మతిమరుపు కలిగించే బ్యాక్టీరియా మన నోట్లోనే ఉందా?

మెదడు పనితీరుపై నోటిలోని బ్యాక్టీరియా ప్రభావం
ఫొటో క్యాప్షన్, మతిభ్రమించే ప్రమాదం పెరగడానికి, నోటిలోని బ్యాక్టీరియాకు సంబంధం ఉండొచ్చని నిపుణులు చెప్పారు.
    • రచయిత, అన్నా వర్లే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మన నోటిలో ఉండే కొన్నిరకాల బ్యాక్టీరియాలకు వయసు పెరిగే కొద్దీ మన మెదడు పనితీరులో వచ్చే మార్పులకు సంబంధముందని నిపుణులు చెబుతున్నారు.

యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్ నేతృత్వంలో ఓ అధ్యయనం జరిగింది. జ్ఞాపకశక్తికి, ఏకాగ్రతకు కొన్ని రకాల బ్యాక్టీరియాలతో సంబంధముందని, అలాగే మెదడు పనితీరు సక్రమంగా లేకపోవడం, అల్జీమర్స్ లాంటి వ్యాధులు కొన్నిరకాల బ్యాక్టీరియాతో ముడిపడి ఉన్నాయని ఆ అధ్యయనంలో తేలింది.

''మీకు సమస్యలు మొదలవడం, లేదంటే డాక్టరు దగ్గరికి వెళ్లి వ్యాధి గుర్తించడానికంటే ముందే మీరు అల్జీమర్స్ బారిన పడుతున్న విషయాన్ని అంచనావేయగలం'' అని అధ్యయానికి నేతృత్వం వహించినవారిలో ఒకరైన డాక్టర్ జొయన్నా ఎల్ హ్యూరెక్స్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మెదడు పనితీరుపై నోటిలోని బ్యాక్టీరియా ప్రభావం
ఫొటో క్యాప్షన్, 50ఏళ్ల వయసున్న 100మందికిపైగా వాలంటీర్లపై అధ్యయనం జరిపారు.

మతిభ్రమణాన్ని నివారించవచ్చా?

''ఈ పరిశోధన ప్రస్తుతం ప్రారంభదశలోనే ఉంది. అయితే నైట్రేట్ ఎక్కువగా ఉండే ఆకుకూరల లాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మంచి బ్యాక్టీరియా వృద్ధిచెంది మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా అనే విషయాన్ని అధ్యయనం చేస్తున్నాం'' అని ఆయన తెలిపారు.

''మా పరిశోధన అంతరార్థం లోతైనది'' అని సహ రచయిత ప్రొఫెసర్ అన్నే కార్బెట్ అన్నారు.

''కొన్నిరకాల బ్యాక్టీరియాలు మెరుగైన మెదడు పనితీరుకు దోహదపడుతుంటే, మరికొన్ని మెదడు పనితీరు క్షీణించేలా చేస్తుంటే... నోటిలోని బ్యాక్టీరియాలను సమతుల్యం చేసే చికిత్స ద్వారా మతిమరుపును నివారించడానికి ఆస్కారం ఉంటుంది’’ అని కార్బెట్ చెప్పారు.

''ఆహారంలో మార్పులు, ప్రో బయోటిక్స్, నోటి పరిశుభ్రత లేదా ఇతర చికిత్స ద్వారా కూడా ఇది చేయవచ్చు'' అని ఆమె తెలిపారు.

మెదడు పనితీరుపై నోటిలోని బ్యాక్టీరియా ప్రభావం
ఫొటో క్యాప్షన్, నోటిని శుభ్రం చేసే శాంపిళ్లను విశ్లేషించారు.

‘ఆకు కూరలు ఎక్కువగా తినాలి’

50ఏళ్లకు పైబడిన వయసున్న 115మందిపై ఈ అధ్యయనం జరిపారు. మరో ప్రాజెక్టు కోసం వారు ఇప్పటికే జ్ఞాపకశక్తి పరీక్షలు చేయించుకున్నారు.

పరిశోధకులు ఆ 115 మందిని రెండు గ్రూపులుగా విడదీశారు. మెదడు పనితీరు మందగించడం వంటి సమస్యలేమీ లేనివారు ఒక గ్రూపు కాగా, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు తక్కువగా ఉన్నవారు మరో గ్రూపు.

నోటిని శుభ్రం చేసే నమూనాలను రెండు గ్రూపుల్లో పాల్గొన్నవారు పంపారు. వాటిని విశ్లేషించి, బ్యాక్టీరియాపై అధ్యయనం జరిపారు.

''నైషేరియా, హీమఫిలస్ అనే బ్యాక్టీరియా గ్రూపులు ఉన్నవారికి జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంది. ఏకాగ్రత, ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తిచేసే సామర్థ్యం ఉంది'' అని యూనివర్శిటీ తెలిపింది.

జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్న వారిలో పొర్ఫిరొమోనాస్ అనే బ్యాక్టీరియా ఎక్కువ స్థాయిలో ఉందని డాక్టర్ ఎల్ హ్యూరెక్స్ చెప్పారు.

అల్జీమర్స్ బారిన పడే ప్రమాదం ఉన్నవారిలో తక్కువ నైట్రేట్ ఉంటుందని, దీనికి బ్యాక్టీరియా గ్రూప్ ప్రివొటెల్లాకు సంబంధముందని ఆమె తెలిపారు.

''మీరు బీట్‌రూట్, బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలు, సలాడ్లు వంటివి తినాలి. అలాగే ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన షుగర్‌తో ఉండే పదార్థాలు తక్కువ తీసుకోవాలని చెబుతాం'' అని హ్యూరెక్స్ తెలిపారు.

ఆకుకూరల్లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.

''భవిష్యత్తులో, మేం సాధారణ పరీక్షల్లో భాగంగా నోటి నమూనాలను సేకరించి, వాటిని విశ్లేషించడం ద్వారా ఎవరైనా ప్రమాదంలో ఉంటే వారికి సూచన ఇవ్వొచ్చు'' అని యూనివర్శిటీ పరిశోధన విభాగం అసోసియేట్ ప్రో- వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అన్ని వాన్‌హటాలో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)