బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2024: అయిదుగురు నామినీలు వీరే

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అయిదో ఎడిషన్ నామినీల పేర్లను ప్రకటించారు.
ఈ ఏడాది ఈ అవార్డు కోసం గోల్ఫర్ అదితి అశోక్, షూటర్లు మను భాకర్, అవని లేఖర, క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోటీలో నిలిచారు.
భారత క్రీడాకారిణుల ప్రతిభ, కృషి, వారు సాధించిన విజయాలకు గుర్తుగా ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును బీబీసీ అందిస్తోంది.
బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లు, బీబీసీ స్పోర్ట్ వెబ్‌సైట్‌ల నుంచి మీరు మీ అభిమాన క్రీడాకారిణికి ఓటు వేయచ్చు.
బీబీసీ ఏర్పాటుచేసిన ఓ ప్యానెల్ ఈ అవార్డు కోసం అయిదుగురు భారతీయ క్రీడాకారిణులను నామినీలుగా ఎంపిక చేసింది. భారత్‌లోని ప్రముఖ క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, రచయితలతో ఈ ప్యానెల్ ఏర్పాటైంది.
ఈ అయిదుగురిలో ప్రజల నుంచి ఎక్కువ ఓట్లు పొందిన క్రీడాకారిణి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంటారు. ఓటింగ్ ఫలితాలు బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లతో పాటు బీబీసీ స్పోర్ట్ వెబ్‌సైట్‌లో ప్రచురితమవుతాయి.
2025 జనవరి 31వ తేదీ రాత్రి 11:30 గంటల వరకు ప్రజలు ఓటు వేయవచ్చు.
ఫిబ్రవరి 17 సోమవారం నాడు దిల్లీలో జరిగే అవార్డుల కార్యక్రమంలో విజేతను ప్రకటిస్తారు.
దీనికి సంబంధించిన నియమ నిబంధనలు, ప్రైవసీ నోటీస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

అవార్డుల వేడుకలో 'స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'తో పాటు మరో మూడు కేటగిరీల్లో జ్యూరీ నామినేట్ చేసిన మరో ముగ్గురు క్రీడాకారిణులను బీబీసీ అవార్డులతో సత్కరిస్తుంది.
యువ అథ్లెట్ సాధించిన విజయాలకు ప్రతీకగా 'బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు, క్రీడల్లో అనుభవజ్ఞులైన క్రీడాకారిణులు చేసిన అసమాన కృషికి గుర్తుగా 'బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్' అవార్డు, పారా స్పోర్ట్స్‌లో చూపిన ప్రతిభను చాటిచెప్పేందుకు 'బీబీసీ పారా స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను బీబీసీ అందించనుంది.
ప్లేయర్లు చాంపియన్లుగా ఎదగడంలో వెన్నంటి నిలిచిన వ్యక్తులు, వారు అందించిన సహకారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో 'చాంపియన్స్ చాంపియన్స్' అనే థీమ్‌తో ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ, కథనాలను మేం మీ ముందుకు తీసుకువస్తున్నాం.
భారత్‌లోని మహిళా అథ్లెట్లు సాధించిన విజయాలను వేడుకగా చేయడంతోపాటు వారికి తగిన గౌరవం ఇవ్వాలనే లక్ష్యంతో 2019లో ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ (ISWOTY) మొదలైంది.
ప్రస్తుతం ఈ అవార్డుల వేడుక అయిదో ఎడిషన్ మీ ముందుకు వచ్చింది.
ఇప్పుడు నామినీల గురించి తెలుసుకుందాం.

అదితి అశోక్ (గోల్ఫర్)
వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారత మహిళా గోల్ఫర్ 26 ఏళ్ల అదితి అశోక్.
2016లో రియో ఒలింపిక్స్‌లో అతిపిన్న వయస్కురాలైన గోల్ఫర్‌గా అడుగుపెట్టినప్పుడు ఆమె వయస్సు 18 ఏళ్లు. తర్వాత జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని కోల్పోయారు. భారత్ తరఫున ఒలింపిక్స్ గోల్ఫ్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. గోల్ఫర్‌గా ఆమె కెరీర్‌లో కూడా ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్.
అదితి 2023 ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని గెలుచుకున్నారు.
2024లో తాను పాల్గొన్న మూడో ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగినప్పటికీ ఆమెకు పతకం దక్కలేదు. లేడీస్ యూరోపియన్ టూర్ (ఎల్‌ఈటీ)లో అయిదు విజయాలు సాధించిన తొలి భారతీయురాలు. లేడీస్ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ టోర్నీకి రెగ్యులర్ పోటీదారు. ప్రతిష్టాత్మక అర్జున అవార్డును కూడా ఆమె అందుకున్నారు.

మను భాకర్ (షూటర్)
ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి 22 ఏళ్ల మను భాకర్. 2024 ఒలింపిక్స్‌లో ఆమె ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో రెండు కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
2018లో షూటింగ్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలిచిన అతిపిన్న భారత షూటర్‌గా మను రికార్డు నెలకొల్పారు. అప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్లు.
షూటర్‌గా తన కెరీర్‌లో పలు వరల్డ్ కప్ టోర్నీలు, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో మను అనేక పతకాలు గెలుచుకున్నారు.
భారత అత్యున్నత క్రీడా పురస్కారం 'ఖేల్ రత్న'కు మను ఎంపికయ్యారు.

అవని లేఖర (షూటర్)
మూడు పారాలింపిక్ పతకాలు సాధించిన తొలి భారత షూటర్ 23 ఏళ్ల అవని లేఖర.
2024 పారిస్ పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం అందుకున్న అవని లేఖర, 2020 టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం, కాంస్యం గెలుచుకున్నారు.
అవని 2015లో పాఠశాల వేసవి సెలవుల సమయంలో షూటింగ్‌ను మొదలుపెట్టారు.
షూటింగ్‌ను హాబీగా చేపట్టిన అవని అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు గెలవడం మొదలుపెట్టారు.
అవని ఇప్పటివరకు 3 షూటింగ్ వరల్డ్ కప్‌లలో పాల్గొని స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గారు. 2022 ఆసియా పారా క్రీడల్లోనూ ఆమె స్వర్ణం గెలిచారు.
అద్భుత విజయాలు సాధించిన అవనిని భారత ప్రభుత్వ పద్మశ్రీ, ఖేల్ రత్న అవార్డులతో సత్కరించింది.

స్మృతి మంధాన (క్రికెటర్)
అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లోని అత్యుత్తమ బ్యాటర్లలో స్మృతి మంధాన ఒకరు.
2024లో స్మృతి 1659 పరుగులు సాధించారు. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒక ప్లేయర్ నమోదు చేసిన అత్యధిక పరుగుల రికార్డు ఇదే. ఇందులో నాలుగు వన్డే సెంచరీలు ఉన్నాయి. ఒక ఏడాదిలో ఒక మహిళా క్రికెటర్ చేసిన అత్యధిక సెంచరీలు ఇవే.
స్మృతి కెప్టెన్‌గా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు 2024 విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో చాంపియన్‌గా నిలిచింది.
స్మృతి రెండు పర్యాయాలు (2018, 2022) ఐసీసీ విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలిచారు. ఆస్ట్రేలియా బ్యాటర్ ఎలిస్ పెర్రీ తర్వాత రెండుసార్లు ఈ అవార్డును గెలిచిన క్రికెటర్ స్మృతి మంధాన.
2020 టి20 ప్రపంచకప్, 2017 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఫైనల్ చేరిన టీమిండియాలో ఆమె సభ్యురాలు. భారత అత్యున్నత క్రీడా పురస్కారాల్లో ఒకటైన అర్జున అవార్డును ఆమె అందుకున్నారు.

వినేశ్ ఫొగాట్ (రెజ్లర్)
మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్. భారత్ తరఫున రెజ్లింగ్‌లో ఆమె అనేక పతకాలు సాధించారు.
ఒలింపిక్‌లో ఫైనల్ పోరుకు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా వినేశ్ చరిత్ర సృష్టించారు. కానీ, తర్వాత అధిక బరువు కారణంగా అనర్హతకు గురయ్యారు.
2019, 2022లలో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో వినేశ్ కాంస్యం గెలిచారు. కామన్వెల్త్ క్రీడల్లో మూడు స్వర్ణాలు నెగ్గిన ఆమె, ఆసియా క్రీడల్లో ఒక స్వర్ణం, కాంస్యాన్ని సాధించారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు వచ్చాయి. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.
2024లో జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆమె గెలిచారు.
2023 అక్టోబర్ 1 నుంచి 2024 సెప్టెంబర్ 30 మధ్య కాలంలో అద్భుత ప్రదర్శన కనబరిచిన అయిదుగురు క్రీడాకారిణులను జ్యూరీ నామినీలుగా ఎంపిక చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














