ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా: వాట్సాప్, టెలిగ్రామ్‌లో పైరసీ కంటెంట్ షేర్ చేస్తే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది?

నాగచైతన్య, సాయిపల్లవి, తండేల్ సినిమా

ఫొటో సోర్స్, Akkineni Naga Chaitanya/Face book

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' సినిమా విడుదలైన కొన్నిరోజుల్లోనే పైరసీ ప్రింట్‌ను ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడంతో చిత్ర నిర్మాతలు బన్నివాసు, సమర్పకులు అల్లు అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 7న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అంతలోనే ఈ సినిమాను పైరసీ చేసి అన్‌లైన్‌లో ఉంచారు.

ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో తండేల్ పైరసీ ప్రింట్‌ను ప్రదర్శించడం దారుణమని సోమవారం విలేఖరుల సమావేశంలో అల్లు అరవింద్, బన్నీవాసు అన్నారు.

పైరసీ లింకులను షేర్ చేస్తున్న వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి లింకులను షేర్ చేస్తే జైలుకు పంపించే అవకాశం ఉందని అల్లు అరవింద్ హెచ్చరించారు.

ఇప్పటికే కొందరిని గుర్తించామని, వారిని అరెస్ట్ చేయిస్తామని ఆయన చెప్పారు.కొంతమంది తెలిసి, మరికొంతమంది తెలియక ఇలాంటి పనులు చేస్తున్నారని బన్నీవాసు అన్నారు.

''ఒక్కసారి క్రిమినల్ కేస్ ఫైల్ అయితే వెనక్కి తీసుకోలేం, యువత ఇందులో చిక్కుకోవద్దు. మా సినిమా క్లిప్ ఒక్కటి ప్లే చేసినా కేసు పెడతాం. కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం. తండేల్ పైరసీ కాపీ 100 శాతం ఓవర్సీస్ నుంచే వచ్చింది. ఆఫ్రికన్ దేశాల్లో ఉన్న ఐపీ అడ్రస్‌ల నుంచి ప్లే చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించాం. పైరసీ చేసిన వాళ్లకీ, దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయి'' అని బన్నీవాసు వ్యాఖ్యానించారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బన్నీ వాసు

ఫొటో సోర్స్, FaceBook/Bunnyvas

ఫొటో క్యాప్షన్, తండేల్ పైరసీ గురించి తమకు సమాచారం ఇవ్వాలని బన్నీవాసు చెప్పారు.

మూవీ పైరసీ అంటే ఏంటి?

చాలా ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో జరుగుతున్న చర్చల్లో సినిమా పైరసీ అంశం ప్రముఖంగా వినిపిస్తుంటుంది.

కాపీరైట్ హోల్డర్ల అనుమతి లేకుండా ఒక సినిమాను అనధికారికంగా కాపీ చేయడం, పంపిణీ చేయడం, స్ట్రీమింగ్ చేయడాన్ని మూవీ పైరసీగా పిలుస్తారు. పుస్తక రచయిత అనుమతి లేకుండా ఎవరైనా ఒక పుస్తకాన్ని కాపీ కొట్టి, విక్రయించడం లాంటిదే ఇది కూడా.

పైరసీ రకరకాల రూపాల్లో జరుగుతుంది. అంటే, థియేటర్లలో కెమెరాతో సినిమాను రికార్డు చేయడం, అనధికారిక వెబ్‌సైట్ల నుంచి సినిమాను డౌన్‌లోడ్ చేసి ప్రసారం చేయడం, ఇలా కాపీ చేసిన సినిమాను సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల ద్వారా, ఇతర డిజిటల్ మీడియా వేదికల ద్వారా పంపిణీ చేయడం, క్యాసెట్లు, డీవీడీలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్కుల్లో అక్రమంగా కంటెంట్‌ను కాపీ చేయడం వంటివి పైరసీ కిందికే వస్తాయి.

మూవీ పైరసీ

ఫొటో సోర్స్, Getty Images

పైరసీ వల్ల చిత్ర పరిశ్రమకు జరిగే నష్టం ఏంటి?

సినిమా పైరసీ అనేది చిత్ర పరిశ్రమకు ఒక ప్రధాన ఆందోళన. పైరసీ అనేక నైతికపరమైన, చట్టబద్ధమైన, ఆర్థిక పరమైన ఆందోళనలకు కారణమవుతుంది.

పెద్ద స్టూడియోల నుంచి చిన్నచిన్న ఫిల్మ్ మేకర్ల వరకు ప్రతీ ఒక్కరిని ఆర్థికంగా ప్రభావితం చేస్తుంది.

పైరసీ కారణంగా 2023లో భారత వినోద పరిశ్రమకు రూ. 22,400 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఎకనమిక్స్ టైమ్స్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) విడుదల చేసిన నివేదిక ద్వారా తెలిసింది.

భారత్‌లో 51 శాతం వినియోగదారులు పైరసీ కంటెంట్‌ను వీక్షిస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడి చేసింది.

పైరసీకి కళ్లెం వేసేందుకు సమష్టి కృషి, కఠిన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.

గేమ్ చేంజర్

ఫొటో సోర్స్, FaceBook

'గేమ్ ఛేంజర్' కూడా...

రెండు నెలలుగా పైరసీ రాక్షసి విరుచుకుపడుతోందని, గేమ్ ఛేంజర్ సినిమాను కూడా ఇలాగే ఆన్‌లైన్‌లో విడుదల చేశారని అల్లు అరవింద్ చెప్పారు. చాలా ప్రయత్నాలు చేసి ఆ లింకులను ఆన్‌లైన్ నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు.

గతంలో 'ఉడ్తా పంజాబ్' సినిమా, థియేటర్లలో విడుదలకు రెండు రోజుల ముందే ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. నిర్మాతల ఫిర్యాదు మేరకు సినిమాను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన ముంబయి పోలీసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద అభియోగాలు నమోదు చేశారు.

అప్పట్లో కబాలి, గ్రేట్ గ్రాండ్ మస్తీ, బ్యాచిలర్ పార్టీ వంటి సినిమాలు కూడా పైరసీ బారిన పడ్డాయి.

మూవీ పైరేట్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొంతమంది పైరేట్స్, తాము పైరసీ చేసిన కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయడం ద్వారా లాభాలను ఆర్జిస్తారు.

పైరసీదారులకు ఆదాయం ఎలా వస్తుంది?

సినిమాలను పైరసీ చేసే వారిని ముఖ్యంగా రెండు గ్రూపులుగా విభజించవచ్చని బైట్స్ కేర్ బ్లాగ్స్ అనే వెబ్‌సైట్ పేర్కొంది. అందులోని సమాచారం మేరకు

యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం కోసం సినిమాలను పైరసీ చేస్తుంటుంది.. మరో గ్రూపు సైబర్ క్రిమినల్స్‌తో చేతులు కలిపి యూజర్ల డేటాను దోచుకుంటుంది.

మొదటి వర్గాన్ని 'ఎథికల్ పైరేట్స్'గా పిలుస్తుంటారు. వీరి ప్రధాన లక్ష్యం తప్పనిసరిగా లాభాలను ఆర్జించడం కాదు. బదులుగా వారు తమ ప్లాట్‌ఫామ్‌ను నడపడానికి అయ్యే ఖర్చులు, సర్వర్ ఖర్చులను పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకే ఉచితంగా, వీలైనంత త్వరగా పైరసీ కంటెంట్‌ను వారు షేర్ చేస్తారు.

ముఖ్యంగా 'పే పర్ క్లిక్' అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా వచ్చే ఆదాయంపై వీరు ఆధారపడతారు. తమ పైరసీ సైట్లలోకి ఎంత ఎక్కువ మంది యూజర్లు వస్తుంటే, ఎక్కువ క్లిక్‌లు పొందుతుంటే అదే స్థాయిలో వారికి ప్రకటనల ద్వారా గణనీయంగా ఆదాయం లభిస్తుంది.

మరో వర్గానికి చెందిన పైరసీదారులు సైబర్ క్రిమినల్స్‌తో చేతులు కలుపుతారు. వీరి లక్ష్యం కేవలం పైరసీ కంటెంట్‌ను షేర్ చేయడం మాత్రమే కాదు. సైట్‌లో మాల్‌వేర్‌ను అమర్చి యూజర్ల సమాచారాన్ని సైబర్ క్రిమినల్స్‌ దోచుకునేందుకు సహకరిస్తారు. బదులుగా భారీ మొత్తాలను పొందుతారు.

కొంతమంది పైరేట్స్, తాము పైరసీ చేసిన కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయడం ద్వారా లాభాలను ఆర్జిస్తారు.

కాపీరైట్

ఫొటో సోర్స్, Getty Images

చట్టం ఏం చెబుతోంది?

కాపీరైట్ చట్టం-1957 భారత్‌లో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ సహా సాహిత్యం, కళలు, సంగీతం, నాటకీయ రచనల యాజమాన్య హక్కులను సంరక్షిస్తుంది.

భారత ప్రభుత్వం, డిజిటల్ పైరసీకి కళ్లెం వేయడానికి కాపీరైట్ (సవరణ) చట్టం-2012 ద్వారా పైరసీ చట్టాలను సవరించింది.

ఇందులో సెక్షన్ 65(ఎ), సెక్షన్ 65 (బి) అనే రెండు ముఖ్యమైన సెక్షన్లను జోడించింది.

సెక్షన్ 65 (ఎ) ప్రకారం, కాపీరైట్ ఓనర్లకు చెందిన టెక్నలాజికల్ ప్రొటెక్షన్ మెజర్స్ (టీపీఎం)ను ఎవరైనా ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా పడుతుంది.

65 (బి) సెక్షన్, ఇన్ఫర్మేషన్ రైట్స్ మేనేజ్‌మెంట్ (ఐఆర్‌ఎం)‌కు సంబంధించినది. ఇది సున్నితమైన సమాచారాన్ని పైరసీ నుంచి రక్షిస్తుంది. ఎవరైనా అనుమతి లేకుండా ఈ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించినా, మార్చినా, ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తుంది.

కాపీరైట్ ఉన్న కంటెంట్‌ను అక్రమంగా ఆన్‌లైన్‌లో పంపిణీ చేయకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 నిరోధిస్తుంది.

ఈ చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం, ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష, 2 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

అంతేకాకుండా భారత న్యాయవ్యవస్థ, 'జాన్ డో' ఆర్డర్లను తీసుకొచ్చింది. ఆన్‌లైన్ పైరసీని ఎదుర్కోవడానికి సినీ నిర్మాతలు తరచుగా వీటిని వాడతారు.

గుర్తుతెలియని నేరస్థుల (అన్‌నోన్ అఫెండర్స్)‌పై చర్యలు తీసుకునేందుకు ఈ ఉత్తర్వులు అవకాశం ఇస్తాయి. వీటిని ఉపయోగించుకోవడం ద్వారా, కొత్త సినిమా విడుదలకు ముందే, అనుమానిత వెబ్‌సైట్లను బ్లాక్ చేయవచ్చు. అయితే, సమగ్ర దర్యాప్తు తర్వాతే ఈ ఆదేశాలు జారీ అవుతాయి.

సినిమాటోగ్రఫీ

ఫొటో సోర్స్, Getty Images

సినిమా పైరసీపై దశల వారీ పోరాటం

పైరసీని అరికట్టడం, ఫిల్మ్ సర్టిఫికెట్‌ ప్రక్రియలో సంస్కరణలు ప్రవేశపెట్టడమే లక్ష్యంగా రూపొందిన సినిమాటోగ్రాఫ్ సవరణ బిల్లు-2023కు లోక్‌సభ ఆమోదం దక్కింది.

సినిమాల్లో పైరసీని అడ్డుకునేందుకు సినిమాటోగ్రాఫ్ చట్టంలో గతంలొ ఎలాంటి నిబంధనలూ లేవు.

తాజా ముసాయిదాలో సెక్షన్ 6ఏఏ పేరుతో కొత్త నిబంధనను తీసుకొచ్చారు. ఎవరైనా అనుమతి లేకుండా థియేటర్లలో రికార్డింగ్ చేస్తే జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించేలా కొత్త నిబంధనను సిద్ధం చేశారు.

ఈ కొత్త చట్టం ప్రకారం, పైరసీని నేరంగా పరిగణించి మూడేళ్ల వరకు జైలు శిక్ష, సినిమా నిర్మాణ వ్యయంలో అయిదు శాతం జరిమానా విధించే అవకాశం ఉంది. లేదా ఈ రెండూ విధించవచ్చు.

పైరసీ

ఫొటో సోర్స్, Getty Images

పైరసీ కేసులను ఎలా ఫిర్యాదు చేయాలి?

మూవీ పైరసీ గురించి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఈ విషయాన్ని కంటెంట్ రైట్స్ హోల్డర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు.

ఆన్‌లైన్‌లో జరిగే మోసాలు, పైరసీల గురించి ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా భారత హోం మంత్రిత్వ శాఖ ఈ పోర్టల్‌ను తీసుకొచ్చింది.

మాల్‌వేర్ ఉన్నా, లేకపోయినా పైరసీ గురించి ఈ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

స్థానిక పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ సెల్‌లో కూడా ఈ విషయం గురించి నివేదించవచ్చు.

మూవీ పైరసీని అరికట్టేందుకు యశ్ రాజ్ ఫిల్మ్స్ వంటి నిర్మాణ సంస్థలు కూడా ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్టల్‌ను నిర్వహిస్తున్నాయి.

మూవీ పైరసీని ఈ పోర్టల్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలంటూ అభిమానుల్ని కోరుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)