తండేల్ మూవీ రివ్యూ: సాయిపల్లవి, నాగచైతన్యల దేశభక్తి ప్లస్ ప్రేమ కథా చిత్రం ఎలా ఉంది?

ఫొటో సోర్స్, X/ThandelTheMovie
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేశభక్తి, ప్రేమను కలగలిపి తీసిన ఈ సినిమా ఎలా ఉంది? చై, పల్లవి జంట సినీ ప్రియుల్ని అలరించిందా?
తండేల్ అంటే లీడర్ అని అర్థం. తన వాళ్లని రక్షించడానికి ముందుండే వాడు. సముద్రం మీద నుంచి నేలమీదకి ఆఖరున కాలు పెట్టేవాడే జాలర్ల నాయకుడు. ఒక ప్రేమ కథకి, హీరో నాయకత్వ లక్షణాలు కలిపితే తండేల్ సినిమా.
అందమైన ఫోటోగ్రఫీ, మంచి సంగీతం, సాయిపల్లవి లాంటి హీరోయిన్. సినిమా హిట్ కావడానికి ఇవి చాలు. కానీ ఒకటి తక్కువైంది. అదే ఎమోషన్.


ఫొటో సోర్స్, X/ThandelTheMovie
కథేంటి?
అసలు కథ ఏమంటే.. రాజు, సత్యలు చిన్నప్పటి నుంచి ప్రేమికులు. ఆ జాలర్ల గ్రామంలో సంవత్సరానికి 9 నెలలు గుజరాత్‌కి వెళ్లి చేపలు పడతారు. మూడు నెలలే ఊళ్లో వుంటారు. ఆ మూడు నెలల కోసం సత్య వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంది.
అయితే చేపలు పట్టడంలో ఉన్న ప్రమాదాన్ని గ్రహించి రాజుని వేటకు వెళ్లొద్దని సత్య కోరుతుంది. తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు వినకుండా వెళ్లిపోతాడు. దీనికి అలిగిన సత్య వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది.
అయితే పాకిస్తాన్ జైల్లో రాజు తన బృందంతో సహా చిక్కుకుంటాడు. అక్కడి నుంచి బయటికి రావడానికి రాజు ఏం చేశాడనేదే మిగతా కథ.

ఫొటో సోర్స్, X/ThandelTheMovie
తడబడిన దర్శకుడు
సాయిపల్లవి అద్భుతమైన నటి. ఈ మధ్య వచ్చిన అమరన్‌లో ఆమె తన నటనతో ఆకట్టుకున్నారు. తండేల్‌లో కూడా ఆ స్కోప్ వుంది. అయితే ఆ పాత్రని రాసుకోవడంలోనే తికమక వుంది.
చిన్నప్పటి నుంచి జాలర్ల పల్లెలో పెరిగిన ఆమెకి, వేటలోని ప్రమాదాలు తెలియనివి కావు. అయితే హఠాత్తుగా రాజుని వేటకి వెళ్లకుండా అడ్డుకోవడం ఫోర్స్‌డ్‌గా వుంది తప్ప, కన్విన్సింగ్‌గా లేదు.
వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం కూడా ఆమె బలమైన వ్యక్తిత్వానికి సూట్ కాదు. ఎందుకంటే సెకెండాఫ్‌లో స్ట్రాంగ్ లేడీగా కనిపిస్తుంది కాబట్టి. హీరోనే ఆమె పెళ్లి చేసుకుంటుందని ప్రేక్షకులకి ఎలాగూ తెలుసు, దర్శకుడికే తెలియక సాగదీశాడు.
ప్రేమ కోసం, భర్త కోసం ఎంత దూరమైనా హీరోయిన్ వెళ్లడం సక్సెస్‌ఫుల్ ఫార్ములా. యముణ్ని సావిత్రి ఎదిరిస్తే ఉత్కంఠతో చూశాం. రోజా సినిమాలో టెర్రరిస్టులలో కూడా మార్పు తీసుకురావడాన్ని టెన్షన్‌తో చూసి జనం సినిమాను హిట్ చేశారు.
మ్యాజిక్ బిగిన్ అయితే లాజిక్ వుండదు. కానీ అసలు మ్యాజిక్కే లేకపోతే.., అదే సమస్య.
రోజాతో పోల్చడం అనవసరమే అయినా, ఆ సినిమాలో ప్రతి సన్నివేశం బలంగా వుంటుంది. కానీ, తండేల్‌లో వెతుక్కోవాలి. ఇంటర్వెల్ వరకూ భారంగా ఉండటానికి కారణం కథలో ఏ సంఘటనా జరక్కపోవడమే.

ఫొటో సోర్స్, X/ThandelTheMovie
పాకిస్తాన్ జైలులో జరిగే సంఘటనలన్నీ కూడా రొటీన్‌గా జరిగినట్టే వుంటాయి. రోజా సినిమాలో హీరోని టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు. అందుకని హీరోయిన్‌పై మనకి సానుభూతి వుంటుంది. ఇక్కడ హీరో బృందం తప్పిపోయి పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అరెస్ట్ అవుతుంది. ఏ దేశమైనా అదే చేస్తుంది. ఆ సంఘటనలేవీ ప్రేక్షకుల్ని టచ్ చేయవు.
హీరోని గాఢంగా ప్రేమించి, ఎదురు చూస్తున్న హీరోయిన్ ఓవైపు, పాకిస్తాన్ జైలులో హీరో మరోవైపు. వాస్తవంగా జరిగిన కథకి దృశ్య రూపం. అయితే కథలోని రూపాన్ని పట్టుకున్న దర్శకుడు చందు మొండేటి, సారాన్ని మాత్రం తెరమీదకి తీసుకురాలేకపోయాడు.
నాగచైతన్య ఎంత బాగా నటించినా ప్రేమకథని, దేశభక్తిని కలగలిపి సినిమా కథను రాసుకోవడంలో దర్శకుడు విఫలం కావడంతో తండేల్ భారంగా కదిలింది.
మంచి కథ, సంగీతం, ఫోటోగ్రఫీ వుండి కూడా మంచి స్క్రీన్ ప్లే, బలమైన సన్నివేశాలు మిస్ కావడంతో సినిమాలో ఫీల్ గుడ్ మిస్ అయ్యింది. గతంలో హిట్స్ ఇచ్చిన చందు మొండేటి ఎక్కడో తడబడ్డారు. లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ కావొచ్చు.

ఫొటో సోర్స్, X/ThandelTheMovie
ప్లస్ పాయింట్స్
1. ఫోటోగ్రఫీ, సముద్రం నేపథ్యంతో చాలా సీన్స్ పెయింటింగ్స్‌లా వుంటాయి.
2. దేవిశ్రీ ప్రసాద్ రెండు మంచి పాటలు
3. సాయిపల్లవి నటన
4. కొన్ని సీన్స్‌లో నాగచైతన్య

ఫొటో సోర్స్, X/ThandelTheMovie
మైనస్ పాయింట్స్
1. యధార్థ కథకి మంచి సన్నివేశాలు లేవు.
2. నాగచైతన్య, సాయిపల్లవి తప్ప మిగతా ఎవరికీ స్క్రీన్ మీద స్పేస్ లేదు. ఒక్క క్యారెక్టర్ కూడా రిజిస్టర్ కాదు.
3. ప్రేమ కథకి, బలవంతంగా దేశభక్తిని ముడిపెట్టడం.
మొత్తానికి సినిమా జస్ట్ ఓకే. గీతా ఆర్ట్స్ ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టింది. నాగచైతన్య జాలర్ల కుర్రాడిలా జుత్తు పెంచుకుని మారిపోయాడుగానీ, బాడీ లాంగ్వేజ్, శ్రీకాకుళం యాస మీద ఇంకొంచెం సాధన చేసి వుండాల్సింది.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం )
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














