ఆంధ్రప్రదేశ్: 'మా ఊరు మాకొద్దు' అని ఆ గ్రామస్థులు ఎందుకు అంటున్నారు?

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పులికాట్ సరస్సు
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లో పులికాట్ సరస్సు మధ్యలో ఇరకం దీవి
    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''ఈ దీవిలో మేం ఉండలేం.. మమ్మల్ని ఇక్కడి నంచి తీసుకుపోయి వేరే చోట ఇళ్ళ స్థలాలు ఇప్పించండి..'' అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఇరకం దీవి వాసులు.

ఆంధ్ర ప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లో పులికాట్ సరస్సు మధ్యలో సుమారు 2వేలమంది ప్రజలు నివసించే ఇరకం దీవిని బీబీసీ సందర్శించింది.

''మరో పాతికేళ్లలో ఈ ఊరు మొత్తం ఖాళీ అయిపోతుంది. పెద్దవారు చనిపోతారు. పిల్లలు వెళ్లిపోయారు. కొత్తగా ఎవరూ రారు.'' అని గ్రామానికి చెందిన కందస్వామి చెప్పారు.

ఈ గ్రామం నుంచి చదువుకునే పిల్లలు బడికి వెళ్లాలంటే కిలోమీటరు పైన నడచి, మరో 7 కిలోమీటర్లు పైగా సరస్సులో పడవ ప్రయాణం చేసి అంటే దాదాపు 50 నిమిషాలకు పైగా బోటులో ప్రయాణం చేసి, తిరిగి కొంత దూరం నడవాలి.

వాన వచ్చినా, తుపాను పట్టినా వారు బడికి వెళ్లలేరు. బడిలో అదనపు తరగతుల్ని ఏర్పాటు చేసినా హాజరు కావడానికి అవకాశం లేదు.

బోటు దగ్గరకు వెళ్లడం ఆలస్యం అయితే ఇంటికి వెళ్లలేరు కాబట్టి, బడిలో చివరి పీరియడ్ వినకుండానే ఇంటికి వెళ్లిపోతారు ఈ ఊరి పిల్లలు..

''బోటు ప్రయాణం వల్ల అదనపు క్లాసులు వినలేం. పదో తరగతి స్పెషల్ క్లాసులు మిస్ అవుతున్నాం. మా ఊరిలోనే ఇంటర్ చదువుకునేందుకు కాలేజ్, అధ్యాపకులు ఉంటే బావుంటుంది.'' అని విద్యార్థిని మోనిష బీబీసీతో చెప్పారు.

మోనిష ఇరకం దీవిలోని ఇరకం గ్రామం నుంచి తమిళనాడులో అరంబాక్కం వెళ్లి చదువుకుంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పులికాట్ సరస్సు
ఫొటో క్యాప్షన్, ఇరకం దీవికి సరైన రోడ్డు సదుపాయం లేదు.

బడి పిల్లలే కాదు, పెద్దలదీ అదే సమస్య. ఊళ్లోఉపాధి లేదు. ఏ సౌకర్యం అందాలన్నా, పని దొరకాలన్నా, పనులు కావాలన్నా వారు గంటసేపు పడవ ప్రయాణం చేయాలి. ఆ ఊరి నుంచి బయటకు వెళ్లాలన్నా, లోపలికి రావాలన్నా పడవ తప్ప మరో మార్గం లేదు.

వంట సరుకులు, గ్యాస్ సిలెండర్లు నుంచి మొదలు ట్రాక్టర్లు, వరికోసే మెషీన్ల వరకూ ఏదైనా పడవ మీద రావాల్సిందే.

ఆ పడవ ప్రయాణం కూడా అంత తేలిక కాదు. దారిలో బోటు మోటార్ ఆగిపోతే మరో పడవ వచ్చే వరకూ గంటల తరబడి, కనుచూపు మేరలో నీరు తప్ప భూమి కనపడనంత నీటి మధ్యలో ఎదురు చూడాల్సిందే.

''ఇక్కడ బడి ఉంది. కానీ ఉపాధ్యాయులు ఎవరూ ఇక్కడ ఉండటానికి ఇష్టపడరు. బదిలీపై వచ్చినా ఎక్కువ కాలం ఉండకుండా వెళ్లిపోతారు. దీనికి ఒకటే పరిష్కారం. మేమంతా ఈ దీవి ఖాళీ చేసి వేరే ఊరు వెళ్లడమే.'' అని బీబీసీతో చెప్పారు ఇరకం గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్ గుణ.

తమకు తడ దగ్గర పూడి కుప్పంలో ఇళ్ళ స్థలాలు ఇస్తామన్నారని, కోర్టు కేసుల్లో అది ఆగిందని గుణ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పులికాట్ సరస్సు

ఇరకం దీవిలో రెండు ఊళ్ళు ఉన్నాయి. ప్రధాన ఇరకం గ్రామంలో మొదలియార్లు, దళితులు, యానాదులు ఉంటారు.

అదే పంచాయితీ పరిధిలోని పాళెంతోపు కుప్పం గ్రామంలో మత్స్యకారులు ఉంటారు. ఈ దీవి ఆంధ్రలో ఉన్నప్పటికీ వీరందరి మాతృభాష తమిళం.

ఇరకం గ్రామస్థులు వ్యవసాయంపైన, పాళెంతోపు కుప్పం గ్రామస్థులు చేపలవేటపైనా ప్రధానంగా ఆధారపడతారు.

2018లో ఈ గ్రామాన్ని బీబీసీ సందర్శించింది. అప్పట్లో ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఇలానే బోటులో ప్రయాణించే వారు.

కాలక్రమంలో బోటులో ప్రయాణించే పిల్లల సంఖ్య తగ్గింది. దానికి కారణం అప్పటి నుంచీ జనం తమ గ్రామాన్ని వదిలివెళ్లడమే..

''ప్రసవానికి మహిళను తీసుకువెళ్తుంటే ఈ రేవులో ఒకరికి, సరస్సు మధ్యలో పడవలో మరొకరికి ప్రసవం అయిపోయింది.'' అని బీబీసీతో చెప్పారు గ్రామ సర్పంచ్ గుణ.

''మా తరం అయిపోయింది. పిల్లలు చదువుకోవాలి కదా? ఒకప్పుడు కరెంటు లేని రోజుల్లో ఇక్కడ బతికారు. ఇప్పుడు ఇక్కడ ఉండలేని పరిస్థితి. ఇక్కడ ఆదాయం లేదు. బయటకు వెళ్లే మార్గమూ లేదు. ఎవరు వచ్చినా వారానికి మించి ఉండలేరు ఇక్కడ'' అన్నారు గుణ

ప్రస్తుతం ఆ గ్రామంలో రెండు బడులు ఉన్నాయి. అంగన్ వాడీ కేంద్రం కూడా ఉంది. ఒక బడి పూర్తిగా మూతబడి ఉంది. ఉపాధ్యాయులు లేకపోవడమే అందుకు కారణం.

మరో బడిలో పది మంది పిల్లలు కూడా చదవడం లేదు. ఆ బడిలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయుడు పడవలో వచ్చి వెళతారు.

పడవ సమయాల ప్రకారం ఆయన ఆ బడిలో పాఠాలు చెప్పేది రెండు గంటల కంటే మించడం లేదు.

దీంతో పిల్లలకు చదువు సరిగా రాదని అక్కడకు పంపడం లేదు తల్లిదండ్రులు.

చిత్రంగా ఈ రెండో బడిని స్వతంత్రానికి ముందే నిర్మించారు.

వందేళ్ల కిందటే బడికి పక్కా భవనం ఉన్న ఊరిలో, ఇప్పుడు ఉపాధ్యాయులు లేక బోసిపోవడం విచిత్రం.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పులికాట్ సరస్సు
ఫొటో క్యాప్షన్, ఊరి నుంచి బయటకు వెళ్లాలన్నా, బయట నుంచి ఊరికి రావాలన్నా గంట సేపు పడవలో ప్రయాణించాలి.

ఈ గ్రామం నుంచి సుమారు 130 మందికి పైగా పిల్లలు రోజూ ఇలా పడవలోనే ప్రయాణం చేసి బడికి వెళతారు.

వారిలో కొందరు భీములపాళెంలోని ఆంధ్ర ప్రభుత్వ పాఠశాలలో, మరికొందరు సున్నాంబళకుళంలోని తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో, మరికొందరు ప్రైవేటు బడుల్లో చదువుతున్నారు.

కొన్నేళ్ళుగా ఈ గ్రామస్థులు ఊరిని ఖాళీ చేస్తూ వస్తున్నారు. సంపన్న కుటుంబాల వారు నగరాలకు తరలిపోయారు.

మిగిలిన వారు తడ మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లిపోయారు.

అవకాశం ఉన్న వారు పిల్లలను తమిళనాడు, ఆంధ్రలోని హాస్టళ్లల్లో, బంధువుల ఇళ్ళల్లో పెట్టి చదివిస్తున్నారు.

అవకాశం లేని వారు తామే స్వయంగా ఊరు వదిలి తడ పరిసరాల్లో అద్దెకు ఉంటూ పిల్లలను చదివిస్తున్నారు.

''మాకు రోడ్డు లేదు. ఇక్కడ బడి లేదు. అందుకే పిల్లల చదువు కోసం నేను ఈ దీవి వదిలేసి భీములవారి పాళెంలో ఉంటున్నాను. నాలా చాలామంది పిల్లల చదువుల కోసం ఆ దీవి వదలి అద్దె ఇళ్లకు వచ్చేస్తున్నారు. మాకు ఇక్కడే (తడ దగ్గర్లో) స్థలం ఇప్పిస్తే ఊరు మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోతాం. ఇక్కడ వ్యవసాయ పనులు కూడా లేవు. వరి కోతల కోసం మిషన్ వచ్చింది. వంద రోజుల పని పది రోజులు కూడా ఉండడం లేదు. అందుకే అందరూ బయటకు వెళ్తున్నారు.'' అని బీబీసీతో చెప్పారు కాటయ్య అనే గ్రామస్థుడు.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పులికాట్ సరస్సు
ఫొటో క్యాప్షన్, ఊరిని వదిలేసి పట్టణాల్లో స్థిరపడుతున్న ఇరకం దీవి వాసులు.

అయితే గ్రామంలో వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల వారి మాట కాస్త భిన్నంగా ఉంటుంది.

వారంతా ఇప్పటికిప్పుడు గ్రామాలను వదిలి వెళ్లాలని కోరుకోవడం లేదు.

అదే సందర్భంలో వారి పిల్లలు ఎవరూ ఆ గ్రామంలో ఉండడమూ లేదు.

''మరో పాతికేళ్లలో ఈ ఊరు మొత్తం ఖాళీ అయిపోతుంది. పెద్ద వారు చనిపోతారు. పిల్లలు వెళ్లిపోయారు. కొత్తగా ఎవరూ రారు.'' అన్నారు గ్రామానికి చెందిన కందస్వామి. ఆయన మాటలు ఈ ఊరి పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

''మాకు రవాణా సౌకర్యం కావాలి. అదే ముఖ్యం. వేనాడుకు మాకు మధ్య వంతెన వేసి, రోడ్డు వేయాలి. కంకర రోడ్డు అయినా పర్లేదు. కానీ పక్షుల అభయారణ్యం ఉందని అటవీ శాఖ వంతెనకు ఒప్పుకోవడం లేదు. ఇస్రోకు అభ్యంతరం లేకపోతే రోడ్డు వేసుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. రవాణా సౌకర్యం ఉంటేనే ఈ ఊరికి భవిష్యత్తు.'' అని బీబీసీతో చెప్పారు కందస్వామి.

ఈ ఊరిలో ప్రస్తుతం ఒక చిన్న ఆరోగ్య కేంద్రం ఉంది. ఆ నర్సు ప్రాథమిక ఆరోగ్య సహాయం అందిస్తోంది. అంత వరకూ ఇబ్బంది లేదు.

కానీ పెద్ద జబ్బులకు చికిత్స కోసం వారు పడవెక్కాల్సిందే.

''ఈ దీవికి ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. అక్కడ పాఠశాల భవనాలు ఉన్నాయి కానీ నిరంతరం బోధన జరగలేదు. ఆ విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోటు ఇచ్చింది. ఇటీవలే దానికి మరమ్మత్తులు కూడా ప్రభుత్వం తరపున చేయించాము. వారు తమకు తడ దగ్గర్లో భూమి కావాలని అడిగారు. ఆ ప్రక్రియ జరుగుతోంది. ఈలోపు మెరుగైన బోటు, రవాణా ఏర్పాట్లు అందేలా చేస్తాం. అలాగే మత్స్యాకారులు, రైతుల ఆదాయం పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం.'' అని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)