అమెరికా నుంచి భారతీయ అక్రమ వలసదారులతో వస్తున్న విమానాలు పంజాబ్‌లోనే దించడంపై విమర్శలు ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో అక్రమ వలసదారులతో భారత్‌కు వస్తున్న విమానం ల్యాండింగ్ ప్రాంతంపై వివాదం రాజుకుంది. పంజాబ్ పరువు తీయాలనే అమృత్‌సర్ విమానాశ్రయంలో విమానం దింపుతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపిస్తున్నారు.
అమెరికాలో 'చట్టవిరుద్ధంగా' నివసిస్తున్న 104 మంది భారతీయులను ఆ దేశం ఇటీవలె వెనక్కు పంపించింది. ఇందులో గుజరాత్, హరియాణా, పంజాబ్‌లకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.
అమెరికా సైనిక విమానం ఫిబ్రవరి 5న అమృత్‌సర్‌లోని శ్రీ గురు రాందాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరందరిని దింపింది.
అయితే, ఫిబ్రవరి 15 రాత్రి పొద్దుపోయాక అమృత్‌సర్‌లోని ఎయిర్ పోర్టుకు చేరుకున్న విమానాన్ని పంజాబ్‌లోనే ల్యాండింగ్ కేటాయించామని అంతకు ముందే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో పంజాబ్ ప్రభుత్వం అంతకుముందు రోజు సాయంత్రం విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసింది.
అమెరికా నుంచి రెండో విమానం ఫిబ్రవరి 15న భారత్‌కు రాబోతున్నట్లు తమకు సమాచారం ఉందని పంజాబ్ ఎన్నారై వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ ప్రకటించారు.
విమానంలో మొత్తం 119 మంది భారతీయులుండగా అందులో 67 మంది పంజాబ్‌కు చెందిన వారున్నారని ఆయన తెలిపారు.
అయితే, ఈ విమానం అమృత్‌సర్‌లోనే దిగుతోందన్న వార్త వచ్చినప్పటి నుంచి అది వివాదంగా మారింది. కేంద్రం ప్రభుత్వంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విమర్శలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వివాదం ఏమిటి?
విమానం రూట్‌ను మార్చి పంజాబ్‌లో కాకుండా వేరే చోట ల్యాండ్ చేయాలని భారత హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలను కోరినట్లు ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు.
119 మందిలో 67 మంది పంజాబ్‌కు చెందిన వారని ఇప్పుడు చెబుతున్నారని, అందుకే అమృత్‌సర్‌లో విమానం ల్యాండ్ అవుతుందని బదులిచ్చారని భగవంత్ మాన్ చెప్పారు.
అయితే, మొదటి బ్యాచ్‌లో 33 మంది గుజరాత్ వారున్నారని, అలాంటప్పుడు అహ్మదాబాద్‌లో ఎందుకు ల్యాండ్ కాలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
"విమానంలో ముగ్గురు హరియాణాకు చెందినవారున్నారు, అలాంటప్పుడు అంబాలాలో ఎందుకు దిగడంలేదు. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ రాగానే అంబాలాలో దింపుతారు. మేం చిన్న పిల్లలం అనుకుంటున్నారా?" అని భగవంత్ మాన్ అన్నారు.
"వారు అమృత్‌సర్‌లో మొదటి విమానాన్ని ల్యాండ్ చేశారు. దీనికి ప్రాతిపదిక ఏమిటో నాకు తెలియదు" అని సీఎం అన్నారు.
"రెండో విమానం అమృత్‌సర్‌లో ఎందుకు ల్యాండ్ అవుతుంది? ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రమాణం ఏమిటి? విదేశాంగ శాఖ దీనిపై వివరణ ఇవ్వాలి. పంజాబ్ పరువు తీసేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర ఇది. ప్రతీసారి అలాగే జరుగుతోంది. పంజాబ్, పంజాబీలను అప్రతిష్ట పాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోంది" అని భగవంత్ మాన్ అంతకు ముందు ఆరోపించారు.
"అమెరికా తమ చట్టం ప్రకారం బహిష్కరించింది. అయితే మన పౌరులకు గౌరవం ఇవ్వడం మా కర్తవ్యం" అని భగవంత్ మాన్ అన్నారు.
అమెరికా విమానం వచ్చే సమయంలో అమృత్‌సర్ విమానాశ్రయంలోనే ఉంటానని సీఎం చెప్పారు. కానీ, రాత్రి ఆయన విమానాశ్రయానికి ఆయన రాలేదు.

ఫొటో సోర్స్, @USBPChief
కాంగ్రెస్, అకాలీదళ్ ఏమన్నాయి?
అమెరికా నుంచి వచ్చిన విమానం దిల్లీలో లేదా మరెక్కడైనా ల్యాండ్ చేయవచ్చు, ప్రతిసారీ అమృత్‌సర్‌లో మాత్రమే ఎందుకు? అని కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ కేంద్ర ప్రభుత్వాన్ని పశ్నించారు.
''ఈ విమానాలను పంజాబ్‌లో ఎందుకు దింపుతున్నారు? ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అమెరికాకు వెళ్లే ప్రతి అక్రమ వలసదారు పంజాబ్‌కు చెందిన వారే అని చెప్పాలనుకుంటున్నారా? ఈ విషయంలో పంజాబ్ ముఖ్యమంత్రి వాదన కరెక్ట్'' అని మనీష్ తివారీ అన్నారు.
"మొదటి విమానంలో గుజరాత్, హరియాణాలకు చెందిన వారున్నారు. ఆ విమానాన్ని దిల్లీలో లేదా వేరే చోట ల్యాండ్ చేసి ఉండవచ్చు కదా?" అని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు.
"వెనక్కు వస్తున్న వారు మనుషులే, నేరస్థులు కాదు. ఆర్థిక మార్గాలను వెతుక్కుంటూ అక్కడికి వెళ్లారు. వారు అక్రమంగా అమెరికా వెళ్లడం వేరే విషయం. ముందు అసలు వారిని వెనక్కి పంపేందుకు సరైన పద్దతి పాటించారా? రెండోది.. ప్రధాని మోదీ అమెరికా వెళ్లినప్పుడు దీని గురించి మాట్లాడారా? మూడోది.. భారత పౌరులను అమెరికా తీసుకొచ్చిన విధానం, వారితో వ్యవహరించిన తీరు భారత ప్రభుత్వానికి సమ్మతమేనా?'' అని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు, పంజాబ్ మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ నాయకుడు గుల్జార్ సింగ్ రాణికే కూడా భగవంత్ మాన్ వ్యాఖ్యలకు మద్దతు పలికారు. పంజాబ్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతీసారి కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నించడం పంజాబ్ దౌర్భాగ్యమని గుల్జార్ సింగ్ అన్నారు.
పంజాబ్ సరిహద్దు రాష్ట్రమని, ముఖ్యంగా సరిహద్దుకు సమీపంలో ఉన్న అమృత్‌సర్ జిల్లాలో విమానం దింపడమనేది.. పంజాబ్ పరువు తీయడంతో పాటు, పంజాబీలను మాత్రమే అక్రమ వలసదారులుగా చూపించే కుట్ర అని ఆయన ఆరోపించారు.
అమృత్‌సర్ నుంచి అంతర్జాతీయ విమానాలు ప్రారంభించాలని చాలారోజులుగా డిమాండ్ చేస్తున్నా కేంద్రం అనుమతించడం లేదని, ఇప్పుడు మాత్రం మా పరువు తీసేలా విదేశీ విమానాలను అమృత్‌సర్‌లో దింపుతున్నారని గుల్జార్ సింగ్ అభిప్రాయపడ్డారు.
గుజరాత్, హరియాణా లేదా మరే ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనైనా విమానాలు దిగవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. పంజాబ్ మాత్రమే కాకుండా చాలా రాష్ట్రాల నుంచి ప్రజలు అమెరికా వెళ్లారని గుల్జార్‌సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ ఏమని బదులిచ్చింది?
అమెరికా నుంచి బహిష్కరణకు గురై భారత్‌కు వస్తున్న వారిలో ఎక్కువ మంది పంజాబ్‌కు చెందిన వారే ఉన్నారని పంజాబ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి అనిల్ సరీన్ తెలిపారు.
ఇంతకుముందు 100 మందితో వచ్చిన విమానంలో 33 మంది పంజాబ్ వారున్నారని, శనివారం 119 మందితో వచ్చే విమానంలో 66 మంది పంజాబ్‌కు చెందిన వారున్నారని అంతకు ముందు ఆయన చెప్పారు.
పంజాబీలను అక్రమ మార్గంలో అమెరికా పంపిన ట్రావెల్ ఏజెంట్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పంజాబ్ ప్రభుత్వం స్పష్టంచేయాలని అనిల్ సరీన్ డిమాండ్ చేశారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ మాట్లాడుతూ "యుఎస్ నుంచి బహిష్కరణకు గురైన పంజాబీలు రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న నకిలీ ఏజెంట్లు, మోసగాళ్ల బాధితులు. యువత రాష్ట్రాన్ని ఎందుకు విడిచిపెడుతున్నారో భగవంత్ మాన్ సమాధానం చెప్పాలి?" అని అన్నారు.
పంజాబ్ ప్రజలు రాష్ట్రాన్ని వదిలి అక్రమ మార్గాల్లో విదేశాలకు ఎందుకు వెళ్తున్నారో ముఖ్యమంత్రి వివరించాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి రన్ చుగ్ డిమాండ్ చేశారు.
యువత తమ భూములు, ఇళ్లు అమ్ముకోవాల్సి వస్తోందని.. యువత జీవితాలను నాశనం చేస్తున్న నిందితులను పట్టుకోకుండా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాజకీయం చేస్తున్నారని రన్ చుగ్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో మోదీ ఏం చెప్పారు?
అమెరికా పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్త విలేఖరుల సమావేశం నిర్వహించారు. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను తిరిగి పంపించడంపై మోదీ స్పందించారు.
అక్రమ వలసదారుల విషయంలో ఇరువురి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయని, ఎవరైనా భారతీయులు అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నట్లు నిర్ధరణ అయితే, వారిని తిరిగి భారత్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు.
కొందరిని మానవ అక్రమ రవాణాదారులు తీసుకెళ్తున్నారని, అమెరికాకు తీసుకు వెళ్లారనే విషయం కూడా వారికి తెలియదని చెప్పారు మోదీ.
"వీరు చాలా సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు. వారు పెద్ద కలలు కంటారు. వారికి అక్రమ రవాణాదారులు పెద్ద వాగ్దానాలు చేస్తారు" అని ప్రధాని అన్నారు.
అలాంటి యువతను కాపాడేందుకు మానవ అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందన్నారు మోదీ.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














