మనుభాకర్: ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కలలు కనే క్రీడాకారులందరికీ స్ఫూర్తి’

బీబీసీ అవార్డుల కార్యక్రమం

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వేసిన ఓట్ల ప్రకారం 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్‌'గా ఒలింపిక్స్ పతక విజేత, షూటర్ మను భాకర్‌ నిలిచారు.

2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచి, ఒకే ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. మను భాకర్ 2021లో 'బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌'గా అవార్డును అందుకున్నారు.

బీబీసీ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు

అవార్డు అందుకున్న తర్వాత మను భాకర్ మాట్లాడుతూ.. "ఈ అవార్డు అందించినందుకు బీబీసీకి ధన్యవాదాలు. ఇది ఎత్తు పల్లాల ప్రయాణం. ఎన్నో మ్యాచ్‌లు గెలిచాను. కానీ ఇక్కడ మీ ముందు నిలవడం గర్వకారణం. ఇది దేశంలోని మహిళలకే కాకుండా పెద్ద ఎత్తున కలలు కనే క్రీడాకారులకు కూడా స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను'' అని అన్నారు.

‘‘ఇది వింటున్న ఆడపిల్లలందరికీ చెప్పేదేమిటంటే.. మీ శ్రమ వృథా పోదు. ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి. మనం ఎంత ఓపికగా ఉంటామనేదే ముఖ్యం. ఒకానొక సమయంలో నేను ఈ ఆటను వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో నేను ఆ పని చేసుంటే ఈరోజు మీ ముందు నిలబడేదాన్ని కాదు, పారిస్‌లో పతకాలు సాధించేదాన్ని కాదు, ఈ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకునేదాన్నీ కాదు" అని మను భాకర్ చెప్పారు.

"మనిషి ఆలోచనకు పరిమితులు లేవు, ఆటంకాలను దాటుకుంటూ ముందుకు సాగిపోవాలి’’ అని ఆమె అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అవనీ లేఖరాకు అవార్డు
ఫొటో క్యాప్షన్, మూడు పారాలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా అవని రికార్డు సృష్టించారు. ఆమె బీబీసీ పారా స్పోర్ట్ వుమన్ ఆఫ్ ది ఇయర్‌' అవార్డుకు ఎంపికయ్యారు.

పారా షూటింగ్‌లో చరిత్రాత్మక విజయాలు సాధించిన అవని లేఖరా 'బీబీసీ పారా స్పోర్ట్ వుమన్ ఆఫ్ ది ఇయర్‌' అవార్డుకు ఎంపికయ్యారు.

మూడు పారాలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా అవని రికార్డు సృష్టించారు.

2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు, కాంస్య పతకాలు, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకున్నారు అవని.

ఈ సందర్భంగా అవని లేఖరా మాట్లాడుతూ ‘‘కిందటిసారి టోక్యోలో పతకం గెలిచినప్పుడు తరువాత ఎలా ముందుకు వెళతావు అని చాలామంది అడిగారు. వారందరికీ బహుశా నేను 2024లో కొన్ని పతకాలు, లా డిగ్రీ నా చేతిలో ఉంటాయని చెప్పా. కిందటేడాది నేను ఆ రెండింటిని పొందాను. నేను లాలో మాస్టర్ డిగ్రీ చేద్దామనుకుంటున్నాను’’ అని చెప్పారు.

చంద్రచూడ్
బీబీసీ అవార్డులు, రాజీవ్ శుక్లా, అజారుద్దీన్
అజారుద్దీన్

ఈ వేడుకలో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, కాంగ్రెస్‌ నాయకులు సచిన్‌ పైలట్‌, ఎంపీ కార్తికేయ శర్మ, మాజీ ఎంపీ అజాహరుద్దీన్, బీసీసీఐ ఉపాధ్యక్షులు, ఎంపీ రాజీవ్ శుక్లా, సాక్షి మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

శీతల్ దేవీ
ఫొటో క్యాప్షన్, శీతల్ దేవీ

శీతల్ దేవీకి 'ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు'

భారత్ తరఫున పారాలింపిక్స్‌లో మెడల్ సాధించిన అతిపిన్న వయస్కురాలిగా నిలిచిన 18 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవీ 'బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు'ను గెలుచుకున్నారు.

మూడేళ్ల కాలంలో ఆమె సాధించిన విజయాలు చూస్తే... 2024 పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం, 2022 ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణ పతకాలు, ఒక రజతం, వరల్డ్ పారా ఆర్చరీ చాంపియన్ షిప్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు.

మిథాలీరాజ్

మిథాలీకి 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్'

18 ఏళ్ల పాటు భారత మహిళా క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా సేవలందించిన మిథాలీ రాజ్ 'బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు'ను గెలుచుకున్నారు.

2004 నుంచి 2022 మధ్య కాలంలో కెప్టెన్‌గా వ్యవహరించిన మిథాలీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక కాలం కెప్టెన్‌గా ఉన్నారు.

ఈ సందర్భంగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ "నాకు బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ఇచ్చినందుకు బీబీసీకి, జ్యూరీకి ధన్యవాదాలు. ఈ అవార్డు ఎంతో మంది అమ్మాయిలను ఈ చక్కని ఆట ఆడేందుకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను.

తులసిమతి మురుగేశన్
ఫొటో క్యాప్షన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తులసిమతి మురుగేశన్ బీబీసీ స్టార్ పెర్‌ఫార్మర్ 2024 అవార్డును గెలుచుకున్నారు
ప్రీతిపాల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ స్టార్ పెర్‌ఫార్మర్ అవార్డు అందుకుంటున్న ప్రీతిపాల్
చేంజ్ మేకర్
నస్రీన్ షేక్

బీబీసీ చేంజ్ మేకర్ 2024 అవార్డును చెస్ ప్లేయర్ తానియా సచ్‌దేవ్, ఖొఖో ప్లేయర్ నస్రీన్ షేక్, బీబీసీ స్టార్ పెర్‌ఫార్మర్ 2024 అవార్డు అథ్లెట్ ప్రీతిపాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ తులసిమతి మురుగేశన్ దక్కించుకున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ప్రశంసనీయ కార్యక్రమం: రాష్ట్రపతి

విజేతలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు.

"బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్' వంటి ప్రశంసనీయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బీబీసీ టీమ్‌ మొత్తాన్ని అభినందిస్తున్నాను. ఈ అవార్డు ద్వారా గుర్తింపు పొందిన అత్యుత్తమ క్రీడాకారిణులు కేవలం తమ ఆటలో గొప్పగా రాణించడమే కాదు, ఎంతో మంది అమ్మాయిలు నిర్భయంగా తమ కలలను సాకారం చేసుకునేలా స్ఫూర్తినిస్తున్నారు" అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ ప్రకటనలో తెలిపారు.

బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవి ఆధ్వర్యంలో దిల్లీలో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

టిమ్ డేవి

గౌరవంగా భావిస్తున్నాం: టిమ్ డేవి

"గొప్ప క్రీడాకారిణుల విజయాల గురించి యువతులు, బాలికలు వినడం ఎంత ముఖ్యమో మనకు తెలుసు. అయితే, ఈ ప్లేయర్లు తమ దారిలో ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్ల గురించి తెలుసుకోవడం కూడా కీలకం. కొత్త తరానికి నిజంగా స్ఫూర్తినిచ్చే ఇలాంటి కథనాలు లింగ మూస పద్ధతులను సవాలు చేయడం, అడ్డంకులను బ్రేక్ చేయడం, మహిళలు, క్రీడల గురించి ఆలోచనలు మార్చడంలో సహాయం చేస్తాయి" అని బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవి అన్నారు.

"ఒలింపిక్స్‌లో మను భాకర్ చరిత్రాత్మక ప్రదర్శన భారత క్రీడల్లో ఓ కీలక ఘట్టంగా నిలుస్తుంది. యంగ్ షూటర్ స్థాయి నుంచి ఒలింపిక్స్‌లో రికార్డులు బ్రేక్ చేసే వరకు సాగిన ఆమె ప్రయాణం దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్స్‌కు స్ఫూర్తిదాయకం. 'బీబీసీ పారా స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్' గా అవని లేఖరాను సత్కరించుకోవడం మేం గౌరవంగా భావిస్తున్నాం. ఆమె పట్టుదల, రికార్డులు బ్రేక్ చేసే విజయాలు మరింత మంది పారా స్పోర్ట్స్‌ వైపు అడుగులు వేసేలా ప్రోత్సాహాన్నిస్తాయి" అని టిమ్ డేవి అన్నారు.

"భారత్‌లోని ఆడియెన్స్ పట్ల బీబీసీకి ఉన్న నిబద్ధతే ఇక్కడి వారితో మా బంధాన్ని ప్రత్యేకంగా నిలుపుతోంది. భారత మహిళా క్రీడాకారిణుల అద్భుత విజయాలను వేడుక చేసుకోవడం మాకు గర్వకారణం" అని టిమ్ డేవి అన్నారు.

సీఈవో రూపా ఝా
ఫొటో క్యాప్షన్, క్రీడలలో మహిళల సమస్యలను పతాకశీర్షికలను దాటి చూడటమే తమ మిషన్ లక్ష్యమని కలెక్టివ్ న్యూస్‌రూమ్ సీఈవో రూపా ఝా అన్నారు.

మార్పు కోసం : సీఈవో రూపా ఝా

BBC ISWOTY 5వ ఎడిషన్‌ నిర్వహణ బాధ్యతలను 'కలెక్టివ్ న్యూస్ రూం' నిర్వహించింది.

కలెక్టివ్ న్యూస్‌రూమ్ సీఈవో రూపా ఝా మాట్లాడుతూ ''దేశంలో మహిళలు క్రీడలపై దృష్టిపెట్టేలా చేయడానికి పతాకశీర్షికలను దాటి చూడాలనే మా లక్ష్యం స్పష్టంగా ఉంది. క్రీడలలో అర్థవంతమైన మార్పు, ప్రగతి కోసం అవసరమైన చర్యలను అర్థం చేసుకోవడం, మహిళలు క్రీడలలో కొనసాగేందుకు సురక్షితమైన, అండగా ఉండటానికి ఎలాంటి వాతావరణం ఉండాలో అర్థం చేసుకోవడం, ఆటలంటే కేవలం పురుషులకే అనే సాధారణ అభిప్రాయాన్ని ఎలా మార్చాలో తెలుసుకోవడం. ఈ మార్పును తీసుకురావడానికి కొండలను కదిలించాల్సిన అవసరమేమీ లేదని మాకు తెలుసు. ఇందుకు స్థిరమైన, నిరంతర ప్రయత్నం అవసరం'' అన్నారు.

"క్రీడల్లో భారతీయ మహిళలు అడ్డంకులు అధిగమిస్తూ, సరికొత్త విజయాలను నమోదు చేస్తూ, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవడానికి ఈ అవార్డులు దోహదం చేయడం సంతోషంగా ఉంది. ఈ అవార్డులు కేవలం గుర్తింపు కోసం మాత్రమే కాదు, అంతకుమించి భారత్‌లో క్రీడలపై ఎప్పటికీ నిలిచిపోయే ప్రభావాన్ని చూపించడానికి కూడా ఉపయోగపడతాయి" అని రూపా ఝా అన్నారు.

ప్లేయర్లు ఛాంపియన్‌లుగా ఎదగడంలో వెన్నంటి నిలిచిన వ్యక్తులు, వారు అందించిన సహకారాన్ని తెలియజేయాలనే ఉద్దేశ్యంతో 'చాంపియన్స్ ఛాంపియన్' అనే థీమ్‌తో ఈ ఏడాది ఎడిషన్ జరిగింది.

అంధుల అథ్లెటిక్స్‌లో గైడ్ రన్నర్స్‌పై చేసిన స్పెషల్ డాక్యుమెంటరీ బీబీసీ ఆరు భారతీయ భాషల్లోని ప్లాట్‌ఫామ్స్‌పై, ఇంగ్లిష్ ఔట్‌లెట్స్‌పై అందుబాటులో ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)