‘నా ఒంట్లో ఇంకా 25 బాంబు శకలాలు ఉన్నాయి’ అంటున్న ఒకనాటి బాల సైనికుడు

ఇరాన్-ఇరాక్ యుద్ధంలో చిన్నారులు

ఫొటో సోర్స్, Masoud Hashemi

ఫొటో క్యాప్షన్, మందుపాతరలు తొలగించే యూనిట్‌లో మసూద్ పనిచేశారు.

హెచ్చరిక : ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలవరపరిచే అవకాశం ఉంది.

''నేనొక బూట్ చూశా. అరికాలు సగ భాగం ఇంకా అందులోనే ఉంది. నాకు చాలా భయమేసింది'' అని మసూద్ హష్మీ గుర్తుచేసుకున్నారు.

ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు తన వయసు 14 ఏళ్లని ఆయన బీబీసీతో చెప్పారు. కొన్నిరోజులకే ఆయన తన తోటి సైనికుని మృతదేహం అవశేషాలు చూశారు. అలాంటి పరిస్థితిని చూడటం ఆయనకు అదే మొదటిసారి.

ఇరాక్-ఇరాన్ సంక్షోభం ఎనిమిదేళ్లపాటు సాగింది. అప్పటికి టీనేజ్‌లో ఉన్న అనేకమంది ఇరానియన్లలో మసూద్ కూడా ఒకరు. ఇప్పుడాయన వయసు 56. స్కూల్ వయసున్న దాదాపు 5 లక్షలమంది పిల్లలను యుద్ధంలో మోహరించామని అప్పట్లో ఇరాన్ అధికారులు చెప్పారు.

యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు తన వయసు కేవలం 11ఏళ్లేనని రేజా షొక్రొల్లాహి అనే మాజీ సైనికుడు చెప్పారు. యుద్ధం వల్ల తన శరీరంలో 25 బాంబు శకలాలు ఇంకా అలాగే ఉండిపోయాయని ఆయన తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్-ఇరాక్ యుద్ధంలో చిన్నారులు
ఫొటో క్యాప్షన్, యుద్ధంలో పాల్గొని 38 ఏళ్లు గడిచిపోయినప్పటికీ ప్రతీ విషయం తనకు గుర్తుందని రేజా చెప్పారు.

యుద్దంలో పాల్గొంటే గుర్తింపు వస్తుందన్న ఆలోచనతో...

యుద్ధంలో పాల్గొన్న సమయంలో తన స్నేహితులు అనేకమందిని తన చేతులతో పూడ్చిపెట్టానని 15 ఏళ్ల మెహ్ది తలాటి గుర్తుచేసుకున్నారు.

నాలుగు దశాబ్దాల తర్వాత ఆ ముగ్గురూ బీబీసీ పర్షియన్ డాక్యుమెంటరీతో తమ అనుభవాలను పంచుకున్నారు.

రాజకీయ, భౌగోళిక వివాదాలతో 1980 సెప్టెంబరులో అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ బలగాలు ఇరాన్‌పై దాడి చేశాయి.

చాలా తొందరగా విజయం సాధిస్తామని ఇరాక్ నాయకుడు హామీ ఇచ్చారు. కానీ, వాళ్లు తలపడుతున్నది ఇరానీ బలగాలతో. ఇరాన్ సైన్యంలో చాలామంది తమ కొత్త విప్లవ నాయకుడు అయతొల్లా రుహొల్లా ఖోమేనీపై తీవ్రమైన భక్తిభావంతో ఉండేవారు.

హీరోయిజాన్ని, అమరత్వాన్ని కీర్తించే ఓ సంస్కృతికి తాము ఆకర్షితులయ్యామని ఈ ముగ్గురు మాజీ సైనికులు 2023లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపారు.

యుద్ధం ప్రారంభమైన కొత్తలో ఇరాకీ ట్యాంక్ కింద గ్రెనేడ్ విసిరినందుకు 13 ఏళ్ల హుస్సేన్ ఫామిద్‌ను అయతొల్లా ఖొమేనీ ప్రశంసించారు.

పోస్టర్లు, నినాదాల్లో ఫామిద్ చర్యలను ప్రశంసించడం తమను తీవ్రంగా ప్రభావితం చేసిందని రేజా చెప్పారు. యుద్ధరంగంలో ఉన్న పిల్లల వార్తలను టీవీలో చూశామని, తామూ యుద్ధంలో పాల్గొనడం కోసం ఎంతగానో ఎదురుచూశామని ఆయన తెలిపారు.

యుద్ధంలో పాల్గొనాలని తన తండ్రి నిర్ణయించుకోవడాన్ని, తనతోను, తన ఈడువాడైన కలషింకోవ్‌తోనూ ఫోటోలు దిగుతామని స్థానికులు అడగడాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.

‘‘ఆ సమయంలో నన్ను నేను హీరోలాగా గొప్పగా ఊహించుకున్నా’’ అని ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు దాన్ని విపత్తులా భావిస్తానన్నారు.

ఇరాన్-ఇరాక్ యుద్ధంలో చిన్నారులు

ఫొటో సోర్స్, Reza Shokrollahi

ఫొటో క్యాప్షన్, 11 ఏళ్ల వయసులో తన తండ్రితో కలిసి రేజా యుద్ధానికి వెళ్లారు.

18 ఏళ్ల లోపువారే ఎక్కువమంది

1979 విప్లవానికి ముందు జెనీవా సమావేశాల్లో ఒక ప్రోటోకాల్‌పై ఇరాన్ సంతకం చేసింది. భద్రతాబలగాల్లో 15ఏళ్లలోపు పిల్లలను చేర్చుకోవడాన్ని నిషేధిస్తూ కుదిరిన ప్రోటోకాల్ అది.

కానీ వయసు పరిమితి తాము బలగాల్లో చేరడంపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఆ ముగ్గురూ తెలిపారు. ఇరాన్ ఇప్పటికీ ఆ ప్రోటోకాల్‌ను అమలుచేయలేదు.

ఆర్కైవ్ ఫుటేజ్‌లోని బీబీసీ డాక్యుమెంటరీలో తమ వయసు 12,13,14 ఏళ్లు అని చెబుతున్న బాలుర ఇంటర్వ్యూలు ఉన్నాయి. తాము యుద్ధరంగంలో పోరాడుతున్నామని వారు చెప్పారు.

జర్మనీలో ప్రస్తుతం ఓ రెస్టారెంట్ నడుపుతున్న మసూద్, యుద్ధంలో పాల్గొనేందుకు తన బర్త్ సర్టిఫికెట్‌లో మార్పులు చేసుకున్నానని చెప్పారు. పోరాట ప్రాంతానికి వెళ్లేదారిలో ఓ బస్సు నుంచి ట్రాఫిక్ అధికారి తనను దించేశారని, అయితే రెండు వారాల తర్వాత తాను మరో బస్సులో సీటు కింద దాక్కుని వెళ్లానని ఆయన గుర్తుచేసుకున్నారు.

మందుపాతరలను తొలగించే యూనిట్‌లో ఆయన పనిచేశారు. మందుపాతరలుండే ప్రాంతంలోకి తొలిసారి ప్రవేశించినప్పటికి తన వయసు 15 ఏళ్లని ఆయన చెప్పారు. ఆ యూనిట్‌ సభ్యుల్లో 60శాతం మంది టీనేజర్లేనని ఆయనన్నారు. అక్కడ ఉన్నవారంతా 16,15,14,13 ఏళ్ల వారు ఉన్నారని, చురుగ్గా, వేగంగా పనిచేస్తారని ప్రత్యేకంగా వారిని ఎంపిక చేశారని ఆయన తెలిపారు.

''ఆ పని చాలా ప్రమాదకరమైనది. చిన్న పిల్లలు దీని గురించి ఎక్కువ ఆలోచించలేరు'' అని మసూద్ అన్నారు.

15 ఏళ్ల వయసులో యుద్ధంలో పోరాడుతూ ఆయన తమ్ముడు చనిపోయారు. తర్వాత సంవత్సరానికి ఆయన తండ్రి గుండెపోటుతో మరణించారు. '' నా తమ్ముడు చనిపోయిన బాధను నాన్న తట్టుకోలేకపోయారు'' అని మసూద్ గుర్తుచేసుకున్నారు.

ఇరాన్-ఇరాక్ యుద్ధంలో చిన్నారులు
ఫొటో క్యాప్షన్, రసాయన ఆయుధాల ప్రభావంతో తనకు శ్వాసకోస సమస్యలు వచ్చాయని మసూద్ చెప్పారు.

ఇరాన్ ఇస్లామిక్ విప్లవానికి మద్దతుగా పనిచేసేందుకు అంకితమైన బస్జీ మిలీషియాలో చేరేనాటికి మెహ్దీ వయసు 15 ఏళ్లు. తర్వాత కాలంలో ఆయన పశ్చిమాసియా పరిశోధకులు అయ్యారు.

''మా క్లాసు విద్యార్థులు ఏడెనిమిదిమంది యుద్ధరంగంలో పనిచేశారు. వారిలో ఒకే ఒక్కరు క్షేమంగా తిరిగి వచ్చారు'' అని మెహ్దీ చెప్పారు.

వారిలో చాలామంది హాలీవుడ్ మూవీ ‘వ్యూ ఆఫ్ ద వార్’ ప్రభావంతో వెళ్లినవారే. కానీ మొదటి ఆపరేషన్ నుంచే తమ ఆశలు, అంచనాలు అన్నీ చెల్లాచెదురయ్యాయని ఆయన చెప్పారు.

మోర్టార్ పేలుడు మొదటిసారి చూసినప్పుడు తన తోటి సైనికుడు మెహ్దీ కళ్లముందే చనిపోయారు.

''బాంబు శకలం నేరుగా ఆయన తలను తాకింది. ఆయన అక్కడికక్కడే చనిపోయారు'' అని మెహ్దీ గుర్తు చేసుకున్నారు.

ఆనాటి యుద్ధంలో చాలామంది చిన్నారులున్నాని ప్రస్తుతం 52 ఏళ్ల వయసులో ఉన్న రేజా చెప్పారు.

‘‘మేం చేయకూడని పనులు మేం చేశాం. కానీ ఒక్కసారి అలా చేసిన తర్వాత మనం ఇంక పిల్లలం కాబోము'' అని ఆయన అన్నారు.

''నాకు స్కూల్‌లో దగ్గరి మిత్రుడైన ఓ స్నేహితుడు నాతో కలిసి పోరాటానికి వస్తానని పదే పదే అడిగాడు. ఆయన కుటుంబం యుద్ధాన్ని వ్యతిరేకిస్తుంది. నువ్వు ఫలానా ఆఫీసుకు వెళ్లాలని నేను ఆయనతో చెప్పాను. కానీ వాళ్లు రిఫరెన్స్ అడుగుతారని ఆయన నాతో అన్నారు. వాళ్లలా అడిగితే నా పేరు చెప్పు అని నేనాయనతో చెప్పాను'' అని ఆయన గుర్తుచేసుకున్నారు.

''ఒక రోజు రాత్రి ఆయన యుద్ధరంగంలోకి వెళ్లారు. మళ్లీ తిరగలేదు. ఆయన అక్కడే చనిపోయారు'' అని రేజా చెప్పారు.

కన్నీళ్లతో నేను ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రయత్నించా. ''ఆయన కుటుంబ సభ్యులు ఏడుస్తూ నన్ను తిట్టారు. ఆ కార్యక్రమం దగ్గర నన్ను ఉండనివ్వకుండా బయటకు నెట్టివేశారు'' అని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఇరాన్-ఇరాక్ యుద్ధంలో చిన్నారులు
ఫొటో క్యాప్షన్, 13 ఏళ్ల వయసులో హుస్సేన్ ఫామిద్ యుద్ధంలో పోరాడుతూ చనిపోయారు.

1979 నుంచి 8వేల మందికి పైగా చిన్నారులు మృతి

రేజా ముఖానికి గాయమైంది. మరో పేలుడులో ఆయన ముఖం, చేతులు, తల, ఛాతీ భాగం, కాళ్లకు గాయాలయ్యాయి. మోర్టార్ ముక్కలు ఇప్పటికీ ఆయన శరీరంలో ఉన్నాయి.

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి 1988లో అయతొల్లా ఖొమేనీ అంగీకరించారు. దీంతో యుద్ధరంగంలో చిన్నారుల పోరాటానికి ముగింపుపడింది.

ఇరాన్ లెక్కల ప్రకారం అధికారికంగా దాదాపు 2లక్షలమంది ఇరానియన్లు చనిపోయారు.

యుద్ధంలో ఏ వయసువారు ఎంతమంది చనిపోయారనేదానిపై కచ్చితమైన లెక్కలు లేవు. కానీ అధికారిక లెక్కల ప్రకారం మృతుల్లో ఒక వంతు మంది స్కూల్ పిల్లల వయసున్నవారు, యువత.

1979 నుంచి అమరులైన పిల్లల సంఖ్య 8వేలకు పైగా ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారి వయసు 11 నుంచి 15 మధ్య ఉంటుంది. వారిలో ఎక్కువ మంది ఇరాన్-ఇరాక్ యుద్ధంలో చనిపోయినవారే.

చిన్నవయసున్న పిల్లలను పోరాటానికి పంపకూడదన్నది తమ విధానమని, అయితే ఆ పిల్లలే స్వచ్ఛందంగా తమ దేశం, మతం కోసం పోరాటంలో భాగమయ్యారని ఇరాన్ ప్రభుత్వం చెప్పింది.

యుద్ధంలో ఇరాక్‌కు భారీగా ప్రాణనష్టం జరిగింది. అయితే రెండువైపులా మరణాల సంఖ్యకు సంబంధించిన లెక్కల్లో భారీ తేడా ఉంది.

ఇరాక్ కూడా కొంతమంది పిల్లలను సైనికులుగా ఉపయోగించినట్టు ఆధారాలున్నాయి. కానీ ఎంతమందనేది తెలియదు.

ఇరాన్-ఇరాక్ యుద్ధంలో చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాక్-ఇరాన్ యుద్ధంలో ఉపయోగించిన ఓ ట్యాంక్

‘జీవితం అక్కడే ఆగిపోయిన్నట్టనిపించింది’

యుద్ధరంగం నుంచి తిరిగివచ్చిన సైనికులకు కొత్త సమస్యలు ఎదురయ్యాయి.

తన స్కూల్ పాత స్నేహితులు డాక్టర్లు లేదా ఇంజినీర్లు అయ్యేందుకు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు రేజా గుర్తించారు.

''వారి జీవితం ముందుకు సాగిపోతోంది. మా వైపు నుంచి చూస్తే జీవితం ఆగిపోయింది'' అని రేజా అన్నారు.

ఇప్పుడాయన జర్నలిస్టు. పరాగ్వేలో భార్య, కొడుకుతో కలిసి జీవిస్తున్నారు. కానీ తాను ఒకచోట నుంచి ఒకచోటకు మారుతూ గందరగోళంగా జీవితం గడిపానని ఆయన చెప్పారు.

''38ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఇప్పటికీ యుద్ధరంగానికి సంబంధించిన ప్రతి క్షణం నాకు గుర్తుంది'' అని ఆయన చెప్పారు.

''మాలో చాలామందిమి యుద్ధానంతర పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోయాం'' అని మెహ్దీ అన్నారు.

పోరాటంలో పాల్గొన్నవారిలో కొందరు ''ఒంటరితనంతో బాధపడుతూ చనిపోయారు. మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకొందరు కుటుంబాలు చెల్లాచెదురయ్యయి'' అని ఆయన చెప్పారు.

గతంలో మెహ్దీ యుద్ధం గురించి సానుకూలంగా మాట్లాడారు. చావుతో సైనికులు పోరాడడాన్ని అద్భుతమైనదిగా వర్ణించారు.

కానీ ఇప్పుడు ఆయనలా మాట్లాడడం లేదు. రాత్రి వేళ రెండు, మూడు గంటల కన్నా ఎక్కువ సమయం నిద్రపోలేకపోతున్నా. ''యుద్ధంలో ఉన్న నా స్నేహితులే నాకెప్పుడూ కలల్లో కనిపిస్తుంటారు'' అని ఆయన చెప్పారు.

రసాయన ఆయుధాల దాడుల ప్రభావం తనపై ఉందని, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని మసూద్ చెప్పారు. ఆయన మెదడులో బాంబు శకలం ఉండిపోయింది.

''38 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ నాకు భయంకర కలలు వస్తున్నాయి. నేను అకస్మాత్తుగా నిద్రలేచి పెద్దగా అరుస్తాను. తర్వాత దగ్గు మొదలవుతుంది'' అని ఆయన తెలిపారు.

గతాన్ని అంగీకరించడానికి ''రియల్లీ డార్క్'' చికిత్స సెషన్లుకు హాజరయ్యానని రేజా చెప్పారు. ''వాళ్లు నన్ను తీసుకెళ్లడమో, లేదా నేను వెళ్లడానికి కారణం కావడమో, లేదా వాళ్లు నన్ను ఆపకపోవడమో ఇలా ఏది ఏమైనప్పటికీ నేను యుద్ధానికి వెళ్లాను'' అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)