‘మేక్ ఇండియా గ్రేట్ అగైన్’.. అమెరికాలో మోదీ నినాదం - ట్రంప్‌తో భేటీలో వాణిజ్యంపై ప్రధాన చర్చ

అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు.

వైట్‌హౌస్‌లో భేటీ అయిన వీరిద్దరూ వాణిజ్యం, భద్రత సహా పలు ఇతర అంశాలపై చర్చించుకున్నారు.

రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీ చేసేలా అమెరికా నుంచి మరింత చమురు, గ్యాస్ కొనుగోలు చేసేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

ట్రంప్ తమతో వాణిజ్య సంబంధాలున్న దేశాలకు వర్తించేలా పన్నులు పెంచిన తరువాత ఈ సమావేశం జరిగింది.

తమ ఇద్దరి మధ్య అద్భుతమైన స్నేహ సంబంధాలున్నాయని, గత నాలుగేళ్ల కాలంలోనూ ఆ సంబంధాలు అలాగే కొనసాగాయని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

రెండు దేశాలు కలిసి మరింతగా వాణిజ్యం జరపాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికాలో మోదీ

ఫొటో సోర్స్, Getty Images

మోదీ గొప్ప నాయకుడు: ట్రంప్

ఈ సమావేశం సమయంలో రెండు దేశాలకు చెందిన అధికారులు, కొందరు రిపోర్టర్లు అక్కడే ఉన్నారు.

ట్రంప్, మోదీ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు.

'వైట్‌హౌస్‌లో మళ్లీ మిమ్మల్ని చూడడం నాకు ఆనందంగా ఉంది' అని మోదీ చెప్పగా మోదీని ఇలా కలుసుకోవడం తనకు దక్కిన గౌరవమని ట్రంప్ అన్నారు.

ట్రంప్ మొదటి టర్మ్ కంటే కూడా ఇప్పుడు రెండింతల వేగంతో తామిద్దరం కలిసి పనిచేస్తామని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ట్రంప్ కూడా మోదీపై ప్రశంసలు కురిపించారు. 'మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారు, అందరూ ఆ విషయమే మాట్లాడుకుంటున్నారు. మోదీ నిజంగా గొప్ప నాయకుడు' అని ట్రంప్ అన్నారు.

అమెరికాలో మోదీ

ఫొటో సోర్స్, Getty Images

మేం ఎవరినైనా జయిస్తాం: ట్రంప్

ట్రంప్ ప్రశంసల తరువాత మోదీ మాట్లాడుతూ.. భారత్‌లో ప్రతి ఒక్కరూ అమెరికా సెంటిమెంట్లను గౌరవిస్తారని అన్నారు.

విలేఖరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ... రెండు దేశాలు కలసికట్టుగా ఉంటాయని ట్రంప్ అన్నారు.

'మేం ఇద్దరం ఎవరినైనా జయించగలం. కానీ, ఒకరినొకరం జయించాలని అనుకోవడం లేదు' అని ట్రంప్ అన్నారు. తామిద్దరం కలిసి ఎవరినైనా జయించగలమని ట్రంప్ చైనాను ఉద్దేశించి అన్నారు.

అమెరికా, భారత్ ఎన్నికలలో 'యూఎస్ఎయిడ్' పాత్ర ఉందా అన్న విలేఖరి ప్రశ్నకు బదులిస్తూ ట్రంప్.. ఉంటే ఉండొచ్చన్నారు.

అమెరికాలో మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఇద్దరు నేతలు ఏం చెప్పారు?

వైట్‌హౌస్‌లో భేటీ అనంతరం ఇద్దరు నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు.

లక్షల డాలర్ల విలువైన సైనిక పరికరాలను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు.

'రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం' గురించి తాను, మోదీ మాట్లాడుకున్నామని.. 2008 ముంబయి ఉగ్రదాడి సూత్రధారుల్లో ఒకరిని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా నిర్ణయించిందని ట్రంప్ చెప్పారు.

భారత్ ఇటీవల అమెరికా ఎగుమతులపై పన్నులు తగ్గించడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.

రెండు దేశాల మధ్య వాణిజ్యంలో అమెరికాకు 100 బిలియన్ డాలర్ల లోటు ఉందని, రెండు దేశాల వాణిజ్య సంబంధాలలో అమెరికన్లకూ న్యాయంగా ఉండేలా త్వరలో చర్చలు ప్రారంభిస్తామన్నారు.

అనంతరం మాట్లాడిన మోదీ... ట్రంప్ మొదటి విడత పాలనలో తామిద్దరం కలిసి చేసిన పనులను గుర్తు చేసుకుంటూ ప్రశంసలు కురిపించారు.

ఇప్పుడు సాధించాల్సిన కొత్త లక్ష్యాలున్నాయని మోదీ అన్నారు.

భారత్‌ను అభివృద్ధి చేయడం, ప్రగతిలోకి తీసుకురావడం వల్ల భారత్‌ను మళ్లీ గొప్ప దేశంగా నిలపొచ్చంటూ ట్రంప్ 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదాన్ని ప్రస్తావిస్తూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు.

ఆ నినాదానికి మార్పు చేస్తూ భారత్‌కు వర్తింపజేసి ‘మేక్ ఇండియా గ్రేట్ అగైన్’ అన్నారు.

మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ నినాదాలు కలిస్తే అప్పుడు అది 'మెగా పార్టనర్‌షిప్' అవుతుంది అని మోదీ అన్నారు.

వాణిజ్యానికి సంబంధించి కొత్త ఒప్పందాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు మోదీ చెప్పారు. న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కృత్తిమ మేధ, సెమీకండక్టర్లు, ఫార్మాస్యూటికల్స్ వంటి ప్రాముఖ్యం కలిగిన పరిశ్రమల గురించి ఆయన ప్రస్తావించారు.

అమెరికా, భారత అంతరిక్ష సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, అరుదైన భూమి ఖనిజాల గురించి చర్చలు జరుపుతామని చెప్పారు.

లాస్ ఏంజిల్స్, బోస్టన్ లలో కొత్త కాన్సులేట్లను ప్రారంభించే ప్రణాళికల గురించి కూడా ఆయన ప్రకటించారు.

టారిఫ్స్ గురించి అడిగిన ప్రశ్నకు డోనల్డ్ ట్రంప్ బదులిచ్చారు. అది భారత్ అయినా లేదా మరో దేశమైనా పన్నులు వసూలు చేస్తామని ట్రంప్ అన్నారు.

'మాకు పన్నులు వేసినట్లే మేం కూడా వారికి పన్నులు విధిస్తాం. ఇది అమెరికా పరిపాలనా విధానం. పరస్పర సుంకాలను వర్తింపజేస్తాం. భారత్ మా నుంచి ఎంత వసూలు చేస్తుందో, మేం కూడా వారి నుంచే అంతే వసూలు చేస్తాం'' అని ట్రంప్ స్పష్టం చేశారు.

అమెరికాలో మోదీ

ఫొటో సోర్స్, Reuters

''అమెరికాలో అక్రమంగా ఉంటే భారతీయులను స్వదేశానికి పిలిపిస్తాం''

అక్రమ వలసల గురించి మోదీ మాట్లాడారు.

''మేం ఎల్లప్పుడూ ఒకే అభిప్రాయంతో ఉన్నాం. భారత పౌరులు ఎవరైనా చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్నట్లయితే, వారిని స్వదేశానికి తీసుకెళ్లడానికి మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. అలా వచ్చిన వారంతా చాలా సాధారణ కుటుంబాలకు చెందిన పిల్లలు. పెద్ద కలలు, వాగ్దానాల ఎరలో వారు చిక్కుకుంటున్నారు. మానవ అక్రమ రవాణా కారణంగా కొంతమంది ఇక్కడికి వచ్చారు. అమెరికాకు వెళ్తున్నట్లు వారికి కూడా తెలియదు'' అని మోదీ అన్నారు.

ట్రాఫికర్ల చేతిలో మోసపోయి చట్టవిరుద్ధంగా అమెరికాలో అడుగుపెడుతున్న యువతను రక్షించడానికి మానవ అక్రమ రవాణాను లక్ష్యంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు.

మోదీ

ఫొటో సోర్స్, Reuters

మేం తటస్థం కాదు.. శాంతి పక్షం: మోదీ

యుక్రెయిన్-రష్యా సంక్షోభానికి సంబంధించి భారత్ తటస్థ వైఖరి అనుసరిస్తున్నట్లుగా అందరూ భావిస్తున్నారని, కానీ అది తప్పు అని మోదీ స్పష్టం చేశారు.

భారత్ శాంతి పక్షం వహిస్తుందని, ఇరు వర్గాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉందని తాము భావిస్తున్నట్లుగా చెప్పారు.

యుద్ధం ముగించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తామని మోదీ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)