ఆంధ్రప్రదేశ్: గోదావరి జిల్లాల్లో రోజుల వ్యవధిలోనే వేలాది కోళ్లు మృతి, అధికారులు ఏం చెబుతున్నారంటే?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని రామకృష్ణ పౌల్ట్రీలో గత పదిరోజులుగా కోళ్లు ఒక్కొక్కటిగా చనిపోయాయి.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీలోనూ కోళ్లు హఠాత్తుగా చనిపోయాయి.
దీంతో పశు సంవర్ధకశాఖ అధికారులు 83 శాంపిల్స్ (చనిపోయిన 3 కోళ్ల శాంపిల్స్‌తోపాటు 40 కోళ్ల ముక్కు శాంపిల్స్, మరో 40 కోళ్ల రెట్ట శాంపిల్స్)ను సేకరించి ఈనెల 6వ తేదీన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని నేషనల్ హైసెక్యూరీటీ డిసీజ్ డయాగ్నోసిస్ లేబొరేటరీకి పంపించారు.
చనిపోయిన మూడు కోళ్లలో రెండింటికి బర్డ్‌ఫ్లూ (వైరస్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా– హెచ్5ఎన్1) నిర్ధరణ అయిందని పశు సంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎల్‌కే సుధాకర్ బీబీసీకి తెలిపారు.
బర్డ్‌ఫ్లూ వ్యాప్తికి హెచ్5ఎన్1 అనే వైరస్ కారణం. ఇది అంటు వ్యాధి. దీనికి అత్యధికంగా వ్యాప్తి చెందే స్వభావం ఉంటుంది. ఈ హెచ్5ఎన్1 జాతి వైరస్ ప్రాణాంతకమైనది. ఇది రోజుల వ్యవధిలోనే మొత్తం పెంపుడు పక్షులు, కోళ్ల మందలకు సోకుతుంది. పక్షుల రెట్టలు, లాలాజలం, కలుషితమైన ఆహారం, నీటి ద్వారా ఇది వ్యాపిస్తుంది.


కిలోమీటరు వరకు రెడ్ జోన్
బర్డ్‌ప్లూ కారణంగా కానూరు అగ్రహారంలోని రామకృష్ణ పౌల్ట్రీ నుంచి కిలోమీటరు వరకు.. వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీ నుంచి కిలోమీటరు వరకు రెడ్ జోన్(ఇన్‌ఫెక్టెడ్)గా ఆయా జిల్లాల అధికారులు ప్రకటించారు.
ఆ కిలోమీటరు పరిధిలోని అన్ని పౌల్ట్రీల్లోని కోళ్లను పూడ్చి పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలోని రెడ్ జోన్ పరిధిలో 55వేల కోళ్లను పూడ్చి పెట్టినట్టు జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ మురళీకృష్ణ బీబీసీకి తెలిపారు.
ఆ పౌల్ట్రీ ప్రదేశంలోనే ఆరు అడుగుల లోతు గొయ్యి తవ్వి, లేదా రెండు మీటర్ల వెడల్పు, లోతుతో గొయ్యి తవ్వి పూడ్చి పెడుతున్నామని తెలిపారు.
ఇక రెడ్ జోన్ పరిధిలో అంటే.. కిలోమీటరు పరిధిలోని పౌల్ట్రీలన్నీ మూడు నెలల పాటు మూసివేస్తారు. అలాగే ఆ జోన్ పరిధిలోని చికెన్ షాపులన్నీ మూసివేశారు.
చికెన్, కోడిగుడ్ల అమ్మకాన్ని నిలిపివేశారు. అలానే ఆయా ప్రాంతాల నుంచి కోడిగుడ్ల ఎగుమతిని కూడా నిషేధించారు.
రెడ్ జోన్ పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజల రక్తనమూనాలను సేకరించాలని నిర్ణయించారు.
ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారికోసం యాంటీ వైరస్ మందులను సిద్ధం చేశారు.
ఈ జోన్ పరిధిలోని ఫారాలను మొత్తం శానిటైజ్ చేసి.. ఈలోగా మళ్లీ అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కోళ్ల ఫారాల కార్యకలాపాల మొదలుపై నిర్ణయం తీసుకుంటామని డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు.
ఇప్పటివరకు పశ్చిమగోదావరి జిల్లాలోని రెడ్ జోన్ పరిధిలో రోజుల వ్యవధిలోనే లక్ష కోళ్లు మృత్యువాత పడ్డాయని, తాము పూడ్చి పెట్టాల్సినవి 55వేల వరకు ఉంటాయని పశు సంవర్ధకశాఖ అధికారులు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రెడ్‌జోన్ పరిధిలో 80వేల కోళ్లు మృత్యువాత పడినట్టు ఆ జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ ఫణీంద్ర బీబీసీకి తెలిపారు.

పది కిలోమీటర్ల వరకు సర్వెలెన్స్ జోన్
రెండు జిల్లాల్లోని ఆయా పౌల్ట్రీల నుంచి పది కిలోమీటర్ల వరకు సర్వెలెన్స్ జోన్‌గా ప్రకటించారు. ఈ పది కిలోమీటర్ల పరిధిలోని కోళ్ళ ఫారాలు, చికెన్ షాపులను మూడు వారాల పాటు మూసివేస్తారు.
ఆయా కోళ్ల ఫారాలను మూడు వారాలపాటు పర్యవేక్షణలో ఉంచుతారు.
అత్తిలి, కొమరవరం, కావలిపురం, ఎర్ర చెరువు, గోటేరు, మందపాక, ఇరగవరం, తేతలి, రేలంగి, గుమ్మంపాడు, పాలి, ఒరిగేడు, బల్లిపాడు, తణుకు, మల్లిపాడు, అర్జునుడి పాలెం ప్రాంతాలను సర్వెలెన్స్ జోన్‌గా ప్రకటించారు.

స్వాబ్ కలెక్షన్ తీసుకుంటున్నాం: కలెక్టర్
తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని కలెక్టర్ ప్రశాంతి బీబీసీతో చెప్పారు. బర్డ్ ఫ్లూ అంటువ్యాధి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభావిత జోన్‌లలోని ప్రజలు కొద్దిరోజుల పాటు గుడ్లు, చికెన్ తీసుకోవద్దని ఆమె సూచించారు.
పౌల్ట్రీల్లోనూ, చికెన్ షాపుల్లోనూ పనిచేసే వారి నుంచి స్వాబ్ కలెక్షన్ తీసుకుని పరీక్షలకు పంపుతున్నామని చెప్పారు.
అంగన్‌వాడీలకు, స్కూళ్లకు కొద్దిరోజుల పాటు గుడ్ల సరఫరాను నిలిపివేశామని కలెక్టర్ వివరించారు.
బర్డ్ ఫ్లూ విషయమై మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చిన ప్రాంతాలలో 144, 133 సెక్షన్లను పక్కాగా అమలయ్యేలా చూడాలని కోరారు.

ఫొటో సోర్స్, ANI
కోడికి రూ. 90 పరిహారం
పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదర్ బీబీసీతో మాట్లాడుతూ.. పరిస్థితి అంతా అదుపులోనే ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
భోపాల్ ల్యాబ్ నుంచి నివేదిక రాగానే సీఎస్ మార్గదర్శకాలు జారీ చేశారు. వాటిని కలెక్టర్లకు పంపగా... యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనల మేరకు చనిపోయిన లేదా పాతిపెట్టిన ఒక్కో కోడికి 90రూపాయలు పరిహారంగా అందిస్తామని దామోదర్ తెలిపారు.
''వైరస్ నిర్ధరణ అయిన రెండు జిల్లాలతో పాటు కాకినాడ, డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల పశు సంవర్ధక శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశాం. ఆయా జిల్లాల్లోని కోళ్ల ఫారాల్లోని ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ఎక్కడికక్కడ రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి బర్డ్ ఫ్లూను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం.'' అని ఆయన తెలిపారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరూ భయాందోళనలు సృష్టించవద్దు.. పౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడి లక్షలాదిమంది రైతులు, కార్మికులు బతుకుతున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత మళ్లీ యధావిధిగా పౌల్ట్రీలు నడుస్తాయి.. అని దామోదర్ బీబీసీతో అన్నారు.
అప్రమత్తంగా ఉన్నాం: మంత్రి కందుల దుర్గేష్
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రెండు పౌల్ట్రీల లోనే బర్డ్ ఫ్లూ నిర్ధరణ అయిందనీ, ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా పది కిలోమీటర్ల పరిధి వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని పర్యటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ బీబీసీకి తెలిపారు.
అన్ని విధాలా అప్రమత్తంగా ఉన్నామనీ, ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు పెట్టాలని, శానిటేషన్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించినట్టు చెప్పారు.
అధికారులు నివారణ చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
రెడ్ జోన్, సర్వైలైన్స్ జోన్ల పరిధిలోనే కాకుండా మిగిలిన చోట్ల కూడా కోళ్లకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














