మోదీ, ట్రంప్ సమావేశం: అమెరికా ఏం కోరనుంది, భారత్ ఏం అడగనుంది?

డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2020 లో ఢిల్లీలో ట్రంప్, మోదీ సమావేశమయ్యారు
    • రచయిత, మైకేల్ కగుల్మెన్
    • హోదా, ఫారిన్ పాలసీ అనలిస్ట్

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ కాసిని కౌగిలింతలను, చిరునవ్వులను పంచుకోవడంతోనే అంతా అయిపోదు.

మోదీ, ట్రంప్ బంధం ఏళ్లతరబడి ధృడంగా మారుతోంది. ఇద్దరూ ఉమ్మడిగా దర్శనమీయడం, సంయుక్త సమావేశాలు ఈ బంధంలో భాగంగా మారాయి. ఈ సారి కూడా వీరిద్దరూ కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహిస్తారని శ్వేత సౌధం వర్గాలు చెబుతున్నాయి.

తొలిసారి వీరిద్దరూ 2017లో వాషింగ్టన్‌లో సమావేశమైన తరువాత హూస్టన్, అహ్మదాబాద్ లాంటి ప్రదేశాలలో భారీ ర్యాలీలలో ఇద్దరూ కలిసి కనిపించడం ద్వారా వీరి మధ్య బంధం మరింత పెరిగింది.

ప్రపంచ దృష్టికోణాలు, రాజకీయాల పై ఉమ్మడి అభిప్రాయాల నుంచి ఏర్పడిన ఈ బంధం, చైనాను ఎదుర్కోవాలనే పరస్పర వ్యూహాత్మక లక్ష్యం అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేసింది.

ఆశ్చర్యకరంగా ట్రంప్ భారత్‌ను విమర్శిస్తారు కానీ, మోదీని ఏనాడూ విమర్శించలేదు.

మోదీ పర్యటన సందర్భంగా బహుశా వీరిద్దరూ తగినంత సమయం గడిపి, ఇప్పటికే చక్కగా ఉన్న అమెరికా, భారత్ వ్యూహాత్మక సంబంధాలను మరింత మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించవచ్చు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మంగళవారం పారిస్‌లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్‌లో నరేంద్ర మోదీ

ఏయే అంశాలను చర్చించవచ్చు ?

ట్రంప్ కేబినెట్‌లోని పలువురిని మోదీ కలుసుకుంటారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఆయన పలువురు అమెరికా నాయకులను, ఇండో అమెరికన్ సమాజానికి చెందిన సభ్యులను కలుసుకుంటారు.

స్పేస్‌ఎక్స్ , టెస్లా సంస్థల చీఫ్ ఎలాన్ మస్క్‌ను కూడా మోదీ కలవవచ్చు. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల రంగాన్ని పెంచాలని ఆసక్తిగా ఉన్న మోదీ, మస్క్ భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీని ప్రారంభించమని కోరవచ్చు.

అయితే మోదీ పర్యటన సమయంలో ట్రంప్-మోదీ సాన్నిహిత్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం గురించిన చర్చలు ఒక ముఖ్యమైన వాస్తవాన్ని కప్పిపుచ్చవచ్చు- ఇద్దరు నాయకులు లావాదేవీలు మాట్లcచ్చు, ముఖ్యంగా ట్రంప్, అనేక డిమాండ్లను చేయచ్చు.

ట్రంప్ గురించి దిల్లీకి బాగా తెలుసు. గత నెలలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి భారత్ వ్యవహార శైలి ఈ సముఖతను సూచిస్తుంది.

మోదీ ప్రస్తుత క్యాబినెట్ మంత్రులలో చాలామంది మునుపటి పదవీకాలంలో కూడా పనిచేశారు. వీరు ట్రంప్ మొదటి పరిపాలనతో పరిచయం ఉన్నవారు.

సుంకాల తగ్గింపు, సరైన పత్రాలు లేని భారతీయ వలసదారులను తిరిగి రప్పించడం, అమెరికన్ చమురును కొనుగోలు అంశాలపై అమెరికాకు అనుకూలంగా భారత్ బహిరంగ సంకేతాలు పంపించింది.

మోదీ, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

సుంకాల్ తగ్గించిన భారత్

భారత్ ఇప్పటికే కొన్ని సుంకాలను తగ్గించింది, గత వారం 104 అక్రమ వలసదారులను స్వదేశానికి రానిచ్చింది.

ట్రంప్ భారతదేశంపై నిర్దిష్ట డిమాండ్లు చేయకుండా, ఆయన కొత్త పరిపాలనతో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలను తగ్గించడం ఈ ముందస్తు చర్యల వెనుక కారణం.

అయినప్పటికీ, ఇటీవల కాలంలో భారతదేశంతో అమెరికా వస్తువులు, సేవల, వాణిజ్య లోటు దాదాపు 4౦ లక్షల కోట్లు కు చేరుకుంది. దీన్ని మరింత తగ్గించడానికి, అదనంగా సుంకాల తగ్గించాలని ట్రంప్ మోదీని కోరవచ్చు . కానీ ఇది భారత్ కు అవకాశంగా మారవచ్చు- సుంకాలను తగ్గించడానికి ఉద్దేశించిన ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై ద్వైపాక్షిక చర్చలు జరపాలని మోదీ ట్రంప్‌ను కోరవచ్చు.

గత కొన్ని ఏళ్లుగా భారత్ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చడానికి ఆసక్తి చూపుతోంది .కొత్త వాణిజ్య ఒప్పందాలపై భారీ పర్యావరణ, కార్మిక సంబంధిత షరతులను విధించిన బైడెన్ పరిపాలన కంటే ట్రంప్ పరిపాలన మరింత సుముఖంగా ఉండొచ్చు.

పాస్ పోర్టులు, అక్రమ వలసలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్ కూడా పెద్ద సంఖ్యలో అక్రమంగా నివసిస్తున్నభారతీయులను తిరిగి తీసుకోవాలని మోదీని కోరవచ్చు

అక్రమ వలసలదారులు, ఇంధనం..

ట్రంప్ కూడా పెద్ద సంఖ్యలో అక్రమంగా నివసిస్తున్నభారతీయులను తిరిగి తీసుకోవాలని మోదీని కోరవచ్చు. కొన్ని అంచనాల ప్రకారం ఈ సంఖ్య 700,000 కంటే ఎక్కువ. ఇది అమెరికాలో మూడవ అతిపెద్ద సమూహం. ఇది భారత్ కు కష్టమైన, సున్నితమైన సమస్య .

గత వారం, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంటులో మాట్లాడుతూ, భారత పౌరులను వెనకి తిప్పిపంపేటప్పుడు వారితో అనుచితంగా వ్యవహరించకుండా భారత ప్రభుత్వం అమెరికాతో కలిసి పనిచేస్తోందన్నారు.

ట్రంప్ మోదీని అమెరికా చమురు ఎక్కువగా కొనమని కోరవచ్చు. 2021లో, అమెరికా చమురు ఎగుమతులలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది.

యుక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లలో వచ్చిన పెద్ద మార్పులు భారత్ దగ్గరి భాగస్వామి అయిన రష్యా నుంచి చౌకైన చమురు ఎక్కువగా దిగుమతి చేసుకోడానికి అవకాశం ఇచ్చింది.

అమెరికా నుంచి భారతదేశం ఎంత చమురు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందో ధరల అంశం నిర్ణయిస్తుంది.

భారత అణుశక్తిలో పెట్టుడుల గురించి మోదీ మాట్లాడవచ్చు. ఇంధనంపై అంతర్జాతీయ ఆసక్తిని పెంచేందుకు పయత్నిస్తున్న భారత్ తన అణు బాధ్యత చట్టాన్ని సవరిస్తూ కొత్త అణుశక్తి మిషన్‌ను ప్రకటించింది. 2030 నాటికి సగం ఇంధన అవసరాలను పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

ట్రంప్‌ను అణు ఇంధనంలో పెట్టుబడి పెట్టమని కోరడం మంచిదే. ఒకటి, శిలాజ ఇంధనాల కంటే పర్యావరణానికి మంచిది. రెండు, సౌర, పవన విద్యుత్తు ట్రంప్ కు ఆకర్షణీయమైన పెట్టుబడిగా కనిపించకపోవచ్చు.

వేలాది మంది భారతీయ-అమెరికన్లు మోదీకి స్వాగతం పలికారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2019 లో హూస్టన్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి మోదీ ట్రంప్ ఉమ్మడిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భారతీయ-అమెరికన్లు వచ్చారు.

టెక్నాలజీ, వీసాలు..

బైడెన్ పరిపాలనలో ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి కారణం టెక్నాలజీ. 2022లో ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఐసెట్) అమలు రెండు వైపుల వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త మూలంగా నిలిచాయి.

ప్రభుత్వ యంత్రాంగంతో పని లేకుండా ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఐసెట్ ను నేరుగా పర్యవేక్షిస్తారు. అంటే ఇద్దరు నాయకులూ వ్యక్తిగతంగా దృష్ఠి పెట్టాలి. అయితే ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్ నుండి అమెరికా ఐసెట్ కు కట్టుబడి ఉంటుందనే హామీని మోదీ కోరే అవకాశం ఉంది.

టెక్ రంగంలో గ్లోబల్ సప్లై చెయిన్ లో భారతదేశానికి పెద్దపీట వేయడం ద్వారా చైనాను ఎదుర్కోవడంపై వాషింగ్టన్ దృష్టి సారిస్తున్న కారణంగా ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

కొంతమంది ప్రభావవంతమైన ట్రంప్ మద్దతుదారులు ఈ వీసాను తీవ్రంగా విమర్శించారు. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులకు ఇచ్చే ఈ వీసాను పెద్ద సంఖ్యలో భారతీయ టెక్ ఉద్యోగులు పొందారు.

ఇరాన్‌లోని చాబహార్ నగరంలో ఓడరేవు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌లోని చాబహార్ నగరంలో ఓడరేవును అభివృద్ధి చేయడానికి భారత్ ఇరాన్ తో కలిసి పనిచేస్తోంది.

యుద్ధాల ముగింపు చర్చల్లో భారత్

ట్రంప్ తో సంభాషణల సమయంలో ఇతర దేశాల ప్రస్తావన కూడా రావచ్చు. ముఖ్యంగా ఇరాన్. ఇరాన్ లోని చాబహార్ నగరంలో ఓడరేవును అభివృద్ధి చేయడానికి భారత్ ఇరాన్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇరాన్, అఫ్గనిస్తాన్ ద్వారా మధ్య ఆసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే భారత్ విస్తృతమైన వ్యూహంలో ఇది భాగం.

కానీ గత వారం, అమెరికా ఇరాన్ పై విడుదల చేసిన మెమోరాండంలో, చాబహార్‌లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వారికి ఆంక్షల మినహాయింపులను తొలగించడం గురించి ప్రస్తావన ఉంది. దీనిపై మోదీ స్పష్టత కోరవచ్చు.

యుక్రెయిన్, గాజాలో యుద్ధాల ముగింపు పై భారత్ విదేశాంగ విధానంలో ప్రాధాన్యం గురించి ట్రంప్, మోదీ చర్చించొచ్చు. ఈ యుద్ధాల ముగింపుపై భారత్ ఆసక్తిగా ఉంది. పుతిన్, రష్యాలను విమర్శించకుండా యుక్రెయిన్ లో యుద్ధం ముగించాలని ఇదివరకే పిలుపునిచ్చారు.

రష్యాతో భారతదేశానికి ఉన్న ప్రత్యేక సంబంధం, ఇజ్రాయెల్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో మోదీ మూడో పక్ష మధ్యవర్తి గా వ్యవహారించాలని ట్రంప్ సూచించవచ్చు. ఈ దేశాలు మధ్యవర్తిత్వాన్ని ఆమోదిస్తేనే మోదీ అలా చేయడానికి అంగీకరిస్తారు.

ఈ వారం కొన్ని సున్నితమైన చర్చలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఇద్దరు నాయకులు పరస్పరం సానుకూలతను కొనసాగించాలని కోరుకుంటారు.

ఆ విషయంలో, ఇండో-పసిఫిక్ క్వాడ్ అండగా నిలుస్తుంది. ఈ సమూహాన్ని- అమెరికా, భారతదేశం, జపాన్ ఆస్ట్రేలియా ట్రంప్ గట్టిగా మద్దతు ఇస్తూ, చైనాను ఎదుర్కోవడంపై దృష్టి సారించారు.

తన మొదటి పదవీకాలంలో, ట్రంప్ క్వాడ్ వార్షిక సమావేశాలను విదేశాంగ మంత్రి స్థాయికి పెంచితే, బైెడెన్ వాటిని నాయకుల స్థాయికి పెంచారు.

ఈ సంవత్సరం క్వాడ్ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికి హాజరు కావాలని ట్రంప్‌ను మోదీ ఆహ్వానించవచ్చు.

ట్రంప్ అంతర్జాతీయ ప్రయాణాలంటే ఇష్టపడరని నివేదికలు చెబుతున్నాయి. కానీ భారతదేశంలో ఆయన పర్యటన మోదీతో తన వ్యక్తిగత సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి, ఈ వారం వాషింగ్టన్‌లో జరిగే చర్చలకు మించి బహుముఖ ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు సహాయపడే అవకాశం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)