ఎలాన్ మస్క్: పిల్లలను ఎందుకు వెంట తిప్పుకుంటున్నారు?

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొడుకును భుజాల మీద ఎక్కించుకుని ఆడిస్తున్న ఎలాన్ మస్క్

ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో మస్క్ పిల్లలు కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మస్క్ పిల్లలతో మోదీ ముచ్చటిస్తుండడం, ఆ పిల్లలు నేల మీద కూర్చుని ఆడుకుంటుండడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చాలామంది పిల్లలు చూడలేని ప్రదేశాలకు కూడా తన పిల్లలను తీసుకెళ్తుంటారు మస్క్.

విదేశీ నేతలతో సమావేశాల దగ్గరి నుంచి, స్పేస్ ఎక్స్ లాంచ్ కంట్రోల్ రూమ్ వరకు, మస్క్ పిల్లలు తండ్రికి సంబంధించిన పలు వ్యాపార వ్యవహారాలు, రాజకీయ కార్యక్రమాలలో కనిపిస్తున్నారు.

కొత్తగా ఏర్పడిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ విభాగానికి ఎలాన్ మస్క్‌ను అధినేతగా డోనల్డ్ ట్రంప్ నియమించినప్పటినుంచి అమెరికా రాజధానిలో జరుగుతున్న పలు రాజకీయ కార్యక్రమాల్లో మస్క్ పిల్లలు తరచూ ప్రత్యక్షమవుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ కార్యక్రమాలకు మస్క్ తన పిల్లలను వెంట తెచ్చుకోవడం చర్చనీయాంశమయింది.

మోదీ, మస్క్ సమావేశంలో కనిపించిన పిల్లలు

టెక్నాలజీ, ఆవిష్కరణలపై మస్క్, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య జరిగిన సమావేశంలోనూ మస్క్ పిల్లలు కనిపించారు. మస్క్ నాలుగేళ్ల కొడుకు లిల్ ఎక్స్, అతని తోబుట్టువులిద్దరు మోదీతో బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.

వాషింగ్టన్‌కు రాకముందు కూడా మస్క్ తన పిల్లలతో తరచూ కనిపించారు. తుర్కియే అధ్యక్షునితో సమావేశంలోనూ, 2021లో టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్‌’గా మస్క్ ఎంపికయినప్పుడు జరిగిన అవార్డుల కార్యక్రమంలోనూ వారు పాల్గొన్నారు.

మస్క్ కుటుంబం, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీతో సమావేశంలో మస్క్ పిల్లలు కనిపించారు.

పిల్లలను తీసుకురావడం వెనక రాజకీయ ఉద్దేశాలున్నాయా?

పిల్లలతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రజలు తమను మానవతా దృక్పథంతో చూసేలా చేయడం రాజకీయ నాయకుల ఉద్దేశమని అమెరికన్ యూనివర్సిటీలో పబ్లిక్ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ కుర్ట్ బ్రాడ్‌డాక్ చెప్పారు.

స్కూలుకు వెళ్లే వయసు కూడా లేని పిల్లలను ఓవల్ ఆఫీసుకు తీసుకురావాలన్న మస్క్ నిర్ణయం సరికాదని బ్రాడ్‌డాక్ అభిప్రాయపడ్డారు.

30 నిమిషాల ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మస్క్ కొడుకు ఎక్స్ బోర్‌గా ఫీలయినట్టు కనిపించింది. దీంతో అతను తండ్రిని అనుకరిస్తూ సందడి చేశాడు. నేల మీద కూర్చొన్న పిల్లాడివైపు చూసి అక్కడున్న నేతలు కొందరు అతన్ని నవ్వించే ప్రయత్నం చేశారు. ఒక సందర్భంలో ఆ పిల్లాడు ‘ష్ మాట్లాడవద్దు ’ అంటూ సైగ చేశాడు.

మస్క్, ట్రంప్‌లిద్దరూ ఇలా కావాలనే చేసినట్టు తనకు అనిపిస్తోందని, ఇందులో వారిద్దరికీ ఏదో ప్రయోజనం ఉండి ఉంటుందని బ్రాడ్‌డాక్ అన్నారు.

ఇదంతా కొన్ని విషయాలపై అందరి దృష్టి మళ్లించి, ఇతర విషయాలను ఆకర్షించేలా చేసే వ్యూహంలో భాగమని ఆయన అన్నారు.

మోదీ, మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మస్క్ పిల్లలతో మాట్లాడుతున్న మోదీ

పిల్లలు ఇలా బయటకు రావొచ్చా?

మస్క్ పిల్లలు తరచుగా బయట కనిపిస్తండడం, వైరల్ అవుతుండడం వెనక ట్రంప్‌కు ఏదో ప్రయోజనం ఉందని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న జాన్ హాబర్ అన్నారు. ఆయన ఐదు అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు పనిచేశారు. హార్వర్డ్‌లో పాఠాలు బోధిస్తారు.

‘‘ఎంత గందరగోళంగా ఉంటే కొన్ని విషయాలపై అందరి దృష్టి అంతగా తగ్గిపోతుందని ట్రంప్ భావిస్తారు'' అని హాబర్ చెప్పారు.

మస్క్ మాజీ గర్ల్‌ఫ్రెండ్, ఎక్స్ తల్లి గ్రైమ్స్, ఓవల్ కార్యాలయంలో తన కొడుకు కనిపించడంపై విమర్శలు చేశారు.

''వాడు ఇలా ప్రజల మధ్యకు రాకూడదు. అయితే వాడి ప్రవర్తన బాగుండటం నాకు సంతోషాన్నిచ్చింది'' అని ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు.

తన కొడుకు అందరి దృష్టిలో పడటం తనకు నచ్చదని 2022లో వానిటీ ఫెయిర్ ఆర్టికల్‌లో ఆమె చెప్పారు.

''కుటుంబంలో ఏం జరిగినప్పటికీ పిల్లలు బయటకు రాకూడదని నేను అనుకుంటా. ఎక్స్‌ను ఎలాన్ ప్రతిసారీ బయటకు తీసుకొస్తున్నారు. ఎందుకో అర్ధం కాదు'' అని ఆమె అన్నారు.

ట్రంప్, మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తన తండ్రి అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడుతుండగా, ఆడుకుంటున్న మస్క్ కొడుకు

గతంలోనూ మస్క్ పిల్లలను వెంట తీసుకొచ్చేవారా?

రాజకీయాల్లోకి రావడానికి చాలాకాలం ముందు మస్క్ తన పిల్లలను వెంట తీసుకొచ్చేవారు.

దశాబ్దకాలం కిందట, ఆయన తన కెరీర్ నిర్మించుకుంటున్న సమయంలో ఎలక్ట్రిక్ వాహనం టెస్లా అందరిదృష్టిని ఆకర్షించేలా ప్రయత్నిస్తున్న సమయంలో మస్క్ పిల్లలు, ఆయనతో కనిపించడం సహజమే అనిపించేది.

2015లో సిలికాన్ వ్యాలీలోని టెస్లా బిల్డింగ్‌లో జరిగిన ఒక ఆవిష్కరణ కార్యక్రమం కోసం విశ్లేషకులు, రిపోర్టర్లు అక్కడ వేచి చూస్తుండగా...మస్క్ ఐదుగురు పిల్లలు పెద్దగా నవ్వుకుంటూ, ఒకరినొకరు పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ పరుగులు తీశారు.

అతిథుల కోసం గంటలపాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ మస్క్ పిల్లలు తమ ఆటపాటలతో అక్కడ ఆహ్లాదం కలిగించారు.

మస్క్, మోదీ

ఫొటో సోర్స్, Getty/X

ఫొటో క్యాప్షన్, మస్క్‌కు పన్నెండు మంది పిల్లలున్నారు.

మస్క్‌కు ఎంతమంది పిల్లలు?

ముగ్గురు మహిళలతో మస్క్‌కు 12 మంది పిల్లలున్నారు. వారి పేర్లు కూడా చిత్రంగా ఉంటాయి.

లిల్ ఎక్స్ అని పిలిచే ఎక్స్ ఏఈఏ-12 అనే పేరున్న మస్క్ కొడుకుకు అందరికన్నా బాగా గుర్తింపు ఉంది. ట్విట్టర్‌కు కొత్త పేరు పెట్టేటప్పుడు అదే పేరును మస్క్ ఎంచుకున్నారు.

భావోద్వేగపరంగా తనకు ఎంతో తోడుగా ఉండే అబ్బాయి అంటూ మస్క్ ఆ నాలుగేళ్ల బాలుడి గురించి చెప్పారు.

పిల్లల విషయంలో మస్క్ చాలా అంకితభావంతో ఉంటారని, వాళ్లకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారని రచయిత వాల్టర్ ఇసాక్‌సన్ చెప్పారు. ఆయన మస్క్ జీవిత చరిత్ర రచయిత. ‘ద డైరీ ఆఫ్ ఎ సీఈవో పాడ్‌కాస్ట్‌’ లో ఈ విషయం తెలిపారు.

''పిల్లలు, ప్రియురాళ్లు, భార్యలు...ఇలా ఆయన తనకు సంబంధించినవారిపై చాలా ప్రేమ చూపిస్తారు.'' అని మస్క్ జీవిత చరిత్ర రాసిన ఇసాక్‌సన్ అన్నారు.

‘‘తన పిల్లలు ఎప్పుడూ తన చుట్టూ ఉండాలని మస్క్ అనుకుంటుంటారు. ఎవరో ఒకరు పక్కనుండాలని కోరుకుంటారు. ఏ సందడీ లేకుండా ఉండటం ఆయనకు ఇష్టం ఉండదు'' అని ఇసాక్‌సన్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)