పీవీ సింధు: BBC Indian Sports Woman of the Year నామినీ

పీవీ సింధు
    • రచయిత, వందన
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పీవీ సింధు... బ్యాడ్మింటన్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. ఎప్పుడో 2009లో సబ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మొదలైన ఆమె ప్రయాణం... ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగే వరకు వచ్చింది. అటు రియో ఒలింపిక్స్‌లోనూ రజతంతో.. ఆ ఘనత సాధించిన తొలి మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్రకెక్కారు.

ఇప్పుడు ఆమె దృష్టంతా ఆగస్టులో జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌పైనే ఉంది. ఎలాగైనా స్వర్ణం సాధించాలన్న ఏకైక లక్ష్యంతో కఠోరంగా శ్రమిస్తున్నారు.

Presentational grey line
News image
Presentational grey line

అంత బిజీ సమయంలో కూడా క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని హైలెట్ చేస్తూ బీబీసీ నిర్వహిస్తున్న స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆమె చిన్ననాటి సంగతుల నుంచి రేపటి ఒలింపిక్స్ లక్ష్యం వరకు ఎన్నో విషయాలను ముచ్చటించారు.

ప్రపంచ ప్రఖ్యాత బ్యాడ్మింటన్ కోచ్... పుల్లెల గోపీచంద్ హైదరాబాద్ నిర్వహిస్తున్న అకాడమీలో నిల్చొని చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి కల్గుతోంది. మొత్తం 8 బ్యాడ్మింటన్ కోర్టులున్నాయి. ఆటగాళ్లు అప్పటికి ఇంకా అడుగు పెట్టలేదు. ఇద్దరు ఒలింపిక్ ఛాంపియన్స్, ఇద్దరు ప్రపంచ ఛాంపియన్స్ ఇంకా ఎంతో మంది వరల్డ్ సూపర్ సిరీస్ ఛాంపియన్స్.. ఇలా రోజూ ఈ 8 కోర్టుల్లోనే ప్రాక్టీస్ చేసి ఆ స్థాయికి చేరారంటే ఆశ్చర్యం కలగక మానదు.

అంతలోనే ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు కోర్టులో అడుగు పెట్టారు. తన టీంమేట్స్‌తో కలిసి ఆమె తన ప్రాక్టీస్ మొదలు పెట్టగానే అప్పటి వరకు సాగుతున్న నా ఆలోచనలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది.

భారత్ తరపున ఒలింపిక్స్‌లో ఏకైక రజతం సాధించిన సింధు జులై 5, 1995న జన్మించారు.

సుమారు నాలుగు గంటల సేపు ప్రాక్టీస్ చేసిన సింధు ఒక్కసారి కూడా తన ఏకాగ్రతను కోల్పోవడం నేను చూడలేదు. ఆమె తన ఫోన్ వైపు కూడా చూడలేదు. మొత్తం తన దృష్టంతా ఆటపైనే పెట్టారు. రాబోయే ఒలింపిక్స్‌లో ఎలాగైనా స్వర్ణం సాధించాలన్నదే ప్రస్తుతం ఆమె ముందున్న లక్ష్యం.

వీడియో క్యాప్షన్, పీవీ సింధు: నన్ను స్ఫూర్తిగా తీసుకోండి.. కానీ నా కష్టాన్ని తక్కువ అంచనా వెయ్యకండి

8 ఏళ్లకే రాకెట్ పట్టిన సింధు

చాలా సేపు వేచి చూసిన తర్వాత ఎట్టకేలకు ఆమె తన ప్రాక్టీస్ పూర్తి చేసుకొని ఇంటర్వ్యూ కోసం సిద్ధమయ్యారు. ఇంటర్వ్యూ అనగానే సహజంగానే వచ్చే మొట్టమొదటి ప్రశ్న... ఈ స్థాయికి చేరుకున్న ఆమె ప్రయాణం ఎలా సాగింది? అని.

తనదైన చిరునవ్వుతో సమాధానం ఇవ్వడం మొదలెట్టారు సింధు.

"నేను 8 ఏళ్ల వయసులో ఉండగా బ్యాడ్మింటన్ ఆడటం మొదలు పెట్టాను. నా తల్లిదండ్రులు ఇద్దరూ అంతర్జాతీయ వాలీ బాల్ ఆటగాళ్లు. నా తండ్రి అర్జున అవార్డు గ్రహీత కూడా. ఆయన ఫుట్ బాల్ ఆడే సమయంలో ఆ పక్కనే సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్స్ సమీపంలో బ్యాడ్మింటన్ కోర్టులు ఉండేవి. అక్కడ నా ప్రయాణం మొదలైంది. నా మొదటి కోచ్ మెహబూబ్ అలీ. పదేళ్ల వయసులో ఉండగా గోపీచంద్ అకాడమీలో చేరాను. ఇప్పటికీ అక్కడే శిక్షణ పొందుతున్నాను."

అక్కడ శిక్షణ పొందుతూనే 2009లో సబ్ జూనియర్ ఏసియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించారు. అక్కడ నుంచి ఆమె ఇక వెనుతిరిగి చూసుకోలేదు. 18 ఏళ్ల వయసులోనే 2013లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించారు. అలా కాంస్యం సాధించిన తొలి మహిళ కూడా ఆమే కావడం విశేషం.

సింధు జైత్రయాత్ర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 18 ఏళ్ల వయసులోనే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం

అప్పుడు బాగా సంతోషం కలిగింది

అక్కడ నుంచి ఆమె జైత్రయాత్ర మొదలైంది. ఎన్నో పతకాలు సాధించారు. కానీ తన కెరియర్ మొత్తంలో ఎనలేని సంతోషాన్నిచ్చిన సందర్భం ఏదని ప్రశ్నించినప్పుడు.. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించి నాలుగేళ్లు గడిచిపోయినా ఇప్పటికీ ఒలింపిక్స్ అనగానే ఆమె కళ్లలో మెరుపు కనిపించింది.

"నిజానికి రియో ఒలింపిక్స్‌కు ముందు నేను గాయపడ్డాను. 2015లో పాదం ఎముక చీలి గాయమైంది. సుమారు 6 నెలల పాటు ఆటకు దూరంగా ఉండిపోయాను. ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. కానీ నా తల్లిదండ్రులకు, నా కోచ్‌కు నాపై పూర్తి నమ్మకం ఉంది. అందుకే వారు ఒలింపిక్స్‌కు సిద్ధం కావాలని చెప్పారు.

అప్పుడే అనుకున్నా.. నా మొదటి ఒలింపిక్స్‌లో ఎలాగైనా అత్యుత్తమ ప్రతిభను కనబర్చాలని. ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధిస్తూ వచ్చాను. ఫైనల్స్‌లోను నూటికి నూరు శాతం ప్రయత్నించాను. కానీ దురదృష్టం వెంటాడింది. అయినా ఒలింపిక్స్‌లో రజతం సాధించడం కూడా చిన్న విషయమేం కాదు. నేను స్వదేశానికి తిరిగి వచ్చేసరికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆ రోజును తలచుకుంటే నిజంగా ఇప్పటికీ నా శరీరం పులకరించిపోతుంది."

ఒలింపిక్స్‌ కోసం చిన్న చిన్న సరదాలకు దూరమైన సింధు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు

వ్యక్తిగతంగా చూస్తే సింధు ఎప్పుడూ గొప్ప ఆశావాదిగానే కనిపిస్తారు. ఆ సందర్భాన్ని గుర్తుచేస్తూ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని కోల్పోయినప్పుడు మీకు ఏమనిపించింది అని ప్రశ్నించాను. వెంటనే సింధు ఇలా సమాధానం చెప్పారు.

"అవును... ఒలింపిక్స్‌లో స్వర్ణం కోల్పోయినప్పుడు నాకు చాలా బాధేసింది. కానీ వెంటనే ఎప్పుడూ మన కోసం మరో అవకాశం ఉంటుందని అనుకున్నా. అప్పటికే నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించని విజయాన్ని సాధించానని భావించాను. అప్పటి నుంచి నా జీవితం చాలా మారిపోయింది. 2019లో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను సాధించడం కూడా నా జీవితంలో నేను సాధించిన అతి పెద్ద విజయాల్లో ఒకటి. రెండు కాంస్యాలు, రెండు రజతాలు తర్వాత చివరిగా స్వర్ణం సాధించా."

అయితే ఒలింపిక్స్‌లో విజయం సింధుకు అంత సులభంగా ఏం లభించలేదు. గోపీచంద్ ఆధ్వర్యంలో కఠోర శిక్షణ తీసుకున్న 21 ఏళ్ల సింధు సుమారు 3-4 నెలల పాటు ఫోన్‌కు దూరంగా ఉండిపోయారు. ఐస్ క్రీం లాంటి చిన్న చిన్న ఇష్టాలను కూడా ఒలింపిక్స్ కోసం వదిలేసుకున్నారు.

రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తర్వాత ఆమె ఎంతో ఇష్టంగా ఐస్ క్రీం తింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం అందరికీ గుర్తుండే ఉంటుంది.

"నేను కేవలం ఒలింపిక్స్‌లో పతకం మాత్రమే సాధించలేదు... ఐస్ క్రీం తినాలన్న నా హక్కును కూడా... అది కూడా గోపీ సర్ చేతుల మీదుగా తీసుకొని" అన్నారు నవ్వుతూ.

సింధుకు ఆమె కోచ్.. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ మాజీ ఛాంపియన్ పుల్లెల గోపీచంద్‌కు మధ్య చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

"నేను పదేళ్ల వయసులో ఉండగా ఆడటం మొదలు పెట్టాను. ఇప్పుడు నా వయసు 24 ఏళ్లు. ఇప్పటికీ ఆయనే నా గురువు."

ఈ ఒక్క మాట చాలు... వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని, గురువు గోపీచంద్ పట్ల ఆమెకు ఉన్న గౌరవాన్ని చెప్పడానికి.

"ఆయన కేవలం కోచ్ మాత్రమే కాదు... అంత కన్నా ఎక్కువ. నాకు మంచి స్నేహితుడు కూడా. ఓ క్రీడాకారిణిగా నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఒక కోచ్‌గా ఆయన చాలా స్ట్రిక్ట్. కానీ బయట మాత్రం చాలా స్నేహపూరక్వంగా ఉంటారు."

పీవీ సింధు
ఫొటో క్యాప్షన్, కోచ్ పుల్లెల గోపీచంద్‌తో సింధు

ఆమె ఇచ్చే ప్రతి సమాధానం కూడా చిరునవ్వుతోనే ముగుస్తుంది. కోర్టులో ఆడేటప్పుడు ఆమె ఎంత ఎగ్రసివ్‌గా ఉన్నప్పటికీ... బయటకొస్తే మాత్రం ముఖంపై చిరునవ్వు చెరగనివ్వరు. చివరకు ఆమె అపజయాల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా.

విజయాలను పక్కపెడితే సింధు తనపై వచ్చే విమర్శల గురించి కూడా మాతో పంచుకున్నారు. మరీ ముఖ్యంగా కీలకమైన టోర్నమెంట్లలో ఫైనల్స్‌లో ఓడిపోవడం గురించి.

"ప్రతి ఒక్కరూ ఫైనల్స్‌కి వచ్చేసరికి నీకు ఏమవుతుంది..? అదేమైనా ఫైనల్ ఫోబియానా? అని అడుగుతుంటారు. అలాంటి వాళ్లందరికీ నా రాకెట్‌తోనే సమాధానమిచ్చి నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను."

అందుకు నిదర్శనం.. వరుసగా 2017, 2018 సంవత్సరాలలో ఫైనల్స్‌లో ఓటమి పాలైన సింధు 2019లో ఫైనల్స్‌లో విజయం సాధించి స్వర్ణం సాధించడమే.

పీవీ సింధు .. ఇప్పుడు ఓ తిరుగులేని బ్రాండ్

భారత్ తరపున ఆమె కేవలం అత్యంత విజయవంతమైన మహిళా క్రీడాకారిణి మాత్రమే కాదు... అత్యంత ధనవంతురాలైన క్రీడాకారిణి కూడా. సింధు ఇప్పుడు ఒక తిరుగులేని బ్రాండ్.

2018 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్ ఆమెను మహిళా క్రీడాకారుల్లో అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న ఏడో వ్యక్తిగా గుర్తించింది. 2018లో ఆమె కేవలం తన విజయాల ద్వారానే సుమారు 3 కోట్ల 57 లక్షల రూపాయలకు పైగా ఆదాయాన్ని సంపాదించారు. ఇక వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా వచ్చిన ఆదాయం విషయానికొస్తే మరో 57 కోట్ల రూపాయలకు పైమాటే. నిజానికి కొందరు క్రికెటర్ల ఆదాయం కన్నా ఆమె సంపాదన ఎక్కువనే చెప్పొచ్చు.

ఓ విజయవంతమైన క్రీడాకారిణిగానే కాకుండా తన పైన, తనకున్న శక్తి సామర్థ్యాలపైనా సింధుకు అపారమైన విశ్వాసం. యావత్ భారత దేశం క్రీడాభిమానుల ఆశల భారాన్ని తన భుజస్కంధాలపై మోస్తూనే ఆ ఒత్తిళ్లన్నింటినీ పక్కన పెట్టి ఆటను ఆస్వాదించడం ఎలాగో ఆమెకు బాగా తెలుసు.

కఠోరమైన ప్రాక్టీస్ సెషన్లు, ప్రపంచమంతా ప్రయాణాలు, వివిధ సంస్థలతో ఒప్పందాలు, వెంటపడే మీడియా... క్రీడాభిమానుల ఆశలు... 24 ఏళ్ల అమ్మాయిపై ఉండే ఒత్తిడి గురించి ఇంతకన్నా ఏం చెప్పాలి? ఇది ఎంతటి వాళ్లకైనా ఒక్కోసారి భారంలా అనిపిస్తుంది.

అచ్చం ఆమె ఆటలాగే... సింధు ఆలోచన సరళి కూడా స్పష్టంగా ఉంటుంది.

"నిజంగా నేను ఎంజాయ్ చేస్తున్నా... చాలా మంది నీకేమైనా వ్యక్తిగత జీవితం అంటూ ఉందా అని ప్రశ్నిస్తుంటారు. ఇది నాకు సరిపోదా అనిపిస్తుంటుంది. నా వరకు ఇది అత్యుత్తమ సమయం. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరికైనా ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండటం సాధ్యం కాదు కదా. జీవితంలో ఏదో కోల్పోతున్నానన్న బాధ నాకు ఎప్పుడూ లేదు. బ్యాడ్మింటన్ నా శ్వాస."

సింధు ఓ తిరుగులేని బ్రాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాలా మంది క్రికెటర్ల కన్నా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న క్రీడాకారిణి సింధు

సింధు సక్సెస్ మంత్ర

ఓ ప్రపంచ ఛాంపియన్‌గా ఏం చెప్పాలో సింధు అదే చెప్పింది.

"ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే.. నన్ను నేను నమ్ముతాను. నిజానికి అదే నా బలం. ఎందుకంటే నువ్వు ఎవరి కోసమో ఆడటం లేదు. నీకోసం నువ్వు ఆడుతున్నావు. నువ్వు ఏదైనా చెయ్యగలవు."

ప్రపంచ ఛాంపియన్‌ అంటే ఎప్పుడూ సీరియస్‌గా ఉంటూ కష్టపడి ప్రాక్టీస్ చెయ్యడమే అనుకుంటారేమో.. కానీ సింధు విషయంలో కూడా మీరు అలా ఆలోచిస్తే... అది కచ్చితంగా తప్పే అవుతుంది.

ఆమె వరకు ఆమె ఓ ఫ్యాషన్ ఐకాన్. ఆమె వ్యక్తిత్వం విషయానికొస్తే.. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండే అమ్మాయిలా అనిపిస్తుంది.

"చక్కగా అన్నీ అలంకరించుకొని తయారవడమంటే నాకు చాలా ఇష్టం" అంటారామె.

ఆమె గోళ్లకు వేసుకున్న నెయిల్ పెయింటే అందుకు నిదర్శనం. అసలు దాన్ని ఎక్కడనుంచి తెచ్చుకున్నారో తెలుసుకునేంత వరకు నా మనసు ఆగలేదంటే నమ్మండి.

మా సంభాషణ కొనసాగుతూనే ఉంది. అంతలోనే ఆమె తన మనసులో భావాలను మరింత స్వేచ్ఛగా చెప్పుకొచ్చారు.

"నన్ను నేను బిల్ బోర్డ్‌పై చూసుకోవడం అన్నా, షూటింగ్‌లో పాల్గొనడం అన్నా చాలా ఇష్టం. అలాగని అందులోనే కొనగాలని కాదు... నేను వాటిని బాగా ఎంజాయ్ చేస్తాను అంతే."

ఇక జీవితంలో బ్యాడ్మింటన్‌ను పక్కనబెడితే సింధుకు సంగీతం అన్నా, తన మేనల్లుడితో ఆడుకోవడం అన్నా చాలా ఇష్టం. ఒత్తిడి నుంచి దూరమయ్యేందుకు ఆమె ఇష్టంగా చేసేది అదే అన్న విషయం సింధు మాటల్లో అర్థమైంది. హైదరాబాద్ బిర్యానీని చాలా ఇష్టంగా తింటారు.

ఫుడ్, ఫ్యాషన్, ఫ్యామిలీ.. ఈ మూడు విషయాలను పక్కనబెడితే... ప్రస్తుతం ఆమె దృష్టంతా రాబోయే టోక్యో ఒలింపిక్స్‌పైనే ఉంది. మరోసారి పతకం సాధించాలన్నది ఆమె కల.

పీవీ సింధు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే సింధు లక్ష్యం

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే లక్ష్యం

సింధు ఈసారి స్వర్ణం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే జరిగితే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించినట్టవుతుంది.

ఇక ఇంటర్వ్యూ ముగిసే సమయం వచ్చేసింది. ఎప్పట్లాగే ఆమె తన అందమైన చిరునవ్వును ఏ మాత్రం చెరగనివ్వకుండా ఇలా అన్నారు...

"జనం నా గురించి మాట్లాడుకోవడం, నన్ను స్ఫూర్తిగా తీసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషాన్నిస్తుంది. అయితే ఇక్కడే నేను ఒక్క విషయం చెప్పదల్చుకున్నా. ఇదంతా ఏదో కొద్ది నెలలు కష్టపడినంత మాత్రాన జరిగిపోలేదు. కొన్నేళ్ల పాటు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇది. విజయం సాధించడం అంత తేలికేం కాదు."

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)