‘హిందువును పెళ్లి చేసుకున్నానని కాళ్లకు సంకెళ్లు వేసి 2 నెలలపాటు బంధించారు.. నా భర్త నన్ను ఎలా రక్షించాడంటే’

- రచయిత, ప్రియాంక జగ్తాప్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"నేను నా భర్త వద్దకు వెళతానంటే వాళ్లు నన్ను కొట్టారు. నా కాళ్లను ఇనుప గొలుసులతో కట్టేయడంతో పారిపోలేకపోయాను. రెండు నెలలు ఆ గదిలో బంధించారు. మా కులంలోనే ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు. నా ఫోన్ కూడా లాక్కున్నారు".
మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీ నగర్‌కు చెందిన షెహనాజ్ ధాగే (22) తనను బంధించిన సంఘటన గురించి బీబీసీతో చెప్పిన మాటలివి.
షెహనాజ్ భర్త సాగర్ కూడా ఆ ఘటన గురించి మాట్లాడారు.
"ఆ రెండు నెలలు పిచ్చిపిచ్చిగా అనిపించింది. చాలా తిరిగాను. చాలామంది దగ్గరికి వెళ్లాను. కమిషనర్‌కు లేఖ రాశాను. కోర్టుకు వెళ్లాను" అని బీబీసీతో చెప్పారు సాగర్.
"వాళ్లు నా భార్య, బిడ్డను రెండునెలల పాటు గదిలో బంధించారు. చట్టం వారిద్దరిని బయటకు తీసుకువచ్చింది" అని ఆయన తెలిపారు.
తన తల్లిదండ్రులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని షెహనాజ్ అనుకోలేదు. మతాంతర వివాహం చేసుకోవడం వల్ల ఇద్దరూ చాలా కష్టాలు పడ్డారు, కలిసి ఉండటానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రెండు నెలల పాటు ప్రయత్నించిన తరువాత జనవరి 29న సాగర్ తన భార్య షెహనాజ్, మూడున్నరేళ్ల కుమారుడిని విడిపించగలిగారు.
షెహనాజ్ తల్లిదండ్రులు మహారాష్ట్రలో జల్నా జిల్లా భోకర్దాన్ సమీపంలోని ఉస్మాన్‌పేట ప్రాంతంలో నివసిస్తున్నారు.
ప్రేమ పెళ్లి చేసుకున్న ఐదేళ్లకు షెహనాజ్ తన పుట్టింటికి వెళ్లారు, కానీ తిరిగి రాలేకపోయారు. షెహనాజ్, ఆమె కొడుకును కుటుంబ సభ్యులు ఇంట్లోని ఒక గదిలో బంధించారు. షెహనాజ్ కాళ్లకు ఇనుప గొలుసులు కట్టి, పారిపోకుండా రెండు తాళాలు వేశారు.


అసలేం జరిగింది?
షెహనాజ్ అలియాస్ సోనాల్, సాగర్ ధాగే 2020లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారికి కార్తీక్ అనే మూడున్నరేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ కుటుంబం ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని మిసర్వాడిలో నివసిస్తోంది
ఇద్దరివి వేరు వేరు మతాలు కావడంతో రెండు కుటుంబాలవారు ఈ పెళ్లిని వ్యతిరేకించారు. కానీ పెళ్లయిన కొద్ది నెలల్లోనే సాగర్ కుటుంబం వారి పెళ్లిని అంగీకరించింది.
దీంతోపాటు గత ఏడాది నుంచి షెహనాజ్ తల్లిదండ్రులు, ఇతర బంధువులు కూడా అప్పుడప్పుడు మిసర్వాడీలోని వారి ఇంటికి రావడం ప్రారంభించారు. దీంతో అందరూ కలిసిపోయినట్టుగా సాగర్ దంపతులు భావించారు.
అలా షెహనాజ్ తన భర్త సాగర్, చిన్న కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్లారు.

'ఫోన్ చేస్తే వెళ్లాం'
2024 డిసెంబర్ 5న షెహనాజ్‌కు ఆమె తల్లి ముంతాజ్ ఖలీద్ షా ఫోన్ చేశారు. తన కాలిపై రాయి పడిందని చెప్పిన ఆమె షెహనాజ్‌ను ఇంటికి రమ్మని కోరారు.
"నా భార్య సోదరి ఇటీవల ప్రసవించింది.అదే సమయంలో మా అత్తగారికి రాయి తగిలి, గాయమైందని చెప్పారు. కాబట్టి ఆమెను చూడటానికి ఆ ఇంటికి వెళ్లాం" అని సాగర్ ధాగే చెప్పారు.
"నేను వెళ్లగానే మంచిగా మాట్లాడి భోజనం పెట్టారు. తర్వాత 'మీరు వెళ్లండి, అమ్మాయిని మూడు-నాలుగు రోజులు ఆగి పంపిస్తాం' అన్నారు. దీంతో నా కుమారుడు, భార్యని అక్కడే వదిలి, శంభాజీ నగర్‌కి వచ్చేశాను'' అని సాగర్ గుర్తుచేసుకున్నారు.
"తర్వాత నేను బస్‌లో ఉండగా నా భార్య నుంచి కాల్ వచ్చింది. ఆమె ఫోన్‌లో ఏదో మాట్లాడుతోంది. నాకు కొంచెం అనుమానం వచ్చింది. ఏమైందని అడిగాను. తర్వాత కాల్ చేస్తానని చెప్పి వెంటనే కట్ చేసింది. తర్వాత ఆమె ఫోన్ డెడ్ అయింది. ఆ తర్వాత రెండు రోజులు తన కాల్ కోసం ఎదురుచూసినా రాలేదు" అన్నారు సాగర్.
సాగర్ తన భార్య, బిడ్డలను తీసుకురావడానికి డిసెంబర్ 7న అత్తమామల ఇంటికి వెళ్లారు.
"నేను వెళ్లినప్పుడు షెహనాజ్ కుటుంబ సభ్యులు నన్ను కొట్టారు. చంపేస్తామని బెదిరించారు. నన్ను చూడగానే నా కొడుకు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు, నేను తనని ఎత్తుకున్నాను. కానీ, వెంటనే పిల్లాడిని లాక్కొని నన్ను పక్కకు తోసేశారు" అని చెప్పారు సాగర్.
తన మతం వేరు కాబట్టి కూతురిని వెనక్కి పంపబోమని వారు చెప్పారని సాగర్ తెలిపారు.

గొలుసులతో కట్టేశారు
సాగర్ ధాగేను అతని అత్తమామలు బయటకు తోశారు.
''సాగర్ నన్ను తీసుకురావడానికి వచ్చేసరికి ఇలా చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నారు. సరిగ్గా అలాగే చేశారు. నన్ను వెనక్కి నెట్టి, నా పిల్లాడిని తీసుకున్నారు'' అని షెహనాజ్ అన్నారు.
"ఆ క్షణంలో నాకు అంతా అర్థమైంది. నన్ను రానివ్వరని సాగర్‌కి చెప్పాను. నువ్వు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయ్" అని ఆయనకు చెప్పాను.
సాగర్ మాట్లాడుతూ "నేను పోలీసులను ఆశ్రయించాను. మతాంతర వివాహం కాబట్టి, కోర్టు ఆదేశాలతో ముందుకు వెళదామని వారు నాకు సూచించారు. అప్పుడు నేను ఒక న్యాయ వాదిని ఏర్పాటుచేసుకొని కోర్టు సహాయం కోరాను. ఆ సమయంలో మా తల్లిదండ్రులు కూడా నాతో ఉన్నారు" అని అన్నారు.
ఇలా చేస్తారని ముందుగా అనుకోలేదని షెహనాజ్ అంటున్నారు.
"నేను నా భర్త వద్దకు పారిపోవాలనుకున్నాను. 10 రోజుల తర్వాత నా కాళ్లను ఇనుప గొలుసులతో కట్టారు. దానికి రెండు తాళాలు వేశారు" అని గుర్తుచేసుకున్నారు షెహనాజ్.
"నా భర్త దగ్గరికి వెళతానంటే కొట్టేవారు. మా మతానికి చెందిన అబ్బాయితో పెళ్లి చేయాలనుకున్నారు. మొదట్లో నా కొడుకును నాకు దూరంగా ఉంచారు. నా కొడుకును నా దగ్గర ఉంచకపోతే ఏదో ఒకటి చేసుకుంటానని బెదిరించాను" అని షెహనాజ్ అన్నారు.
'పోలీసులను పంపండి'
షెహనాజ్ వద్ద ఫోన్ కూడా లేకపోవడంతో ఆమె సాగర్‌ను ఎక్కువగా సంప్రదించలేక పోయారు. ఒకసారి షెహనాజ్ ఫోన్ సంపాదించి, సాగర్‌కు కాల్ చేసి తనను పెడుతున్న చిత్రహింసల గురించి చెప్పారు.
''ఇంట్లో మొబైల్ ఒకటి చార్జింగ్ పెట్టడం చూశాను. అక్కడ ఎవరూ లేకపోవడంతో రహస్యంగా నా భర్తకు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పాను'' అని షెహనాజ్ అన్నారు.
చాలా రోజుల తర్వాత తన భార్య గొంతు వినడంతో ప్రాణం తిరిగొచ్చినట్లయిందని సాగర్ చెప్పారు.
"ఆ రెండు నెలల్లో ఒకసారి ఫోన్ చేయగలిగింది. రెండు నిమిషాలు మాట్లాడింది. గొలుసులతో కట్టేశారని చెప్పింది. దయచేసి వీలైనంత త్వరగా ఏదైనా చేసి తీసుకెళ్లడానికి పోలీసు వాహనం పంపాలని కోరింది" అని అన్నారు సాగర్.
"కోర్టులో కేసు వేశానని ఆమెకు చెప్పాను. నిన్ను త్వరగా తీసుకురావడానికి పోలీసులు వస్తారన్నాను. అప్పుడే గదిలోకి ఎవరో వచ్చారు, ఆమె ఫోన్ కట్ చేసింది. మేం మళ్లీ మాట్లాడుకోలేదు" అని సాగర్ చెప్పారు.
ఎలా కాపాడారు?
''నన్ను కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు ఇంటికి వచ్చారు" అని షెహనాజ్ చెప్పారు.
"ఆ సమయంలో మా అమ్మ పోలీసు కారును చూసింది. వెంటనే లోపలి నుంచి ఇంటికి తాళం వేసింది. నేను కోర్టుకు వెళ్లాలని చెప్పాను. నిశ్శబ్దంగా ఉండమని, శబ్దం చేయవద్దన్నారు. పోలీసు కారు వెళ్లిపోయింది, తర్వాత నన్ను కొట్టారు" అని చెప్పారు షెహనాజ్.
"నేను వాళ్లను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నానని వారు అన్నారు. వారి తరపున కోర్టులో సాక్ష్యం చెబితేనే నన్ను వెళ్లనిస్తామని మా నాన్న చెప్పారు. నేను మా ఆయనతో వెళ్లొద్దన్నారు. నా కొడుకును వదిలెయ్యాలని చెప్పారు. అది నాకు ఇష్టం లేదు" అని షెహనాజ్ చెప్పారు.
జనవరి 12న షెహనాజ్‌తో హాజరు కావాలని కోర్టు ఆదేశించగా ఆమె తండ్రి మాత్రమే హాజరయ్యారు. కూతురిని వెనక్కి పంపబోనని సాగర్‌కు చెప్పారు.
షెహనాజ్ విడుదలైన రోజును సాగర్ గుర్తుచేసుకుంటూ..''జనవరి 29న నా భార్య, కొడుకు విడుదలైన రోజున శంభాజీనగర్‌లో పనికి వెళ్లాను. భోకర్దాన్ సబ్-ఇన్‌స్పెక్టర్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఈరోజు షెహనాజ్‌ని ఔరంగాబాద్ కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. అయితే నాకు ఫిబ్రవరి 3 తేదీ అని ముందు చెప్పారు. ఆ విషయం ఎస్ఐకి చెప్పాను" అని అన్నారు.
త్వరగా చర్యలు తీసుకున్నామని, కోర్టుకు రావాలని ఎస్ఐ సూచించారని సాగర్ గుర్తుచేసుకున్నారు.
"వెంటనే మా అమ్మను పిలిచాను, అక్కడ నుంచి నేరుగా కోర్టుకు వెళ్లాం. కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది" అని సాగర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాళ్లు రువ్విన షెహనాజ్ తల్లి..
షెహనాజ్‌ను తీసుకెళ్లేందుకు పోలీసులు వెళ్లగా ఆమె తల్లి, సోదరి అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
"వంటగది దగ్గర కూర్చొని ఉన్నాను. అప్పుడు పోలీసు కారు రావడం కనిపించింది" అన్నారు షెహనాజ్.
ఆమె మాట్లాడుతూ "పోలీసులు నా దగ్గరకు వచ్చి నా పేరు అడిగారు. నా పక్కనే కూర్చున్న అబ్బాయిని చూసి ఇతను మీ కొడుకేనా అని అడిగారు. నేను అవును అన్నాను. దీంతో బయటికి తీసుకొచ్చారు" అన్నారు.
షెహనాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన మొత్తాన్ని చూసిన ఆమె తల్లి చాలా కోపంగా ఉన్నారు. పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. షెహనాజ్‌ను ఆపడం అసాధ్యం అనిపించిన ఆమె సోదరి కార్తీక్‌ను పట్టుకుంది. అయితే పోలీసులు కార్తీక్, షెహనాజ్‌లను రక్షించి భోకర్దన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
'అంబేడ్కర్‌కు ధన్యవాదాలు'
కోర్టు, పోలీసులు చాలా సాయం చేశారని, ఈ కేసు తర్వాత చట్టంపై నమ్మకం పెరిగిందని సాగర్ చెప్పారు.
అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తనకు భార్య, కొడుకు తిరిగి వచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.
"చట్టం గురించి మనకు తెలిస్తే దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలాంటివి జరిగితే మనం చట్టం వద్దకు తప్ప మరెక్కడికీ వెళ్లలేం" అని సాగర్ అన్నారు.
"మేం చాలా ఇబ్బందులు పడ్డాం. నా కొడుకు మొదటి పుట్టిన రోజు కూడా జైలులో జరుపుకొన్నాడు. జైలులోనే అతనికి ఏడాది నిండింది. వాడికి మూడు నెలల వయస్సు ఉండగా మమ్మల్ని అరెస్టు చేసి జైల్లో వేశారు" అని గుర్తుచేసుకున్నారు సాగర్.
"మేం 2020లో పారిపోయి వివాహం చేసుకున్నాం. అప్పటికి షెహనాజ్ వయస్సు 18 సంవత్సరాలు. అయితే, షెహనాజ్ తల్లిదండ్రులు ఆమెను మైనర్‌గా చెబుతూ నకిలీ పుట్టిన తేదీతో కూడిన పత్రాలను చూపి, నాపై కేసు పెట్టారు. నన్ను జైల్లో పడేశారు. అప్పుడు షెహనాజ్ తనను కూడా జైల్లో పెట్టమని అడిగింది. మేం ముగ్గురం దాదాపు 9 నెలలు జైల్లోనే ఉన్నాం. తరువాత మమ్మల్ని నిర్దోషులుగా విడుదల చేశారు" అని అన్నారు.

పోలీసులు ఏమన్నారు?
భోకర్దాన్ సబ్-ఇన్‌స్పెక్టర్ బి.టి. సహానే ఈ కేసు వివరాలు తెలిపారు. షెహనాజ్ కుటుంబం ఔరంగాబాద్‌లోని మిసర్వాడిలో కొంతకాలం నివసించింది. అక్కడే షెహనాజ్, సాగర్‌కు పరిచయం ఏర్పడింది. ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పారిపోయి, వివాహం చేసుకున్నారు.
పెళ్లయిన ఐదేళ్ల తర్వాత షెహనాజ్ తల్లిదండ్రులు ఆ దంపతులను గ్రామానికి ఆహ్వానించారు. వచ్చాక, ఆమె కాళ్లకు సంకెళ్లు వేసి ఇంట్లో బంధించారు. ఆమె భర్త హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బాధితురాలిని, ఆమె మూడున్నరేళ్ల కొడుకును హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. మేం ఇంటికి వెళ్లి షెహనాజ్‌ను బయటకు తీసుకువచ్చాం.
మేం చూసేటప్పటికి షెహనాజ్ కాళ్లకు సంకెళ్లు వేసి ఉన్నాయి. గొలుసు తొలగించాం. తర్వాత కోర్టు ఆదేశాల మేరకు భర్తకు అప్పగించాం.
ఇప్పుడు షెహనాజ్ క్షేమంగా ఉన్నారు. కోర్టు ఆమెకు రక్షణ కల్పించింది. అలాగే ఈ కేసులో షెహనాజ్ కుటుంబంపై కూడా కేసు నమోదైంది.
షెహనాజ్ తల్లి ముంతాజ్ బేగం ఖలీద్, తండ్రి ఖలీద్ షా సికిందర్ షా, షాహీన్ షకీర్ షా, జాకీర్ ఖలీద్ షాలపై విచారణ జరుగుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














