మోదీపై క్యారికేచర్: వికటన్ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేశారా?

అన్నామలై, వికటన్ మ్యాగజైన్

ఫొటో సోర్స్, Annamalai/Vikatan

ఫొటో క్యాప్షన్, ‘వికటన్ మ్యాగజైన్’పై అన్నామలై ఫిర్యాదుచేశారు.
    • రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రముఖ తమిళ మీడియా సంస్థల్లో ఒకటైన వికటన్ గ్రూప్ వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

వికటన్ గ్రూప్ వెబ్‌సైట్, వికటన్.కామ్‌ శనివారం రాత్రి నుంచి చాలా మంది పాఠకులకు ఓపెన్ కాలేదు. వికటన్ యాప్ కూడా చాలా ఫోన్లలో పనిచేయలేదు.

ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ కొన్ని రోజుల క్రితం వికటన్ ప్రచురించిన ఓ కార్టూన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై శనివారం (ఫిబ్రవరి 15) కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆ సాయంత్రం నుంచే సైట్ ఓపెన్ కావడంలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి నోటీసు అందలేదని వికటన్ గ్రూప్ తెలిపింది.

అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ గురించి ఇలాంటి కార్టూన్ ప్రచురించడం సరైనది కాదని, ఇది శిక్షించాల్సిన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి అన్నారు.

ఇంతకీ వికటన్ గ్రూప్ ఎలాంటి కారికేచర్ ప్రచురించింది? వికటన్ గ్రూప్ దీనిపై ఏం చెబుతోంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అన్నామలై ఏమని ఫిర్యాదు చేశారు?

వికటన్ గ్రూప్ 'వికటన్ ప్లస్' అనే ఆన్‌లైన్ మ్యాగజైన్‌ను ప్రచురిస్తోంది.

ఫిబ్రవరి 10న ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై ఒక క్యారికేచర్ ప్రచురించింది.

అమెరికాలో అక్రమంగా ఉంటున్నారనే ఆరోపణలపై కొందరు భారతీయులకు సంకెళ్లు వేసి, తిరిగి భారత్‌కు పంపించడంపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ప్రస్తావించకపోవడం గురించి వ్యంగ్యంగా ఈ క్యారికేచర్ ప్రచురించింది.

ఈ క్యారికేచర్‌పై కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎల్. మురుగన్‌కు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు రంజనా ప్రకాష్ దేశాయ్‌కు అన్నామలై ఫిర్యాదులేఖ పంపారు.

వికటన్ మ్యాగజైన్ డీఎంకే‌కు ప్రచార సాధనంలా వ్యవహరిస్తోందని, ప్రధానికి వ్యతిరేకంగా నిరాధార, అవాస్తవ కథనాలను ప్రచురిస్తోందని ఫిర్యాదులో తెలిపారు.

మోదీ, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోదీపై క్యారికేచర్ ప్రచురించిన వికటన్ మ్యాగజైన్

వికటన్ మ్యాగజైన్ ఏం చెబుతోంది?

క్యారికేచర్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు శనివారం మధ్యాహ్నం అన్నామలై 'ఎక్స్'లో ప్రకటించారు. ఆ రాత్రి నుంచి చాలా చోట్ల వికటన్ వెబ్‌సైట్, యాప్ పనిచేయడం లేదు.

దీనిపై శనివారం రాత్రి వికటన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ''శతాబ్ద కాలం నుంచి భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్దతుగా వికటన్ పనిచేస్తోంది. మేమెప్పుడూ భావ ప్రకటనా స్వేచ్ఛకు అనుగుణంగానే పనిచేశాం. చేస్తూనే ఉంటాం. ఈ కవర్ పేజీ వల్ల కేంద్ర ప్రభుత్వం వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసి ఉంటే... మేమూ చట్టపరంగా ముందుకెళతాం'' అని వికటన్ మ్యాగజైన్ ఆ ప్రకటనలో తెలిపింది.

వికటన్ గ్రూప్ తమ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడానికి Anandhavikatan.com అనే కొత్త వెబ్ అడ్రస్‌ను ఆదివారం ఉదయం ప్రారంభించింది.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వికటన్ మ్యాగజైన్‌ను బ్లాక్ చేయడాన్ని స్టాలిన్ ఖండించారు

స్టాలిన్ ఖండన

వికటన్ పత్రికను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసినట్టు ప్రచారం జరుగుతుండడంతో , పలు రాజకీయ పార్టీలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి.

''శతాబ్ద కాలంగా మీడియా నిర్వహణలో ఉన్న వికటన్ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయడాన్ని నేను ఖండిస్తున్నా. అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు మీడియాను బ్లాక్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది బీజేపీ ఫాసిస్ట్ స్వభావానికి ఒక ఉదాహరణ. బ్లాక్ చేసిన వెబ్‌సైట్‌కు వెంటనే అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా'' అని స్టాలిన్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

బీజేపీ ఏం చెబుతోంది?

''ఇది దేశ వ్యతిరేక చర్య. దీంట్లో ప్రమేయమున్నవారిని శిక్షించాలి. భారత ప్రధాని అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షునిముందు, ప్రధానిని గొలుసుతో బంధించి ఉన్నట్టుగా కార్టూన్ ప్రచురించడం శిక్షించాల్సిన చర్య అనడంలో ఎలాంటి సందేహం లేదు'' అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణన్ తిరుపతి అన్నారు.

భావప్రకటనా స్వేచ్ఛ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వికటన్ మ్యాగజైన్‌ను బ్లాక్ చేయడం భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని సీనియర్ జర్నలిస్టులు చెప్పారు.

భావప్రకటనాస్వేచ్ఛకు ఇది వ్యతిరేకమా?

ఈ చర్య భావ ప్రకటనా స్వేచ్ఛకు పూర్తిగా విరుద్ధమని, దీనిని ఎదుర్కోవడానికి మొత్తం మీడియా కలిసి రావాలని సీనియర్ జర్నలిస్టు, 'ది హిందూ' గ్రూప్ డైరెక్టర్లలో ఒకరైన ఎన్. రామ్ అన్నారు.

''ఈ కార్టూన్‌ను వికటన్ ప్లస్ వెబ్‌సైట్‌లో మాత్రమే ప్రచురించారు. ఇది చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కార్టూన్ తెలియజేయాలనుకున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది. అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్టు భావిస్తున్న భారతీయులను గొలుసులతో కట్టి భారత్‌కు తీసుకురావడాన్ని ఎత్తి చూపుతూ ఈ కార్టూన్ ప్రచురించారు''

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19-1A ప్రకారం, ఇది పూర్తిగా చట్టబద్ధమైనది. భావ ప్రకటనా స్వేచ్ఛపై రాజ్యాంగం కొన్ని పరిమితులను విధించింది. ఈ కార్టూన్ ఆ పరిమితుల్లోనే ఉంది. ''ఈ ఒక్క కార్టూన్ కోసం మొత్తం వికటన్ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. దీన్ని చట్టపరంగానే ఎదుర్కోవాలి. లేకపోతే ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. వికటన్ వంటి పెద్ద కంపెనీలకే ఇది జరిగిందంటే...అందరికీ ఇది జరగవచ్చు. ఇది కొత్త రకమైన దాడి'' అని ఎన్. రామ్ అన్నారు.

వందేళ్లగా మీడియా రంగంలో ఉన్న వికటన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురయిందన్న వికటన్ మ్యాగజైన్

గతంలోనూ..

వికటన్ గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంది. ఆ సమయంలో వికటన్ ఎడిటర్‌ని అరెస్టు చేసి జైలులో పెట్టారు.

ఆనంద వికటన్ 29.03.1987 నాటి పత్రిక ముఖచిత్రంపై ఒక క్యారికేచర్ ప్రచురించారు. దాని కింద, ఎమ్మెల్యేలు, మంత్రులపై విమర్శలున్నాయి.

తమిళనాడు శాసనసభలో దీనిపై వివాదం చెలరేగింది. తర్వాతి సంచికలో వికటన్ క్షమాపణ చెప్పాలని, లేదంటే వికటన్ ఎడిటర్ శిక్ష అనుభవించాల్సివస్తుందని స్పీకర్ బీ.హెచ్.పాండియన్ హెచ్చరించారు.

క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తర్వాతి సంచికలో వికటన్ ఎడిటర్ ఎస్ బాల సుబ్రహ్మణియన్ ప్రకటించారు. ఈ విషయంపై 1987 ఏప్రిల్ 4న తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎడిటర్‌కు మూడు నెలలు కఠినమైన శిక్ష విధిస్తూ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని నిరసిస్తూ డీఎంకె, సీపీఐ, సీపీఎం, ముస్లిం లీగ్, ఫార్వర్డ్ బ్లాక్ వాకౌట్ చేశాయి.

వెంటనే పడాపాయ్ ఫామ్ హౌస్ నుంచి ఎస్. బాలసుబ్రహ్మణియన్‌ను అరెస్టు చేసి, సెంట్రల్ జైలుకు తరలించారు.

తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ విజ్ఞప్తితో స్పీకర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో జైలునుంచి బాలసుబ్రహ్మణియన్ విడుదలయ్యారు. తర్వాత తనపై చర్య తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయింగా, 1994లో కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)