‘‘నరేంద్ర మోదీ బూటకపు బీసీ.. ఆయనది అగ్రవర్ణం’’: మాయావతి - ‘‘నాది అత్యంత వెనకబడ్డ కులం’’: మోదీ... ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బూటకపు బీసీ అని, ఆయన అగ్రవర్ణానికి చెందినవారని బీఎస్పీ చీఫ్ మాయావతి వ్యాఖ్యానించినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో పేర్కొంది. అయితే.. తనది అత్యంత వెనుకబడ్డ కులమని మోదీ జవాబు ఇచ్చినట్లు మరో కథనంలో తెలిపింది.
ఆ కథనాల ప్రకారం.. ''ప్రధాని మోదీ వెనుకబడిన కులంలో పుట్టలేదు. ఆయన బూటకపు బీసీ. నరేంద్ర మోదీ కులం మొదట్లో అగ్రవర్ణం. ఆయన గుజరాత్‌కు సీఎం అయిన తరువాత ఎన్నికల్లో లబ్ధి పొందటానికి తన కులాన్ని ఓబీసీల జాబితాలో చేర్చారు'' అని మాయావతి శనివారం లఖ్‌నవూలో విలేకరుల సమావేశంలో వివరించారు.
విపక్షాలు (ఎస్పీ-బీఎస్పీలు) తనను నీచుడని, నిమ్నజాతి అని అభివర్ణించాయని మోదీ చేసిన ఆరోపణలను మాయావతి తోసిపుచ్చారు. ''మేమెన్నడూ ఆయనను నీచ్ అని అనలేదు. పైపెచ్చు అగ్రవర్ణానికి చెందినవారని గౌరవంగా మాట్లాడాం'' అని చెప్పారు.
''మోదీయే కావాలని లేనిపోనివి మాకు ఆపాదించి కులరాజకీయాలు చేస్తున్నారు'' అని ఆమె పేర్కొన్నారు. ఇకనైనా కులరాజకీయాలు ఆపండని ఆమె ప్రధానిని ఉద్దేశించి అన్నారు.
మాయావతి విమర్శలపై ప్రధాని మోదీ యూపీలోని పలు ప్రచార సభల్లో స్పందిస్తూ.. ''మాయావతిగారూ.. నాది అత్యంత వెనుకబడ్డ కులం. నేను నకిలీ ఓబీసీని కానే కాదు. నన్ను కుల రాజకీయాల్లోకి లాగవద్దని విపక్షాలను కోరుకుంటున్నాను'' అని పేర్కొన్నారు.
ఎస్పీ-బీఎస్పీలు ఎల్లపుడూ చేసేది కుల స్మరణేనని మోదీ విమర్శించారు. ''వారు చేసేది కులజపం.. దోచుకునేది ప్రజాధనం. అదో అవకాశవాద కూటమి'' అని ఎద్దేవా చేశారు.
''అసలు అంబేడ్కర్ పేరును నిత్యం స్మరించే మాయావతి ఆయన జీవితం నుంచి నేర్చుకున్నదేమిటి? ఆమె దృష్టంతా ఎప్పుడూ కుర్చీ పైనే! అంబేడ్కర్ ఆశయ సాధనకు ఆమె ఎప్పుడైనా ప్రయత్నించారా? అంబేడ్కర్‌ను వ్యతిరేకించేవారితో ఆమె దోస్తీ కట్టారు'' అని మోదీ వ్యాఖ్యానించారు.

జస్టిస్ నూతి రామ్మోహనరావు కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు
మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు కుమారుడు వశిష్టపై వరకట్న వేధింపుల కేసు నమోదైందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. వశిష్ట భార్య సింధుశర్మ ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని సీసీఎస్ మహిళా పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. జస్టిస్ నూతి రామ్మోహనరావు, ఆయన భార్య జయలక్ష్మి పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
పెళ్లైనప్పటి నుంచి తన భర్త, అత్తమామలు అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నారని, తరచూ కొట్టేవారని సింధు కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వశిష్ట, సింధులకు మహిళా పోలీస్ ఠాణా అధికారులు రెండుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం మరోసారి ఇద్దరినీ పిలిపించారు. ఈసారి కూడా ఏకాభిప్రాయం కుదరలేదు.
ఆరు రోజుల క్రితం దారుణంగా చిత్రహింసలు పెట్టారంటూ సింధు పోలీసులకు తన శరీరంపై ఉన్న గాయాలను చూపించడంతో వశిష్ట, అతడి తల్లిదండ్రులపై ఐపీసీ 498-ఎ, 406, 323 సెక్షన్లతో పాటు వరకట్న వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ మంజుల తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ నెల 20న వశిష్ట, అతడి తల్లిదండ్రులు తీవ్రంగా కొడితే సింధు జూబ్లీహిల్స్ అపొలో ఆసుపత్రిలో చేరిందంటూ ఆమె సన్నిహితులు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు విడుదల చేశారు.
శనివారం రాత్రి మహిళా పోలీస్ ఠాణా వద్ద సింధు విలేకరులతో మాట్లాడుతూ ‘‘నన్ను చిత్రహింసలు పెట్టి, పిల్లలిద్దరినీ నా నుంచి లాక్కున్నారు. వారిద్దరినీ నాకు ఇప్పించాలని పోలీసులను కోరుతున్నా. ఒక పాప ఇంకా పాలు తాగుతోంది’’ అని చెప్పారు.
‘‘నాకు పెళ్లై ఏడేళ్లయ్యింది. పెళ్లైన కొద్దినెలలకే ఇంట్లో చిత్రహింసలు మొదలయ్యాయి. మా అత్త ఆదేశాల మేరకు నా భర్త వశిష్ట కొట్టేవారు. వైవాహిక బంధం తెగుతుందన్న భావనతో భరించాను. దీన్ని అలుసుగా తీసుకుని మరింతగా హింసలు పెడుతున్నారు. ఈ నెల 20న నాభర్త, అత్తమామలు ముగ్గురూ కొట్టారు. వారే అపొలో ఆసుపత్రిలో చేర్పించారు. నన్ను పిచ్చిదానిగా ప్రచారం చేస్తున్నారు’’ అని ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
జాన్సన్ బేబీ షాంపూల్ని అమ్మొద్దు: రాష్ట్రాలకు బాలల హక్కుల కమిషన్ ఆదేశం
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్).. జాన్సన్ బేబీ షాంపూ విక్రయాల్ని ఆపేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించిందని, దుకాణాల నుంచి వాటి నిల్వలను తొలగించాలని చీఫ్ సెక్రటరీలకు లేఖ రాసిందని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. జాన్సన్ బేబీ షాంపూ నమూనాల్ని ల్యాబ్‌లో పరీక్షించగా, ప్రామాణిక నాణ్యత లేదని తేలినట్లు బాలల హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. జైపూర్‌లోని డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీ ఈ మేరకు ధ్రువీకరించిందని ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల నుంచి జాన్సన్ బేబీ షాంపూ, టాల్కమ్ పౌడర్ నమూనాల్ని సేకరించామని, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌తో పాటు జార్ఖండ్ (తూర్పు), రాజస్థాన్ (పశ్చిమ), మధ్యప్రదేశ్ (సెంట్రల్), అస్సోం (ఈశాన్య)ల నుంచి ఈ నమూనాల్ని తీసుకున్నామని వివరించింది.
ఈ క్రమంలోనే రాజస్థాన్ ల్యాబ్ టెస్ట్‌లో షాంపూ నాణ్యత లోపాలు వెలుగు చూశాయన్నది. మిగతా రాష్ట్రాల్లోని ల్యాబ్‌ల నుంచి పరీక్షా ఫలితాలు రావాల్సి ఉందని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశామని వెల్లడించింది.
జాన్సన్ టాల్కమ్ పౌడర్ టెస్టుల్నీ త్వరగా ఇవ్వాలని రాజస్థాన్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్‌ను కోరినట్లు ఎన్‌సీపీసీఆర్ చెప్పింది. క్యాన్సర్ కారకాలు, ఇతరత్రా హానికర అవశేషాలున్నాయన్న వార్తల నేపథ్యంలోనే ఈ పరీక్షల్ని నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








