క్రికెట్‌లో పురుషులతో పోల్చితే మహిళలకు వేతనాల్లో తేడా ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాన్వీ ములే
- హోదా, బీబీసీ ప్రతినిధి
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 29 ఏళ్ల సజ్నా సజీవన్ 2024 ఫిబ్రవరి 23న బ్యాటింగ్ చేయడానికి క్రీజులో అడుగుపెట్టారు. బహుశా ఆమెకు అది చాలా ముఖ్యమైన, కీలకమైన రోజు.
ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 టోర్నమెంట్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మహిళల వెర్షన్ 'విమెన్ ప్రీమియర్ లీగ్' రెండో సీజన్‌లో మొదటి మ్యాచ్ అది.
సజ్నా తొలిసారి ఈ డబ్ల్యూపీఎల్ టోర్నీలో ఆడుతున్నారు. మ్యాచ్‌లో తన జట్టు గెలవడానికి ఆమెకు చివరి బంతికి ఆరు పరుగులు కావాలి. ఆ బంతికి సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించారు సజ్నా.
సజ్నా కేరళ రాష్ట్రంలోని సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి ఆటో డ్రైవర్, తల్లి స్థానిక మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్నారు. కాగా, కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ఆమె ఇల్లు గడవడం కూడా కష్టమైపోయింది.
"డబ్ల్యూపీఎల్ కారణంగా నాకు ఇండియా తరఫున ఆడే అవకాశం వచ్చింది. నా గురించి తెలుసుకోవడానికి ఇది ఒక వేదికగా మారింది. నాకోసం కొత్త దారులు తెరిచింది" అని ముంబయిలో ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో సజ్నా చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ ఫిబ్రవరి 14న ప్రారంభమైంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని మహిళల వద్దకు క్రికెట్ ఆటను తీసుకెళ్లడంలో ఈ లీగ్ కీలక పాత్ర పోషిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ లీగ్ టీవీ కవరేజీ ప్రభావం చూపుతుందని భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ ఝులన్ గోస్వామి అన్నారు. ఈ కవరేజీ యువతులను క్రికెట్‌లో పాల్గొనేలా ప్రేరేపిస్తుందని చెప్పారు. "లీగ్ ప్రతి ఒక్కరికీ కొత్త తలుపులు తెరుస్తోంది" అని ఝులన్ అభిప్రాయపడ్డారు.
ఇది మహిళలకు సానుకూలంగా ఉన్నప్పటికీ, ఫీజు చెల్లింపులో వ్యత్యాసం సమస్యగా మారింది. అంటే డబ్ల్యూపీఎల్‌లో మహిళా క్రికెటర్లు పొందే డబ్బుకు, ఐపీఎల్‌లో పురుష క్రికెటర్లు పొందే డబ్బుకు చాలా వ్యత్యాసం ఉంది.
ఇరు టోర్నీల్లో ఫ్రాంచైజీ యజమానులు చెల్లించే వేలం డబ్బుపైనే ఆటగాళ్లకు వచ్చే వేతనం ఆధారపడుతోంది. మరి ఎందుకీ తేడా?. దీనిపై సీనియర్, మాజీ మహిళా క్రికెట్ ప్లేయర్లు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
మహిళల క్రికెట్‌లో పెట్టుబడులు
వేతన వ్యత్యాసం ఉన్నప్పటికీ మహిళల క్రికెట్‌లో డబ్ల్యూపీఎల్ అత్యంత లాభదాయకమైన లీగ్. ఈ టోర్నీ ప్రభావం గురించి ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ స్పందించారు.
"ఇది నిజంగా ఆటను మార్చేసింది. ఇతర టోర్నమెంట్‌ల స్థాయి కూడా పెరగడం చూస్తుంటే గర్వంగా ఉంది. ప్రతి ప్లేయర్ ఆడాలనుకునే ఏకైక లీగ్ డబ్ల్యూపీఎల్" అని షార్లెట్ అన్నారు.
ఈ లీగ్ ప్రేక్షకాదరణకు ప్రధాన కారణం ఏమిటంటే.. ప్లేయర్లకు మంచి జీతం, భారీ ప్రైజ్‌మనీ లభించడం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి క్రికెట్ ఆడాలని కలలు కనే ఎందరో ప్లేయర్ల జీవితాలను మార్చే శక్తి డబ్ల్యూపీఎల్‌కు ఉంది. వారిలో ముంబయికి చెందిన 22 ఏళ్ల సిమ్రాన్ షేక్ ఒకరు.
సిమ్రాన్, ఆమె ఐదుగురు తోబుట్టువులు ముంబయిలోని ధారావి ప్రాంతంలో ఒక చిన్న ఇంట్లో పెరిగారు. ధారావి ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ. ఎలక్ట్రీషియన్ అయిన ఆమె తండ్రి జాహిద్ అలీ రోజుకు రూ. 500 నుంచి 1000 వరకు సంపాదిస్తుంటారు.
2024 డిసెంబర్లో డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్ ఆమెను రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేయడంతో సిమ్రాన్ గురించి చాలామందికి తెలిసింది. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ వేలంలో ఏ ప్లేయర్‌కు అయినా ఇదే అత్యధిక బిడ్.
సిమ్రాన్ నిరాడంబరమైన కుటుంబానికి ఆమె వేతనం ఎక్కువగా కనిపించవచ్చు. కానీ, ఇది మరోసారి క్రికెట్‌లో 'లింగ వేతనాల వ్యత్యాసం' ఎక్కువగా ఉందని చూపించింది.

ఫొటో సోర్స్, Getty Images
డబ్ల్యూపీఎల్ మాత్రేమే కాదు..
డబ్ల్యూపీఎల్ వేలానికి నెల రోజుల ముందు ఐపీఎల్ వేలం జరిగింది. ఇందులో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కోసం రికార్డ్ వేలం జరిగింది. రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా రిషబ్ నిలిచాడు.
ఇప్పుడు పంత్ సంపాదనను భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధానతో పోల్చండి. డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ప్లేయర్ మంధాన. 2023లో జరిగిన డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్ వేలంలో మంధానను ఆర్సీబీ రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే రిషబ్ పంత్ కంటే ఆమె వేలం దాదాపు ఎనిమిది రెట్లు తక్కువ.
విరాట్ కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్‌లతో పోల్చి చూస్తే మహిళా ప్లేయర్ల వేలంలో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది. పురుష, మహిళా ప్లేయర్లకు చెల్లించే డబ్బులో ఈ వ్యత్యాసం కేవలం డబ్ల్యూపీఎల్‌కే పరిమితం కాలేదు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే పురుష, మహిళల జట్లకు సమాన మ్యాచ్ ఫీజును చెల్లించనున్నట్లు 2022లో బీసీసీఐ ప్రకటించింది. కానీ, భారతదేశం తరపున ఆడే ఆటగాళ్లకు ఇచ్చే వార్షిక కాంట్రాక్టుల విషయానికి వస్తే, ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ పురుష, మహిళా ప్లేయర్లకు ఎంత చెల్లిస్తుందో చూస్తే భారీ వ్యత్యాసం ఉంది.

భారత్ తరఫున ఆడుతున్న పురుష క్రికెటర్లకు గరిష్టంగా వార్షిక కాంట్రాక్ట్ మొత్తం రూ.7 కోట్లు ఇస్తుండగా, మహిళలకు రూ.50 లక్షలు మాత్రమే ఇస్తున్నారు.
ఇంగ్లండ్‌లో జరుగుతున్న 'ది హండ్రెడ్' క్రికెట్ టోర్నీలో కూడా ఇదే విధమైన అసమానత కనిపిస్తోంది. వేతనాల్లో సమానత్వం వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చినా.. కార్యరూపం దాల్చలేదు.

ఫొటో సోర్స్, Getty Images
వేతన వ్యత్యాసానికి కారణం?
డబ్ల్యూపీఎల్, ఐపీఎల్ మధ్య ఇలాంటి పోలిక కుదరదని భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అంటున్నారు.
"మీరు డబ్ల్యూపీఎల్ కేవలం రెండు సీజన్‌లు జరిగింది. ఐపీఎల్ 18వ సీజన్. రెండింటినీ పోల్చలేరు. కాబట్టి దీనికి మరికొంత సమయం ఇవ్వాలి" అని మిథాలీ సూచించారు.
స్పాన్సర్‌లు తమ పెట్టుబడిపై మంచి రాబడిని ఆశించడమే వేతనాల్లో తేడాకు కారణమని అడ్వర్టైజింగ్ నిపుణులు చెబుతున్నారు. పురుషుల క్రికెట్ కంటే మహిళల క్రికెట్‌ను తక్కువ మంది వీక్షకులు చూస్తారు, కాబట్టి దానిపై పెట్టుబడులు కూడా తక్కువ ఉంటున్నాయని చెప్పారు.
'ఆడుతున్న అమ్మాయిలను టీవీలో ఎంత ఎక్కువమంది చూస్తే అంతగా స్పాన్సర్లు ముందుకు వస్తారు' అని మిథాలీ అభిప్రాయపడ్డారు.
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ఈ టోర్నీని వీక్షించిన వారి సంఖ్య 10.2 కోట్లు. 2024 నాటికి ఇది 62 కోట్లకు చేరింది. డబ్ల్యూపీఎల్ చూసే వీక్షకుల సంఖ్య 2023లో మొదటి సీజన్‌లో 5 కోట్ల మంది చూశారు, ఇది 2024 నాటికి 10.3 కోట్లకు పెరుగుతుందని అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
మార్పు కనిపిస్తోంది: డయానా
డబ్ల్యూపీఎల్‌లో వీక్షకుల సంఖ్య తక్కువగా ఉండటానికి మరొక కారణం తక్కువ జట్లు, తక్కువ మ్యాచ్‌లు. ఐపీఎల్ 2024 సీజన్‌లో 10 జట్లు 13 నగరాల్లో 74 మ్యాచ్‌లు ఆడాయి. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్‌లో ఐదు జట్లు, నాలుగు నగరాల్లో 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
దీనిపై భారత మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ మాట్లాడుతూ.. బీసీసీఐ సమాన వేతనం ప్రకటించడం మంచి ముందడుగని, అయితే మహిళా క్రికెటర్లు మునుపటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని కోరారు.
1970, 80లలో తాను క్రికెట్ ఆడిన రోజుల నుంచి ఇప్పటికి చూస్తే చాలా పురోగతి ఉందని డయానా అభిప్రాయపడ్డారు. ఆ రోజుల్లో టీవీలో చాలా తక్కువగా మహిళల మ్యాచ్‌లు ప్రసారం అయ్యాయని, వాటి కోసం నిధులు సేకరించడం కూడా కష్టమైందని ఆమె పేర్కొన్నారు.
టీవీలో మ్యాచ్‌ల ప్రసారం విషయంలో డబ్ల్యూపీఎల్ సానుకూల మార్పును తీసుకొచ్చిందని భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అభిప్రాయపడ్డారు.
"ప్రజలు ఇప్పుడు మమ్మల్ని చూస్తున్నారు, గుర్తిస్తున్నారు. నిన్న ప్రయాణంలో కొంతమంది అభిమానులను కలిశారు. నేను డబ్ల్యూపీఎల్ టోర్నీ కోసం వెళుతున్నానని వారికి తెలుసు. ఈ మార్పు మాకు చాలా పెద్దది. ఎందుకంటే ఇది మెరుగైన ప్రదర్శనను కొనసాగించడానికి మాకు ప్రేరణనిస్తుంది" అని హర్మన్‌ప్రీత్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














