లైలా సినిమాపై వైసీపీ అభిమానుల ట్రోలింగ్ ఎందుకు? నటుడు పృథ్వీరాజ్ బీబీసీతో ఏం చెప్పారు?

Prudhvi Raj Balireddy

ఫొటో సోర్స్, Prudhvi Raj Balireddy

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విష్వక్ సేన్ నటించిన 'లైలా' సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ వైసీపీ మద్దతుదారులు ట్వీట్లు చేస్తున్నారు.

ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అభిమానులు విరుచుకుపడుతున్నారు.

ముఖ్యంగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ''బాయ్ కాట్ లైలా' హ్యాష్ ట్యాగ్‌‌తో వేల సంఖ్యలో ట్వీట్లు పెడుతున్నారు.

ఈ విషయంపై హీరో విష్వక్ సేన్, మూవీ నిర్మాత సాహూ గారపాటి ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చారు.

మరోవైపు ఈ వివాదంపై పృథ్వీరాజ్ ‘బీబీసీ’తో మాట్లాడుతూ తాను ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పృధ్వీరాజ్ ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, YT/SSHINEescreens screen grab

ఇంతకీ ఏం జరిగిందంటే..

విష్వక్ సేన్ నటించిన 'లైలా' సినిమా ఈ నెల 14న విడుదల కానుంది.

ఇందులో ఆయన 'లేడీ' గెటప్ లో కనిపించనున్నారు.

ఈ సినిమాకు సంబంధించి మెగా మాస్ ఈవెంట్ పేరుతో ప్రీరిలీజ్ వేడుక ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా అందులో నటించిన పృథ్వీరాజ్(30ఇయర్స్ ఇండస్ట్రీ‌ డైలాగ్‌తో ఆదరణ పొందిన నటుడు) మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలపై దుమారం రేగింది.

ఈ సినిమాలో తాను మేకల సత్తి క్యారెక్టర్ లో నటిస్తున్నట్లుగా పృథ్వీ చెప్పారు.

''అది యాదృచ్చికంగా జరిగిందో.. నిజంగానే జరిగిందో తెలియదు గానీ సుమ గారూ.. సినిమాలో ఒక సీనులో మేకల సత్తిని తీసుకురండిరా.. అంటారు.. అక్కడ మేకలు ఉంటాయి. నేను షాట్ గ్యాప్ లో ఎన్ని మేకలు ఉన్నాయి.. అని అన్నా. ఇవి 70.. అవి 80… 150 ఉన్నాయి మేకలుఅన్నారు.చివర్లో సినిమా అయిపోయాక ఇంకో సీను ఉంది. నా బామ్మర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్టుగా లెక్కేస్తే 11 ఉన్నాయి. ఇదేమిటో నాకు అర్థం అవ్వలా..! అలాగా.. సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు.'' అంటూ పృథ్వీరాజ్ అన్నారు.

ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు, రీట్వీట్లు చేస్తున్నారు.

వైసీపీ అభిమానుల ఆగ్రహం

పృథ్వీరాజ్ వ్యాఖ్యలు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 11 సీట్ల గురించేనని వైసీపీ ఫాలోవర్లు సోషల్ మీడియా(ఎక్స్)లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'మా జగనన్నను అంటే మా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా చూస్తే ఊరుకోదు' అంటూ అనితారెడ్డి అనే నెటిజన్ ఎక్స్ హ్యాండిల్ లో పోస్టు చేశారు.

''క్షమాపణ చెప్పినా వదిలే ప్రసక్తే లేదు'' అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

''ప్రతి ఒక్కడికి ఇది ఫ్యాషన్ అయిపొయింది. అతను మాట్లాడింది తప్పు.. కావాలంటే అతనిని సినిమాలు వదిలేసి రాజకీయాలు చేసుకోమనండి అభ్యంతరం లేదు.'' అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

గతంలో నటుడు పృథ్వీరాజ్ వైఎస్సార్సీసీపీలో పనిచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎస్వీబీసీ చైర్మన్ గానూ పనిచేశారు.

ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనకు మద్దతుగా ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేశారు.

విష్వక్‌సేన్, నిర్మాత

ఫొటో సోర్స్, YT/SSHINEescreens screen grab

విష్వక్ సేన్, నిర్మాత ఏమన్నారంటే..

నటుడు పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై సోమవారం (ఫిబ్రవరి 10వ తేదీ) హీరో విష్వక్‌సేన్, నిర్మాత సాహు గారపాటి మీడియా సమావేశం నిర్వహించారు.

''సినిమా రాకముందే చంపేయకండి.. బాయ్ కాట్ లైలా అంటూ అన్ని వేల ట్వీట్లు వేయడం కరెక్టేనా..'' అంటూ నటుడు విష్వక్‌సేన్ ఆవేదన వ్యక్తం చేశారు.

''ఆ సమయంలో(పృథ్వీరాజ్ మాట్లాడుతున్నప్పుడు) చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లాం. ఆయన మాట్లాడినట్లు మాకు తెలియదు. ఫంక్షన్ అయ్యాక ఇంటికి వెళ్లి ఆయన కామెంట్లు చూసి షాక్ అయ్యాం. ఈ హ్యాష్ ట్యాగ్(బాయ్ కాట్ లైలా) చూశాక.. అప్పుడు పృథ్వీరాజ్ ఆ కామెంట్స్ చేశారని తెలిసింది. మా స్టేజీ మీద, ఈవెంట్ లో జరిగింది కాబట్టి 'సారీ' చెబుతున్నాం. ఆయనకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన కేవలం సినిమాలో నటించారు.'' అని అన్నారు విష్వక్ సేన్.

సినిమాను ఆదరించాలని కోరారు.

ఇదే విషయంపై నిర్మాత సాహూ గారపాటి మాట్లాడారు.

''అసలు ఆ టాపిక్ రాకుండా ఉండాల్సింది. అది రాజకీయ వేదిక కాదు, సినిమా ప్రీరిలీజ్ వేడుక. మేం ఉంటే అప్పటికప్పుడు స్టేజీ మీదకు వెళ్లి పృథ్వీని కంట్రోల్ చేసేవాళ్లం'' అని చెప్పారు.

అలాగే నిర్మాణ సంస్థ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు.

''లైలా సినిమా మెగా మాస్ ఈవెంట్ సందర్భంగా ‘30 ఇయర్స్ పృథ్వీ’ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం. వాటితో షైన్ స్క్రీన్స్, సినిమా నటీనటులు, సాంకేతిక సిబ్బందికి సంబంధం లేదు. ఈవెంట్ సందర్భంగా ఎవరైనా రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసి ఉంటే మా మద్దతు ఉండదు.'' అని ప్రకటించింది నిర్మాణ సంస్థ.

‘క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లి 11 మంది ఆటగాళ్లున్నారంటే అదీ తప్పవుతుందా?’

ఈ వివాదంపై నటుడు పృథ్వీరాజ్ బీబీసీతో మాట్లాడారు.

''ఆ సమయంలో నేను కావాలని మాట్లాడిన మాటలు కావు. సినిమాలో క్యారెక్టర్ బట్టి అలాంటి సీన్లు ఉన్నాయని మాట్లాడానే తప్ప ఎవరినో ఉద్దేశించి అన్న మాటలు కావు. వాటితో ఎవరికీ సంబంధం లేదు. సినిమాను బాయ్ కాట్ చేయాలని ట్రోల్ చేయడం ఏ మాత్రం సరికాదు'' అన్నారు.

అలాంటి వ్యాఖ్యలు చేయాలంటే రాజకీయ సభలు చాలా ఉంటాయి.. అప్పుడు మాట్లాడతామని చెప్పారు పృథ్వీరాజ్.

''నేను ఏదైనా క్రికెట్ మ్యాచ్ కు వెళ్లి 11 మంది ఆటగాళ్లు ఉన్నారని అంటే దాన్ని కూడా వైసీపీ అన్వయించుకుంటారా..? ఇది పొలిటికల్‌గా కాదు, సినిమాగానే చూడాలి.

ఈ విషయంపై ఇప్పటికే లైలా మూవీ హీరో, నిర్మాత నాతో మాట్లాడారు. ‘‘నేను అక్కడి నుంచి(వైసీపీ) వచ్చా కాబట్టి, ఇప్పుడు జనసేనలో ఉండి గొంతు గట్టిగా వినిపిస్తుండటంతో టార్గెట్ చేశారు.'' అని బీబీసీతో చెప్పారు పృథ్వీరాజ్.

ఈ ట్రోల్స్ కారణంగా సినిమా మరింత విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజకీయాలు,సినిమాను వేరువేరుగా చూడాలి

ఈ వివాదంపై సినీ జర్నలిస్టు మహమ్మద్ అన్వర్ బీబీసీతో మాట్లాడారు.

''సినిమా నటులు రాజకీయాల్లో వెళ్లడం.. అక్కడ పరిణామాలను తీసుకువచ్చి ఇక్కడ మాట్లాడటం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతోంది. పృథ్వీరాజ్ ఈ విధంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సినిమా ఫంక్షన్లు, రాజకీయ వేదికలు కాదని గుర్తుంచుకోవాలి. రెండింటినీ వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉంది.'' అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)