రాణి రాంపాల్: తినడానికి తిండిలేని స్థితి నుంచి భారత హాకీ ముఖచిత్రంగా మారిన క్రీడాకారిణి..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌరభ్ దుగ్గల్
- హోదా, బీబీసీ న్యూస్
హాకీకి రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ క్రీడాకారిణి రాణిరాంపాల్, మెంటార్‌షిప్ పాత్రకు సిద్ధమయ్యారు.
హరియాణాలోని కురుక్షేత్ర జిల్లాలోని షహబాద్‌కు చెందిన రాణి రాంపాల్ 16 ఏళ్ల కెరీర్ తర్వాత అంతర్జాతీయ హాకీ నుంచి వీడ్కోలు తీసుకున్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు తరఫున 14ఏళ్ల వయసులో తొలి మ్యాచ్ ఆడిన రాణిరాంపాల్ తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.
భారత్-జర్మనీ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ మ్యాచ్ తర్వాత న్యూదిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియంలో గురువారం జరిగిన కార్యక్రమంలో రాణి రాంపాల్ రిటైర్‌మెంట్ ప్రకటించారు. హాకీ ఇండియా ఈ కార్యక్రమం నిర్వహించింది. దీని ద్వారా అధికారిక వేడుకలో ఆటకు వీడ్కోలు పలికిన తొలి భారత మహిళా హాకీ క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది.
తానెంతగానో ఇష్టపడే హాకీ మైదానంలో రిటైర్‌మెంట్ ప్రకటించడం కన్నా ఓ క్రీడాకారిణికి కావాల్సింది ఇంకేముంటుందని ఆమె వ్యాఖ్యానించారు. రెండుసార్లు భారత్ తరఫున ఒలింపిక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రాణి 254 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు.
‘‘ఈ కార్యక్రమం నిర్వహించినందుకు హాకీ ఇండియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా హాకీ ప్రయాణంలో పూర్తి సహకారం అందించిన తల్లిదండ్రులకు, కోచ్ బల్‌దేవ్ సర్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాను. వాళ్లు లేకపోతే హాకీలో నా మనుగడ సాధ్యమయ్యేది కాదు. హాకీలో భవిష్యత్ స్టార్లకు మార్గదర్శనం చేయడంపై ఇప్పుడు దృష్టిపెడతాను’’ అని రాణి చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
రాణి కెరీర్‌లో చిరస్మరణీయ విజయాలు
రానున్న హాకీ ఇండియా లీగ్‌లో జేఎస్‌డబ్ల్యూకి చెందిన సూరమ్ హాకీ క్లబ్ తరఫున ఆడేందుకు రాణి సంతకం చేశారు. భారత్‌లో మహిళా హాకీ లీగ్ జరగడం ఇదే తొలిసారి.
‘‘క్రీడాకారిణిగా హాకీకి వీడ్కోలు పలికినప్పటికీ, కొత్త పాత్రలో హాకీతో కొనసాగుతాను...ఇది నాకు మిశ్రమ అనుభూతిని కలిగిస్తోంది’’ అని రాణి చెప్పారు. ఆమె నేతృత్వంలో ఆడిన భారత మహిళల హాకీ జట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగోస్థానంలో నిలిచింది.
‘‘ఓ క్రీడాకారిణి కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలుంటాయి. కొన్ని మనకెంతో ఆనందం కలిగిస్తాయి. మరికొన్ని మనకెప్పటికీ గుర్తుండిపోతాయి. టోక్యో ఒలింపిక్స్‌లో ప్రేక్షకులెవరూ లేకుండా ఆడడం నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. అదెప్పుడు గుర్తొచ్చినా నా కళ్లల్లో నీళ్లువస్తాయి’’ అని రాణి తెలిపారు.
2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మెరుగ్గా రాణించిన భారత మహిళల హాకీ టీమ్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై కాలేకపోయింది. ప్రస్తుతం జట్టు తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది.
‘‘ఎత్తు పల్లాలు ఆటలో భాగం. టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగోస్థానంలో నిలిచిన తర్వాత 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ టీమ్ మరింత మెరుగైన ప్రదర్శన చేస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ దురదృష్టవశాత్తూ మా టీమ్ క్వాలిఫై కాలేకపోయింది. అయితే మా టీమ్ తిరిగి పుంజుకుంటుందని నమ్మకముంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌పై దృష్టి నిలపగలరని నమ్మకముంది’’ అని రాణి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
షహబాద్ నుంచి స్టార్‌డమ్ దాకా...
రాణి తండ్రి కుటుంబపోషణ కోసం చక్రాలబండి లాగేవారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత బల్దేవ్ సింగ్ మార్గదర్శకత్వంలో షహబాద్‌లో రాణి తన కెరీర్ ప్రారంభించారు.
‘‘2002లో నేను షహబాద్‌లోని హాకీ అకాడమీలో చేరేందుకు వెళ్లినప్పుడు బల్దేవ్ సర్ తొలుత నన్ను చేర్చుకునేందుకు నిరాకరించారు’’ అని అర్జున అవార్డ్ గ్రహీత అయిన రాణిరాంపాల్ గుర్తుచేసుకున్నారు.
‘‘హాకీ నేర్చుకునేంత సామర్థ్యం నాకు లేదేమోనని భావించా. నాకు ఎప్పటికీ తలుపులు మూసుకుపోయాయనుకున్నా. కానీ చాలామంది కొత్తవారితో సర్ సాధారణంగా ఇలాగే వ్యవహరిస్తారు.కొత్తగా వచ్చిన వాళ్లకు నిజంగా ఆసక్తి ఉందా...దీర్ఘకాలంపాటు ఆడడానికి సిద్ధంగా ఉన్నారా...లేకపోతే వేసవి హాబీలా దీన్ని చూస్తున్నారా అనేది తెలుసుకోవాలని సర్ అలా పరీక్షిస్తుంటారు ’’ అని రాణి చెప్పారు.
పేద కుటుంబానికి చెందిన రాణి అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు.
‘‘ఎట్టకేలకు నేను అకాడమీలో చేరా. నాకిప్పటికీ గుర్తుంది. అప్పుడు నాకున్న అసలైన ఆందోళన మా పేదరికం.బండిలాగే వ్యక్తి కుమార్తెగా నాకు చాలా తక్కువ వనరులున్నాయి.హాకీ స్టిక్ కొనుక్కోవడం, ఆటల కోసం డబ్బులు ఖర్చుపెట్టాలన్న ఆలోచన, మరీ ముఖ్యంగా ప్రొటీన్ ఆహారం తీసుకోవడం నాకు తీరని కలగా ఉండేది. కానీ ఆ పరిస్థితుల నుంచి బల్దేవ్ సర్ నన్ను రక్షించారు’’ అని రాణి అప్పటి విషయాలను తెలియజేశారు.
2002లో షహబాద్ సెంటర్‌లో చేరిన దగ్గరినుంచి 2004వరకు రాణి సీనియర్ ప్లేయర్ ఉపయోగించిన హాకీ స్టిక్‌ను వాడేవారు .
‘‘కొంతకాలం తర్వాత నా ఆటతీరు చూసి ముచ్చటపడ్డ సర్, నాకు కొత్త బ్రాండ్ హాకీ స్టిక్ బహుమతిగా ఇచ్చారు. నా హాకీ కెరీర్‌లో అది టర్నింగ్ పాయింట్.ఆ విషయం నాకెంత ప్రోత్సాహాన్నిచ్చిందంటే...విజయం కోసం నా ఆరాటం కొన్ని రెట్లు పెరిగింది’’ అని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగిని కూడా అయిన రాణి తెలిప్పారు.
సబ్-జూనియర్ స్థాయి నుంచి, జూనియర్, సీనియర్ జాతీయ జట్లులో స్థానం సంపాదించేలా రాణి ఎదిగారు. కానీ అనేక గంటల కఠినమైన శిక్షణ, లెక్కించలేనన్ని త్యాగాలద్వారానే ఇది సాధ్యమైంది. 2013లో జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్ షిప్‌లో కాంస్యం గెలిచిన మహిళల హాకీ జట్టులో రాణి కూడా సభ్యురాలు.
2008లో బీజింగ్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌తో నేను అంతర్జాతీయ హాకీలో ప్రవేశించాను.
ఓ క్రీడాకారిణికి ఒలింపిక్స్ అంటే ఏంటనేదానిపై అప్పటికి నాకు అవగాహన లేదు.
‘‘అయితే మేం క్వాలిఫయర్స్‌లో ఓడిపోయిన తర్వాత, గుండె బద్ధలైన భావన నా సీనియర్ల ముఖంలో కనిపించింది. అది చూసిన తర్వాత మేం ఏం కోల్పోయామో నాకు అర్ధమయింది’’ అని రాణి గుర్తుచేసుకున్నారు. ‘‘అప్పుడు నేను ఒలింపిక్స్‌లో ఆడాలన్నది నా తదుపరి లక్ష్యంగా నిర్దేశించుకున్నా’’ అని తెలిపారు.
‘‘ఒలింపిక్ కల నెరవేర్చుకోడానికి రాణికి మరో ఎనిమిదేళ్ల సమయం పట్టింది. అంతకుముందు భారత మహిళల హాకీ టీమ్ ఒలింపిక్స్ ఆడింది...1980లో మాస్కోలో జరిగిన క్రీడల్లో, ఆ తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌కు భారత జట్టు అర్హత సాధించడం చాలా గొప్ప విషయం’’ అని రాణి అభిప్రాయపడ్డారు.
‘‘విజయం సాధించడాన్ని మించి ఓ కోచ్ తన శిష్యురాలి దగ్గరి నుంచి ఇంకేం కోరుకుంటాడు...భారత హాకీ టీమ్‌లో రాణి స్టార్ ప్లేయర్. మెంటార్‌గా కూడా ఆమె విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. తన కష్టపడేతత్వం, క్రమశిక్షణతో రాణి మైదానం లోపల, వెలుపల ప్రత్యేక గుర్తింపు పొందింది’’ అని షహబాద్‌కు చెందిన కోచ్ బల్దేవ్ సింగ్ చెప్పారు. ఎంతోమంది మహిళా హాకీ క్రీడాకారుల కెరీర్‌ను బల్దేవ్ సింగ్ తీర్చిదిద్దుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫిట్‌నెస్ లేని స్థాయి నుంచి...
ఫిట్‌నెస్ ప్రమాణాలు లేని కారణంగా జూనియర్ నేషనల్ క్యాంప్ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నుంచి భారత మహిళా హాకీకి ముఖచిత్రంగా మారడం దాకా రాణి రాంపాల్ చేసిన ప్రయాణం అద్భుతమైన కథకు ఏ మాత్రం తీసిపోదు. ఇది ఎందరికో స్ఫూర్తికలిగిస్తుంది. భారత్‌లో అత్యున్నత క్రీడాపురస్కారమైన ఖేల్ రత్న పొందిన తొలి మహిళా హాకీ క్రీడాకారిణి కూడా రాణి రాంపాలే.
పొట్టగడవడమే కష్టంగా ఉండే కుటుంబం రాణిది.
ఆమె స్థానంలో ఉంటే అంతర్జాతీయస్థాయిలో హాకీ ఆడాలనే కల అసాధ్యమైనదిగా చాలా మంది భావించేవారు. కానీ రాణి మాత్రం తన మార్గాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులను అవరోధంగా భావించలేదు.
ఓ గుడిసెలో నివసించడం దగ్గరనుంచి ఆధునిక సౌకర్యాలన్నీ ఉన్న రెండంతస్థుల ఇంటిని తన తల్లిదండ్రులకు బహుమతిగా ఇవ్వగలిగే స్థాయికి రాణి ఎదిగిన తీరు ఆమె పట్టుదలకు, కష్టపడేతత్వానికి నిదర్శనం.
తెల్లవారుజామున శిక్షణాతరగతులకు హాజరయ్యేందుకు ఒకప్పుడు చుక్కలను చూసి సమయాన్ని లెక్కించుకున్న రాణి దగ్గర ఇప్పుడు అత్యంత ఖరీదయిన యాపిల్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఉన్నాయి.
దశాబ్దంన్నర కాలానికి పైబడిన తన సుదీర్ఘ కెరీర్‌తో రాణి భారత మహిళా హాకీకి ముఖచిత్రంగా మారడమే కాదు...తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేశారు.
‘‘నా వరకు చూసుకుంటే..నా హాకీ ప్రయాణం అద్భుతమైన కథకు తీసిపోదు’’ అని రాణి చెప్పారు.
‘‘2007లో నా తొలి జూనియర్ జాతీయ శిబిరం నుంచి ఫిట్‌నెస్ లేని కారణంగా నన్ను తొలగించారు. నా జీవితంలో నేనెప్పుడు భారత్ తరఫున ఆడలేనని నా కోచ్ అందరిముందూ నాతో అన్నాడు. ఆ సమయంలో నా దగ్గర ఎలాంటి సౌకర్యాలూ లేవు. నేను మామూలు ఆహారం తీసుకునేదాన్ని. ఒక అథ్లెట్ తీసుకోవాల్సిన పోషకాహారంతో పోలిస్తే..నేను పోషకాహార లోపంతో బాధపడుతున్న క్రీడాకారిణిగా ఉండేదాన్ని. నా బరువు కేవలం 36కిలోలు. కానీ ఊహించని పరిణామం లాంటి ఆ నిష్క్రమణను నేను ఆశీర్వాదంగా తీసుకున్నా. ఆ తర్వాత చాలా కష్టపడ్డా. షహబాద్ సెంటర్‌లోని మా కోచ్ బల్దేవ్ సర్ నాకు అండగా నిలిచాడు. ఇంక నేనెప్పుడూ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆసియా లెవన్, వరల్డ్ లెవన్ జట్లలో కూడా చోటు దక్కించుకునే అవకాశం లభించింది’’ అని రాణి గుర్తుచేసుకున్నారు.
రాణి కెరీర్‌లో అసాధారణ విజయాలున్నాయి. 2018 ఆసియా క్రీడల్లో ఆమె నేతృత్వంలో భారత్ రజత పతకం సాధించింది. ఒడిశాలో అమెరికాపై జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో చివరి నిమిషంలో ఆమె చేసిన కీలక గోల్‌తో, 2020 టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ అర్హత సాధించింది. ఆ మ్యాచ్‌లో విజయం ద్వారా భారత్ వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌కు క్వాలిఫై కాగలిగింది.
ధైర్యం, అంకితభావానికి రాణి జీవితం నిదర్శనం. తర్వాతి తరం హాకీ క్రీడాకారిణులకు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














