‘శివశక్తి పాయింట్’ వయసు 370 కోట్ల సంవత్సరాలు.. భూమిపై జీవానికి దీనికి సంబంధం ఉందా?

ఫొటో సోర్స్, ISRO
- రచయిత, నందిని వి
- హోదా, బీబీసీ ప్రతినిధి
చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రాంతం వయసు 370 కోట్ల సంవత్సరాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధ్యయనం వెల్లడించింది.
అదే కాలంలో భూమిపై మొట్టమొదట సూక్ష్మజీవులు కనిపించాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే కనుగొన్నారు. ఇది చంద్రుడు, భూమి మధ్య చారిత్రక సంబంధంపై ముఖ్యమైన సమాచారాన్ని అందించింది.
దీనికి సంబంధించిన ఇస్రో పరిశోధన రిపోర్ట్ ప్రముఖ సైంటిఫిక్ జర్నల్ 'నేచర్'లో ప్రచురితమైంది.
ఇంతకీ ఈ అధ్యయనం ఏం చెబుతోంది? ఇది ఎందుకు ముఖ్యమైనది?.


ఫొటో సోర్స్, ISRO
ఏం కనుగొన్నారు?
2023 ఆగస్టు 23న ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మాడ్యుల్‌ను దింపారు. ఇలా దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, సోవియట్ యూనియన్, చైనా తర్వాత చంద్రుడిపై స్పేస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసిన దేశంగా భారత్ నిలిచింది.
చంద్రయాన్-3 మాడ్యుల్ దిగిన ప్రాంతం వయసును ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ల్యాండింగ్ సైట్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ 'శివశక్తి పాయింట్' అనే పేరు పెట్టారు.
ఈ ప్రదేశం 370 కోట్ల సంవత్సరాల నాటిదని శాస్త్రవేత్తలు చెప్పారు.
2016లో నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. గ్రీన్‌లాండ్‌లో కనుగొన్న ఏకకణ సూక్ష్మజీవుల శిలాజ అవశేషాలు 370 కోట్ల ఏళ్ల నాటివి.

ల్యాండింగ్ ప్రాంతం వయసు కనుగొనడంపై ఇస్రో మాజీ శాస్త్రవేత్త మైలస్వామి అన్నాదురై మాట్లాడుతూ "ఈ ఆవిష్కరణ భూమి, చంద్రుడి మధ్య ఎంత దగ్గరి సంబంధం ఉందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది" అని చెప్పారు.
"దక్షిణ ధ్రువం వద్ద ల్యాండింగ్ ఒక గొప్ప విజయం. ఇప్పుడు, ఈ ప్రాంతం పురాతనమైనదిగా గుర్తించారు. ఈ ఆవిష్కరణ చాలా ముఖ్యమైనది, విలువైనది. ఇది నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ISRO
పరిశోధన ఎలా చేశారు?
అహ్మదాబాద్‌లోని ఇస్రో ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. వారు చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రాంతం లక్షణాలు, స్థలం నైసర్గిక స్వరూపం తదితర విషయాలు పరిశీలించారు.
ఇస్రో శాస్త్రవేత్తలు అధునాతన ఇమేజింగ్ పరికరాలను ఉపయోగించి చంద్రుని క్రేటర్స్, రాతి నిర్మాణాలను నిరంతరం అధ్యయనం చేస్తున్నారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న భూభాగాన్ని అధ్యయనం చేయడానికి వారు అధిక-రిజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ డేటాసెట్‌లను ఉపయోగించారు.
చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రాంతం మొదటి మ్యాప్ ముఖ్యమైన ఫలితాలను వెల్లడించింది.
శాస్త్రవేత్తలు ల్యాండింగ్ ప్రాంతంలో మూడు విభిన్న రకాల భూభాగాలను అధ్యయనం చేశారు. బాగా ఎత్తుపల్లాలున్న కఠిన ప్రాంతం(హై రిలీఫ్ రగ్గ్‌డ్ టెర్రైన్), బాగా ఎత్తుపల్లాలున్న మెత్తని మైదానం(హై రిలీఫ్ స్మూత్ ప్లెయిన్), తక్కువ ఎత్తుపల్లాలున్న మెత్తని మైదానం(లో రిలీఫ్ స్మూత్ ప్లెయిన్స్).
చంద్రయాన్-3 అంతరిక్ష నౌక వాస్తవానికి లో రిలీఫ్ స్మూత్ ప్లెయిన్స్‌లో ల్యాండ్ అయింది.
ఆ ప్రాంతంలో శిలలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో తెలుసుకోవడానికి సమగ్ర సర్వే నిర్వహించారు. దీని ప్రకారం, ల్యాండింగ్ సైట్‌కు దక్షిణంగా 14 కిలోమీటర్ల దూరంలో 540 మీటర్ల వ్యాసంతో కొత్త బిలం కనుగొన్నారు. ఇక పడమటి వైపున చిన్న రాతి శకలాలు ఉన్నాయి. ఇవి సమీపంలోని 10 మీటర్ల వెడల్పు గల బిలం నుంచి ఉద్భవించి ఉండవచ్చు.
ఈ రాళ్లను (క్రేటర్ సైజ్-ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్) అధ్యయనం చేయడం ద్వారా ఆ ప్రాంతం వయసును లెక్కించారు. చంద్రుని దక్షిణం వైపున ఉన్న స్కోమ్‌బెర్గర్ బిలం అవశేషాలు ల్యాండింగ్ ప్రాంతంలో కొద్దిగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇది ఎందుకు ముఖ్యం?
ప్రాంతం వయసును కనుగొనడం చంద్రుని దక్షిణ ధ్రువ చరిత్రను అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది.
ఈ విషయమై శాస్త్రవేత్త టి.వి.వెంకటేశ్వరన్ బీబీసీతో మాట్లాడుతూ "చంద్రయాన్-3 వల్ల లభించిన అదనపు సమాచారంగా దీన్ని చూడాలి. దీని ద్వారా చంద్రుని భౌగోళిక చరిత్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం" అని అన్నారు.
చంద్రుడి పుట్టుకపై 3 సిద్ధాంతాలు ఉన్నాయని వెంకటేశ్వరన్ తెలిపారు. దీని ప్రకారం, భూమి, చంద్రుడు ఒకే సమయంలో ఏర్పడినట్లు మొదటి వాదన. రెండోది.. భూమి, చంద్రుడు వేర్వేరు సమయాల్లో వివిధ ప్రాంతాలలో ఏర్పడ్డాయి. కొన్ని కారణాల వల్ల చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి అక్కడే ఉంటోంది. మూడోది.. ఒక ఉల్క భూమిపై పడి, భూమిని చీల్చి, చంద్రుడు ఏర్పడ్డాడనే సిద్ధాంతం కూడా ఉంది.
"మూడో వాదన ఎక్కువగా నమ్మదగినది. అయితే, మిగిలిన రెండు నిజం కాదని చెప్పడానికి మా వద్ద ఎటువంటి ఆధారాలు లేవు" అని వెంకటేశ్వరన్ అన్నారు.
భూమికి ఎదురుగా ఉన్న చంద్రుని భాగం అనేది దాని అవతలి వైపుతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని ఆయన చెప్పారు.
"చంద్రునిపై అగ్నిపర్వతం ఉందని మాకు తెలుసు, అది ఎప్పుడు ఆగిందో తెలియదు. భూమి, చంద్రుని మధ్య సంబంధం, చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? దాని నిర్మాణంపై చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాలు కనుగొనే ప్రయాణంలో ఇస్రోకు ఈ ఆవిష్కరణ ఒక ముందడుగు" అని వెంకటేశ్వరన్ వివరించారు.
చంద్రునికి అవతలి వైపున లక్షల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం ఉందని 2024 నవంబర్‌లో నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. అమెరికా, చైనా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు.
చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ చాలా పురాతనమైనదని స్పష్టమైనట్లు వెంకటేశ్వరన్ తెలిపారు. అయితే ఈ పరిశోధనకు జీవం పుట్టుకతో సంబంధం లేదని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ISRO
మునుపటి విజయాలు
చంద్రునిపైకి దిగిన చంద్రయాన్-3 అంతరిక్ష నౌకలో రెండు ప్రధాన భాగాలు ఉన్నాయి. ఒకటి విక్రమ్ ల్యాండర్, మరొకటి ప్రజ్ఞాన్ అనే రోవర్.
రోవర్‌లో రెండు పరికరాలు, ల్యాండర్‌పై మూడు పరికరాలు అమర్చారు.
ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌లు పది రోజుల పాటు చంద్రుడి ఉపరితలం మీద అనేక శాస్త్రీయ పరిశోధనలు చేసి, అక్కడి మూలకాలను, మట్టి నమూనాలను, ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలను, ఇతర అంశాలపై కీలకమైన సమాచారాన్ని, చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఫొటోలను భూమికి చేరవేశాయి.
రోవర్‌కు ఉన్న 'లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్ప్రెక్ట్రోస్కోప్ పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు కనుగొందని ఇస్రో వెల్లడించింది. దీంతోపాటు అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సిలికాన్, ఆక్సిజన్‌లను ప్రజ్ఞాన్ రోవర్ కనుగొందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించింది.
"చంద్రయాన్-3 అంతరిక్ష నౌక ఎవరూ చేయని పని చేసింది" అని ప్రాజెక్ట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీర ముత్తువేల్ బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














