విష్వక్‌సేన్ ‘లైలా’గా మెప్పించాడా, హిట్ కొట్టాడా?

ఫొటో సోర్స్, https://x.com/VishwakSenActor
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
విడుదలకి ముందే వివాదంలో చిక్కుకున్న లైలా, ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాపై విష్వక్ సేన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
అతను మంచి నటుడు. కానీ, కథల ఎంపికలో చాలా పూర్. చాలా మంది హీరోల్లాగే తన ఎలివేషన్ బాగుంటే చాలనుకుంటారు. మిగతా కథ మీద శ్రద్ధ వుండదు. లైలా పరిస్థితి కూడా ఇదే.
సోనూ (హీరో) హైదరాబాద్ పాతబస్తీలో బ్యూటీపార్లర్ నడుపుతుంటాడు. మేకప్‌లో ఎక్స్‌పర్ట్. అమ్మాయిలు క్యూలో నిలబడి మరీ పార్లర్‌కు వస్తుంటారు. ఆ ఏరియాలో అతనంటే క్రేజ్. ఒకావిడకి సాయం చేయడానికి , ఆమె భర్త చేసే వంటనూనెకి మోడల్‌గా సోనూ ప్రచారం చేస్తాడు. అది కల్తీ నూనె. దీనికి తోడు నార్మల్‌గా ఉన్న ఒకమ్మాయిని హీరో తన టాలెంట్‌తో అందగత్తెగా మేకప్ చేస్తాడు. ఇవన్నీ అతనికి తెచ్చిన కష్టాలు ఏంటి? అతను అమ్మాయి వేషం ఎందుకు వేయాల్సి వచ్చిందన్నదే లైలా కథ.


ఫొటో సోర్స్, https://x.com/VishwakSenActor
హీరో అమ్మాయి వేషం వేస్తే..
హీరో అమ్మాయి వేషం వేస్తే, అంతకు మించిన సక్సెస్ పాయింట్ లేదు. 1982లో వచ్చిన టూట్సీ (డస్టిన్ హాఫ్‌మన్), మిసెస్ డౌట్‌ఫైర్ (1993) ఈ రెండు హాలీవుడ్ క్లాసిక్స్. ఆస్కార్ అవార్డులు అందుకున్నాయి. మిసెస్ డౌట్‌ఫైర్‌ని కమల్‌హాసన్ భామనే సత్యభామనేగా తీసారు. నరేష్ నటించిన చిత్రం భళారే విచిత్రం ఆ రోజుల్లో పెద్ద హిట్. రాజేంద్రప్రసాద్ యాక్ట్ చేసిన మేడమ్ కూడా ఓకే.
వీటన్నిటిలో హీరో ఆడవేషం వేయడానికి బలమైన కారణం వుంటుంది. లైలాలో అదే లోపించింది. సెకాండాఫ్‌లో హీరో లైలాగా కనిపించడానికి చాలా సిల్లీ రీజన్ వుంటుంది. కామెడీ కథలు ఇలాగే వుంటాయనుకున్నా, సన్నివేశాలు రొటీన్, పాత ముతక వాసన వేయడంతో విష్వక్ సేన్ కష్టం వృథా అయిపోయింది. లేడీ గెటప్‌లో హీరో కనిపిస్తే, కచ్చితంగా విలన్,లేదా ఇంకొకరు ఆమె మీద మనసు పడతారు. కామెడీకి కీ పాయింట్ ఇదేనని అందరికీ తెలుసు. దీన్ని కొత్తగా చెప్పడంలో రచయిత, దర్శకుడు విఫలమై బోర్ కొట్టిస్తారు.
నిజానికి ఈ సినిమాలో అమ్మాయిల బ్యూటీపార్లర్ హీరో నడపడమే కొత్త పాయింట్. నార్మల్‌గా ఉన్న అమ్మాయిని అందగత్తెగా మేకప్ చేసి కష్టాలు తెచ్చుకోవడం ఇంకా కొత్త పాయింట్.
దీనికి తోడు హీరో మీద పగబట్టిన ఎస్ఐ, అతని మీద కక్ష పెంచుకున్న యూట్యూబర్, పెళ్లి పిచ్చిలో ఉన్న విలన్ అభిమన్యు, విలన్ మీద పగ పెంచుకున్న చోటా విలన్. ఈ క్యారెక్టర్లన్నీ ఎస్టాబ్లిష్ చేసి, కథలో చుక్కల ముగ్గులా వీళ్లందర్నీ కలిపితే మంచి కామెడీ కథగా మారేది. ఇవన్నీ మరిచిపోయి బూతు ద్వందార్థాల మాటలు, హీరోయిన్ లేడీ గెటప్ మాత్రమే నమ్ముకుని కథని భారం చేసుకున్నారు
2గంటల15 నిమిషాల సినిమాలో పాటలు, ఫైట్లు కథకి అడ్డం తగులుతుంటాయి.

ఫొటో సోర్స్, https://x.com/VishwakSenActor
ఒకప్పటి నరేష్, అల్లరి నరేష్‌లా హాస్యాన్ని పండించగల నటుల్లో విష్వక్ సేన్ ఒకరు. అయితే మాస్ హీరో కావాలనే కోరికతో అనవసరమైన ఫీట్స్ చేస్తుంటారు.
ఫైట్స్ చేస్తే మాస్ హీరోలు కాలేరు. కథ బలంగా వుండాలి.
సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా వుంది కానీ, ఎందుకుందో తెలియదు.
హీరో ఎంట్రీ సాంగ్ , హీరోయిన్‌తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్, జిమ్‌లో లవ్‌ట్రాక్, ఇవన్నీ రొటీన్ అయ్యాయని విషయం దర్శకుడు గుర్తించినట్టు లేడు.
అక్కడక్కడ పగలబడి నవ్వించే సీన్స్ వున్నా, అవి కంటిన్యూ కావు. కథలో భాగంగా వుండవు. పెంచల్‌దాస్ పాడిన పాట బావున్నా మిగతావేవీ గుర్తుండవు. నిర్మాత సాహు బాగానే ఖర్చు పెట్టినా, ప్రయోజనం లేకపోయింది.ఇక పృధ్వీని మేకల కొట్టంలో ఎందుకు కట్టేస్తారో తెలియదు. అనవసరం. మేకల సంఖ్యని చెప్పి అందర్నీ ఇరికించాడు.
ప్లస్ పాయింట్స్ః
విష్వక్ సేన్ లేడీ గెటప్
అక్కడక్కడ నవ్వించే సన్నివేశాలు
విలన్‌గా అభిమన్యు నటన
మైనస్‌పాయింట్స్ః
హీరోయిన్
బలహీనమైన కథనం
రొటీన్ సీన్స్
సినిమాల్లో స్టోరీ టెల్లింగ్ చాలా మారింది. మూస పద్ధతిలో చెబితే ప్రేక్షకులు ఒప్పుకోరు. ద్వందార్థాల వల్ల కామెడీ రాదు. కథలో పాత్రల ప్రవర్తన వల్ల వస్తుంది. క్యారెక్టర్ లేవీ రాసుకోకుండా , కేవలం లైలానే నమ్ముకుంటే, విగ్గు ఊడిపోతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














