ఆంధ్రప్రదేశ్‌: జీబీ సిండ్రోమ్‌తో మహిళ మృతి, ఈ వ్యాధి అసలు ఎందుకు వస్తుంది?

గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల
ఫొటో క్యాప్షన్, జీబీఎస్ బారినపడిన ఐదుగురు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

మహారాష్ట్రలో కలకలం సృష్టించిన గీయాన్ -బరే సిండ్రోమ్ (జీబీఎస్) ఆంధ్రప్రదేశ్‌లోనూ తీవ్రంగా కనిపిస్తోంది. ఈ వ్యాధితో ఆంధ్రప్రదేశ్‌లో తొలి మరణం నమోదైంది.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) లో ప్రకాశం జిల్లా అలసందల పల్లికి చెందిన కమలమ్మ (45) ఈ వ్యాధితో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి బీబీసీకి తెలిపారు.

మూడు రోజుల కిందట తీవ్రమైన జ్వరంతో కాళ్లు చచ్చుబడిపోయి ఆసుపత్రికి వచ్చిన కమలమ్మకు జీబీ సిండ్రోమ్‌ ఉన్నట్లు గుర్తించి వెంటిలేటర్‌పై చికిత్స అందించామని డాక్టర్ రమణ యశస్వి చెప్పారు. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందిందన్నారు.

జాన్ అనే మరొక మహిళ కూడా వెంటిలేటర్ పై చికిత్స పొందుతోందనీ, అయితే ఆమె పరిస్థితి బాగానే ఉందని రమణ యశస్వి చెప్పారు. ఇదే వ్యాధి లక్షణాలతో మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరినప్పటికీ కోలుకొని ఆదివారంనాడు డిశ్చార్జ్ అయ్యారని వివరించారు.

జీబీ సిండ్రోమ్ మృతి కేసు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే ప్రధమమని డాక్టర్ రమణ యశస్వి తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, Getty Images

‘బర్డ్‌ఫ్లూతో సంబంధం లేదు’

జీబీ సిండ్రోమ్‌ అనేది అంటు వ్యాధి కాదు.. వంశపారం పర్యంగా కూడా రాదని,, ప్రజలు ఈ విషయం అవగాహన చేసుకోవాలని జీజీహెచ్‌ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సుందరాచారి తెలిపారు. ఈ వ్యాధికి బర్డ్‌ ఫ్లూతో సంబంధం లేదు.. జీబీఎస్‌ కేసులు ప్రతి నెలా వస్తూనే ఉంటాయి. 95 శాతం రికవరీ అవుతారని చెప్పారు.

ఎలా వస్తుంది?

ఇన్ఫెక్షన్స్‌. డయేరియా, గ్యాస్ట్రో ఎంట్రైసిటీస్‌. జలుబు దగ్గు, ఇన్‌ఫ్లుయెంజా వల్ల ఈ ప్రమాదం ఉంటుంది.

ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

  • ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి.
  • వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం.
  • శుభ్రమైన నీరు తాగాలి.
  • పోషకాహారం తీసుకోవాలి.

ఎలాంటి లక్షణాలుంటాయి?

నరాలు ఒక్కసారిగా చచ్చుబడిపోవడం లేదంటే.. ఒకొక్కటిగా పనిచేయకపోవడం.. కండరాల బలహీనతతో తీవ్రమోతాదులో పక్షవాతం వస్తుంది. ఈ సమస్య చేతులు, కాళ్లల్లో జలదరింపు లేదా తిమ్మిరితో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత కండరాల బలహీనతతో కీళ్లను కదిలించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ లక్షణాలు రెండు నుంచి నాలుగు వారాలలో తీవ్రమవుతాయి.

డాక్టర్ విజయ లలిత
ఫొటో క్యాప్షన్, జీబీఎస్ రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తుందని డాక్టర్ పి. విజయ లలిత చెప్పారు.

జాగ్రత్తలు

ఈ వైరస్‌ రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి మనిషిని బలహీన పరుస్తుంది. చివరికి కండరాల బలహీనతతో పక్షవాతం వస్తుందని గుంటూరుకి చెందిన డాక్టర్‌ పి. విజయ లలిత బీబీసీతో చెప్పారు.

ఒక్కోసారి చేతులు, కాళ్లు చచ్చుబడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయని వివరించారు.

చిన్నపిల్లలకు కూడా ఈ వ్యాధి రావచ్చనీ, కానీ త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయని అన్నారు.

''ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ ఇది.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లు, వైరల్‌ ఇన్‌ఫెకన్లు ఎక్కువగా సోకే ప్రమాదం ఉన్న వారు,. గతంలో ఏవైనా వైరస్‌ జబ్బులు బారినపడి కోలుకున్న వారికి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. వైరల్‌ ఫీవర్‌ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.. చిన్న పిల్లలు, వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. బలహీనంగా ఉండేవారిపై త్వరగా ప్రభావం చూపిస్తుంది.'' అని ఆమె తెలిపారు.

కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని డాక్టర్‌ సుందరాచారి కూడా సూచించారు

మహారాష్ట్రలో మొదలు

గీయాన్ -బరే సిండ్రోమ్ (జీబీఎస్‌) కేసులు ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర పుణేలో వెలుగుచూశాయి.

ఒక్క వారం వ్యవధిలోనే అక్కడ వందల కేసులు నమోదయ్యాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)