తెలంగాణ: మళ్లీ కులగణన ఎందుకు, ప్రభుత్వం ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో మరోసారి కులగణన చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈసారి మొన్నటిలా సిబ్బంది ఇంటింటికీ రారు.
మొన్న జరిగిన సర్వేలో పాల్గొనని వారు తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఈ రీసర్వే ద్వారా అధికారులు కల్పిస్తున్నారు. అయితే ఇలా ప్రభుత్వం రెండోసారి అవకాశం ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి.
తెలంగాణ కులగణన సర్వే పూర్తయ్యాక వివాదాలు పెరిగాయి. ముఖ్యంగా బీసీల సంఖ్య 2014 కంటే బాగా తగ్గడంతో బీసీ సంఘాలు, పార్టీల్లోని బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిపై ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. మరోసారి సర్వేలో పేర్లు నమోదు చేసుకునేందుకు ఎవరూ ఊహించని విధంగా వెసులుబాటు కల్పించింది.


ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్ ద్వారానూ..
''రాష్ట్రంలో మూడు శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు. వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరోసారి అవకాశం కల్పిస్తున్నాం. కేసీఆర్, కేటీఆర్ వంటి వారు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వలేదు. మరికొందరు అందుబాటులో లేకుండా పోయారు’’ అని చెప్పారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
‘‘వివరాల నమోదుకు టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే అధికారులే ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి వివరాలన్నీ నమోదు చేసుకుంటారు. లేదా మండల కార్యాలయాల్లో ప్రజా పాలన అధికారులు ఈ పది రోజులు అందుబాటులో ఉంటారు. అక్కడ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాల నమోదుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది'' అని తెలిపారు విక్రమార్క.
అయితే ఇది ప్రభుత్వం వైఫల్యం అంటోంది బీఆర్ఎస్.
''ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుల గణనపై తమ వైఫల్యాన్ని ఒప్పుకున్నారు. 200 కోట్ల రూపాయలు ఖర్చుచేసి చేయించిన సర్వేతో 2 కోట్ల మంది బడుగు బలహీన వర్గాలను అవమానించారు. భట్టి మాటలతో ప్రభుత్వ వైఫల్యం బహిర్గతమైంది. నిపుణుల మాటలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. సర్వేను సరిగా చేయడం చేతకాని ప్రభుత్వం మంచి పాలన ఎలా అందిస్తుంది?'' అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద.

ఫొటో సోర్స్, Getty Images
కూడికలు,తీసివేతల సర్వే
మరో అవకాశం ఇవ్వడం కాదు... మొత్తంగా రీసర్వే చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
''కులాల జనాభాను తక్కువ చేసి చూపించారు. కూడికలు తీసివేతలతో సర్వే ను కుట్ర పూరితంగా మార్చారు. మళ్ళీ నాలుగు పేజీలు సర్వేలో జోడించి మమ అనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో ఆగ్రహాన్ని చూసే రాహుల్ గాంధీ వరంగల్ టూర్ రద్దు చేసుకున్నారు'' అని వ్యాఖ్యానించారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద.
అయితే మరోసారి మొత్తం సర్వే చేయాలనే డిమాండును డిప్యూటీ సీఎం విక్రమార్క సమర్థించలేదు.
''రాష్ట్రంలో కులగణన విజయవంతం అయితే దేశమంతటా చేయాల్సి వస్తుందని అనుకునేవారు రీ సర్వే కోసం డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో లక్ష మందికి పైగా సిబ్బందితో పూర్తి శాస్త్రీయంగా సమగ్ర ఇంటింటి సర్వే జరిగింది'' అన్నారు భట్టి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














