మోదీ- ట్రంప్ చర్చలు: ఐదు కీలక అంశాలు ఇవే...

డోనల్డ్ ట్రంప్, నరేంద్రమోదీ, భారత్- అమెరికా సంబంధాలు, పన్నులు, రక్షణ ఒప్పందాలు, టెక్నాలజీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్, నిఖిల్ ఇనాందార్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

డోనల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా వెళ్లొచ్చారు. ఈ పర్యటన హుందాగా, ఒక వాణిజ్య వ్యవహారంగా, ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా సాగింది.

2025లో వాణిజ్య లోటును తగ్గించేందుకు భారత్‌కు ఆయుధాల అమ్మకాలు పెంచాలని, అందులో భాగంగాఎఫ్ 35 జెట్ విమానాలతో పాటు ముడి చమురు, సహజవాయువు ఎగుమతులు పెంచాలనుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

రక్షణ రంగానికి సంబంధించి వాణిజ్య ఒప్పందంపై చర్చలు, దాన్ని ఖరారు చేసేందుకు రెండు పక్షాలు అంగీకరించాయి.

2008 ముంబయి దాడుల సూత్రధారుల్లో ఒకరు, షికాగోకు చెందిన వ్యాపారి తహ్యావుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.

"నెల రోజుల వ్యవధిలోపే ఒక ప్రభుత్వం ఇన్ని పనులు చెయ్యడం చాలా గొప్ప విషయమే" అని వాషింగ్టన్‌లోని సౌత్ ఏషియా ఇన్‌‌స్టిట్యూట్‌కు చెందిన మైఖేల్ కుగెల్‌మన్ బీబీసీతో చెప్పారు.

"మొత్తంగా చూస్తే బైడెన్ పాలనా కాలంలో జరిగిన ఒప్పందాలు, ప్రత్యేకించి టెక్నాలజీ, రక్షణ రంగంలో జరిగినవి, ట్రంప్ ‌హయాంలో కొన్ని మార్పులు చేర్పులు చేసినా, వాటిని కొనసాగించేందుకు రెండు పక్షాలకు పెద్దగా ఇబ్బందులు లేవని అనుకోవచ్చు" అన్నారాయన.

అయినప్పటికీ, పెద్ద సవాళ్లు ముందున్నాయి. అవేంటో చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డోనల్డ్ ట్రంప్, నరేంద్రమోదీ, భారత్- అమెరికా సంబంధాలు, పన్నులు, రక్షణ ఒప్పందాలు, టెక్నాలజీ

ఫొటో సోర్స్, Getty Images

1) ట్రంప్ పన్నుల భారం నుంచి భారత్ తప్పించుకుందా?

అమెరికా తన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై పన్నుల భారం మోపుతోంది. దీంతో ఆయా దేశాలు కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ప్రతీకారం అన్నట్లుగా పన్నులు విధిస్తున్నాయి.

ఇలాంటి సమయంలోనే మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు.

అమెరికా వాణిజ్య భాగస్వాముల మీద విస్తృతంగా పన్నులు విధించే ప్రణాళిక రూపొందించాలని ట్రంప్ సలహాదారులను ఆదేశించారు. అవి ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.

అమెరికాకు కీలక వాణిజ్య భాగస్వామి అయిన భారత్ మీద అమెరికా పెద్దగా భారం మోపడం లేదు. ట్రంప్ పన్ను ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు వీలుగా భారత్ తన బడ్జెట్‌లో అనేక వస్తువుల మీద పన్నులను 13 శాతం నుంచి 11 శాతానికి తగ్గించింది.

భారతదేశం ప్రస్తుతానికి పన్నుల ప్రమాదాన్ని తప్పించుకున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పన్నులతో సమస్య ఉన్నట్లు కనిపించడం లేదని దిల్లీ కేంద్రంగా పని చేసే గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అన్నారు.

దీనికి ప్రధాన కారణం అమెరికా భారత్‌కు ఎగుమతి చేసే 75శాతం వస్తువుల్లో దిగుమతి సుంకాలు కట్టాల్సినవి 5 శాతం కంటే తక్కువగా ఉంటాయని ఆయన చెప్పారు.

"ఒకే సమూహంలో కొన్ని ఎంపిక చేసిన వస్తువుల మీద 150 శాతం పన్నులు విధించడాన్ని ట్రంప్ ప్రస్తావించారు. అయితే అది సబబు కాదు. ప్రతీకార పన్నుల విషయంలో భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం పెద్దగా కనిపించడం లేదు" అని శ్రీవాస్తవ బీబీసీతో చెప్పారు.

అయితే ఈ అభిప్రాయంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో సెంటర్ ఫర్ డబ్ల్యూటీవో స్టడీస్‌ మాజీ అధిపతి అభిజిత్ దాస్ ఏకీభవించడం లేదు.

"ఇది బయటకు తేలిగ్గా కనిపించవచ్చు. కానీ ఇందులో కనిపించని సమస్యలు ఉన్నాయి. భారత దేశం దిగుమతి సుంకాలకు ప్రతీకార పన్నులకు సంబంధం ఉండదు. వేరే అంశాలు కూడా వాటిని ప్రభావితం చెయ్యవచ్చు" అని ఆయన బీబీసీతో చెప్పారు.

ట్రంప్ ప్రతీకార పన్నుల వ్యవహారం కేవలం దిగుమతి సుంకాలకే పరిమితం అవుతుందని భావించలేం. విలువ ఆధారిపత పన్ను, పన్నేతర ఆటంకాలు, వాణిజ్యపరమైన ఆంక్షల్ని కూడా ఆయన వాడవచ్చు. భారతదేశంలోకి దిగుమతి అయ్యే వస్తువుల మీద ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం జీఎస్టీ విధిస్తున్నారు. ట్రంప్ భారత్ మీద ప్రతీకార పన్నులు విధించాలనుకుంటే దీన్ని ఆయుధంగా వాడుకునే అవకాశం ఉంది.

ప్రతీకార పన్నుల విషయంలో అమెరికన్ ప్రభుత్వం విడుదల చేసిన మెమో ఈ వ్యూహాన్ని వివరిస్తుంది. ప్రతీకార పన్నుల్ని విధించే విషయంలో అమెరికన్ వ్యాపార సంస్థల మీద పన్నేతర ఖర్చుల భారం, విదేశీ సంస్థలకు ఇచ్చే రాయితీలు, విదేశాల్లో అమెరికన్ వస్తువులపై భారాన్ని మోపే నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని అమెరికన్ ప్రభుత్వం చెబుతోంది.

ప్రస్తుతం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనల రక్షణలో ఉన్న ఇండియన్ ప్రొక్యూర్‌మెంట్‌ మార్కెట్‌లోకి తమకు అనుమతి ఇవ్వాలని అమెరికా ఆశిస్తుందని దాస్ చెప్పారు.

"ఇది దేశీయ ఉత్పత్తిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న భారత ప్రభుత్వ విధానానికి ఆటంకంగా మారుతుంది. మేకిన్ ఇండియా అనే ప్రభుత్వ విధానానికి నేరుగా సవాలు విసురుతుంది. ఇది మనకు ఎంత మాత్రం మంచిది కాదు" అని ఆయన అన్నారు.

ట్రంప్ ప్రతీకార పన్నుల వ్యూహాన్ని భారత్ తిప్పి కొట్టాలని దాస్ సూచిస్తున్నారు. ముఖ్యంగా, భారత్‌లో వ్యవసాయ ఉత్పత్తుల్లో విష రసాయనాలు ఉన్నాయంటూ అమెరికా వాటి మీద పన్నేతర ఆంక్షలు విధిస్తోంది.

అమెరికా తమ దేశంలో వ్యవసాయ రంగానికి భారీగా రాయితీలు ఇస్తుందని ఆయన చెబుతున్నారు. అమెరికా వాదనను తిప్పి కొట్టేందుకు భారత్ ఈ రాయితీల వ్యవహారాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలని దాస్ సూచిస్తున్నారు.

రెండు దేశాల మధ్య వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు కేవలం పన్నులు ఒక్కటే సమాధానం కాదు. రక్షణ, ఇంధన రంగంలో కొనుగోళ్లు కొంత వరకు లోటును భర్తీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

డోనల్డ్ ట్రంప్, నరేంద్రమోదీ, భారత్- అమెరికా సంబంధాలు, పన్నులు, రక్షణ ఒప్పందాలు, టెక్నాలజీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, అమెరికా నుంచి భారత్ మరిన్ని ఆయుధాలు కొనుగోలు చేయాలని ట్రంప్ ఆశిస్తున్నారు.

2) 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు భారత్ అమెరికా వాణిజ్యం

రెండు దేశాల మధ్య వాణిజ్యం 2030 నాటికి రెట్టింపు కావాలని, అది కూడా ప్రస్తుతం ఉన్న 190 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ అమెరికా లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి.

2025 జూన్- జులైలో వాణిజ్య ఒప్పందం తొలి దశపై చర్చించాలని మోదీ, ట్రంప్ భావిస్తున్నారు.

ఈ చర్చలు మార్కెట్లను అందుబాటులో ఉంచడం, పన్నుల తగ్గింపు, వస్తువులు, సేవల రంగాల్లో సరఫరా వ్యవస్థల ఏకీకరణపై చర్చలు జరగనున్నాయి.

"రెండు దేశాలు వాణిజ్య ఒప్పందాన్ని కొనసాగిస్తాయనే ప్రకటన, పన్నుల తగ్గింపు కోసం చర్చలు జరపడానికి భారతదేశానికి అవకాశం ఇస్తుంది. అది అమెరికా-భారతదేశం సంబంధానికి మాత్రమే కాకుండా, ఇటీవలి నెలల్లో గందరగోళంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు కూడా వరంలా మారుతుంది " అని కుగెల్‌మన్ అన్నారు.

అయితే రెండు దేశాలు ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకుంటాయన్న దానిపై స్పష్టత లేదు.

"ఈ వాణిజ్య ఒప్పందం ఏమిటి? ఇది పూర్తి స్థాయి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమా లేదా పరస్పర సుంకాల ఒప్పందమా?" అని శ్రీవాస్తవ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

వాణిజ్య ఒప్పందంపై వివరాలు తెలియకుండా వ్యాఖ్యానించడం సరికాదని దాస్ అభిప్రాయపడ్డారు.

"ఇది తప్పనిసరిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కాకపోవచ్చు. అదే అయితే దాని గురించి స్పష్టంగా చెప్పి ఉండేవారు. ఇది కొన్ని ఎంపిక చేసిన వస్తువుల మీద పన్నులను తగ్గించేలా ఇందులో రెండు దేశాలకు ప్రయోజనం ఉండేలా కూడా ఉండవచ్చు" అని దాస్ చెప్పారు.

సింగపూర్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ ఆసియా డీకోడెడ్‌లో ప్రధాన ఆర్థికవేత్త ప్రియాంక కిశోర్ మాట్లాడుతూ, 500 బిలియన్ల డాలర్లు "చాలా పెద్ద లక్ష్యమే కానీ ఇందులో మనకు లాభం చేకూర్చే అంశాలు తక్కువగా ఉన్నాయి" అని చెప్పారు.

"ఉదాహరణకు, రష్యన్ షాడో ఫ్లీట్‌పై అమెరికా ఆంక్షలు త్వరలో అమలులోకి రానున్నాయి, కాబట్టి భారతదేశం చమురు కోసం అమెరికా వైపు మొగ్గు చూపుతుంది. ఇది అంత కష్టం కాదు" అని ప్రియాంక తెలిపారు.

భారతదేశానికి చమురు, సహజవాయువు ఎగుమతి చేసే దేశాల్లో అమెరికా నెంబర్ వన్ అవుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.

డోనల్డ్ ట్రంప్, నరేంద్రమోదీ, భారత్- అమెరికా సంబంధాలు, పన్నులు, రక్షణ ఒప్పందాలు, టెక్నాలజీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్‌కు ఎఫ్ 35 యుద్ధ విమానాలు ఇస్తామని అమెరికా చెబుతోంది.

3) రూ. వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలు

అమెరికా- భారత్ రక్షణ వాణిజ్యం దాదాపు సున్నా నుంచి 20 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీని వల్ల అమెరికా భారత్‌కు మూడో అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా మారింది.

భారతదేశానికి ఆయుధాల సరఫరాలో రష్యా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, భారత్ అమెరికా వైపు మళ్లడంతో రష్యా వాటా 62 శాతం నుంచి 34 శాతానికి (2017-2023 మధ్య) పడిపోయింది.

రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి అమెరికా భారతదేశానికి సైనిక పరికరాల అమ్మకాలను "ఈ సంవత్సరం నుంచి అనేక బిలియన్ డాలర్లకు" పెంచుతుందని, చివరికి ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాలను అందించడానికి మార్గం సుగమం చేస్తుందని ట్రంప్ అన్నారు.

అయితే ఇది అంత సులభం కాదంటున్నారు నిపుణులు.

"ఇది బాగానే ఉంది, కానీ ఇది గుర్రం ముందు బండిని పెట్టడం లాంటిది కావచ్చు" అని కుగెల్‌మన్ అన్నారు.

భారతదేశానికి అమెరికా ఆయుధాల అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ, అధికారిక అడ్డంకులు, ఎగుమతి నియంత్రణల వంటి సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానాల బదిలీని పరిమితం చేస్తాయని ఆయన అంటున్నారు.

భారతదేశం ‘ఎఫ్-35 ఆఫర్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు’ అని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు అజయ్ శుక్లా అన్నారు.

అమెరికా ఆయుధ ఒప్పందాలు సవాళ్లతో కూడుకున్నవని శుక్లా పేర్కొన్నారు - ప్రైవేట్ సంస్థలు దీర్ఘకాలిక భాగస్వామ్యాల కంటే లాభాలకే ప్రాధాన్యత ఇస్తాయి.

రష్యాతో భారత్ ఆయుధ ఒప్పందాలు ఆలస్యం కావడం, దీని వల్ల ఖర్చులు పెరగడం అమెరికాతో భారత రక్షణ సంబంధాలు మరింతగా బలపడే అవకాశం ఉంది.

డోనల్డ్ ట్రంప్, నరేంద్రమోదీ, భారత్- అమెరికా సంబంధాలు, పన్నులు, రక్షణ ఒప్పందాలు, టెక్నాలజీ, ఎలాన్ మస్క్, టెస్లా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి నరేంద్రమోదీ ఎలాన్ మస్క్‌తో చర్చించారు.

4) ఎలాన్ మస్క్ భారతీయ ప్రణాళికలకు మోక్షమెప్పుడు?

నరేంద్రమోదీ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పుల గురించి ఆయనతో చర్చించినట్లు భారత విదేశాంగ శాఖ చెబుతోంది.

భారత్‌లో స్టార్‌లింక్ సేవల్ని ప్రారంభించాలన్న మస్క్ ప్రణాళికలు ఆగిపోవడం లేదా భారతీయ మార్కెట్‌లోకి టెస్లా ఆగమనం గురించి వారు చర్చించారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

భారతదేశంలో స్టార్‌లింక్ సేవల్ని విస్తరించేందుకు తనకు నేరుగా స్ప్రెక్ట్రమ్ కేటాయించాలని ఎలాన్ మస్క్ ఒత్తిడి చేస్తున్నారు. వేలం ద్వారా స్ప్రెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సి వస్తే ముకేశ్ అంబానీతో పోటీ పడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఎలాన్ మస్క్‌ సంస్థకు లైసెన్స్ ఇచ్చే వ్యవహారం పెండింగ్‌లో ఉంది.

టెస్లా భారతదేశంలో కార్ల తయారీ కర్మాగారాన్ని స్థాపించాలని అడుగుతోంది. మూడు సంవత్సరాల లోపు స్థానికంగా 500 మిలియన్ డాలర్ల విలువైన దేశీయ మార్కెట్‌ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వాహనాల మీద దిగుమతి సుంకాలను తగ్గించింది. అయితే టెస్లా భారత్‌లో తన ప్రణాళికల గురించి ఇంకా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.

డోనల్డ్ ట్రంప్, నరేంద్రమోదీ, భారత్- అమెరికా సంబంధాలు, పన్నులు, రక్షణ ఒప్పందాలు, టెక్నాలజీ, ఎలాన్ మస్క్, టెస్లా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ డ్రంప్‌తో కలిసి ప్రెస్ మీట్‌లో పాల్గొన్న మోదీ, రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

5) మీడియా ప్రశ్నలకు మోదీ సమాధానాలు

చాలా అరుదైన సందర్భం ఇది. ప్రధానమంత్రి మోదీ ట్రంప్‌తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఆయన రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో ఒకటి అక్రమ వలసలు. మరొకటి అదానీ గ్రూప్‌పై అమెరికన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ చేసిన లంచం ఆరోపణలకు సంబంధించినది.

భారతీయ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్రమోదీకి బాగా సన్నిహితుడనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన అమెరికాలో 250 మిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడినట్లు 2024 నవంబర్‌లో అభియోగాలు మోపారు.

ఈ అంశం గురించి తాను ట్రంప్‌తో చర్చించలేదని మోదీ చెప్పారు. వలసల విషయంలో భారత్ నుంచి అక్రమంగా అమెరికా వచ్చిన వారిని తిరిగి తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 11 ఏళ్ల కాలంలో ఆయన నేరుగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన మూడో ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. ఆయన ఎప్పుడు ఒంటరిగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించలేదు.

2019లో ఆయన నాటి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 2023లో నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నప్పుడు రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)