రిషబ్ పంత్‌ని రక్షించిన యువకుడు ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించారు?

ఫొటో సోర్స్, Getty Images/BBC
- రచయిత, షాబాజ్ అన్వర్
- హోదా, బీబీసీ హిందీ కోసం
క్రికెటర్ రిషబ్ పంత్ 2022లో రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు సాయం చేసిన రజత్ అనే యువకుడు ప్రాణాపాయ పరిస్థితుల మధ్య ఆస్పత్రిలో చేరారు. రజత్ ముజఫర్ నగర్‌కు చెందినవారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రజత్, ఆయన స్నేహితురాలు ఆత్మహత్యకు యత్నించారు. అనంతరం ఆమె మరణించారు. అయితే ప్రస్తుతం రజత్ పరిస్థితి నిలకడగా ఉంది.
మరోపక్క రజత్, ఆయన కుటుంబ సభ్యులు తమ కుమార్తెను కిడ్నాప్ చేసి హత్య చేశారని యువతి కుటుంబం ఆరోపిస్తోంది.
అయితే రజత్ కుటుంబం దీనిని ఖండించింది. ఆత్మహత్యాయత్నానికి ముందు, వారిద్దరూ ఒక వీడియో తీశారని, అందులో 'వారు కలిసి జీవించడం, చనిపోవడం గురించి మాట్లాడుకున్నట్లు ఉందని' అని రజత్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


ఏం జరిగింది?
ఫిబ్రవరి 11న ముజఫర్‌నగర్‌లోని పుర్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులకు సమాచారం అందింది.
"ఈ ఘటనలో షకర్‌పూర్ గ్రామంలోని మజ్రా బుచ్చా బస్తీకి చెందిన ఒక యువతి మరణించింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. రజత్ పరిస్థితి నిలకడగా ఉంది. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం" అని పుర్కాజీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ జైవీర్ సింగ్ తెలిపారు.
అయితే, మృతురాలి కుటుంబం నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.
సదర్ డిఎస్పీ రాజు కుమార్ మాట్లాడుతూ, "ఇది ఆత్మహత్య కేసు. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారని గ్రామస్తులు చెప్పారు" అని అన్నారు.
వారిద్దరూ ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకుకోవాలనుకున్నారని, కానీ ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించకపోగా, వారిద్దరికి వేరు వేరు వ్యక్తులతో పెళ్లి నిర్ణయించాయని గ్రామ పెద్ద గోపాల్ సింగ్ చెప్పారు.

రజత్ కుటుంబం ఏమంటోంది?
మృతురాలి తండ్రి ఈ-రిక్షా నడుపుతూ, వాచ్‌మెన్‌గానూ పనిచేస్తున్నారు.
"నా కూతురికి ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు " అని ఆయన అన్నారు. ఆమె పానిపట్‌లో నా బంధువులతో కలిసి కరెంట్ పని చేసేది. మార్చిలో ఆమె వివాహం నిర్ణయించాం. కాబట్టి ఇటీవలే అక్కడి నుండి ఇంటికి వచ్చింది. నా కూతురిని కిడ్నాప్ చేస్తామని బెదిరించింది రజత్, అతని కుటుంబ సభ్యులే." అని ఆయన అన్నారు.
ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం అయింది. రెండో కుమార్తెకు కూడా సెహరాన్‌పూర్‌లో నిశ్చితార్థం జరిగింది. మార్చిలో పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మృతురాలి తల్లి కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. స్థానిక మీడియా వద్ద కూడా ఈ ఫిర్యాదు కాపీ ఉంది.
అయితే, అలాంటి ఫిర్యాదు ఏదీ అందలేదని పోలీసులు ఖండించారు.
ఆ సంఘటన జరిగినప్పటి నుండి, రజత్ కుటుంబ సభ్యులు గ్రామంలో కనిపించడం లేదు. రజత్ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. అయితే, బీబీసీ రజత్ తమ్ముడు ఓంకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడింది. ఆయన ఉత్తరాఖండ్‌లోని ఆసుపత్రిలో తన సోదరుడితోపాటు ఉన్నారు.
"ఆ అమ్మాయి కుటుంబం తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఆత్మహత్య ప్రయత్నానికి ముందు ఆ అమ్మాయి రజత్ ఒక వీడియో తీశారు, అందులో తమ కుటుంబం తమకు మద్దతు ఇవ్వడం లేదని చెబుతున్నారు" అని ఆయన అన్నారు.
"ఈ ఇద్దరూ ప్రేమించుకున్న విషయం మాకు తెలియదు. మేం రజత్ పెళ్లిని కూడా నిశ్చయించాం. తనకి త్వరలో పెళ్లి జరగనుంది." అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, X/RISHABH PANT
రిషబ్‌ను కాపాడిన రజత్, నిషు
డిసెంబర్ 30, 2022న భారత క్రికెటర్ రిషబ్ పంత్ కారు ఉత్తరాఖండ్ సరిహద్దులోని పుర్కాజీ సమీపంలో ప్రమాదానికి గురైనప్పుడు... స్థానిక చక్కెర కర్మాగారంలో పనిచేసే రజత్ గురించి అందరికీ తెలిసింది.
ఆ సమయంలో, రజత్, ఆయన స్నేహితుడు నిషు పంత్‌ను కారు నుంచి బయటకు లాగి ఆయన ప్రాణాలను కాపాడారు.
దీని తరువాత, ఇద్దరు యువకులను అనేక మంది నాయకులు సత్కరించారు. రిషబ్ పంత్ కూడా ఒక స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చారని రజత్ సోదరుడు ఓంకుమార్ చెప్పారు.
రిషబ్ పంత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా ఆ ఇద్దరు యువకులకు కృతజ్ఞతలు తెలిపారు.
"ప్రమాద సమయంలో నాకు సహాయం చేసి, నేను సురక్షితంగా ఆసుపత్రికి చేరుకునేలా చేసిన ఈ ఇద్దరు హీరోలకు నేను కృతజ్ఞతలు చెప్పాలి" అని ఆయన రాశారు . రజత్ కుమార్ , నిషు కుమార్, ధన్యవాదాలు. నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞుడను, రుణపడి ఉంటాను." అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ANI
"ఆ రోజును ఎలా మర్చిపోగలం. ఒక కారు ప్రమాదానికి గురవడాన్ని నేను, రజత్ చూసినప్పుడు, వెంటనే అక్కడికి పరిగెత్తాం. కారులో ఉన్నది ఎవరో మాకు తెలియదు కానీ మానవత్వంతో ఇదంతా చేశాం. గొప్ప క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడటానికి మేం సహాయం చేశామని తరువాత తెలిసింది." అని ఆ రోజును గుర్తుచేసున్నారు నిషు.
ఇప్పుడు రజత్ ఆసుపత్రిలో ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.
మృతురాలి కుటుంబం నుంచి అధికారిక ఫిర్యాదు అందితే, దర్యాప్తులో ముందడుగు పడుతుందని పోలీసులు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














