లోకి వెళ్లిన రామతులసమ్మ మృతదేహంగా బయటికి వచ్చారు.
సిబ్బంది నిర్లక్ష్యం వల్లే రామతులసమ్మ చనిపోయారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
రామతులసమ్మకు గుండెజబ్బు ఉంది. గతంలో ఆపరేషన్ ద్వారా పేస్‌మేకర్ అమర్చారు. ఈ విషయం ముందే చెప్పినప్పటికీ, ఎంఆర్ఐకు పంపారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
"మృతురాలి పోస్టుమార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. అది వచ్చాకే ఆమె ఎలా చనిపోయారు, అందుకు బాధ్యులెవరనేది తెలిసే అవకాశం ఉంది" అని ఏలూరు టూ టౌన్ సీఐ రమణ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వైద్యాధికారులు ఏమంటున్నారు?
రామతులసమ్మ ఘటనపై ఏలూరు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో) డాక్టర్ ఆర్. మాలినితో బీబీసీ మాట్లాడింది.
బాధితులతో పాటు డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులు, వైద్యం కోసం రామతులసమ్మ సంప్రదించిన వైద్యులతోనూ అధికారులు మాట్లాడి వివరాలు సేకరించినట్లు డాక్టర్ మాలిని బీబీసీతో చెప్పారు.
"కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం, రామతులసమ్మకు మూడేళ్ల కిందట పేస్‌మేకర్ వేశారు. ఐదు నెలలుగా డయాలసిస్ జరుగుతోంది. తరచూ తల తిప్పుతోందని డయాలసిస్ చేస్తున్న డాక్టర్‌కు ఫిర్యాదు చేస్తుండడంతో తలకు ఎంఆర్ఐ తీయించాలని సూచించారు. పేస్‌మేకర్ ఉండడంతో కార్డియాలజిస్టును కూడా సంప్రదించారు. ఆ తరువాతే ఎంఆర్ఐ టెస్టుకు వెళ్లారు" అని డాక్టర్ మాలిని తెలిపారు.
"స్కానింగ్ సమయంలో పక్కనే ఉన్న ఆమె భర్తకు పేషంట్ రామతులసమ్మ సరిగ్గా పడుకోలేదని, ఆమె కాళ్లు కదలకుండా పట్టుకోమని సిబ్బంది చెప్పారు. కొంతసేపటికి ఆమె శరీరం చల్లగా మారడం గమనించి అరిచానని, బయటికి వచ్చాక చలనం లేని రామతులసమ్మను సిబ్బంది గిల్లి చూశారని ఆయన నాతో చెప్పారు" అని మాలిని బీబీసీతో చెప్పారు.
సౌండ్ ప్రూఫ్ రూం కావడం వల్ల తమకు వినిపించలేదని సిబ్బంది చెబుతున్నారని ఆమె అన్నారు.
"పై ఫ్లోర్‌లో రేడియాలజిస్ట్ ఉన్నారని స్కానింగ్ సెంటర్ సిబ్బంది చెబుతున్నారు. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం టెక్నీషియన్ మాత్రమే ఉన్నారని చెబుతున్నారు" అని ఆమె చెప్పారు.
డయాగ్నస్టిక్ సెంటర్‌కు నోటీసులిచ్చామని, ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తేగానీ మృతికి కారణం చెప్పలేమని డాక్టర్ మాలిని తెలిపారు.
"సిబ్బంది పొరపాటు ఉంది. ఎంఆర్ఐ జరుగుతున్న సమయంలో పేషంట్ ఇబ్బందిపడితే స్కానింగ్ ఆపేయాలి. ఇది ఎంఆర్ఐ స్కానింగ్ గైడ్‌లైన్. అలా చేయలేదు" అన్నారామె.
ఈ వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సుస్మిత డయాగ్నస్టిక్ సెంటర్ స్పందన కోసం బీబీసీ ప్రయత్నిస్తోంది. రాగానే ఈ కథనంలో ప్రచురిస్తాం.

ఫొటో సోర్స్, Getty Images
పేస్‌మేకర్ ఉంటే ఎంఆర్‌ఐ చేయించుకోకూడదా?
పేస్‌మేకర్ అనేది, బ్యాటరీతో పనిచేసే చిన్న ఎలక్ట్రానిక్ పరికరం. ఇది స్వల్ప విద్యుత్ ప్రేరణలతో హృదయ స్పందనను నియంత్రిస్తుంది.
మాగ్నటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ) మెషీన్ పెద్ద ట్యూబ్ ఆకారంలో ఉంటుంది. రేడియో సిగ్నల్స్, కంప్యూటర్‌ను ఉపయోగించి శరీరంలోని అవయవాలు, కణజాల చిత్రాలను తీస్తుంది.
ఎంఆర్ఐ యంత్రంలో ఉండే పెద్ద అయస్కాంతం శరీరం చుట్టూ బలమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఈ అయస్కాంత క్షేత్రం వల్లే ఎంఆర్ఐ స్కానింగ్ తీసేముందు ఆభరణాలు లేదా ఏవైనా లోహపు వస్తువులు శరీరంపై ఉంటే తీసేయమని చెబుతారు.
తొలినాళ్లలో వచ్చిన పేస్‌మేకర్లు ఎంఆర్ఐ - కంపాటబుల్ (అనుకూలమైనవి) కావు. అంటే, ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోడానికి అంత సురక్షితం కాదు. అయితే, గత దశాబ్ధంలో మెరుగైన సాంకేతికతతో తయారు చేసిన పేస్‌మేకర్లు అందుబాటులోకి వచ్చాయి.
ఒకవేళ పేస్‌మేకర్ ఎంఆర్ఐ - కంపాటబుల్ అయినప్పటికీ స్కానింగ్ చేస్తున్నంత సేపు పర్యవేక్షణ అవసరం. అంతేకాకుండా, ఎంఆర్ఐ స్కానింగ్ సమయంలో ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైనా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఎంఆర్‌ఐ ప్రమాదాలు - కారణాలు
గత దశాబ్ధంలో ఎంఆర్ఐ టెస్టుల ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది.
అమెరికా, బ్రిటన్, జపాన్‌లో కూడా ఎంఆర్ఐ ప్రమాదాలు నమోదయ్యాయి. బాధితుల్లో ఎక్కువ శాతం పిల్లలు, వృద్ధులే. కానీ మరణాలు చాలా అరుదని పరిశోధన పత్రాలు చెబుతున్నాయి. ప్రాణాంతక ప్రమాదాలు నమోదైన శాతం కూడా చాలా తక్కువగా ఉన్నట్లు రిపోర్టులు పేర్కొన్నాయి.
ఈ ప్రమాదాలకు కారణాలు చూస్తే, పెద్దగా అనుభవంలేని వైద్య సిబ్బంది లేదా రోగుల పూర్తి వివరాలు అడగకపోవడం, ముందు పరీక్షలు నిర్వహించి వారికి స్కానింగ్ చేయొచ్చా, లేదా అనేది పరిశీలించకపోవడం వంటి వాటి వల్ల జరుగుతున్నాయని వివిధ దేశాల్లో జరిగిన పరిశోధనల పత్రాలు, రిపోర్టులు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎంఆర్‌ఐకి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పేస్‌మేకర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మెటాలిక్ ఇంట్రాక్యులర్ ఫారిన్ బాడీస్ -IOFB (కంట్లో చేరే లోహపు పదార్థం) వంటివి ఉన్నవారు, ఆ విషయాన్ని రేడియాలజిస్టుకు తెలియజేయాలి.
న్యూరోస్టిమ్యులేషన్ డివైసెస్ (నరాల సంబంధిత చికిత్సలో భాగంగా అమర్చే పరికరాలు ), హియరింగ్ ఇంప్లాంట్స్ (వినికిడి పరికారాలు), బుల్లెట్లు, పెల్లెట్లు, సెరిబ్రల్ ఆర్టరీ అనూరిజం క్లిప్‌లు (మెదడులో అమర్చే క్లిప్) , మాగ్నటిక్ డెంటల్ ఇంప్లాంట్లు ఉంటే ముందుగా తెలియజేయాలి.
కృత్రిమ అవయవాలు, ఇంట్రాయూట్రైన్ డివైస్(IUD- గర్భాశయ పరికరం), చెవి, ముక్కుకు ధరించే ఆభరణాలు వంటి వాటి గురించి చెప్పాలి.
కొన్నిసార్లు టాటూ ఇంక్‌లోనూ లోహపు ఆనవాళ్లు ఉంటాయి. పర్మనెంట్ మేకప్ ఉన్న వారికి కూడా అసౌకర్యం కలగొచ్చు.
ఎంఆర్ఐ స్కాన్ సమయంలో అసౌకర్యంగా లేదా వేడిగా అనిపిస్తే వెంటనే చెప్పాలి.
(ఆధారం: నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఎన్‌హెచ్‌ఎస్)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














