'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' సందర్భంగా రాష్ట్రపతి ప్రత్యేక సందేశం

ఫొటో సోర్స్, Getty Images
'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' వంటి అద్వితీయమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు బీబీసీ బృందాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు.
'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ -2024' అవార్డును ఈ రోజు (సోమవారం) రాత్రి దిల్లీలో ప్రకటించనున్నారు.
ఈ అవార్డుకు గోల్ఫర్ అదితి అశోక్, షూటర్లు మను భాకర్, అవని లేఖరా, క్రికెటర్ స్మృతి మంధాన, రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌లు నామినీలుగా ఎంపికయ్యారు.
ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టులు, రచయితలు, నిపుణులతో కూడిన జ్యూరీ ప్యానల్ 2025 జనవరిలో ఐదుగురు ప్లేయర్లను నామినీలుగా ఎంపిక చేసింది.
ఆ తరువాత విజేతలను నిర్ణయించడానికి ఆడియన్స్ ఓట్లు వేశారు.
2024లో భారత క్రీడాకారిణుల ప్రతిభ, కృషి, వారు సాధించిన విజయాలకు గుర్తుగా ఈ అవార్డును బీబీసీ అందిస్తోంది. దేశంలో మహిళలు క్రీడల్లో సాధించిన విజయాలను ఇది గౌరవిస్తుంది.
ఇవాళ రాత్రి 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు ప్రకటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విశిష్ట సందేశమేంటో చూద్దాం..

రాష్ట్రపతి సందేశం:
'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' వంటి అద్వితీయమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు యావత్ బీబీసీ బృందాన్ని నేను అభినందిస్తున్నాను.
2020 నుంచి ప్రతి ఏడాది బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును నిర్వహించడం ద్వారా క్రీడలలో మహిళల విజయాలను హైలైట్ చేయడానికి బీబీసీ తన నిబద్ధతను చాటడం నాకు సంతోషంగా ఉంది.
ఈ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన అసాధారణ అథ్లెట్లు తమ క్రీడల్లో రాణించడమే కాకుండా, యువతులు నిర్భయంగా తమ కలలను సాకారం చేసుకునేందుకు స్ఫూర్తినిచ్చారు.
మన అమ్మాయిలు, మహిళలు క్రీడా పతకాలు గెలుచుకున్నప్పుడు నేనెంతో సంతోషిస్తాను.
ప్రపంచ వేదికపై భారతీయ మహిళా క్రీడాకారులు తమదైన ముద్ర వేయడం సంతోషంగా ఉంది.
అంతర్జాతీయ ఈవెంట్లలో వారు పతకాలు సాధించినప్పుడు, జాతీయ గీతానికి అనుగుణంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్నప్పుడు, ప్రతి భారతీయుడు మనసూ గర్వంతో ఉప్పొంగుతుంది.
లింగ వివక్ష, సంప్రదాయ మూస ధోరణలను సవాల్ చేయడంలో క్రీడలు సానుకూల పాత్ర పోషిస్తాయి.

భారత మహిళలు అడ్డంకులను అధిగమించి, అంతర్జాతీయ క్రీడా వేదికలపై సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు.
కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో వారి ప్రదర్శనలు భారతదేశంలోని క్రీడా రంగంలో మహిళలు సాధించిన పురోగతిని, భారత ప్రభుత్వం నిబద్ధతను ప్రతిబింబిస్తాయి.
ఈ అసాధారణ మహిళా క్రీడాకారులు స్ఫూర్తిదాయక కథనాలను విస్తృతంగా వ్యాప్తి చేయడం చాలా ముఖ్యమైన అంశం.
ఇది అథ్లెట్ల పేరు ప్రఖ్యాతులను పెంచడానికి, భావి తరాలకు స్ఫూర్తిదాయంగా ఉండేందుకు సహాయపడుతుంది.
తల్లిదండ్రులు, పాఠశాలలు, కళాశాలలు, యజమాన్యాలు, ఇతర సంస్థలు అంతా మహిళలను, బాలికలను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని నేను కోరుతున్నాను.
ఇది కేవలం గెలుపోటములకు సంబంధించినది కాదు. ఇది మన అమ్మాయిలకు సాధికారత కల్పిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














