పిల్లల బొమ్మలు, మారణాయుధాలు: సిరియా ద్వారా ఆయుధ సరఫరాకు రష్యా, ఇరాన్ ఎలా సహకరించుకున్నాయి?

- రచయిత, సెర్గీ గొర్‌యాష్కో, అనస్టాసియా లొరారెవా
- హోదా, బీబీసీ ప్రతినిధులు
సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కిందటేడాది చివరలో రాత్రికి రాత్రే గద్దె దిగిపోవడం పశ్చిమాసియాలో రష్యా ప్రాబల్యపై తీవ్ర ప్రభావం చూపింది.
ముఖ్యంగా ఇది రష్యా, తెహ్రాన్ మధ్య గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న సహకారానికి గండి కొట్టింది. ఆయుధాల రహస్య సరఫరా ద్వారా ఈ రెండు దేశాలు తమ బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి.
అసద్ పాలనలో రహస్యంగా సాగిన ఈ ఆయుధ చీకటి వ్యాపారంలో దాగున్న అంశాలను బీబీసీ వెలుగులోకి తెచ్చింది. అసద్ పాలన ముగిసిన తర్వాత ఇప్పుడేం జరగనుందని కూడా ప్రశ్నిస్తోంది.


ఫొటో సోర్స్, RT
మానవతాసాయం పేరుతో...
రష్యా ప్రచార సాధనం ఆర్‌టీ 2024 అక్టోబరు1న ఓ ముఖ్యమైన వీడియోను ప్రసారం చేసింది. సిరియా కోస్తా ప్రాంతం లటకియాలోని ఎయిర్‌పోర్టు దగ్గర సాగుతున్న తంతును ఎలాంటి వ్యాఖ్యానాలు లేకుండా కెమెరా ఐదు నిమిషాల పాటు రికార్డు చేసింది.
ఈ ప్రాంతం అసద్ అన్నయ్య బాసిల్ పేరుతో ఉండేది. 2015 నుంచి సిరియాలో మోహరించిన రష్యా సాయుధ దళాలకు ఇది ప్రధాన స్థావరం.
ఎయిర్ పోర్టు పేరు చూపుతూ వీడియో మొదలవుతుంది. తర్వాత ఇరాన్ విమానయాన కంపెనీ ఖెష్మ్ ఫార్స్ ఎయిర్ లోగోతో ఉన్న బోయింగ్ రవాణా విమానం రన్ వే మీదకు వస్తుంది. తర్వాత విమానంలోని వస్తువులను దింపడం పుటేజ్‌లో కనిపిస్తుంది.
విమానం నుంచి పెద్ద సంఖ్యలో సంచులను కిందకు దింపుతారు. రష్యా మిలటరీ డ్రెస్‌లో ఉన్నట్టుగా కనిపించే ఇద్దరు వ్యక్తులు ఈ ప్రక్రియను మొత్తం మొబైల్స్‌లో చిత్రీకరిస్తారు. సంచులను కత్తిరించి పచ్చని దుప్పట్ల కట్టలను కెమెరాకు చూపిస్తారు. అక్కడితో ఆ ఫుటేజ్ అయిపోతుంది.
ఈ ప్రక్రియ ముగిసిన తరువాత జరిగిన సమావేశంలో శరణార్థులు, చెల్లాచెదురయిన వారి కోసం రష్యా పంపిన మానవతాసాయాన్ని సిరియా స్వాగతిస్తోందని ఒక అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, Morteza Nikoubazl_NurPhoto via Getty Images
దుప్పట్లూ పేలతాయి...
రష్యా హమీమిమ్ సైనిక స్థావరానికి దగ్గర ఉన్న గిడ్డంగిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిందని రెండు రోజుల తర్వాత అంతర్జాతీయమీడియా తెలిపింది. ఆ ఘటన జరిగిన తర్వాత చిత్రీకరించిన వీడియోలో మంటలను మాత్రమే కాకుండా పేలుడుకు కారణమయ్యే పదార్థాలను కూడా గుర్తించారు. ఆర్‌టీ ప్రసారం చేసిన వీడియోకు, ఆ తరువాత వైమానిక దాడులు జరగడానికి సంబంధముందని కొందరు భావిస్తున్నారు.
''దుప్పట్లు కూడా పేలతాయని ప్రతి ఒక్కరికీ తెలుసు'' అని హమీమిమ్ వ్యవహారాల గురించి తెలిసిన ఒకరు పేరు చెప్పడానికి ఇష్టపడకుండా బీబీసీ దగ్గర విమర్శించారు.
మానవతాసాయం పంపిణీ పేరుతో ఇరాన్, రష్యా మిలటరీ స్థావరం ద్వారా ఆ ఆయుధాలను సరఫరా చేస్తోందా అని అడిగినప్పుడు....ఆ వ్యక్తి ఇలా స్పందించారు. ''నేనేం చెప్పాలని మీరు కోరుకుంటున్నారు? ఆ దుప్పట్లు ఎంత తీవ్రతతో పేలాయంటే హమీమిమ్‌ను పూర్తిగా తుడిచిపెట్టేశాయి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
సిరియాలోని రష్యా వైమానిక స్థావరం హమీమిమ్ లెబనాన్ కు ఇరాన్ ఎగుమతులకు కీలకమైన రవాణా కేంద్రం కాదని ప్రాంతీయ నిపుణుడు నికితా స్మాగిన్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ ఉపరితల రవాణా సౌకర్యాలపై ఆధారపడిందని, దీనిని ఇజ్రాయెల్ తరచుగా లక్ష్యంగా చేసుకుందని స్మాగిన్ వివరించారు. ఈ దాడులు జరిగినప్పటికీ, రష్యా స్థావరాల మీదుగా కాకుండా ఎగుమతులు సిరియా లెబనాన్‌కు చేరుకున్నాయి. అయితే సిరియాలో అధికారం మారిన తరువాత ఈ మార్గాలన్నీ తక్కువ ప్రాధాన్యం ఉన్నవిగా మారాయి.
‘‘ప్రస్తుతం ఇరాన్ ప్రభావం నుంచి సిరియా పూర్తిగా బయటపడింది. అయినా హమీమిమ్ ద్వారా రష్యా రవాణాను అనుమతిస్తే సిరియా కొత్త అధికారవర్గంతో ఒక ఒప్పందం చేసుకునే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుంది’’ అని వివరించారు.

రష్యన్లను మానవ కవచంగా...
''హమీమిమ్ వైమానికస్థావరం దగ్గర ఆయుధాల రవాణాకు సంబంధించిన ఇరాన్ విమానాన్ని 2023 ప్రారంభంలో గుర్తించాం'' అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ సరిత్ జెహావి చెప్పారు.
ప్రస్తుతం ఆమె ఇజ్రాయెల్‌లో అల్మా రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ నిర్వహిస్తున్నారు.
''సిరియాలోని డమాస్కస్, అలెప్పో ఎయిర్‌పోర్టులపై ఇజ్రాయెల్ నిఘా ఉంది. దీంతో ఇరాన్ విమానాలు అక్కడ ల్యాండ్ అవ్వలేవు. దీనివల్ల వారు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కున్నారు''అని జెహావి చెప్పారు.
హమీమిమ్ ఎయిర్‌పోర్టు దగ్గరకు ఇరాన్ విమానాలు వస్తున్న తొలిరోజుల్లోనే ఆయుధాల రవాణాకు ఇది కేంద్రంగా మారవచ్చని తాము హెచ్చరించామని ఆమె తెలిపారు. ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా రష్యన్లను మానవకవచాలుగా ఉపయోగించుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

ఫొటో సోర్స్, IDF
పిల్లల బొమ్మలతో పాటు ప్రాణాంతక ఆయుధాలు
నవంబరులో ఐడీఎఫ్ దక్షిణ లెబనాన్‌లో చిత్రీకరించిన ఓ వీడియో ప్రసారం చేసింది. ఆ వీడియోలో బ్యాగులు, బాక్సులు, బొమ్మలతో నిండి ఉన్న గది కనిపించింది. యజమానులు హడావిడిగా వెళుతున్నారు. ఒక సైనికుడు నిల్చుని ఉన్నారు. తర్వాత కెమెరా ఆ గదిలో ఓ మూలకు మళ్లింది.
''మేం ఒక పిల్లల గదిలోకి వెళ్లాం'' అని ఆ దాడిలో పాల్గొన్న వ్యక్తి బీబీసీతో చెప్పారు. ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.
''మేం గోడ పగలగొట్టాం. అప్పుడు అక్కడ మాకు మొదటిగా కనిపించింది రష్యా తయారుచేసిన ఆయుధాలు. వాటిలో కలషింకోవ్ రైఫిల్స్ మాత్రమే కాదు, కార్నెట్ యాంటీ టాంక్ మిస్సైల్ సిస్టమ్ వార్ హెడ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటివి ఆ ప్రాంతంలోని వేరే ఇళ్లల్లో కూడా కనిపించాయి'' అని ఆయన తెలిపారు.
''ఇలాంటి ఆయుధాలు ఐడీఎఫ్‌తో సంఘర్షణ కోసం కాదు...పట్టణాలపై దాడుల కోసం. ఐదారుగురికి సరిపడా ఆయుధాలు ప్రతి ఇంట్లో ఉన్నాయి. ఉగ్రవాదులు కార్నెట్ లాంచర్‌ను తీసుకుని ఆ బాక్సులు వదిలివేశారు. బీబీసీ ఫోటోల్లో ఇది కనిపిస్తోంది'' అని ఆ సైనికుడు తెలిపారు.
సిరియా నుంచి ఆ ఆయుధాలను రోడ్డు మార్గంలో దక్షిణ లెబనాన్‌కు తరలిస్తుండొచ్చు.
సరిహద్దుల్లో ఉన్న దక్షిణ లెబనాన్‌లోని సెటిల్‌మెంట్ల నుంచి ఇజ్రాయెల్ పట్టణాలపై కార్నెట్ మిస్సైళ్లతో దాడి చేయవచ్చు.శరదృతువు సమయానికి ఈ మార్గాలను ఇజ్రాయెల్ వైమానిక బలగాలు లక్ష్యంగా చేసుకోవడంతో వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
కార్నెట్ క్షిపణుల పరిధి దక్షిణ లెబనాన్‌లోని సెటిల్‌మెంట్స్ నుంచి ఇజ్రాయెలీ పట్టణాపై ప్రయోగించేందుకు అనువుగా ఉంది.

లెబనాన్ హిజ్బుల్లా చేతికి రష్యా ఆయుధాలు?
సిరియా నుంచి లెబనాన్‌కు ఆ ఆయుధాలు వచ్చిఉండొచ్చని మాతో మాట్లాడిన సైనికుడు భావించారు. ఆ ఇళ్లల్లో ఐడీఎఫ్ సైనికులకు కనిపించిన సిరియా డబ్బు ఆ మాటలకు బలం చేకూర్చింది.
అయితే ఈ ఆయుధాలపై ఉన్న స్టాంపులు, సీల్స్ పరిశీలించినప్పుడు అవి రష్యా ఆయుధాల ఎగమతి సంస్థ నుంచి వచ్చినట్టు తేలింది.
అంటే కార్నెట్లను అధికారిక సంస్థకే విక్రయించినట్టు బీబీసీకి సమాచారమిచ్చిన వ్యక్తి చెప్పారు.
''ఈ పరిస్థితుల్లో మొదటగా గుర్తొచ్చేది సిరియా ఆర్మీ. ఇది అసద్‌కు చెందిన ఆర్మీ. దానికి లెబనాన్ హిజ్బుల్లాతో దగ్గరి సంబంధాలున్న సిరియా హిజ్బుల్లాతో సాన్నిహిత్యం ఉందని మనకు తెలుసు'' అని ఆయన చెప్పారు.
లెబనాన్‌లో ఐడీఎఫ్ గుర్తించిన రష్యా ఆయుధాలు సిరియా జాతీయ ఆర్మీ నుంచే వచ్చాయని పశ్చిమ దేశాల ఇంటెలిజన్స్ వర్గాలకు చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి బీబీసీకి తెలిపారు.
అసద్ పాలనా కాలం చివరి వరకు రష్యా ఆయుధాలను సిరియన్ హిజ్బుల్లాకు అందించేవారని స్మాగిన్ చెప్పారు. ఆ తర్వాత అవి లెబనాన్‌కు సరఫరా అయ్యేవని, రష్యా వాటి గురించి అసలు పట్టించుకునేది కాదని తెలిపారు.
'ఆయుధాలు అలా సరఫరా అవుతున్నాయని వారికి తెలియదు. ఒకవేళ తెలిసినా వాళ్లు ఏమీ చేయరు'' అని స్మాగిన్ తెలిపారు.
''2022వరకు ఇజ్రాయెల్‌తో సంబంధాలకు రష్యా చాలా ప్రాధాన్యమిచ్చేది. ఆ తర్వాతే హిజ్బుల్లాకు ఆయుధాల సరఫరాను బహిరంగంగా అనుమతించడం మొదలయింది'' అని స్మాగిన్ చెప్పారు.
''తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇజ్రాయెల్ అభిప్రాయాలను రష్యా పట్టించుకోవడం మానేసింది. అయితే ఇప్పటికీ హిజ్బుల్లాకు రష్యా నేరుగా ఆయుధాలు సరఫరా చేస్తోందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు''అని స్మాగిన్ తెలిపారు.

సిరియాలో ఏం జరగనుంది?
సిరియా ఆర్మీకి హిజ్బుల్లా నమ్మదగ్గ స్నేహితుడు. సిరియాలో ఉన్న రష్యా బలగాలతో సమన్వయంతో పనిచేసేది. ఇజ్రాయెల్ దాడులతో జరిగిన నష్టంతో హిజ్బుల్లా బలహీనపడింది. బషర్ అల్ అసాద్ పాలన ఆకస్మికంగా ముగిసిపోవడానికి దారితీసిన కారణాల్లో ఇది కూడా ఒకటి.
దీనికితోడు సిరియాలో మిగిలి ఉన్న ఆయుధాగారాలపై ఇజ్రాయెలీ ఎయిర్‌ఫోర్స్ తీవ్రంగా దాడులు చేస్తోంది. సిరియా ఆయుధాలలో దాదాపు 80శాతం వృధాగా మారాయి. కొత్త అధికారులు హిజ్బుల్లాకు ఆయుధాలు అందించాలని భావించినా, చాలా తక్కువగానే మిగిలాయి.
ఇపుడు సిరియాలో అధికారం కూడా ఇరాన్‌ను శత్రువుగా చూసే సైన్యం వర్గాలకు బదిలీ అయింది. మరి సిరియాలోని రష్యా మిలటరీ స్థావరాలు, తెహ్రాన్ సరఫరాల భవితవ్యం ఏంటన్నది తేలాల్సి ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి).














