బ్లైండ్ అథ్లెట్ రక్షిత రాజు: ‘నాకంటే ఎక్కువగా నా గైడ్ రన్నర్‌నే నమ్మాను’

రక్షిత, సిమ్రన్ శర్మ, పారాలంపిక్స్, జపాన్, పారిస్, గోల్డ్ మెడల్
ఫొటో క్యాప్షన్, రక్షిత
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నా చిన్నతనంలో మా ఊళ్లో అందరూ నన్ను ‘గుడ్డిది, దేనికీ పనికి రాదు’ అని అనడం విన్నానని రక్షిత రాజు చెప్పారు. ప్రస్తుతం ఆమెకు 24 ఏళ్లు. ఇప్పుడామె భారత దేశపు ప్రముఖ మిడిల్ డిస్టెన్స్ పారా అథ్లెట్.

‘ఇది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది’ అని ఆమె అన్నారు.

రక్షిత పుట్టుకతోనే అంధురాలు. పదేళ్ల వయసులో తల్లిదండ్రుల్ని కోల్పోయారు. దీంతో ఆమె చెవుడు, నత్తితో బాధ పడుతున్న తన అమ్మమ్మ దగ్గర పెరగాల్సి వచ్చింది.

"మేమిద్దరం వికలాంగులమే. అందుకే మా అమ్మమ్మ నన్ను సులభంగా అర్థం చేసుకునేది. వైకల్యం గురించి ఎక్కువగా బాధ పడవద్దని చెప్పేది" అని రక్షిత చెప్పారు.

రక్షితకు 13ఏళ్లున్నప్పుడు ఆమె చదువుకుంటున్న స్కూలులో టీచర్ ఆమెతో ‘నీలో మంచి క్రీడాకారిణి అయ్యే లక్షణాలు ఉన్నాయి’ అని చెప్పారు.

"నేను ఆశ్చర్యపోయాను, అవునా, ఎలా? నేను అంధురాలిని. నాకు కనిపించని ట్రాక్ మీద ఎలా పరుగెత్తగలను" అని టీచర్‌ను అడిగానని ఆమె గుర్తు చేసుకున్నారు.

దృష్టి లోపం ఉన్నవారు గైడ్ సాయంతో పరుగెత్తవచ్చని ఆమె టీచర్ వివరించారు. గైడ్ పక్కనే వారు పరుగెత్తవచ్చని చెప్పారు. అంధులైన అథ్లెట్ల కోసం ట్రాక్ మీద రెండు లేన్లు ఉంటాయి. ఈ రెండు లేన్లలో అథ్లెట్‌తో పాటు గైడ్ రన్నర్ పరుగెత్తుతారు. చిన్న తాడుకు రెండు చివర్లలో ముడులు వేసి చేతులకు కట్టుకుంటారు.

ఇలా ఇద్దరూ పరుగెత్తవచ్చని ఆమె టీచర్ రక్షితకు వివరించారు. రక్షితకు ఇది ఆశ్చర్యంగా అనిపించింది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రక్షిత, సిమ్రన్ శర్మ, పారాలంపిక్స్, జపాన్, పారిస్, గోల్డ్ మెడల్
ఫొటో క్యాప్షన్, అథ్లెట్లలో దృష్టి లోపానికి సంబంధించి హెచ్చు తగ్గులు ఉండటంతో, పోటీ పారదర్శకంగా ఉండేందుకు వారు కళ్లకు మాస్కు పెట్టుకుంటారు.

కొన్ని రోజుల పాటు. ఇతర విద్యార్థులు ఆమెకు గైడ్ రన్నర్‌గా వ్యవహరించేవారు. 2016లో రక్షితకు 15 ఏళ్లున్నపుడు ఆమె జాతీయ క్రీడల్లో పోటీ పడ్డారు. అక్కడ ఆమెను రాహుల్ బాలకృష్ణ గుర్తించారు.

రాహుల్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్. గతంలో ఆయన 1500 మీటర్ల రేస్‌లో పాల్గొన్నారు. కొన్నేళ్ల కిందట ఆయనను పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కోచ్ ఒకరు పారా అథ్లెట్లకు పరిచయం చేశారు. ఆ సమయంలో ఆయన గాయం నుంచి కోలుకుంటున్నారు.

పారా అథ్లెట్లకు అవసరమైన గైడ్స్, కోచ్‌ల విషయంలో కొరత ఉండటంతో ఈ రెండు పాత్రలు పోషించాలని రాహుల్ నిర్ణయించుకున్నారు. కోచ్‌గా ఆయన అందిస్తున్న సేవలకు ప్రభుత్వం జీతం చెల్లిస్తుంది. అయితే గైడ్ రన్నర్లకు ప్రభుత్వం ఎలాంటి వేతనం ఇవ్వదు.

అయితే, దృష్టి లోపం ఉన్న రన్నర్లు అంతర్జాతీయ పోటీల్లో పతకం గెలిస్తే వారి గైడ్ రన్నర్‌కు పతకం లభిస్తుంది. దీంతో రాహుల్ తన కెరీర్‌లో తాను సాధించలేకపోయిన విజయాన్ని రక్షిత ద్వారా సాధించాలని భావించారు. "దేశం కోసం ఈ పని చేయగలిగినందుకు చాలా గర్వంగా ఉంది" అని ఆయన చెప్పారు.

రక్షిత, సిమ్రన్ శర్మ, పారాలంపిక్స్, జపాన్, పారిస్, గోల్డ్ మెడల్
ఫొటో క్యాప్షన్, రాహుల్, రక్షిత ఎనిమిదేళ్లుగా కలిసి శిక్షణ తీసుకుంటున్నారు.

రక్షితకు అండగా నిలిచేందుకు ఆయన తన సమయాన్ని, డబ్బును కేటాయించారు. మెరుగైన శిక్షణ వసతుల కోసం 2018లో ఆమెను బెంగళూరు తీసుకెళ్లారు. అక్కడ ఆమె గవర్నమెంట్ హాస్టల్‌లో ఉంటూ రాహుల్‌తో కలిసి శిక్షణ తీసుకునేవారు.

"ఈ పరుగులో చిన్న చిన్న అంశాలు కూడా కీలకమే. ట్రాక్ మీద పరుగెత్తేటప్పుడు మలుపు దగ్గర గైడ్ రన్నర్ అథ్లెట్‌ను హెచ్చరించాల్సి ఉంటుంది. అలాగే మిగతా వాళ్ల కంటే వెనుకబడినప్పుడు కూడా ఆ విషయం వాళ్లకు చెబితే, మరి కొంతశక్తితో వేగంగా పరుగు తీస్తారు" అని రాహుల్ తెలిపారు.

పరుగు పందెంలో నిబంధనల ప్రకారం అథ్లెట్, గైడ్ రన్నర్ ఒకరి చేతులు ఒకరు పట్టుకోకూడదు. అయితే వారు ఫైనల్ లైన్ చేరుకునే వరకు చేతులకు చిన్న తాడును తగిలించుకోవచ్చు. దీంతోపాటు గైడ్ రన్నర్ పోటీల్లో పాల్గొనే అథ్లెట్‌ను నెట్టడం, లాగడం, లేదా వారిని ముందుకు నడిపించేలా ఎలాంటి పనులు చెయ్యకూడదు.

శిక్షణ సమయంలో ఇద్దరి మధ్య బలమైన బంధం ఉండాలి. ‘నేను నా కంటే ఎక్కువగా నా గైడ్‌ రన్నర్‌ను నమ్ముతాను’ అని రక్షిత చెప్పారు.

వారి కఠోర శ్రమ, శిక్షణకు తగిన ఫలితం దక్కింది. 2018, 2023 ఏషియన్ గేమ్స్‌లో రక్షిత బంగారు పతకాలు సాధించారు. ఈ విజయాల తర్వాత గ్రామ ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గతంలో తనను రకరకాల మాటలు అన్న గ్రామస్థులే తనను ఊరేగింపుగా తీసుకెళ్లడం గురించి రక్షిత నవ్వుతూ చెప్పారు.

రక్షిత, సిమ్రన్ శర్మ, పారాలంపిక్స్, జపాన్, పారిస్, గోల్డ్ మెడల్
ఫొటో క్యాప్షన్, రక్షితతో పాటు ఆమె అమ్మమ్మ, రాహుల్‌ను ఊరేగింపుగా తీసుకెళుతున్న గ్రామస్తులు

2024లో పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో 1500 మీటర్ల పరుగు పందెంలో రాహుల్‌తో కలిసి పాల్గొనేందుకు అర్హత సాధించిన అంధురాలైన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా రక్షిత గుర్తింపు పొందారు.

ఫ్రాన్స్‌లో వారికి పతకం దక్కలేదు. అయితే భారత్ తరఫున పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొనేందుకు అంధులైన అథ్లెట్లలో రక్షిత ఒక్కరికే అవకాశం దక్కింది. ఆ పోటీల్లో స్ప్రింటర్ సిమ్రన్ శర్మ కాంస్య పతకాన్ని సాధించారు.

సిమ్రన్‌కు స్వల్ప దృష్టి లోపం ఉంది. ఆమె పోటీల్లో పాల్గొన్నప్పుడు ఒంటరిగానే పరుగెత్తారు.

2021లో సిమ్రన్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు, ఆమె ట్రాక్ మీద తనకు కేటాయించిన లేన్ దాటి పక్కకు వెళ్లారు. పక్కనున్న లేన్‌ను చూడలేకపోయారు. దీంతో పరుగు పోటీల్లో కొనసాగాలంటే తనకు కూడా గైడ్ కావాలని ఆమె తెలుసుకున్నారు. దిల్లీలో ఉంటున్న ఆమెకు గైడ్ రన్నర్‌ను వెదకడం సవాలుగా మారింది.

"అది ఎవరైనా కావచ్చు. వారికి మనతో పాటు వేగంగా పరుగెత్తగల శక్తి, టెక్నిక్ ఉందా అన్నది ముఖ్యం" అని ఆమె వివరించారు.

రక్షిత, సిమ్రన్ శర్మ, పారాలంపిక్స్, జపాన్, పారిస్, గోల్డ్ మెడల్
ఫొటో క్యాప్షన్, పారిస్‌ పారాలింపిక్స్‌లో తన గైడ్ రన్నర్‌తో కలిసి సిమ్రన్ 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు.

కొంత మంది గైడ్‌ రన్నర్‌లతో ఆమె చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. వారు ఆమె స్పీడును అందుకోలేక పోయారు. దిల్లీకే చెందిన అభయ్‌ కుమార్ రూపంలో సిమ్రన్‌ శర్మకు సరైన జోడీ దొరికింది. ఆమె శిక్షణ తీసుకునే ప్రాంతంలోనే అభయ్ కుమార్ కూడా ట్రైనింగ్‌లో ఉన్నాడు.

18 ఏళ్ల అభయ్ ‌కుమార్ పోటీలలో పాల్గొంటూనే సిమ్రన్‌కు శిక్షణ ఇచ్చే వారు. దీంతో ఆయనకు అంతర్జాతీయ పోటీలలో పాల్గొనే అవకాశం దక్కింది.

"వాళ్లు నాకు వీడియోలు పంపేవారు, వాటిని చూసిన తర్వాత 'నేను వేగంగా నేర్చుకుంటాను. ఇది నాకు పెద్ద కష్టమేమీ కాదనిపించింది. అయితే తొలిసారి సిమ్రన్‌తో పరుగెత్తినప్పుడు చాలా కష్టంగా అనిపించింది" అని అభయ్ కుమార్ చెప్పారు.

"ట్రాక్ మీద పరుగెత్తేటప్పుడు మలుపు వద్దకు వచ్చినప్పుడు లోపలి వైపున్న చెయ్యి తక్కువగా, బయట వైపు ఉన్న చెయ్యి ఎక్కువగా కదిలించాల్సి వచ్చేది. అయితే ఆమెతో పరుగెత్తేటప్పుడు నేను ఆమెకు బయట ఉండేవాడిని" అని అభయ్ చెప్పారు. దీని వల్ల అతని రెండు చేతులు ఒకేలా కదిలించడానికి వీలయ్యేదని, సిమ్రన్‌కు ఎలాంటి సమస్య వచ్చేది కాదని తెలిపారు.

అంధులైన అథ్లెట్లతో పరుగెత్తేటప్పడు గైడ్ రన్నర్లు ప్రతి చిన్న విషయాన్ని సమన్వయం చేసుకోవాలి. పరుగు మొదలు పెట్టినప్పటి నుంచి ఫినిషింగ్ లైన్ చేరే వరకు ఇద్దరి మధ్య ఒకే అవగాహన ఉండాలి. అథ్లెట్లు గైడ్ రన్నర్ల కంటే ముందు ఫినిషింగ్ లైన్‌ను చేరుకోవాలి.

2024లో జపాన్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో పాల్గొనేందుకు వారికి అవకాశం దొరికినా, ఈ పోటీలకు కొన్ని రోజులకు ముందు మాత్రమే వారిద్దరి జోడీ కుదిరింది. దీంతో వారికి తగినంతగా ప్రాక్టీస్ సమయం దొరకలేదు.

రక్షిత, సిమ్రన్ శర్మ, పారాలంపిక్స్, జపాన్, పారిస్, గోల్డ్ మెడల్
ఫొటో క్యాప్షన్, సరైన సమన్వయం కోసం సిమ్రన్, అభయ్ కుమార్ శిక్షణలో అన్ని విధాలుగా శ్రమించారు.

అభయ్, సిమ్రన్ కలిసి పాల్గొన్న తొలి 100 మీటర్ల రేస్ విఫలమైంది.

"మా ఇద్దరిలో ఎవరికీ నిబంధనలు సరిగ్గా తెలియదు. నేను ఫినిషింగ్ లైన్ దాటేందుకు వీలుగా తను ఆగిపోవాలని అభయ్ కుమార్ భావించారు. దీంతో అతను పూర్తిగా ఆగిపోయారు" అని సిమ్రన్ చెప్పారు.

అభయ్ కుమార్ ఆమె కంటే ముందే లైన్ దాటడంతో వాళ్లపై అనర్హత వేటు పడింది.

అయితే అదే సమయంలో వాళ్లకు 200 మీటర్ల పోటీ కూడా ఉంది. తాము బంగారు పతకానికి అడుగు దూరంలో ఉన్నామని వాళ్లకు తెలుసు. ఆ పోటీల్లో టీ 12 కేటగిరీలో సిమ్రన్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది.

పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో నాలుగో స్థానంలో నిలిచారు వారు. 200 మీటర్ల పోటీలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. దృష్టి లోపంతో బాధపడుతూ పారాలింపిక్ మెడల్ సాధించిన తొలి భారతీయ పారాలింపిక్ మహిళా అథ్లెట్‌గా సిమ్రన్ గుర్తింపు పొందారు.

"మేమిద్దరం కలిసి పతకం సాధించామని నాకు తెలియలేదు. అయితే ఆ సమయంలో నా గైడ్ మనం పతకం సాధించడమే కాదు, వ్యక్తిగతంగా నేను బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ చూపించానని చెప్పారు" అని సిమ్రన్ నవ్వుతూ చెప్పారు.

రక్షిత, సిమ్రన్ శర్మ, పారాలంపిక్స్, జపాన్, పారిస్, గోల్డ్ మెడల్
ఫొటో క్యాప్షన్, పారిస్‌లో 200 మీటర్ల రేసులో సిమ్రన్, అభయ్ మూడో స్థానంలో నిలిచారు.

పారాలింపిక్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు ప్రభుత్వం సిమ్రన్‌ను అర్జున అవార్డుతో గౌరవించింది.

100 మీటర్ల పందెంలో ఓడిపోవడంతో అభయ్ కుమార్‌ తనకు గైడ్‌గా కొనసాగుతారా లేదా అనే దాని గురించి ఆమె ఆందోళన చెందారు. అతను తన కెరీర్ కోసం తనను వదిలేస్తాడేమో అనుకున్నారు.

అథ్లెట్ గెలిచినప్పుడు గైడ్ రన్నర్‌కు కూడా పతకం దక్కుతుంది. అయితే గైడ్ రన్నర్లకు జీతాలు, నగదు బహుమతులు ఇవ్వడం లేదని, వారి కెరీర్ కూడా ఎక్కువకాలం కొనసాగడం కష్టమని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.

"మేం వాళ్లకు ఆహారం, వసతి, రవాణా, శిక్షణ సౌకర్యాలు కల్పించడంలో మాత్రమే సాయపడగలం" అని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నేషనల్ అథ్లెటిక్స్ కోచ్ సత్యనారాయణ చెప్పారు.

ప్రస్తుతం రక్షిత, సిమ్రన్‌కు స్పాన్సర్‌షిప్ ఉంది. దీంతో వారి శిక్షణకు అవసరమైన నిధులు అందుతాయి. అందులో నుంచి వాళ్లు తమ గైడ్లకు కూడా చెల్లించవచ్చు. తాము గెలుచుకున్న నగదు బహుమతిలో నుంచి కొంత వారికి కూడా అందించవచ్చు. అయితే ప్రభుత్వం నుంచి మరింత మద్దతు లభించాలని రాహుల్, అభయ్ కోరుతున్నారు. అథ్లెట్లు, మహిళల కోసం రిజర్వ్ చేసిన ఉద్యోగాల్లో ఇతర క్రీడాకారులకు ఇస్తున్నట్లే అంధులైన మహిళా అథ్లెట్లకు అవకాశం కల్పించాలంటున్నారు.

సిమ్రన్ లాస్ఏంజిల్స్‌లో జరగనున్న పారాలింపిక్స్ ‌మీద దృష్టి పెట్టారు. ఈసారి తాను బంగారం పతకం గెలుస్తాననే ధీమాతో ఉన్నారు.

రక్షిత కూడా ఈసారి పతకం సాధిస్తాననే ఆశతో ఉన్నారు. "ఆమె తప్పక పతకం గెలుస్తారు" అని రక్షిత గైడ్ రన్నర్ రాహుల్ చెప్పారు.

"గ్రామాల్లో ఆమె లాంటి వాళ్లు అనేక మంది ఉన్నారు. క్రీడల గురించి, అందులో వారికున్న అవకాశాల గురించి వాళ్లకేమీ తెలియదు. వారికి రక్షిత మార్గదర్శిగా నిలవాలి" అని రాహుల్ ఆకాంక్షిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, ‘నాకంటే ఎక్కువగా నా గైడ్ రన్నర్‌నే నమ్మాను’

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)