హిమాలయాల సౌందర్యాన్ని వందేళ్ల కిందటే తన కెమేరాలో బంధించిన ఇటాలియన్ ఫొటోగ్రాఫర్

ఫొటో సోర్స్, DAG
- రచయిత, సుధా జీ తిలక్
- హోదా, దిల్లీ
విట్టోరియా సెల్లా... ప్రముఖ ఇటాలియన్ ఫొటోగ్రాఫర్. 20వ శతాబ్దంలో ఆయన తీసిన చిత్రాలు పర్వతారోహణ చరిత్రను ఒక మలుపు తిప్పాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
హిమాలయాలలో ఆయన తీసిన అరుదైన చిత్రాలలో కొన్ని ఇప్పటికీ అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా చెప్తారు.
దిల్లీలో విట్టోరియా సెల్లా: ఫొటోగ్రాఫర్ ఇన్ ద హిమాలయా పేరుతో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌లో ఆయన తీసిన ఫొటోలను ప్రదర్శించారు.

ఫొటో సోర్స్, DAG
ప్రముఖ బ్రిటిష్ ఎక్స్‌ప్లోరర్, రచయిత హ్యూ థామ్సన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని దిల్లీ ఆర్ట్ గ్యాలరీ (డీఏజీ) నిర్వహిస్తోంది.
సెల్లా భారత ఫొటోగ్రాఫ్‌లకు చెందిన అతిపెద్ద కలెక్షనే ఈ ప్రదర్శన.
వీటిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతాలలో ఒకటైన కే2 వంటి వాటి ఫొటోలు కూడా ఉన్నాయి. శతాబ్దం క్రితం సెల్లా తన కెమెరాలో ఈ చిత్రాలను బంధించారు.


ఫొటో సోర్స్, dag
ఉత్తర ఇటలీలోని ఉన్ని వ్యాపారానికి ప్రాచుర్యం పొందిన పట్టణమైన బియెల్లాలో సెల్లా జన్మించారు. సమీపంలోని ఆల్ప్స్ పర్వత శ్రేణులను అధిరోహించేవారు ఆయన.
ఉన్ని మిల్లుల దగ్గర, తన తండ్రి నేర్పించిన విషయాలతో ఇంజనీరింగ్, కెమిస్ట్రీలో తన నైపుణ్యాలను సెల్లా ఉపయోగించే వారని థామ్సన్ చెప్పారు.
తనకి ఇరవై ఏళ్లు వచ్చేసరికే కొల్లొడియన్ ప్రాసెస్ లాంటి క్లిష్టమైన ఫొటోగ్రాఫ్ పద్ధతులపై ఆయన ఆరితేరారు.
ఇవి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా లార్జ్ ఫార్మాట్ గ్లాస్ ప్లేట్స్‌ను అభివృద్ధి చేసేందుకు దోహదం చేశాయి.

ఫొటో సోర్స్, DAG

ఫొటో సోర్స్, DAG
టెక్నికల్‌గా ఎలాంటి తప్పులు లేకుండా ఆయన తీసిన పనోరమిక్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.
కాంచెన్‌జంగా యాత్రలో బ్రిటిష్ ఎక్స్‌ప్లోరర్ డౌగ్లస్ ఫ్రెష్‌ఫీల్డ్‌తో పాటు తాను కూడా చేరినప్పుడు సెల్లా హిమాలయాల ప్రయాణం 1899లో ప్రారంభమైంది.
ఏదైనా పర్వతం చుట్టూ తిరిగిరావాలంటే నేపాల్‌లోకి కూడా ప్రవేశించాల్సి ఉంటుంది. అయితే, ఎడతెరపి లేకుండా కురిసే వర్షాలు, పర్వతం ఎక్కాలనే వారి టీమ్ ఆశయాలకు విఘాతం కలిగించేవి.
ఆ సమయంలో, సెల్లా పర్వతం పైనుంచి జారుకుంటూ వస్తోన్న మంచుని తన కెమెరాలో బంధించేవారు.
టెక్నాలజీతో ఆయన ఎన్నో ప్రయోగాలు చేసేవారు. కాంచెన్‌జంగాకు చెందిన టెలిఫొటో పిక్చర్ల కోసం ప్రయత్నించేవారు. ఆయన చిత్రాలు వీక్షకులను ఎన్నడూ చూడని లోకాలకు తీసుకెళ్లాయి.

ఫొటో సోర్స్, DAG
ఆ తర్వాత దశాబ్దానికి అబ్రూజీ డ్యూక్‌తో కలిసి 1909లో కే2 పర్వత యాత్రకు వెళ్లారు.
సెల్లా తీసిన ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన పర్వతానికి చెందిన ఫొటోగ్రాఫ్‌లు ఆయన నైపుణ్యాలు, స్థితప్రజ్ఞతను తెలియజేస్తున్నాయి.
సుమారు 30 కేజీల బరువున్న కెమెరాలను మోసుకుంటూ.. ప్రమాదకరమైన ప్రాంతాలను దాటుకుంటూ సెల్లా ఫొటోలు తీసేవారు.

ఫొటో సోర్స్, DAG
''సెల్లా అత్యున్నతమైన పర్వత ఫొటోగ్రఫర్. టెక్నికల్ పర్‌ఫెక్షన్‌కు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ఆయన పేరు పర్యాయపదంగా మారింది'' అని కే2: ద స్టోరీ ఆఫ్ ద సేవేజ్ మౌంటెన్ రచయిత జిమ్ కుర్రాన్ అన్నారు.

ఫొటో సోర్స్, DAG

ఫొటో సోర్స్, DAG

ఫొటో సోర్స్, DAG
కే2 సాహస యాత్రలో, నాలుగు నుంచి ఐదు నెలల పాటు తన రోజ్ అండ్ కో కెమెరాతో 250 ఫార్మల్ ఫొటోగ్రాఫ్‌లను తీశారని, కాంచెన్‌జంగాకు చెందినవి 200 తీసినట్లు థామ్సన్ తన నోట్స్‌లో రాశారు.
''అధునాతన డిజిటల్ ప్రమాణాల పరంగా తీసుకుంటే, ఇది అంత పెద్ద సంఖ్య కాదు. కానీ, అనలాగ్ చిత్రం చివరి రోజుల్లో, ఇది ఎనిమిది రోల్స్‌తో సమానం. 1970ల్లో ఒక ఫొటోగ్రాఫర్ పర్వతంపై ఒక ఉదయం పూట ఏం చేయగలడు. సెల్లా ఫొటోగ్రాఫ్ తీస్తున్న సమయంలో ఇది చెప్పుకోదగ్గ సంఖ్యనే.'' అని థామ్సన్ అన్నారు.
ప్రతి ఒక్క ఫొటోతో ఎంతో జాగ్రత్త వ్యవహరించేవారు. ఎందుకంటే, ఆయన చిత్రాలు తీయగలిగే ప్లేట్లు చాలా తక్కువగా ఉండేవి.

ఫొటో సోర్స్, DAG
అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో ఫొటోలు తీయడంలో ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి.
తేమ వాతావరణ పరిస్థితులతో సెల్లాకు చెందిన చాలా షాట్లు పాడైపోయేవి.
అలా పాడైపోగా మిగిలిన ఫొటోలే అద్భుతమైన ఆయన నైపుణ్యాలను వెలుగులోకి తెచ్చాయని థామ్సన్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














