అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల గురించి 9 ఆశ్చర్యపరిచే నిజాలు...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశాలకు పంపాలన్న నిర్ణయాన్ని డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. భారత్ నుంచి అమెరికాలో అక్రమంగా ఉంటున్న 18వేల మందిని తాము గుర్తించినట్లు అమెరికా చెబుతోంది.
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయుల్ని, భారత దేశం వెనక్కి తీసుకుంటుందని గత వారం అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు.
మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని అడ్డుకుంటామని అన్నారు.
"వీళ్లందరూ సాధారణ కుటుంబాలకు చెందిన పిల్లలు. గొప్ప జీవితం, సంపాదన లాంటివి వాళ్లను ఆకర్షించాయి" అని మోదీ వాషింగ్టన్‌లో చెప్పారు.
భారతీయులు ఎంత మంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు? వారు ఎలా వస్తున్నారు? ఏయే మార్గాల్లో వస్తున్నారు, ఏ ప్రాంతానికి చెందినవారు ఇలాంటి వివరాలతో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన దేవేష్ కపూర్, అబ్బీ బుడిమన్ ఒక నివేదిక రూపొందించారు.
ఆ నివేదికలో కొన్ని విస్తు గొలిపే అంశాలు ఉన్నాయి.

అక్రమంగా ఉంటున్న భారతీయులెందరు ?
అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారి సంఖ్య ఆ దేశ జనాభాలో 3శాతం, విదేశీయుల్లో 22శాతంగా ఉన్నారు.
అయితే వీరిలో భారత్ నుంచి ఎంత మంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. వివిధ రకాల గణాంక విధానాల వల్ల అంచనాలు ఏవీ ఒకదానికొకటి సరి తూగడం లేదు.
2022 నాటికి అమెరికాలో 7 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారని, వారిలో మూడొంతుల మంది మెక్సికో, ఎల్ సాల్వడార్ నుంచి వచ్చిన వారని ప్యూ రీసర్చ్ సెంటర్, సెంటర్ ఫర్ మైగ్రేషన్ స్టడీస్ ఆఫ్ న్యూయార్క్ అంచనా వేశాయి.
అయితే దీనికి విరుద్దంగా, మైగ్రేషన్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ ఈ సంఖ్య 3 లక్షల 75వేలనీ, ఇందులో భారత్ ఐదో స్థానంలో ఉందని చెబుతోంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించిన ప్రభుత్వ అధికారిక అంచనాలు మరో విధంగా ఉన్నాయి. 2022 నాటికి అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు 2 లక్షల 20వేల మంది అని వెల్లడించింది.
అక్రమ వలసదారుల గురించి వివిధ సంస్థలు చెబుతున్న అంచనాల్లో భారీ తేడాలు చూస్తే, వీరిలో భారతీయుల సంఖ్య ఎంత అనే దానిపై అయోమయం మరింత పెరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
బాగా తగ్గిన సంఖ్య
అమెరికాలోని అక్రమ వలసదారుల్ల భారతీయుల వాటా చాలా తక్కువ.
"ప్యూ, సీఎంఎస్ అంచనాలు కచ్చితమైతే, అక్రమ వలసదారుల్లోని ప్రతీ నలుగురిలో ఒక భారతీయుడు ఉన్నట్లు. అయితే మైగ్రేషన్ నమూనాలను చూస్తే ఇలా జరిగే అవకాశం లేదని దేవేష్ కపూర్, అబ్బీ బుడిమన్ అధ్యయనం చెబుతోంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అంచనాల ప్రకారం 2016తో పోలిస్తే 2022లో భారతీయ అక్రమ వలసదారుల సంఖ్య 60 శాతం తగ్గిపోయింది. మొత్తం అక్రమ వలసదారుల సంఖ్య కూడా 2016లో ఉన్న 5లక్షల 60వేలతో పోలిస్తే 2022 నాటికి ఈ సంఖ్య 2 లక్షల 20వేలకు తగ్గింది.
2016 నుంచి 2022 నాటికి భారతీయ అక్రమ వలసదారుల సంఖ్య ఇంత వేగంగా ఎలా తగ్గింది? డేటా దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని దేవేష్ కపూర్ చెప్పారు.
అయితే కొన్ని కోణాల నుంచి చూస్తే ‘‘అక్రమంగా అమెరికాలోకి వచ్చిన వారిలో కొందరు చట్టబద్దంగా క్రమబద్దీకరణ పొంది ఉండవచ్చు, లేదా కోవిడ్ సమయంలో ఎదురైన కష్టాలు తట్టుకోలేక తిరిగి వెళ్లిపోయి ఉండవచ్చు’’ లాంటి కొన్ని కారణాలు భారత అక్రమ వలసదారుల సంఖ్య తగ్గిందని చెప్పడానికి కాస్త లాజికల్‌గా కనిపిస్తున్నాయి.
ఏదేమైనప్పటికీ, ఈ అంచనాలేవీ 2023లో అమెరికా సరిహద్దుల వద్ద భారతీయుల సంఖ్య పెరగడాన్ని ప్రతిబింబించడం లేదు. దీనర్ధం ఏంటంటే ప్రస్తుతం అమెరికాలో భారతీయ అక్రమ వలసదారుల సంఖ్య వివిధ సంస్థలు చెబుతున్న దాని కంటే ఎక్కువగా ఉండవచ్చు.
సరిహద్దుల్లో అరెస్టులు పెరుగుతున్నప్పటికీ, 2020- 2022 మధ్య అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన భారతీయుల సంఖ్య పెరగలేదని అమెరికా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని దేవేష్ కుమార్ అధ్యయనంలో తేలింది.
మెక్సికో, కెనడాతో అమెరికా సరిహద్దుల వద్ద అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించే వారిని అధికారులు నిలిపివేస్తున్నారు.
వీసా గడువు పూర్తైన తర్వాత కూడా అమెరికాలోనే ఉంటున్న భారతీయుల సంఖ్య 2016లో 1.5 శాతంగా ఉంది. ఈ సంఖ్యలో ఎలాంటి మార్పు రాలేదు.
2017లో 2600 మందిగా ఉన్న డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డాకా) సంఖ్య 2024 నాటికి 1600కి తగ్గింది. చిన్న పిల్లలుగా అమెరికా వచ్చిన వారిని తిప్పి పంపకుండా డాకా కార్యక్రమం రక్షిస్తుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య, వాటా పెరిగింది. 1990లో 0.8 శాతం ఉన్న భారతీయ అక్రమ వలసదారుల జనాభా 2015 నాటికి 3.9 శాతానికి చేరుకుంది. అయితే 2022లో అది 2 శాతానికి తగ్గింది.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త దారుల్లో పెరిగిన అక్రమ వలసలు
అమెరికాకు రెండు వైపుల భూ సరిహద్దు ఉంది.
అరిజోనా, కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, టెక్సస్ రాష్ట్రాలకు దక్షిణం వైపున మెక్సికోతో సరిహద్దు ఉంది. మెక్సికో నుంచి అత్యధికంగా అక్రమంగా అమెరికాలోకి వస్తున్నారు. అమెరికాలోని 11 రాష్ట్రాలకు కెనడాతో సరిహద్దు ఉంది.
2010కి ముందు రెండు సరిహద్దుల్లోనూ భారతీయులు అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన సందర్భాలు చాలా తక్కువ. అది ఎప్పుడూ వెయ్యి దాటలేదు.
2010 నుంచి అమెరికా మెక్సికో సరిహద్దుతో పాటు మిగతా మార్గాల్లోనూ భారతీయులు అక్రమంగా అమెరికాలో ప్రవేశించడం పెరిగింది.
2024 ఆర్థిక సంవత్సరంలో ఉత్తర సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్య 36శాతం పెరిగింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే అది 4శాతం ఎక్కువ.
భారతీయులు అక్రమ మార్గంలో అమెరికాలోకి ప్రవేశించేందుకు కెనడా దగ్గరిదారిగా మారింది. అమెరికాతో పోలిస్తే కెనడా వీసా త్వరగా లభిస్తోంది.
2021 నుంచి కెనడా నుంచి అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేసే వారి సంఖ్య పెరిగింది. 2023లో మెక్సికో సరిహద్దుల నుంచి అక్రమ వలసదారుల సంఖ్య పతాక స్థాయికి చేరుకుంది.
"2023 గణాంకాలు కేవలం భారతీయులకు మాత్రమే సంబంధించినవి కావు. బైడెన్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలోకి అక్రమ ప్రవేశాలు అన్ని దేశాల నుంచి పెరిగాయి. అందులో భాగంగానే భారతీయుల సంఖ్య కూడా పెరిగి ఉండవచ్చు" అని దేవేష్ కపూర్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అక్రమంగా అమెరికాలోకి వచ్చిన భారతీయులెక్కడ ఉంటున్నారు?
అమెరికాలో భారతీయ వలసదారులు ఎక్కువగా కొన్ని రాష్ట్రాల్లో ఉంటున్నట్లు తాజా అధ్యయనం తేల్చింది. కాలిఫోర్నియాలో (1,12,000) టెక్సస్‌లో (61,000), న్యూజెర్సీలో(55,000), న్యూయార్క్‌లో(43,000), ఇల్లినోయిలో (31000) భారతీయులు ఉన్నారు. అనధికారిక భారతీయ వలసదారులు కూడా ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నారు.
మరి కొన్ని రాష్ట్రాలు, ఒహాయోలో 16శాతం, మిషిగన్‌లో 14శాతం, న్యూజెర్సీలో 12శాతం, పెన్సిల్వేనియాలో 11 శాతంగా ఉన్న అక్రమ వలసదారుల్లో భారతీయుల సంఖ్య కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.
వీటితో పాటు టెన్నిసీ, ఇండియానా, జార్జియా, విస్కాన్సిన్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఉన్న అక్రమ వలసదారుల్లో భారతీయులు 20శాతం మంది ఉన్నారు.
"దీన్ని మేము ఊహించాం. ఎందుకంటే తమ వారిలో కలిసిపోవడానికి, పని వెదుక్కోవడానికి ఇది తేలికైన మార్గం. ఉదాహరణకు ఒక గుజరాతీ అమెరికన్ మరో గుజరాతీకి పంజాబీ అమెరికన్ మరో పంజాబీకి సాయం చేస్తారు" అని కపూర్ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
ఆశ్రయం కోరుతున్న భారతీయులు ఎవరు?
సరిహద్దుల్లో నిర్బంధించిన వారు, తాము స్వదేశానికి వెళితే తమ ప్రాణాలకు ముప్పు ఉందనే విషయాన్ని కోర్టుల్లో నిరూపించుకోగలిగితే, అలాంటి వారు అమెరికన్ కోర్టుల్లో ఆశ్రయం(అసైలమ్) కోరవచ్చు. డిపోర్టేషన్ భయంతో అమెరికాలో ఆశ్రయం కోరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
భారత్ నుంచి ఎంతమంది అమెరికాలో అలాంటి ఆశ్రయం కోరుతున్నారనే దాని గురించి ప్రభుత్వం ఎలాంటి వివరాలు విడుదల చెయ్యలేదు. అయితే వారు మాట్లాడే భాష ఆధారంగా కోర్టు కేసుల ద్వారా కొన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి.
2001 నుంచి అమెరికాలో ఆశ్రయం కోరుకుంటున్న వారిలో పంజాబీలు ఎక్కువ మంది ఉన్నారు. పంజాబీల తర్వాత హిందీ(14శాతం), ఇంగ్లిష్ (8శాతం) గుజరాతీ(7శాతం) మాట్లాడేవారు ఉన్నారు.
2001-2022 మధ్య పంజాబ్, హరియాణాల నుంచి అమెరికాలో ఆశ్రయం కోరుతూ దాఖలైన కేసుల సంఖ్య 66 శాతం.
ఆశ్రయం దక్కించుకున్నవారిలోనూ పంజాబీలదే (63శాతం) సింహ భాగం. తర్వాతి స్థానాల్లో హిందీ(58శాతం)ఉన్నారు. దీనికి విరుద్దంగా గుజరాతీల దరఖాస్తుల్లో పావు వంతు మాత్రమే ఆమోదం పొందాయి.

ఫొటో సోర్స్, Reuters
వ్యవస్థతో ఆటలు , ఆశ్రయం కోరుతున్న కేసులెందుకు పెరుగుతున్నాయి?
భారత్ నుంచి ఆశ్రయం కోరుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ సేకరించిన గణాంకాలు చెబుతున్నాయి.
ఈ దరఖాస్తుల సంఖ్య కేవలం రెండేళ్లలో పదిరెట్లు పెరిగింది. అమెరికాలో ఆశ్రయం కోరినవారు 2021లో 5 వేలుగా కాగా, 2023లో 51వేలకు పెరిగారు.
అమెరికాలో ఇంత భారీ స్థాయిలో అశ్రయం కోసం దరఖాస్తులు పెరగడం అనూహ్యంగా కనిపిస్తోంది. కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. విదేశాల్లో ఆశ్రయం కోరుతున్న వారిలో భారతీయులు ఎక్కువ మంది ఉన్నారని అధ్యయనం తేల్చింది.
‘‘విదేశాల్లో పౌరసత్వం లేదా వర్క్ పర్మిట్లు రావాలంటే చాలా కాలం పడుతుంది. ఆ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుంది. అందుకే ఆశ్రయం తీసుకునేందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు" అని కపూర్ చెప్పారు.
పంజాబ్ నుంచి ఎక్కువమంది విదేశాల్లో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటనే దానిపై స్పష్టత లేదు.
ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అసైలమ్ విధానంలో అవకాశాలు క్షీణిస్తున్నాయి.
ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తొలి వారంలోనే అమెరికన్ సరిహద్దుల్లోని నిర్బంధ క్యాంపుల్లో ఉన్న వారికి అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు, ఆశ్రయం కోరుతున్న వారి దరఖాస్తులు పరిశీలించేందుకు బైడెన్ ప్రభుత్వం ప్రారంభించిన యాప్‌ను తొలగించారు.
ఈ యాప్‌ను తొలగించే నాటికి అందులో 3లక్షల అపాయింట్‌మెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో ఆశ్రయం కోరేవారు భారత్ గురించి ఏం చెప్పారు?
అమెరికాలో ఆశ్రయం కోరుతున్న వారిలో ఎక్కువ మంది సంపన్న రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్‌కు చెందినవారే. విదేశాల్లో స్థిరపడేందుకు అవసరమైన ఖర్చును భరించే సామర్థ్యం వారికి ఉంది.
భారతదేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముస్లింలు, వెనుకబడిన వర్గాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందినవారు, కశ్మీర్‌కు చెందిన వారు చాలా అరుదుగా విదేశాల్లో ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది.
దీనిని బట్టి తెలుస్తోంది ఏంటంటే, విదేశాల్లో ఆశ్రయం కోరుతున్న వారిలో ఎక్కువ మంది డబ్బున్నవారే, అంతే తప్ప దేశంలోని పేద ప్రాంతాలు, సంఘర్షణ ఉన్న ప్రాంతాలకు చెందిన వారు కాదు.
లాటిన్ అమెరికా లేదా కెనడాలోకి నకిలీ విద్యార్థులుగా ప్రవేశించి, అక్కడ నుంచి అనేక కష్టాలు పడుతూ అమెరికాలో అడుగు పెట్టేందుకు అక్రమ మార్గంలో ప్రయత్నిస్తున్న వారు పెడుతున్న ఖర్చు భారతదేశ తలసరి ఆదాయం కంటే 30 నుంచి 100 రెట్లు ఎక్కువ. ఈ ఖర్చుల కోసం వారు తమ ఆస్తుల్ని అమ్మేస్తున్నారని అధ్యయనం తెలిపింది.
అమెరికాకు అక్రమంగా వెళుతున్న వారిలో సింహ భాగం పంజాబ్, గుజరాత్ వారు ఎక్కువ. ఈ రెండు రాష్ట్రాలు సంపన్నమైనవే. ఇక్కడ భూముల విలువ, ఆ భూముల్లో పండే పంటల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.
"చట్ట విరుద్దంగా మనుషుల్ని విదేశాలకు పంపించేందుకు కూడా చాలాఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది" అని అధ్యయనం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
భారతీయుల్ని వలసలకు ప్రోత్సహిస్తున్నదేమిటి?
‘‘విదేశాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తులు పెరగడం భారతదేశంలో ప్రజాస్వామ్య తిరోగమనానికి ముడిపడినట్లు అనిపించవచ్చు" అని రచయితలు చెబుతున్నారు.
పంజాబ్, గుజరాత్ నుంచి అనేక ఏళ్లుగా విదేశాలకు వలసలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల నుంచి అమెరికాకే కాకుండా కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాలకు వెళుతున్నారు.
దీనివల్ల భారతదేశం 2023లో 120 బిలియన్ డాలర్ల విదేశీ మారకాన్ని అందుకుంది. మెరుగైన జీవితం, పేదరికం నుంచి బయటపడాలనే తపన, విదేశాల్లో సంపాదనకు మెరుగైన అవకాశాలు లాంటి అంశాలు వలసలకు ప్రోత్సాహన్ని అందిస్తున్నాయని అధ్యయనంలో తేలింది.
దీంతో ఈ డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి సమాంతరంగా ఏజంట్లు, బ్రోకర్లు పుట్టుకొచ్చారు.
అయితే ఈ అధ్యయనాన్ని మరో కోణంలో చూడాలని భారత ప్రభుత్వం చెబుతోంది. "అక్రమ మార్గంలో విదేశాలకు వెళ్లే వారి విషయంలో వారు అక్కడకు వెళ్లడానికి తమ దేశంలో చాలా ఎక్కువ ఖర్చు చేసి నష్టపోతున్నారు" అని భారత ప్రభుత్వం అంటోంది.
ఎంతమంది భారతీయుల్ని తిప్పి పంపారు?
భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం 2009 -2024 మధ్య 16వేల మంది భారతీయుల్ని అమెరికా వెనక్కి పంపింది.
ఒబామా కాలంలో ఏడాదికి సగటున 750 మంది, ట్రంప్ తొలి పాలనా కాలంలో ఏడాదికి సగటున 1550 మంది, బైడెన్ పాలనా కాలంలో ఏడాదికి సగటున 900 మంది భారతీయుల్ని స్వదేశానికి పంపించారు.
2023, 2024లో భారతీయ అక్రమ వలసదారుల్ని తిప్పి పంపడం పెరిగింది. అయితే అత్యధిక సంఖ్య అంటే 2020లోనే. ఆ ఏడాది 2300 మంది భారతీయుల్ని అమెరికా వెనక్కి పంపించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














