కబడ్డీతో కలలుకనే ధైర్యం వచ్చిందంటున్న అమ్మాయిలు, ఈ ఆట వారికి ఎలా పరిచయమైంది, వారి జీవితాల్లో వచ్చిన మార్పేంటి?

- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ మరాఠీ
మీనా కబడ్డీ ఆడుతూ తన కళ్లను ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు తిప్పుతూ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది.
భారతీయ సంప్రదాయ క్రీడ అయిన కబడ్డీని ఇప్పుడు 50కి పైగా దేశాల్లో ఆడుతున్నారు.
కబడ్డీ పోటీ రెండు టీముల మధ్య జరుగుతుంది. ఒక్కో జట్టులో ఏడుగురు క్రీడాకారులు ఉంటారు. జట్టులోని ఒకొక్కరు అవతలి జట్టు బరిలోకి వెళ్లి కూతపెడుతూ వారిని తాకి , వారికి చిక్కకుండా తమ బరిలోకి వచ్చేయాలి.
కానీ 14 ఏళ్ల మీనాకు ఇది గెలుపు కన్నా ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన విషయం. ఈ ఆట ఆమెకు నిర్బంధ గ్రామీణ జీవితం నుంచి అవకాశాల ప్రపంచానికి దారులు వేసింది.
''ఆట ఆడేటప్పుడు ఓ ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంటుంది’’ అని సిగ్గుపడుతూ, మాటలను కష్టంగా వెతుక్కుంటూ చెప్పారు మీనా. ''కబడ్డీ ఆడేటప్పుడు నేను ఇంటిపనికి పరిమితమైన, ఒత్తిళ్లు, అంచనాలతో భారమైన జీవితం గడిపే మీనాని కాదు. నేను, నా ప్రత్యర్థి..అంతే. ఆటలు ఆడని ఇతర అమ్మాయిలతో పోలిస్తే..నేనో శక్తిమంతమైన అమ్మాయిని అనే భావన ఈ ఆట కలిగిస్తుంది'' అని ఆమె చెప్పారు.
భారత ఆర్థిక రాజధాని ముంబయికి 230 కిలోమీటర్ల దూరంలోని కుషోది అనే చిన్న గిరిజన గ్రామ శివార్లలో మీనా జీవిస్తున్నారు. అక్కడ అమ్మాయిల జీవితం...ఇంటిపనులు , పెళ్లి , పిల్లలను కనడం అనే సంప్రదాయం చుట్టూ తిరుగుతుంటుంది.
అయితే 15 ఏళ్ల క్రితం ఆ గ్రామంలోని పాఠశాల టీచర్ల బృందం అమ్మాయిలకు మరిన్ని అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది.

అమ్మాయిలు కబడ్డీ ఎందుకు ఆడకూడదు?
''నాకో కూతురు ఉంది. జీవితంలో తను ఏదైనా సాధించాలని, సాధ్యమైనంత చక్కని జీవితం గడపాలని కోరుకున్నా'' అని దాజీ రాజ్‌గురు చెప్పారు. ''అమ్మాయిలు కబడ్డీ ఎందుకు ఆడకూడదు...దాన్ని కెరీర్‌గా ఎందుకు మార్చుకోకూడదు'' అని ఆయన ప్రశ్నించారు.
అందుకే చిన్నతనంలో కబడ్డీ ఆడిన ఆయన, తనసహచరులతో కలిసి స్థానిక అమ్మాయిలకు ఆ ఆట ఎలా ఆడాలో నేర్పించాలని భావించారు. తాము పొదుపుచేసుకున్న 5వేల రూపాయలు ఖర్చు పెట్టి కబడ్డీ క్లబ్ ప్రారంభించారు. స్కూల్ మైదానాన్ని ఈ ఆట కోసం ఉపయోగించుకునేందుకు ఒప్పించారు. ఆ ప్రాంతంలో అదే తొలి అమ్మాయిల కబడ్డీ క్లబ్ అని వారు భావిస్తున్నారు.
మొదటగా అదే స్కూల్‌లో చదువుతున్న ఇద్దరు అమ్మాయిలతో ఆ క్లబ్ ప్రారంభమైంది. ''ఇంటికి దూరంగా ఎక్కువ సమయం గడపాల్సి ఉండడంతో అమ్మాయిలను కబడ్డీ ఆటకు పంపడానికి తల్లిదండ్రులు సుముఖంగా లేరు '' అని దాజీ రాజ్‌గురు చెప్పారు. ''తమ కూతుళ్ల పెళ్లిపై ఇది ఎలాంటి ప్రభావం కలిగిస్తుందోనని వాళ్లు ఆందోళన చెందారు. సంప్రదాయ కుటుంబాలు ఆడపిల్లలను బయటకు పంపడం, ఆలస్యంగా తిరిగిరావడాన్ని అంగీకరించవు'' అని ఆయన తెలిపారు.
స్కూల్ ప్రారంభం కావడానికి ముందు, తర్వాత కబడ్డీ శిక్షణ తీసుకునేటప్పుడు అమ్మాయిలు సురక్షితంగా ఉంటారని.. తల్లిదండ్రులకు నచ్చజెప్పడానికి దాజీ, ఆయన సహచరులు ఇంటింటికీ తిరిగారు. అమ్మాయిలు ఎప్పుడూ తమ పర్యవేక్షణలోనే ఉంటారని, అబ్బాయిలతో వాళ్లకు ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

జీవితాలను మార్చేసిన కబడ్డీ
తొలిరోజుల్లో టీచర్లు బాలికలను ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చి మళ్లీ విడిచిపెట్టేవాళ్లు. అయితే కబడ్డీ ఆడే అమ్మాయిల సంఖ్య పెరిగేకొద్దీ ఇది సాధ్యం కాలేదు. ప్రస్తుతం క్లబ్‌లో 30మంది అమ్మాయిలున్నారు. తాము శిక్షణ ప్రారంభించిన దగ్గరి నుంచి దాదాపు 300మందికి శిక్షణ ఇచ్చి ఉంటామని దాజీ అంచనా వేస్తున్నారు. కబడ్డీ శిక్షణ పొందిన వారిలో దాజీ కుమార్తె కూడా ఉన్నారు. కొంతమంది ఏడేళ్ల వయసు నుంచే ఆడడం ప్రారంభించారు.
క్లబ్‌లోని ఇతర సభ్యురాళ్లలాగే మీనా స్కూలు మొదలుకావడానికి రెండు గంటలముందు, స్కూల్ అయిపోయిన తరువాత రెండు గంటలు కబడ్డీ శిక్షణ పొందారు. ఆమె తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరి, రాత్రి అయ్యాక ఇంటికి చేరుకునేవారు.
''తెల్లవారుజామున చీకట్లో నేను ఒంటరిగా వెళ్లేదాన్ని. ఎవరేమన్నా చేస్తారేమోనని నాకు భయం వేసేది. అప్పుడు నా కుటుంబం నాకు మద్దతుగా నిలవలేదు. నేను క్రీడాకారిణి కావడం ఇప్పటికీ వారికి ఇష్టం లేదు'' అని ఆమె చెప్పారు.
కానీ ఆమె తన పట్టుదలను వీడలేదు. ఎప్పటి నుంచో కష్టపడి ఆడుతూ రాష్ట్ర, స్థానిక జట్లలో చోటు సంపాదించిన క్లబ్‌లోని ఇతర సభ్యురాళ్ల నుంచి ఆమె స్ఫూర్తిపొందారు. క్లబ్‌లో ఎనిమిదేళ్లపాటు శిక్షణ పొందిన తొలి బ్యాచ్ అమ్మాయిలు సిద్ధి చల్కే, సమ్రీన్ బురంద్కర్. ఇప్పుడు వారి వయసు 25 ఏళ్లు. వాళ్లు ప్రొఫెషనల్ లీగ్ ప్లేయర్లు. ఆర్థికంగా స్వతంత్రులు.

కలలను నిజం చేసుకోవడానికి..
తొలిరోజుల్లో తమ పిల్లలు ఏదో కొన్నిరోజులు కబడ్డీ ఆడి వదిలేస్తారని తల్లిదండ్రులు భావించారు. కానీ అమ్మాయిలు దాన్నే కెరీర్‌గా మలుచుకుంటామని చెప్పినప్పుడు వారు సంతోషించలేకపోయారు. పెళ్లి చేసుకోవాలని వారిపై ఇప్పటికీ ఒత్తిడి ఉంటుందిగానీ, అదే సమయంలో అమ్మాయిల ఆటతీరు చూసి వారు గర్వపడుతుంటారు.
''నా కుటుంబంలో ఎవరూ నా అంత సంపాదించడం లేదు'' అని సమ్రీన్ చెప్పారు. ''నేనిప్పుడు పెద్ద నగరంలో జీవిస్తున్నా. సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతున్నా. నా కమ్యూనిటీకి చెందిన అమ్మాయిలు వాళ్లు కోరుకుంది చేయగలగడం చాలా కష్టమైన విషయం. కబడ్డీ వల్లే నేనిక్కడ ఉండగలిగాను''అని ఆమె చెప్పారు.
సమ్రీన్ టీమ్‌లోనే సిద్ధి కూడా ఆడుతున్నారు. కబడ్డీ ద్వారానే వారు స్నేహితులయ్యారు. పోటీలకోసం వారు దేశవ్యాప్తంగా పర్యటించారు. బహుమతులు, చాంపియన్‌షిప్స్ గెలుచుకుంటున్నారు.
''కబడ్డీ వల్లే నేనిదంతా చేయగలిగాను. లేకపోతే నేను పెళ్లిచేసుకుని నా భర్త ఇంటికి వెళ్లి, గిన్నెలు కడుక్కుంటూ ఉండేదాన్ని'' అని సిద్ధి చెప్పారు. ఇద్దరూ పెద్దగా నవ్వారు. విధి నుంచి తప్పించుకుని ఉపశమనం పొందినట్టుగా వారు కనిపించారు.
క్రీడల్లో రాణించడం భారత్‌లో క్రీడాకారిణులకు లేదా ఆటగాళ్లకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. క్రీడల్లో మంచి ఘనతలు సాధించినవారికి రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కేటాయిస్తాయి. ఆటలు ఆడడం ఆపేసిన తర్వాత కూడా వారికి ఆదాయం లభిస్తుంది.
చాలామంది గ్రామీణ బాలికలు ఈ ఉద్యోగాల ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం పొందాలనే కలను నిజం చేసుకోవడానికి క్రీడలను ఎంచుకుంటారు. వారికి గౌరవం, గుర్తింపు లభిస్తాయి.
''మేము స్పోర్ట్స్ క్లబ్ ప్రారంభించినప్పుడు ఈ అమ్మాయిలకు ఎవరూ ఎలాంటి ప్రాముఖ్యం ఇచ్చేవారు కాదు. వాళ్లు తమ ఇళ్లలో, సమాజంలో ఎప్పుడూ ద్వితీయశ్రేణి పౌరులుగానే ఉండేవారు'' అని క్లబ్ యువ కోచ్ విలాస్ బెండ్రె చెప్పారు.
''కానీ ఎప్పుడైతే క్రీడల ద్వారా గ్రామీణ బాలికలు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారో అప్పుడు వారి జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చినట్టు మేం గుర్తించాం. వాళ్లు మాట్లాడే విధానం, వారి జీవనశైలి, వాళ్లు తమ గురించి తాము చెప్పుకునే తీరు ఇలా అన్నీ మారిపోయాయి'' అని ఆయన తెలిపారు.

సమాజంలో గుర్తింపు, గౌరవం
వాళ్లు ప్రొఫెషనల్ క్రీడాకారిణులు కాకపోయినప్పటికీ, వారి ఆత్మవిశ్వాసం పెరిగిన విధానం, క్లబ్‌కు చెందిన అనేకమంది అమ్మాయిలు యూనివర్సిటీకి వెళ్లడానికి, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడానికి తల్లిదండ్రులు అంగీకరించేలా చేసింది.
వారి సమాజం కూడా దీన్ని అంగీకరిస్తోంది. బాలికలు వ్యాయామం చేయడం చూసినప్పుడు వారికి ఇకపై కోపం రాదు.
పోటీల్లో టీమ్ గెలుచుకునే బహుమతుల ద్వారా వచ్చే డబ్బు, అప్పుడప్పుడు వచ్చే డోనేషన్లతోపాటు కోచ్‌ల ద్వారా క్లబ్‌కు నిధులు సమకూరుతున్నాయి. క్లబ్‌లో శిక్షణ పొందేవారిలో చాలా మంది అమ్మాయిలు పేద, వెనకబడిన కుటుంబాలకు చెందినవారు. క్లబ్‌లో చేరేందుకు డబ్బులు కూడా చెల్లించలేరు.
శిక్షణతో పాటు, క్లబ్ పాఠశాలలో వేసవి శిబిరాలు నిర్వహిస్తుంది. గుడ్లు, అరటి పండ్లు, పాలు అందిస్తుంది. గాయపడ్డ క్రీడాకారిణులకు చికిత్సకయ్యే ఖర్చు తరచూ భరిస్తుంటుంది.
కలలు కనే ధైర్యాన్నిచ్చిన కబడ్డీ
కాలం గడిచే కొద్దీ తల్లిదండ్రుల భయాలు తగ్గాయి. కానీ కొన్నిసార్లు విమర్శకులు కోచ్‌ల ఉద్దేశాలను ప్రశ్నిస్తుంటారు. ''మీరు అబ్బాయిలకు ఎందుకు శిక్షణ ఇవ్వరు''వంటి ప్రశ్నలను ప్రజలు కొందరు పరోక్షంగా అడుగుతుంటారు అని దాజీ చెప్పారు. అబ్బాయిలకు ఇప్పటికే అవకాశాలున్నాయని, కానీ అమ్మాయిల విషయం వచ్చేసరికి అంతరాలున్నాయని ఆయన చెప్పారు.
''మేం వారికి కోచ్‌లం మాత్రమే కాదు'' అని విలాస్ చెప్పారు. ''కొన్నిసార్లు మేం వాళ్లకు తల్లిదండ్రుల్లా ఉంటాం. వారికి మార్గదర్శకత్వం వహిస్తాం. వారిని క్రమశిక్షణలో ఉంచుతాం. వారు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహకారం అందిస్తాం'' అని ఆయన తెలిపారు.
ఈ విలువైన అవకాశం ఎంత శక్తిమంతమైనదో మీనాకు తెలుసు. ''నేను మంచి రైడర్ అయి, భారత కబడ్డీ టీమ్ కెప్టెన్ కావాలనుకుంటున్నాను'' అని ఆమె చెప్పారు. సాధారణ గ్రామీణ జీవితాన్ని వెనక్కి నెట్టి, పతకాలు, ఛాంపియన్‌షిప్స్ గురించి ఆమె ధైర్యంగా కలలు కంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















