‘బీజేపీ ఆఫీసుకు వస్తున్నా, ఎంతమందిని జైల్లో వేస్తారో వేయండి’ అంటూ ప్రధాని మోదీకి సీఎం కేజ్రీవాల్ సవాల్, దిల్లీలో ఏం జరుగుతోంది?

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, ANI

తమ పార్టీ నాయకుల అరెస్టుకు నిరసనగా దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా అనేకమంది పార్టీ కార్యకర్తలు బయల్దేరారు. దీంతో, దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

నిరసన ర్యాలీ ప్రారంభానికి ముందు ఆప్ కార్యాలయంలో కేజ్రీవాల్ మాట్లాడారు.

కేంద్రంలోని బీజేపీ ‘ఆపరేషన్ జాడూ (చీపురు)’ను మొదలుపెట్టిందని, అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని చూస్తోందని, అందుకే తమ పార్టీ నాయకులను అరెస్టు చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. దేశంలో బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ పెను సవాలుగా మారబోతోందనే భయంతో ఆ పార్టీ ఇలా చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికల తర్వాత తమ పార్టీ బ్యాంకు ఖాతాలు కూడా ఫ్రీజ్ అవుతాయని ఈడీ తరఫు లాయర్ కోర్టులో చెప్పారని, ఇదంతా ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలో భాగమని కేజ్రీవాల్ ఆరోపించారు.

అయితే, దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని, ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ర్యాలీని అడ్డుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

అంతకు ముందు ఏం జరిగింది?

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ కార్యాలయానికి వస్తానంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సవాల్ శనివారం విసిరారు.

''ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నా పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలందరితో కలిసి దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తా. మీకు ఇష్టమొచ్చిన వాళ్లని జైల్లో పెట్టుకోండి'' అని కేజ్రీవాల్ శనివారం సాయంత్రం అన్నారు.

దిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ కొన్ని రోజుల కిందట తాత్కాలిక బెయిల్‌పై విడుదలయ్యారు.

ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఒక సిద్ధాంతం అని, ఎంతమంది నాయకులను జైలుకు పంపిస్తే, అంతకంటే ఎక్కువ మంది నాయకులు పుట్టుకొస్తారని కేజ్రీవాల్ అన్నారు.

ఆప్ నిరసన ర్యాలీ నేపథ్యంలో దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం చుట్టుపక్కల పోలీసులు భద్రతను భారీగా పెంచారు. పలు మార్గాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఐటీవో మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

అయితే, కేజ్రీవాల్ ప్రకటనను ఒక జిమ్మిక్కుగా బీజేపీ అభివర్ణించింది. స్వాతి మలివాల్ విషయంలో నోరు మెదపకుండా కేజ్రీవాల్ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు బీజేపీ దిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్.

సచ్‌దేవ్ మీడియాతో మాట్లాడుతూ, ''కేజ్రీవాల్ డ్రామాలు ఆపండి. మేం మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాం. మీ ఇంట్లో మీ పార్టీకి చెందిన మహిళా ఎంపీని కొట్టారు, తిట్టారు. కానీ, ఆ విషయంపై మీరు నోరుమెదపడం లేదు. ఇది జరిగి ఆరు రోజులైంది. కానీ, ఇప్పటికీ ఒక్కమాట మాట్లాడలేదు'' అన్నారు.

''ప్రెస్ కాన్ఫరెన్సుల్లో పెద్దపెద్ద మాటలు మాట్లాడతారు, మీ సోదరి కోసం ఒక్క మాట మాట్లాడలేరా? విప్లవం సృష్టించిన ఝాన్సీ రాణి, జ్వాలా అని ప్రశంసలు కురిపించిన ఆమె కోసం ఒక్కమాట మాట్లాడకపోవడం సిగ్గుచేటు'' అన్నారు బీజేపీ నేత సచ్‌దేవ్.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ దిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్

కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ, ''ఎమోషనల్ టార్చర్‌కు బదులు, కొన్ని సూటి ప్రశ్నలకు కేజ్రీవాల్ స్పష్టమైన సమాధానాలు చెప్పాలి'' అని అన్నారు.

''స్వాతి మలివాల్‌ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిభవ్ కుమార్‌కు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారనేదే ఇక్కడ ప్రశ్న. ఆయన్ను తనతో పాటు సీఎం ఎస్కార్ట్‌‌లో లఖ్‌నవూకు తీసుకెళ్లారు. అంతేకాకుండా సీఎం ఇంట్లోనే బిభవ్ దొరికిపోయారు'' అని పూనావాలా అన్నారు.

''మీ మహిళా ఎంపీ స్వాతి మాలీవాల్‌తో బిభవ్ కుమార్ అనుచితంగా ప్రవర్తించారని మీ సంజయ్ సింగ్ మొదట విలేఖరుల సమావేశంలో చెప్పారు. అది నిజమా, లేక 72 గంటల తర్వాత మీరు యూటర్న్ తీసుకున్నారు, అది నిజమా?'' అని పూనావాలా ప్రశ్నించారు.

''మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ చిట్టా బిభవ్ కుమార్ దగ్గర ఉంది కదా, అందుకే భయపడుతున్నారు. మీ వైఖరి మహిళా వ్యతిరేకం'' అన్నారు పూనావాలా.

షెహజాద్ పూనావాలా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా

‘బీజేపీ అందరినీ జైల్లో పెట్టాలనుకుంటోంది..’- కేజ్రీవాల్

శనివారం సాయంత్రం కేజ్రీవాల్ మాట్లాడుతూ, తమ పార్టీ సాధించిన విజయాలను గుర్తు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలని బీజేపీ చూస్తోందన్నారు.

''వాళ్లు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను ఏం చేస్తున్నారో మీరే చూస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరిని జైల్లో పెడుతున్నారు. నన్ను జైల్లో పెట్టారు, మనీశ్ సిసోడియాను జైల్లో పెట్టారు, సంజయ్ సింగ్‌ను జైల్లో పెట్టారు, సత్యేంద్ర జైన్‌ని జైల్లో పెట్టారు, ఇవాళ నా పీఏని జైల్లో పెట్టారు'' అన్నారు కేజ్రీవాల్.

''రాఘవ్ చద్దా లండన్ నుంచి వచ్చారు. ఇప్పుడు రాఘవ్ చద్దాని జైల్లో పెడతామని అంటున్నారు. మరికొద్ది రోజుల్లో సౌరభ్ భరద్వాజ్‌ని, అతిషిని కూడా జైల్లో పెడతారు'' అని ఆయన అన్నారు.

‘మేం చేసిన తప్పేంటి?’

దిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై 50 రోజుల తర్వాత బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్, తనను ఎందుకు జైల్లో పెట్టారని నిలదీశారు.

ఆయన మాట్లాడుతూ, ''వాళ్లు మమ్మల్ని ఎందుకు జైల్లో పెట్టాలనుకుంటున్నారని ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మేం చేసిన తప్పేంటంటే, దిల్లీలో పేద పిల్లలకు మంచి చదువు కోసం పనిచేశాం. ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దాం. అది వాళ్లు చేయలేరు. అందుకే ప్రభుత్వ పాఠశాలలను అడ్డుకోవాలనుకుంటున్నారు. దిల్లీలో మొహల్లా క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. మంచి వైద్యసేవలు అందిస్తున్నాం. మొహల్లా క్లినిక్‌లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలను అడ్డుకోవాలనుకుంటున్నారు'' అని అన్నారు.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Getty Images

'ప్రధాన మంత్రి జైల్ గేమ్ ఆడుతున్నారు'

ప్రధాన మంత్రి తమ పార్టీతో జైల్ గేమ్ ఆటాడుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

''నేను ప్రధాన మంత్రికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు జైల్ - జైల్ ఆటాడుతున్నారు, ఒక్కోసారి ఒక్కొక్కరిని మీరు జైల్లో పెడుతున్నారు. ఒకసారి మనీశ్ సిసోడియాను మరోసారి సంజయ్ సింగ్‌ను, ఇంకోసారి కేజ్రీవాల్‌ను జైల్లో పెడతారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నేను నా పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరితో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తా. ఎవరెవరిని జైళ్లలో పెట్టాలనుకుంటున్నారో పెట్టండి. అందరినీ కలిపి జైల్లో వేసేయండి'' అని కేజ్రీవాల్ అన్నారు.

'ఆమ్ ఆద్మీ పార్టీకి అంతం లేదు'

నాయకులను జైల్లో పెట్టినంత మాత్రాన తమ పార్టీ అంతం కాదని కేజ్రీవాల్ అన్నారు.

''ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను జైల్లో వేసి పార్టీని నాశనం చేయాలని మీరు అనుకుంటున్నారు. కానీ, అది జరగదు, కావాలంటే ఒకసారి ప్రయత్నించి చూడండి. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది దేశవ్యాప్తంగా ఆదరణ కలిగిన ఒక సిద్ధాంతం. అది ప్రజల గుండెల్లో ఉంది. మీరు ఆమ్ ఆద్మీ నాయకులను జైల్లో పెడితే, అంతకు వందరెట్లు ఎక్కువ మందిని ఈ దేశం అందిస్తుంది'' అన్నారు కేజ్రీవాల్.

అరవింద్ కేజ్రీవాల్

ఫొటో సోర్స్, ANI

వివాదాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ

కేజ్రీవాల్ అధికారిక నివాసంలో తనపై దాడి జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు, దిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఆరోపించారు.

కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ తనను కొట్టాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిల్లీ పోలీసులు బిభవ్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు.

ఈ వివాదంతో అసలు ఆమ్ ఆద్మీ పార్టీలో ఏం జరుగుతోందనే ప్రశ్న తలెత్తింది.

ఇదిలా ఉండగా, చాలా రోజుల నుంచి విదేశాల్లో ఉన్న ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా శనివారం కేజ్రీవాల్‌ను కలిసేందుకు వచ్చారు.

మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.

50 రోజుల తర్వాత, ఎన్నికల ప్రచారం కోసం ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

జూన్ 1 వరకూ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న ఆయన మళ్లీ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)