ప్రధాని మోదీ కులంపై వివాదమేమిటి.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు ఆగ్రహిస్తోంది?

ఫొటో సోర్స్, https://x.com/revanth_anumula
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రధాని నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.
''నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదు. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. పుట్టుకతో ఉన్నత కులం. కానీ, 2001లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కులాన్ని బీసీ కులాల్లో కలుపుకొన్నారు'' అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం(ఫిబ్రవరి 14, 2025) ఓ సభలో మాట్లాడుతూ అన్నారు.
ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. నరేంద్ర మోదీ కులంపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి.


ఫొటో సోర్స్, Congress/X
నరేంద్ర మోదీ కులంపై గతంలోనూ వివాదం
నరేంద్ర మోదీ కులం గురించి నిరుడు ఫిబ్రవరిలోనూ పెద్ద దుమారం చెలరేగింది.
నిరుడు ఫిబ్రవరిలో న్యాయ్‌యాత్ర సమమంలో రాయ్‌పుర్‌లో జరిగిన ఓ సభలో నరేంద్ర మోదీ కుల ప్రస్తావన తీసుకువచ్చారు రాహుల్ గాంధీ.
''ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీ కుటుంబంలో పుట్టలేదు. ఆయన పుట్టిన మోద్ ఘాంచి కులానికి గుజరాత్‌లో 2000 సంవత్సరంలోనే ఓబీసీ హోదా దక్కింది. నరేంద్ర మోదీ జనరల్ కులానికి చెందినవారు'' అని ఆరోపించారు రాహుల్ గాంధీ.
అప్పట్లో ఈ విషయంపై బీజేపీతోపాటు జాతీయ బీసీ కులాల కమిషన్ కూడా వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి.

ఫొటో సోర్స్, Reuters
అసలు మోదీది ఏ కులం?
గుజరాత్‌లోని వాద్ నగర్ ప్రాంతంలో 1950 సెప్టెంబరు 17న నరేంద్ర మోదీ జన్మించారు.
ఆయనది అక్కడి 'మోద్ ఘాంచి' అనే కులం. ఈ కులాన్ని 1999లో ఓబీసీ జాబితాలో చేర్చింది కేంద్ర ప్రభుత్వం.
మోదీ పుట్టినప్పుడు ఆయన కులం జనరల్(ఓసీ) జాబితాలోనే ఉన్నట్టుగా చెప్పారు రాజకీయ, సామాజిక విశ్లేషకులు మెరుగుమాల నాంచారయ్య.
''నరేంద్ర మోదీ పుట్టినప్పుడు మోద్ ఘాంచి కులం గుజరాత్‌లో ఓసీ కేటగిరీలోనే ఉంది. అలాగని ఆ కులమేమీ ఉన్నతాదాయవర్గాలకు చెందినదని భావించడానికి లేదు'' అని చెప్పారు.
మండల్ కమిషన్ సిఫారసు మేరకు మోద్ ఘాంచి కులాన్ని గుజరాత్ ప్రభుత్వం ఓబీసీల జాబితాలో చేర్చిందని జాతీయ బీసీ కులాల కమిషన్ గత ఏడాది ప్రకటించింది.
''మండల్ జాబితా 91(ఎ)లో మోద్ ఘాంచి కులం ఉంది. 1994 జూలై 25న ఓబీసీ కులాల జాబితాలో మోద్ ఘాంచి కులాన్ని చేర్చుతూ గుజరాత్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని జాతీయ బీసీ కులాల కమిషన్ వెల్లడించింది'' అని పీఐబీ గత ఏడాది ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే మోద్ ఘాంచి కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చినప్పుడు గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, చబిల్ దాస్ మెహతా ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఫొటో సోర్స్, ani
మోద్ ఘాంచి కులాన్ని కేంద్రం ఓబీసీలో ఎప్పుడు చేర్చిందంటే...
గుజరాత్ ప్రభుత్వం చేసిన సిఫార్సు మేరకు మోద్ ఘాంచి కులాన్ని సెంట్రల్ ఓబీసీ జాబితాలో చేర్చాలని 1997 నవంబరు 15న జాతీయ బీసీ కులాల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
ఆ తర్వాత జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ వెబ్ సైట్ ప్రకారం అక్టోబరు 27, 1999లో అదర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్(ఓబీసీ) జాబితాలో చేర్చుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది భారత ప్రభుత్వం.
''గుజరాత్ రాష్ట్రంలో మోద్ ఘాంచి సహా 104 కులాలు ఓబీసీ జాబితాలో ఉన్నాయి'' అని నిరుడు జారీ చేసిన ఓ ప్రకటనలోనూ స్పష్టం చేసింది జాతీయ బీసీ కులాల కమిషన్.
మోద్ ఘాంచి కులాన్ని గుజరాత్ ఓబీసీ జాబితాలో చేర్చినప్పుడు గానీ, సెంట్రల్ జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చినప్పుడు గానీ నరేంద్ర మోదీ ఎలాంటి శాసన లేదా కార్యానిర్వాహక పదవిలో లేరని కమిషన్ స్పష్టం చేసింది.
ఇదే విషయమై గత ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల తర్వాత కూడా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు.
''మోద్ ఘాంచి కులాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఓబీసీ జాబితాలో చేర్చే నాటికి నరేంద్ర మోదీ ఏ ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయలేదు. ఆయన ఆర్గనైజేషన్ కోసం పనిచేసేవారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీనే గుజరాత్‌లో అధికారంలో ఉంది'' అని చెప్పారు అమిత్ షా.
''కేంద్ర ప్రభుత్వం 1999లో మోద్ ఘాంచి కులాన్ని సెంట్రల్ ఓబీసీ జాబితాలో పేర్కొన్నప్పుడు కూడా నరేంద్ర మోదీ ఎంపీగా గానీ, ఎమ్మెల్యే గానీ, కనీసం సర్పంచిగా కూడా లేరు.
ఆ తర్వాత రెండేళ్లకు ఆయన 2001లో గుజరాత్ సీఎం అయ్యారు'' అని అమిత్ షా తెలిపారు.
అయితే, ఆ సమయంలో కేంద్రంలో అటల్ బిహారి వాజ్‌పేయీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

ఫొటో సోర్స్, Telangana CMO
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి చర్చ
తాజాగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌తో మరోసారి వివాదం తెరపైకి వచ్చింది.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు మెరుగుమాల నాంచారయ్య బీబీసీతో మాట్లాడారు.
''ఇది పాత వివాదమే. నరేంద్ర మోదీ కులం గురించి గతంలోనూ వివాదాలు నడిచాయి.
ఆయన సీఎం కాకముందే ఆయన కులాన్ని కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేర్చింది. గతంలో బీజేపీ పలు సందర్భాల్లో దీనిపై స్పష్టత ఇచ్చింది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, https://www.facebook.com/
కులగణన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల గణన చేపట్టింది.
ఇందులో బీసీల జనాభా తగ్గిందని వివాదం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ కూడా కాంగ్రెస్ చేపట్టిన కుల గణనపై విమర్శలు చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని ఉద్దేశించిన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
''ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవగాహనారాహిత్యంతో కూడుకున్నవి. ప్రధానమంత్రి బీసీనా.. కాదా..? అనే అంశంపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నా.'' అని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కులగణన అంశంలో దొర్లిన తప్పుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్ రెడ్డి కావాలని ప్రధాని మోదీ కులంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.
''నరేంద్ర మోదీ కులంపై గతంలోనే ఒక స్పష్టత ఉంది. మోదీ గుజరాత్ సీఎం కాకముందే ఆయన కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ నేతలతో పాటు మాయావతి విమర్శలు
నరేంద్ర మోదీ కులంపై గతంలోనూ చాలాసార్లు వివాదాలు నడిచాయి. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ తెరపైకి వచ్చాక గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కూడా నరేంద్ర మోదీ కులంపై ఆరోపణలు చేసింది.
''నరేంద్ర మోదీ బీసీ కులంలో పుట్టలేదు. ఆయన వైశ్య కుటుంబంలో పుట్టారు. మోద్ బ్రాహ్మణ, మోద్ బనియా కులాల తరహాలోనే ధనిక వర్గానికి చెందిన కులం కావడంతో నరేంద్ర మోదీ పుట్టిన ఘాంచి కులానికి ముందు మోద్ జత చేశారు.'' అని నాటి గుజరాత్ ప్రతిపక్షత నేత శక్తిసిన్హ్ గోహిల్ ఆరోపించారు.
''ప్రధాని మోదీ వెనుకబడిన కులంలో పుట్టలేదు. ఆయన బూటకపు బీసీ. నరేంద్ర మోదీ కులం మొదట్లో అగ్రవర్ణం. ఆయన గుజరాత్‌కు సీఎం అయిన తరువాత ఎన్నికల్లో లబ్ధి పొందటానికి తన కులాన్ని ఓబీసీల జాబితాలో చేర్చారు'' అని యూపీ మాజీ సీఎం మాయావతి 2019లో ఆరోపించారు.
మాయావతి విమర్శలపై ప్రధాని మోదీ కూడా అప్పట్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో స్పందించారు.
''మాయావతిగారూ.. నాది అత్యంత వెనుకబడ్డ కులం. నేను నకిలీ ఓబీసీని కానే కాదు. నన్ను కుల రాజకీయాల్లోకి లాగవద్దని విపక్షాలను కోరుకుంటున్నాను'' అని మోదీ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














