దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ చేసిన తప్పులేంటి, ఎందుకు ఓడిపోయారు?

ఫొటో సోర్స్, ANI
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. న్యూ దిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయనను ఓడించారు. తన ఓటని అంగీకరిస్తూ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు.
"ప్రజా తీర్పును మేము సగౌరవంగా అంగీకరిస్తున్నాం. విజయం సాధించిన బీజేపీకి అభినందనలు. దిల్లీ ప్రజల ఆకాంక్షలను ఆ పార్టీ నెరవేరుస్తుందని భావిస్తున్నాను" అని కేజ్రీవాల్ చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రతిపక్ష పాత్ర పోషించబోతోంది. అయితే కీలక నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోదియా ఓడిపోవడం పార్టీ నాయకులు, కార్యకర్తలను అయోమయంలో పడేసింది.
దిల్లీ అసెంబ్లీలో తాము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని కేజ్రీవాల్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు.
"రానున్న ఐదేళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడంతో పాటు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుంది" అని అందులో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘కుల మతాలకతీతంగా మనుషులంతా ఒక్కటే. అన్ని కులాలు, మతాల మధ్య ద్వేష భావం కాకుండా, ప్రేమ సోదరభావం ఉన్న భారతదేశాన్ని మనమంతా నిర్మించాలి’’ ఇది దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 'ఎక్స్' అకౌంట్‌లోని క్యాప్షన్. ఎక్స్‌లో ఆయనను 27.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో భారతదేశపు రాజకీయ నాయకులకుండే ఫాలోయింగ్‌తో పోలిస్తే ఈ సంఖ్య చిన్నదేమీ కాదు.
"దేశం అవినీతి కుంభకోణాలతో విసిగిపోయిన సమయంలో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నుంచి కేజ్రీవాల్ ముందుకొచ్చారు" అని ఆప్ నాయకుడు శశికుమార్ చెప్పారు.
2023 సెప్టెంబర్‌లో దిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. అవినీతి కేసులో బెయిల్ పొందిన కొద్ది రోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పుడు, ప్రతిపక్షాలు ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ, దిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచే నడుపుతున్నారని ఎగతాళి చేశాయి. అప్పుడు కేజ్రీవాల్ ఈ డిమాండ్‌ను పట్టించుకోలేదు.
గత ఏడాది మార్చి 21న కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు. ఇది 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగింది. అప్పుడు ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని విమర్శించాయి. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించాయి.
దిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ ఆరు నెలలు జైలులో ఉన్నారు (తరువాత దానిని రద్దు చేశారు). ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ "నేను ప్రజల కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నేను నిజాయితీపరుడినో, కాదో ప్రజలు చెబుతారు" అని కేజ్రీవాల్ అన్నారు.
ఇప్పుడు దిల్లీ ప్రజలు తమ నిర్ణయం తీసుకున్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ నిజాయితీపరులా, కాదా అన్నదానికంటే కూడా దిల్లీ తదుపరి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాదు, బీజేపీకి చెందిన వ్యక్తి అనే అంశంపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది.
ఈ రాజీనామా తర్వాత 2030లో జరిగే తదుపరి ఎన్నికల వరకు వేచి ఉండాల్సి వస్తుందని కేజ్రీవాల్ బహుశా ఊహించి ఉండకపోవచ్చు.
నిజానికి, కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన పార్టీ, తాను పూర్తిగా నిజాయితీపరులమని కేజ్రీవాల్ చెప్పుకుంటారు. కానీ ఆయన అవినీతి కేసులో జైలుకు వెళ్ళినప్పుడు, ఆయన ఇమేజ్‌కి పూర్తి విరుద్ధంగా అనిపించింది.
పంజాబ్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ అశుతోష్ కుమార్ మాట్లాడుతూ, "కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక ఇమేజ్ ఖచ్చితంగా బలహీనపడింది, కానీ భారతదేశ ఓటర్లకు ఇది పెద్ద విషయం కాదని నేను భావిస్తున్నాను" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నుంచి..
యూపీఏ వన్, టూ ప్రభుత్వంలో కుంభకోణాలకు వ్యతిరేకంగా 2011లో అన్నా హజారే చేపట్టిన ఉద్యమంలో కేజ్రీవాల్ తెరపైకి వచ్చారు.
సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ర్యాంక్ సాధించిన తర్వాత ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్‌లోకి అర్హత సాధించారు. 1995లో ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.
2006లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2012లో న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్‌తో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. 2013 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పరివర్తన్‌తో మొదలు పెట్టి...
ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగంలో చేరిన నాలుగేళ్ల తర్వాత కేజ్రీవాల్ , మనీశ్ సిసోదియా మరి కొందరు కలిసి దిల్లీలోని సుందర్‌నగర్ ప్రాంతంలో పరివర్తన్ అనే సంస్థను సంస్థాపించారు.
ఈ సంస్థ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం, ఆదాయపు పన్ను, విద్యుత్ సరఫరా లాంటి అంశాలపై పోరాడేవారు. 2005లో కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా కలిసి కబీర్ అనే మరో స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.
పరివర్తన్, కబీర్ అనే సంస్థలు సమాచార హక్కు చట్టం, పాలనలో జవాబుదారీ తనం లాంటి అంశాల కోసం పోరాడాయి. ఆ పోరాటాల ఫలితంగా 2001లో దిల్లీ ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది.
దీంతో జాతీయ స్థాయిలో సమాచార హక్కు చట్టం కోసం పోరాడుతున్న అన్నా హజారే, అరుణారాయ్, శేఖర్ సింగ్‌కు అరవింద్ కేజ్రీవాల్ జత కలిశారు. 2006 ఫిబ్రవరిలో ఉద్యోగానికి రాజీనామా చేసి పబ్లిక్ కాజ్ రీసర్చ్ ఫౌండేషన్ స్థాపించారు.
ఈ ఉద్యమంలో కేజ్రీవాల్, మనీష్ సిసోదియాకు తోడుగా ప్రశాంత్ భూషణ్, కిరణ్ బేడీ వచ్చి కలిశారు. ఈ బృందం సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని దిల్లీలో జరిగిన అనేక అక్రమాలను వెలుగులోకి తెచ్చింది.
2011లో ఇండియా ఎగనెస్ట్ కరప్షన్ పేరుతో అన్నా హజారే ప్రారంభించిన పోరాటంలో వీరంతా జత కలిశారు. తర్వాతి రోజుల్లో ఇదొక ఉద్యమంలా మారింది.
అవినీతిని అరికట్టేందుకు బలమైన లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, సీబీఐ, సీవీసీ లాంటి వ్యవస్థల్ని లోక్‌పాల్ కింద ఉంచాలని అన్నా హజారే డిమాండ్ చేశారు.
ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో యూపీఏ ప్రభుత్వం బలమైన లోక్‌పాల్ బిల్లు తీసుకు వచ్చేందుకు అంగీకరించింది.
అయితే లోక్‌పాల్‌కు రాజకీయ నాయకులను విచారించే అర్హత ఉండదనే ప్రతిపాదన తీసుకు రావడంతో కేజ్రీవాల్ ఉద్యమం నుంచి బయటకు వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ ముఖ్యమంత్రిగా..
2013 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఆప్ 28 సీట్లు వచ్చాయి. బీజేపీ 31 స్థానాలు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయట నుంచి మద్దతివ్వడంతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
దిల్లీ అసెంబ్లీలో జనలోక్‌పాల్ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో 2014 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
తన రాజీనామాకు గల కారణాలను ప్రజలకు వివరించకుండా ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవడం ద్వారా తాను తప్పు చేశానని కేజ్రీవాల్ 2014 ఏప్రిల్‌లో చెప్పారు.
2015లో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ ఘన విజయం సాధించింది. అసెంబ్లీలోని 70 స్థానాల్లో ఆప్ 67 సీట్లు గెలుచుకుంది. కేజ్రీవాల్ 2015 ఫిబ్రవరి 14న మరోసారి ముఖ్యమంత్రిగా రామ్‌లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేశారు.
కొత్త ఒరవడి
దిల్లీలో రెండోసారి ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, మొహల్లా క్లినిక్‌లు, పారదర్శక పాలన వంటి వాటికి పెద్ద పీట వేసింది.
దిల్లీలో ఆమ్ఆద్మీ ప్రభుత్వం, కేంద్రంలో, దిల్లీ కార్పోరేషన్‌లో బీజేపీ అధికారంలో ఉండటంతో ఈ రెండు పార్టీల మధ్య నిరంతర సంఘర్షణ పాలనా వ్యవహారాలపై ప్రభావం చూపింది.

ఫొటో సోర్స్, Getty Images
అవినీతి ఆరోపణలతో జైలుకు..
ఆప్ ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ కేజ్రీవాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పార్టీని వదిలి వెళ్లారు. తర్వాతి కాలంలో కొంతమంది నాయకులు, ఎమ్మెల్యేలు కూడా ఇదే బాట పట్టారు.
2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీపార్టీ సాధించిన విజయంతో దేశ వ్యాప్తంగా ఆ పార్టీకి కార్యకర్తల బేస్ ఏర్పడింది.
2020లోనూ దిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 2015 నాటి విజయాన్ని పునరావృతం చేసింది. 70 స్థానాల్లో 63 గెలుచుకుంది.
దీంతో 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఆప్ జాతీయ పార్టీగా అవతరించింది. గోవా, గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణాలో పోటీ చేసినా అక్కడ ప్రభావం చూపలేకపోయింది.
దిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి రావడం, ఆ పార్టీ నేతలు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోదియా, కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యాయి.
మద్యం పాలసీని మార్చిన కేసులో కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్ట్ చెయ్యడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు. బీజేపీ వ్యూహాలను తిప్పి కొట్టడంలో విఫలం అయ్యారు.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫరితాలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు.
"నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. రాజకీయాల్లో ఉన్నవారు నిజాయతీగా వ్యవహరించాలి. లిక్కర్ పాలసీ కేజ్రీవాల్ ప్రతిష్టను దెబ్బ తీసిందని, ప్రజలకు సేవ చెయ్యాలనే ప్రాథమిక సూత్రాన్ని వదిలి పెట్టి తప్పుడు మార్గంలో నడవటం వల్లనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
కేజ్రీవాల్ తన ఇమేజ్‌కు విరుద్ధంగా వ్యవహరించారా?
ధర్మవీర్ గాంధీ 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌పై పంజాబ్ నుంచి లోక్‌సభ ఎంపీ అయ్యారు. అయితే కేజ్రీవాల్‌తో విభేదాల కారణంగా, ఆయన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లతో కలిసి ఆప్‌ను వదిలేశారు.
ప్రస్తుతం ఆయన పాటియాలా నుంచి కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి గురించి గాంధీ మాట్లాడుతూ, కేజ్రీవాల్ ఒక్కశాతం కూడా నిజాయితీపరుడు కాదని అన్నారు.
"కేజ్రీవాల్ తాను సామాన్యుడినేనని, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సామాన్యుడిలాగే ఉంటానని చెప్పారు, కానీ ఇది అబద్ధమని తేలిపోయింది. ఆయన తనకోసం ఒక పెద్ద బంగళా కట్టుకుని, ఖరీదైన కారు కొన్నారు. తాను ప్రజాస్వామ్య నాయకుడినని, స్వరాజ్యాన్ని నమ్ముతానని కేజ్రీవాల్ అన్నారు, ఇది కూడా తప్పని రుజువైంది. ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, పార్టీలో కేజ్రీవాల్ ఆదేశాలే పాటించాల్సి ఉంటుందని" అని గాంధీ అన్నారు.
"కేజ్రీవాల్ నిజాయితీపరుడినని, పారదర్శక రాజకీయాలు చేస్తానని చెప్పారు కానీ అది కూడా తప్పని తేలింది, అవినీతి కేసులో జైలుకు వెళ్లి ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. తాను మతం, కులం ఆధారంగా రాజకీయాలు చేయనని కేజ్రీవాల్ అన్నారు. ఇది కూడా నిజం కాదు. కేజ్రీవాల్ తన కులాన్ని చాలాసార్లు ప్రస్తావించారు. లౌకికవాదం ఆయనకు ముఖ్యమైన భావజాలం కాదు అని గాంధీ చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ వంటి వ్యక్తులు ఉన్నారు, కానీ ఇప్పుడు వారందరూ విడిపోయారు.
యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌ల గురించి దిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌తో పెద్ద చర్చ జరిగిందని ధర్మవీర్ గాంధీ చెప్పారు. ఆ చర్చను గుర్తుచేసుకుంటూ గాంధీ ఇలా చెప్పుకొచ్చారు, "యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ విషయంలో మీరు సరైన పని చేయలేదని నేను ఆయనతో చెప్పాను. అందుకు కేజ్రీవాల్ ఇటువైపు ఉండండి లేదా అటువైపు ఉండండి అన్నారు. కేజ్రీవాల్ పార్టీలోని ప్రజాస్వామ్యం ఇదేనా? కేజ్రీవాల్ రాజ్యసభకు ఎవరిని పంపారో మీరు చూశారు. అశోక్ కుమార్ మిట్టల్ లవ్లీ యూనివర్సిటీ యజమాని, ఆయనను ఎంపీగా చేశారు. డబ్బు ఇవ్వగలిగే వ్యక్తులే ఎంపీలయ్యారు అని అన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తనను తాను బీజేపీ బాధిత పార్టీగా చూపించుకుంది కానీ ఆ అంశం ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆమ్ ఆద్మీ పార్టీ 2012 నవంబర్‌లో ఏర్పడింది. దిల్లీలోని ఏడు లోక్‌సభ సీట్లలో ఒక్కటి కూడా గెలవలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల నుండి 2020 వరకు, దిల్లీ ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి, అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తూనే ఉన్నారు.
కానీ 2025 నాటికి ఈ ధోరణి కూడా ఆగిపోయింది. ఇప్పుడు దిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలు బీజేపీతో ఉన్నాయి. దిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేయబోతున్నది కూడా బీజేపీనే.
అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలపై ఆమ్ ఆద్మీ పార్టీకి పునాది వేశారు. కానీ ఒక సంవత్సరం లోపే, అంటే డిసెంబర్ 2013 లో, ఆయన కాంగ్రెస్ మద్దతుతో దిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
49 రోజుల్లోనే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు, ఆ తర్వాత ఆయన మళ్లీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా గళం విప్పారు.
2024 నాటికి, అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ నేతృత్వంలోని అఖిల భారత కూటమిలో చేరారు. దిల్లీ , గుజరాత్ లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంది, కానీ అది ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వలేదు.
అయితే, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్థానాల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకపోవడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నష్టపోయిందనే చెప్పాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














