అమెరికా అబద్ధం చెప్తోంది, వారి నౌకల ఉచిత ప్రయాణానికి మేం అనుమతించలేదు: పనామా ప్రకటన

పనామా కాలువ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పనామా కాలువలో అమెరికా నౌకల ఉచిత రవాణాకు అనుమతి ఇవ్వలేదని ఆ దేశం తెలిపింది.
    • రచయిత, మాలు కర్సినో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా నౌకలు పనామా కాలువలో ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా తమ విధానంలో మార్పులు చేయడానికి పనామా నిరాకరించింది.

తమ ప్రతిపాదనను పనామా అంగీకరించిందని వైట్ హౌస్ ప్రకటించిన తర్వాత పనామా ఈ వ్యాఖ్యలు చేసింది.

''అమెరికా ప్రభుత్వ నౌకలు పనామా కాలువలో ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏటా అమెరికా ప్రభుత్వానికి కోట్ల డాలర్లు ఆదా అవుతాయి'' అని అమెరికా విదేశాంగశాఖ ఎక్స్‌లో ఒక ప్రకటనలో తెలిపింది.

అమెరికా ప్రకటనపై పనమా కాలువ అధారిటీ(ఏసీపీ)స్పందించింది. ''కాలువలోంచి ప్రయాణించడంపై పన్నులు, ఇతర ఫీజులు విధించే అధికారం మాకు ఉంది. వాటిలో ఎలాంటి సర్దుబాట్లూ చేయలేదు'' అని తెలిపింది.

మరోవైపు పనామా అధ్యక్షుడు కూడా తాజాగా దీనిపై స్పందిస్తూ ‘అమెరికా అబద్ధాలు ప్రచారం చేస్తోంది’ అని ఆరోపించారు.

అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక జలమార్గమైన పనామా కాలువను తిరిగి తమ నియంత్రణలోకి తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పనామా కాలువ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పనామా కాలువ తిరిగి స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ అంటున్నారు.

చైనాపై అమెరికా ఆరోపణలు

82కిలోమీటర్ల పొడవుండే పనమా కాలువ సెంట్రల్ అమెరికా అంతటా విస్తరించిఉంటుంది. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల మధ్య ప్రధాన లింక్ ఇదే.

ఈ వారం లాటిన్ అమెరికా దేశాల పర్యటనకు వెళ్లిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పనామా కాలువపై చైనా ''ప్రభావం, నియంత్రణ'' ఉన్నాయని, తన విధానంలో పనామా ''తక్షణమే మార్పులు'' చేయాలని డిమాండ్ చేశారు.

పనామా తగిన మార్పులు చేయకపోతే రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం తమకున్న హక్కులను సంరక్షించుకోవడానికి అమెరికా అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

తన పర్యటనలో రుబియో పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినోతో సమావేశమయ్యారు. కాలువ అధికారి రికార్టె వాస్‌క్వెజ్ మొరాల్స్‌నూ కలిశారు.

అమెరికా నౌకల రవాణాకు ప్రాధాన్యం ఇవ్వడానికి వీలుగా ఆ దేశ నావికాదళంతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు రుబియోతో చెప్పామని పనామా కాల్వ అథారిటీ తెలిపింది.

వాషింగ్టన్‌తో దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని బుధవారం(ఫిబ్రవరి 5) ప్రత్యేక ప్రకటనలో తెలిపింది.

పనామా కాలువ

ఫొటో సోర్స్, PANAMA CANAL AUTHORITY

ఫొటో క్యాప్షన్, పనామా కాలువ అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది.

పనామా కాలువ రవాణాలో అమెరికా వాటా 52శాతం

ఈ కాలువ రవాణాలో అమెరికా నౌకల వాటా గణనీయమైనది. 2024లో ఈ మార్గంలో ప్రయాణించిన నౌకలలో 52 శాతం అమెరికా పోర్టుల నుంచి రాకపోకలు సాగించినవే.

ఏటా సుమారు 14,000 ఓడలు ఈ కాలువలో ప్రయాణిస్తాయి. దీని వల్ల దక్షిణ అమెరికా చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రయాణ సమయం, డబ్బు ఆదా అవుతాయి.

పనామా కాలువను "తిరిగి స్వాధీనం" చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ట్రంప్ తన అధ్యక్ష ప్రసంగంలో చెప్పారు, తటస్థంగా ఉంటానని ఇచ్చిన హామీని పనామా నిలబెట్టుకోలేదని, ఈ కాలువను చైనా నిర్వహిస్తోందని ట్రంప్ ఆరోపించారు.

ట్రంప్ ప్రణాళికను పనామా అధ్యక్షుడు ములినో తీవ్రంగా ఖండించారు. కీలకమైన వాణిజ్య మార్గం తమ చేతుల్లోనే ఉందని, అలాగే ఉంటుందని ఆయన తెలిపారు.

చైనా నియంత్రణపై ట్రంప్ చేసిన ఆరోపణలను కూడా తోసిపుచ్చారు. "మా పరిపాలనలో ప్రపంచంలోని ఏ దేశం జోక్యం చేసుకోవడం లేదు'' అని ఆయన చెప్పారు.

ట్రంప్ ఇటీవల మరోసారి ఇదే ఆరోపణ చేశారు. ప్రస్తుత పరిస్థితిపై తాను సంతృప్తిగా లేనని ఈ వారం ప్రారంభంలో చెప్పినప్పటికీ కొన్ని విషయాలను పనామా అంగీకరించిందని ట్రంప్ అన్నారు. చైనా మౌలిక సదుపాయాల కల్పన కార్యక్రమం ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటవ్‌లో తమ సభ్యత్వం కొనసాగించబోదని ములినో చెప్పారు.

20వ శతాబ్దం ప్రారంభంలో అమెరికా ఈ కాలువను నిర్మించింది. అయితే ఆ దేశంలో చాలా ఏళ్ల పాటు జరిగిన నిరసనల తర్వాత అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 1977లో పనామాతో ఒక ఒప్పందంపై సంతకం చేశారు. జలమార్గం నిర్వహణను క్రమంగా పనామాకు అప్పగించారు. ఈ నిర్ణయాన్ని ''పెద్ద తప్పు''గా ట్రంప్ అభివర్ణించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)