మనిషిని మింగి మళ్లీ బయటకు ఊసేసిన తిమింగలం - ఎందుకు తినలేదో తెలుసా?

- రచయిత, ఆండ్రియా డియాజ్, ఐలెన్ ఆలివా
- హోదా, బీబీసీ ప్రతినిధులు
సముద్రంలో కయాకింగ్ చేస్తున్న ఒకరిని తిమింగలం ఒక్కసారిగా మింగేసి, ఆ వెంటనే బయటకు ఊసేసిన వీడియో తాజాగావైరల్ అయింది.
తిమింగలం నోటి నుంచే కాదు, చావు నోటి నుంచి బయటపడిన ఆ కయాకర్ అడ్రియాన్ సిమాన్కస్ ప్రాణాంతకమైన ఆ అనుభవాన్ని ‘బీబీసీ’తో చెప్పారు.
అడ్రియన్ తనను తిమింగలం మింగిన వెంటనే గమనించిన మొదటి విషయం జిగురులాంటి పదార్థం.
‘నేను ఏదో నోటిలో ఉన్నానని గ్రహించడానికి నాకొక క్షణం పట్టింది. అది ఓర్కా(కిల్లర్ వేల్).. సీ మాన్‌స్టర్ వంటిది ఏదో నన్ను తినేసింది అనుకున్నాను’ అని 23 ఏళ్ల ఆ యువకుడు ‘బీబీసీ ముండో’తో చెప్పారు.
తిమింగలం(హంప్‌బ్యాక్ వేల్) నోటి లోపల తాను ఎలా జీవించగలనో అడ్రియన్ ఆలోచించడం ప్రారంభించారు. అప్పుడే తిమింగలం ఆయన్ను తిరిగి బయటకు ఊసేసింది.
వెనెజ్విలా కయాకర్ తన తండ్రితో కలిసి చిలీలోని పటగోనియన్ తీరంలో మాగెలాన్ జలసంధి ప్రాంతంలో కయాక్‌పై వెళ్తుండగా ఇది జరిగింది. ''వెనుక నుంచి నన్నేదో ఢీకొట్టి, దగ్గరగా లాక్కుని ముంచేసినట్టు అనిపించింది'' అని ఆయన చెప్పారు.

అక్కడికి కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్న ఆయన తండ్రి డేల్ ఆ భయంకర ఘటనను వీడియో తీశారు.
''నేను కళ్లు మూసుకున్నాను, మళ్లీ నేను కళ్లు తెరిచినప్పుడు తిమింగలం నోటి లోపల ఉన్నానని గ్రహించగలిగాను'' అని అడ్రియన్ బీబీసీతో చెప్పారు.
''నా ముఖం మీద ఒక జిగురులాంటి పదార్థమేదో ఉన్నట్టనిపించింది. అంతా నీలం, తెలుపు రంగుల్లో మాత్రమే కనిపిస్తోంది''అని ఆయన తెలిపారు.
''అది నన్ను మింగేస్తే నేనేం చేయగలను. నేను దానితో పోరాడలేననుకున్నాను'' అని ఆయన చెప్పారు.
''తర్వాతేంచేయాలో నేనాలోచించాల్సింది''
కొన్ని సెకన్లలోనే, ఉపరితలం వైపు పైకి లేస్తున్నట్టు అడ్రియన్ భావించారు.
''ఎంత లోతులో ఉన్నానో తెలియదు. శ్వాస తీసుకోగలనా లేదా అని భయపడ్డాను. పైకి రావడానికి చాలా సమయం పట్టిందని నాకనిపించింది.
రెండు సెకన్లపాటు అలాంటి పరిస్థితే ఉంది. ఎట్టకేలకు నేను సముద్రంపైకి వచ్చా. తిమింగలం నన్ను తినలేదని గ్రహించాను'' అని అడ్రియన్ వివరించారు.

ఫొటో సోర్స్, DELL SIMANCAS
కళ్లుమూసి తెరిచేంతలో..
కయాక్‌కు దగ్గరలోనే ఉన్న అడ్రియన్ తండ్రి డాల్ సిమాన్కస్ ఇదంతా నమ్మలేనట్టుగా చూశారు.
తండ్రీకొడుకులిద్దరూ చిలీ దక్షిణ నగరం పుంటా అరెనాస్ తీరానికి దిగువున ఉన్న ఈగల్ బే దాటిన వెంటనే ఇది జరిగింది.
''నా వెనక ఏదో ప్రమాదం జరిగినట్టనిపించింది. నేను చుట్టూ చూశా. అడ్రియన్ ఎక్కడా కనిపించలేదు.
నాకొక్క క్షణం భయం వేసింది. వెంటనే సముద్రం నుంచి పైకి వస్తూ అడ్రియన్ కనిపించారు'' అని 49 ఏళ్ల డాల్ వివరించారు.
''అప్పుడు నేనేదో శరీరంలాంటిది చూశా. దాని పరిమాణం చూసి అది తిమింగలం అని అర్థం చేసుకున్నా''అని అడ్రియన్ చెప్పారు.
ఎగసిపడే అలలను చిత్రీకరించడానికి కయాక్ వెనుక భాగంలో డాల్ ఒక కెమెరాను అమర్చారు. అది ఆయన కొడుకు భయానక అనుభవాన్ని రికార్డు చేసింది.
మెరుగైన జీవితం గడపాలన్న ఉద్దేశంతో ఏడేళ్ల కిందట అడ్రియన్ చిలీ నుంచి వెనెజ్వెలా వెళ్లారు.
కయాక్ కెమెరాలో రికార్డయిన దృశ్యం చూస్తూ..అడ్రియన్ ఆ భారీ తిమింగలాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
''నా వెనుక ఆ తిమింగలం ఉన్న క్షణాన్ని నేను చూళ్లేదు. రెక్క కనిపించింది. నేను దాన్ని చూళ్లేదు. అది నన్ను భయపెట్టింది'' అని అడ్రియన్ చెప్పారు.
''కానీ తర్వాత, వీడియో చూసినప్పుడు..నిజానికి ఆ తిమింగలం భారీ పరిమాణంలో నా ముందు ప్రత్యక్షమయింద్న విషయం నాకర్థమయింది. ఒకవేళ నేను దాన్ని చూసుంటే..నాకు మరింత భయం వేసుండేది'' అని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బయటకు ఊసేయడానికి కారణం అదే..
ఈ అనుభవం బతికి ఉండడం గురించి మాత్రమే కాదని, తిమింగలం తనను బయటకు ఊసేసిన తనకు రెండో అవకాశం లభించినట్టు భావించానని అడ్రియన్ చెప్పారు.
''భూమ్మీద అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటైన చోట కలిగిన ఈ ప్రత్యేక అనుభవం ఆ క్షణం వరకు పరిస్థితులు మెరుగ్గా ఉండడానికి నేనేం చేయగలను అన్నది ఆలోచించడానికి అవకాశం కల్పించింది. ఈ అనుభవం నుంచి నేను సద్వినియోగం చేసుకుంటా'' అని ఆయన తెలిపారు.
తిమింగలం నుంచి అతివేగంగా ఆయన తప్పించుకోగలగడానికి కారణం ఉందని వన్యప్రాణి నిపుణులు చెప్పారు.
''హంప్‌బ్యాక్ తిమింగలాలకు చిన్న గొంతులుంటాయి. చిన్న చేపలు, రొయ్యలను మింగడానికి వీలయిన గొంతు ఉంటుంది. ఇది ఇంట్లో ఉపయోగించే పైపు పరిమాణంలో ఉంటుంది'' అని బ్రెజిల్‌కు చెందిన పర్యావరణ నిపుణుడు రోచ్‌డ్ జాకబ్సన్ సెబా బీబీసీకి చెప్పారు.
''అవి కయాక్‌లు, టైర్ల వంటి పెద్ద వస్తువులనే కాదు... ట్యూనా వంటి పెద్ద చేపలనూ మింగలేవు.
తిమింగలం కయాక్‌ను మింగలేక ఊసేసింది" అని ఆయన తెలిపారు.
హంప్‌బ్యాక్ తిమింగలం అనుకోకుండా అడ్రియన్‌ను మింగేసి ఉండొచ్చని సెబా అభిప్రాయపడ్డారు.
''చేపలు తింటున్నప్పుడు అనుకోకుండా కయాక్‌ను మింగి ఉండొచ్చు..తినేటప్పుడు తిమింగలాలు చాలా వేగంగా ఉపరితలంపైకి వస్తాయి. ఆ మార్గంలో ఉన్న వస్తువులను అనుకోకుండా ఢీకొడతాయి. తిమింగలాలు తిరిగే ప్రాంతాలలో ప్యాడిల్‌బోర్డులు, సర్ఫ్‌బోర్డులు ఉపయోగించకూడదని అందరూ గుర్తుపెట్టుకునేలా ఈ ఘటన చేసింది.
తిమింగలాలను పరిశీలించేటప్పుడు ఇంజిన్లను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోవాలి. ఆ శబ్దం ద్వారా తిమింగలాలు వాటిని గుర్తిస్తాయి'' అని ఆయన తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














