దక్షిణాఫ్రికా: 'గే ఇమామ్' హత్యకు కారణమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తొడా ఒపేమి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలో మొట్టమొదటి గే ఇమామ్‌గా చెప్పే ముహ్సిన్ హెండ్రిక్స్ దక్షిణాఫ్రికాలో హత్యకు గురయ్యారు.
57 ఏళ్ల హెండ్రిక్స్ కేప్‌టౌన్‌లోని ఓ మసీదులో పనిచేస్తారు. స్వలింగ సంపర్కులు, అణగారిన ముస్లింలకు ఈ మసీదు సురక్షితమైన స్థలంగా భావిస్తారు.
దక్షిణ ఆఫ్రికాలోని గెబెర్హా నగరం సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారుపై శనివారం ఉదయం మెరుపుదాడి జరిగింది.
''ముఖాలకు ముసుగు వేసుకున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తమ వాహనం నుంచి దిగి హెండ్రిక్స్ ప్రయాణిస్తున్న వాహనంపై అనేకమార్లు కాల్పులు జరిపారు'' అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
హెండ్రిక్స్ మరణ వార్త ఎల్‌జీబీటీక్యూ+ కమ్యూనిటీతో పాటు అందరినీ షాక్‌కు గురిచేసింది. హెండ్రిక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు.

ఆ పెళ్లే హత్యకు కారణమా?
''ఇది విద్వేష హత్య అని మేం భయపడుతున్నాం. అధికారులు విస్తృత దర్యాప్తు చేయాలి'' అని ఇంటర్నేషనల్ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ అండ్ ఇంటర్‌సెక్స్ అసోసియేషన్ (ఐఎల్‌జీఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జూలియా ఎర్ట్ కోరారు.
''తమ ఆలోచనలకు తగ్గట్టుగా ముందుకు వెళ్లడానికి దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేకమందికి ఆయన మద్దతుగా నిలిచారు. మార్గదర్శకత్వం వహించారు. సమాజం సంఘీభావంతో ఉంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయనేదానికి ఆయన జీవితం ఒక నిదర్శనం'' అని జూలియా అన్నారు.
ఒక లెస్బియన్ వివాహాన్ని జరిపించిన తర్వాత హెండ్రిక్స్ హత్యకు గురయ్యారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇది అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఫొటో సోర్స్, AFP
సెక్యూరిటీ ఫుటేజ్‌లో దాడికి సంబంధించిన వీడియోలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హెండ్రిక్స్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ కారు బ్లాక్ చేసింది. ఆ సమయంలో ఇమామ్ వెనక సీట్లో కూర్చుని ఉన్నారని పోలీసులు చెప్పారు.
రోడ్డుకు ఒక వైపు నుంచి ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది. ఒక వ్యక్తి కారు నుంచి దూకారు. తాము చుట్టుముట్టిన వాహనం వైపు పరుగులు తీశారు. వెనక కారు కిటికీలోంచి పలుమార్లు కాల్పులు జరిపారు.
శనివారం ఉదయం ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిలో హెండ్రిక్స్ చనిపోయారని హెండ్రిక్స్ అల్-గుర్బాహ్ ఫౌండేషన్ చెప్పింది. కేప్‌టౌన్ శివార్లలోని వైన్‌బర్గ్‌లో మస్జిదుల్ గుర్బాహ్ మసీదును ఈ ఫౌండేషన్ నిర్వహిస్తోంది.
సహనంతో ఉండాలని, హెండ్రిక్స్ కుటుంబాన్ని రక్షించడం ముఖ్యమన్న విషయం గుర్తుపెట్టుకోవాలని ఫౌండేషన్ బోర్డు అధ్యక్షుడు అబ్దుల్‌ముఘీత్ పీటర్సన్ వాట్సాప్ గ్రూప్‌లో తమ అనుచరులకు విజ్ఞప్తి చేశారు.
ఇస్లాం సంప్రదాయ విధానాలను సవాలు చేసిన హెండ్రిక్స్ మతంలోని జాలి, నమ్మకం వంటివాటిని సమర్థించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆఫ్రికా దేశం
లైంగిక విధానాల వల్ల వివక్షకు గురయ్యే ప్రజలకు రక్షణగా నిలిచిన మొదటి ఆఫ్రికా దేశం దక్షిణాఫ్రికా.
వర్ణవివక్ష అనంతరం ఏర్పాటయిన రాజ్యాంగం 2006లో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసింది. ఈ హక్కు కల్పించిన మొదటి ఆఫ్రికా దేశం దక్షిణాఫ్రికానే.
ఎల్‌జీబీటీ కమ్యూనిటీ పెరుగుతున్నప్పటికీ స్వలింగ సంపర్కులు ఇప్పటికీ వివక్ష ఎదుర్కొంటున్నారు. వారిపై హింస జరుగుతోంది. ప్రపంచంలో ఎక్కువ హత్యలు నమోదవుతున్న దేశం కూడా దక్షిణాఫ్రికానే.
హెండ్రిక్స్ గే అన్న విషయం 1996లో ప్రపంచానికి తెలిసింది. కేప్ టౌన్‌తో పాటు ఇతరప్రాంతాల్లోని ముస్లింలను ఇది షాక్‌కు గురిచేసింది.
అదే సంవత్సరం, ఆయన ది ఇన్నర్ సర్కిల్ అనే సంస్థను స్థాపించారు. తమ లైంగిక విధానాలు, విశ్వాసాలపై సంఘీభావం కోరుకునే ముస్లింలకు ఈ సంస్థ మద్దతుగా నిలిచేది. తర్వాత ఆయన మస్జిదుల్ గుర్బాహ్ మసీదును నెలకొల్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నిజాయితీగా ఉండాల్సిన అవసరం గొప్పది
2022లో ఆయనపై ‘ది రాడికల్’ అనే డాక్యుమెంటరీ రూపొందింది. ''చావు భయం కంటే నిజాయితీగా ఉండాల్సిన అవసరం గొప్పది'' అని తనకు వస్తున్న బెదిరింపుల గురించి ఆ డాక్యుమెంటరీలో హెండ్రిక్స్ మాట్లాడారు.
మతాంతర చర్చలు, ఎల్‌జీబీటీక్యూ+ వ్యక్తులు తమ మతపరమైన కమ్యూనిటీల్లో ఎదుర్కునే ఇబ్బందులు, మానసిక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం గురించి హెండ్రిక్స్ తరచూ మాట్లాడేవారు.
‘మతాన్ని శత్రువుగా చూడడం ఆపేయాలి, ఇది ముఖ్యమైన విషయం’ అని గత సంవత్సరం కేప్ టౌన్‌లో జరిగిన ఇల్గా వరల్డ్ కాన్ఫరెన్స్‌లో ఆయనన్నారు.
‘హెండ్రిక్స్ మరణంతో హృదయం బద్దలైంది’ అని గే అయిన మంత్రి రెవరెండ్ జైడ్ మెకాలే అన్నారు.
బ్రిటిష్-నైజీరియన్ ఎల్‌జీబీటీక్యూ హక్యుల కార్యకర్త అయిన ఈయన హౌస్ ఆఫ్ రెయిన్‌బో అనే సంస్థను నడుపుతున్నారు. ఇది నైజీరియాలో స్వలింగ సంపర్కులకు మద్దతుగా నిలుస్తుంది.
''నేను ఒక క్వీర్ ఇమామ్'' అని చెప్పడం ద్వారా హెండ్రిక్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని నైజీరియాకు చెందిన గే ముస్లిం సాధిక్ లవాల్ బీబీసీతో చెప్పారు.
"ఆఫ్రికాలో, ముఖ్యంగా మతోన్మాదం ఉండే నైజీరియాలో చాలా మంది క్వీర్ ముస్లింలకు హెండ్రిక్స్ ఒక మెంటార్'' అని ఆయనన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














