బ్యాంకులు అప్పులివ్వడానికి, క్రెడిట్ స్కోరుకు లింకేంటి, స్కోరు చెక్‌చేసుకోకపోతే ఏమవుతుంది?

క్రెడిట్ స్కోర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రెడిట్ స్కోరును బట్టి బ్యాంకులలో లోన్లు లభ్యమవుతుంటాయి.
    • రచయిత, నాగేంద్ర సాయి కుందవరం
    • హోదా, బిజినెస్ అనలిస్ట్, బీబీసీ కోసం

అప్పు లేకుండా ఈ రోజుల్లో జీవితం దాదాపుగా సాగదంటే అతిశయోక్తి కాదు. యాప్స్‌లో క్రెడిట్‌ కార్డులతో చేసుకునే రీచార్జ్‌ మొదలు, పిల్లల స్కూల్‌ ఫీజులు (ఎడ్యుకేషన్‌ లోన్‌), కారులోన్‌, హౌసింగ్‌ లోన్‌, మార్ట్‌గేజ్‌ లోన్‌, బిజినెస్‌ లోన్‌…ఇలా ఎన్నో రకాల అప్పులు.

అవసరం లేకపోయినా కొన్నిసార్లు మొహమాటంతో కొందరు రుణం తీసుకుంటుంటారు. అయితే ఇలా అప్పు పుట్టడానికి, పుట్టకపోవడానికి మన పరపతి, ఆర్థిక స్థోమతే కారణం.

కొంత మందికి బ్యాంకులు వెంటపడి మరీ లోన్స్‌ ఇస్తామని ఫోన్లు చేస్తాయి. ఇంకొంత మంది బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పైసా అప్పు పుట్టదు. వీటన్నింటికీ లింక్‌ ఉన్న ఏకైక ఫ్యాక్టర్‌.. క్రెడిట్‌ స్కోర్‌.

ఇంతకీ ఈ క్రెడిట్‌ స్కోర్‌ అంటే ఏంటి? క్రెడిట్‌ బ్యూరో రిపోర్ట్‌ ఎక్కడ చూడొచ్చు? అప్పు తీసుకున్న వాళ్లు, తీసుకోవాలని అనుకుంటున్న వాళ్లు ఎన్నాళ్లకు ఓసారి ఈ రిపోర్ట్‌ చూసుకోవాలి? ఈ క్రెడిట్‌ రిపోర్ట్‌లో ఏం ఉంటుంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

క్రెడిట్ స్కోరు ఎవరిస్తారు?

ఒక దేశానికైనా, కంపెనీకైనా, వ్యక్తికైనా అప్పు ఇచ్చేముందు బ్యాంకులు చూసే ఏకైక విషయం - తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా లేదా అని. దేశాలకు సావరిన్‌ రేటింగ్‌ లాంటిదే వ్యక్తులకు క్రెడిట్‌ బ్యూరోలు ఇచ్చే క్రెడిట్ స్కోర్‌.

ప్రస్తుతం భారత్‌లో ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌, ఎక్స్‌పీరియన్‌, ఈక్విఫ్యాక్స్‌, క్రిఫ్‌ హైమార్క్‌ పేర్లతో నాలుగు క్రెడిట్‌ బ్యూరోలు ఉన్నాయి. వీటికి ఆర్బీఐ గుర్తింపు ఉంటుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర రుణదాత సంస్థలతో ఈ కంపెనీలు పనిచేస్తాయి. వాళ్లందరి దగ్గరి నుంచి సమాచారాన్ని తీసుకుని, క్రోడీకరించి రిపోర్టులు తయారు చేసి, క్రెడిట్‌ స్కోర్‌ ఇస్తాయి.

క్రెడిట్ స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750పైన స్కోర్‌ ఉంటే సులువుగా, తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు క్రెడిట్‌ స్కోర్‌ చెక్‌ చేసుకుంటూ ఉండాలి. అన్నీ సక్రమంగా టైమ్‌కు కట్టేస్తున్నాం కదా ఇంకెందుకు అనుకోవద్దు. మనం కట్టే పేమెంట్స్‌ అన్నీ లోన్‌ అకౌంట్లలో నమోదవుతున్నాయా లేదా? ఎక్కడైనా డిఫాల్ట్‌ మార్క్‌ పడిందా? లోన్‌ క్లోజర్స్‌ పక్కాగా అందులో నమోదయ్యాయా, లేదా? అనే అంశాలు చూసుకోవాలి.

వీటితో పాటు మన డేటాను ఎవరైనా దొంగిలించి, లోన్లు వంటివి తీసుకునే ప్రమాదం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. రేపు మనకు మళ్లీ అప్పు పుట్టాలన్నా, ఉన్న క్రెడిట్‌ స్కోర్‌ కాపాడుకోవాలన్నా ఈ రిపోర్ట్‌ ఒక్కటే ఆధారం.

క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్టు
ఫొటో క్యాప్షన్, ఏడాదికి ఒకసారి నాలుగు సంస్థల నుంచి క్రెడిట్ రిపోర్టులను ఉచితంగానే పొందొచ్చు

రిపోర్టులో ఏం చూడాలి?

సాధారణంగా క్రెడిట్‌ బ్యూరో ఇచ్చే ఫుల్‌ లెంగ్త్‌ రిపోర్ట్‌లో మన పూర్తి పేరు, ఇంటి పేరు, తండ్రి లేదా భర్త పేరుతో పాటు ఇంత వరకు వివిధ సంస్థలకు ఇచ్చిన ఇంటి చిరునామాలన్నీ ఉంటాయి. మనం పని చేసే ప్రస్తుత ఆఫీస్‌, పాత ఆఫీస్‌లు, డిజిగ్నేషన్స్‌ వంటివి కూడా ఉంటాయి.

వీటిల్లో ఏదైనా తేడాలు గమనించినా, వీటిని పొరపాటున ఎవరైనా వాడినట్టు అనిపించినా వెంటనే బ్యూరోకు రిపోర్ట్‌ చేయండి. ఎందుకంటే మీ పేరు, ఫోన్‌ నెంబర్‌, అడ్రస్‌, పాన్‌ వంటివి ఇతరులు వాడితే మీకు భవిష్యత్తులో ఇబ్బంది ఎదురవ్వొచ్చు.

మనకు ఎన్ని లోన్లు ఉన్నాయి? ఏ సంస్థ ఎంత లోన్‌ ఇచ్చింది? ఇంకా మనం ఎంత బకాయి ఉన్నాం? పేమెంట్‌ హిస్టరీ ఎలా ఉంది? వంటి వివరాలుంటాయి. వీటితో పాటు మనకు ఉన్న హౌసింగ్‌ లోన్లు, వాహన రుణాలు, పర్సనల్‌ లోన్లు, బై నౌ - పే లేటర్‌ లోన్లు వంటి సమాచారం ఉంటుంది. ఇవే కాకుండా గతంలో పూర్తయిన రుణాల వివరాలు, క్రెడిట్‌ కార్డ్స్‌ క్లోజ్‌ చేసేసి ఉంటే వాటి వివరాలు కూడా ఉంటాయి. వీటిల్లో తప్పొప్పులు ఏవైనా ఉన్నాయేమో సరిచూసుకోవాలి.

మనం వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి చేసిన ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్‌ కూడా ఉంటుంది. క్రెడిట్‌ కార్డ్‌, పర్సనల్‌ లోన్‌, హౌసింగ్‌ లోన్ వంటివి ఎంక్వైరీ చేసినా కూడా ఇందులో డేటా ఫీడ్‌ అయి ఉంటుంది. హార్డ్‌ ఎంక్వైరీ చేసిన ప్రతిసారీ ఇందులో కచ్చితంగా నమోదవుతుంది.

ఏదైనా బ్యాంక్‌లో ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ చేసుకుంటే ఆ వివరాలు కూడా ఉంటాయి. రైట్‌ ఆఫ్‌ (Write Off) చేసుకుంటే అందులో అసలు ఎంత? వడ్డీ మొత్తం ఎంత? మొత్తం అప్పులో ఎంత సెటిల్‌ చేసుకున్నారు? వంటి వివరాలు కూడా నమోదై ఉంటాయి. వీటన్నింటినీ జాగ్రత్తగా రిపోర్టులో చెక్‌ చేసుకోవాలి.

క్రెడిట్ స్కోర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రెడిట్‌ స్కోర్‌ 750పైన ఉంటే సులువుగా, తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయి

ఎప్పుడు, ఎందుకు చెక్ చేసుకోవాలి?

సాధారణంగా ఏడాదికి రెండుసార్లు, కుదరకపోతే కనీసం ఒక్కసారైనా ఈ క్రెడిట్‌ రిపోర్ట్‌ చెక్‌ చేసుకోవడం మంచిది.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి క్రెడిట్‌ బ్యూరో సంస్థ ఏడాదికోసారి ఉచితంగా రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నాలుగు క్రెడిట్‌ సంస్థల నుంచి ఒక్కోసారి చొప్పున ఏడాదిలో నాలుగుసార్లు ఫ్రీగానే రిపోర్ట్‌ చెక్‌ చేసుకోవచ్చు.

సదరు సంస్థను సంప్రదించి, మెయిల్లో ఈ రిపోర్ట్‌ పొందొచ్చు.

క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్యాంకులు ఎవరికైనా లోన్లు ఇవ్వాలంటే క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తాయి.

క్రెడిట్ స్కోర్ ఎందుకు చూడాలంటే...

  • సడెన్‌గా మన క్రెడిట్ స్కోర్ తగ్గిపోయినప్పుడు దానికి కారణం తెలుసుకోవడానికి
  • తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి
  • మంచి క్రెడిట్‌ స్కోర్‌, క్రెడిట్‌ హిస్టరీ మెయింటైన్‌ చేయడానికి
  • మనకు ఎక్కడెక్కడ ఎంత లోన్స్‌ ఉన్నాయో స్పష్టత కోసం
  • ఏదైనా పెద్ద లోన్‌ (హౌసింగ్‌ లోన్‌) వంటివి అప్లై చేసే ముందు లోన్ మంజూరయ్యే అవకాశం ఎంత, తిరస్కరణకు గురయ్యే అవకాశమెంత, రిస్క్‌ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూసుకోవడానికి
  • ఏదైనా లోన్ మన అకౌంట్లో తప్పుగా రిఫ్లెక్ట్ అయితే సరిచేసుకోవడానికి
  • లోన్ క్లియర్ చేసి నో డ్యూ సర్టిఫికెట్‌ తెచ్చుకున్నా అది క్లోజ్ అయినట్టు చూపించకపోతే సరిచేసుకోవడానికి

ఏ లోన్‌ అప్లై చేసే ముందైనా క్రెడిట్ స్కోర్‌ ఎంతుందో చూసుకోవడం ఉత్తమం.

క్రెడిట్‌ స్కోర్‌లో కేవలం మన స్కోర్‌ మాత్రమే ఉంటుంది. అదే క్రెడిట్‌ రిపోర్ట్‌లో అయితే ఆర్థిక జాతకమంతా ఉంటుంది.

ఎప్పుడు, ఎక్కడ, ఎంత లోన్‌ మొత్తానికి దరఖాస్తు చేసుకున్నారు అనే అంశాలు మొదలు.. ఎంత శాంక్షన్ అయింది, ఎంత బాకీ ఉంది, ఎంత ఈఎంఐ ఎప్పుడు చెల్లిస్తున్నారు.. వంటివన్నీ ఇందులో ఉంటాయి. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి.

క్రెడిట్ స్కోర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏడాదికి రెండుసార్లు క్రెడిట్ రిపోర్టు చెక్ చేసుకోవాలి.

తప్పులుంటే ఎవరిని సంప్రదించాలి?

ఒక్కోసారి డేటా చౌర్యం వల్లో లేదా డేటా ఎంట్రీ లోపాల వల్లో స్కోర్‌పై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు మన పేరు లేదా ఇతర వివరాలు ఇంకెవరితోనైనా మ్యాచ్ అయితే వాళ్ల క్రెడిట్‌ డిఫాల్ట్స్ వంటివి మన అకౌంట్‌లో పడిపోవచ్చు. ఇలా కొన్ని కేసుల్లో జరిగింది.

అందుకే రిపోర్ట్స్‌ చెక్‌ చేసినప్పుడు ఏదైనా తప్పు ఉంటే వెంటనే క్రెడిట్‌ బ్యూరోకు మెయిల్‌ ద్వారా తక్షణ సమాచారం ఇవ్వాలి. వాళ్లు కోరిన వివరాలు ఇచ్చి, ఆ తప్పులను సరిచేయించుకోవాలి.

కొన్నిసార్లు మన డేటాను వాడుకుని, ఇతరులు కన్స్యూమర్‌ లోన్లకు అప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి స్కామ్స్‌ నుంచి వెంటనే తేరుకుని బయటపడటానికైనా రిపోర్ట్స్‌ చెక్‌ చేయాలి. వెంటనే క్రెడిట్‌ బ్యూరో సంస్థలకు ఈ వివరాలను అందించాలి.

ఏడాదికి ఒకసారి నాలుగు సంస్థల నుంచి ఈ రిపోర్టులను ఉచితంగానే పొందొచ్చు కాబట్టి కనీసం మూడు రిపోర్టులైనా తీసుకుని పరిశీలించడం మంచిది.

ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ చెల్లించిన వాళ్లకు ఈ సంస్థలు మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. స్కోర్‌లో ఏదైనా మార్పు జరిగినప్పుడు వెంటనే ఎస్ఎంఎస్‌, మెయిల్‌ రూపంలో అలర్ట్ చేస్తాయి. అలానే ఏదైనా ఎంక్వైరీ చేసినప్పుడు ఆ వివరాలను కూడా ఎస్ఎంఎస్‌ రూపంలో తెలియజేసే వెసులుబాటు ఉంది.

దీనికి ఈ సంస్థలు ఏడాదికి సుమారు రూ.1000 నుంచి 1200 వరకూ చార్జ్‌ చేస్తున్నాయి .

క్రెడిట్ కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రెడిట్ రిపోర్టును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.

స్కోర్ ఎప్పుడు తగ్గుతుంది?

క్రెడిట్‌ స్కోర్‌ తగ్గడానికి, పెరగడానికి మనం చేసే కొన్ని పనులు కారణమవుతాయి.

అవసరం ఉన్నా లేకపోయినా క్రెడిట్‌ ఎంక్వైరీలు చేయడం, లోన్లు తీసుకోవాలని తాపత్రయపడటం వంటివి మన స్కోర్‌పై నెగిటివ్‌ ఎఫెక్ట్ చూపిస్తాయి.

బ్యాంకుల పరిభాషలో సాఫ్ట్ ఎంక్వైరీ, హార్డ్‌ ఎంక్వైరీ అని రెండు ఉంటాయి.

సాఫ్ట్‌ ఎంక్వైరీలో - స్కోర్‌ సమాచారం అడగడం, ప్రీ అప్రూవల్‌ లోన్స్‌ గురించి తెలుసుకోవడం, క్రెడిట్‌ రిపోర్టులకు సంబంధించి సెల్ఫ్‌ చెక్‌ చేయడం వంటివి ఉంటాయి. వీటికి ఎలాంటి ఇంపాక్ట్‌ ఉండదు.

అదే లోన్‌ (క్రెడిట్ కార్డ్ అప్లికేషన్‌, లోన్‌ అప్లికేషన్‌ వంటివి) గురించి బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ సంస్థను సంప్రదించడాన్ని హార్డ్‌ ఎంక్వైరీగా పరిగణిస్తారు. అయితే ఈ హార్డ్‌ ఎంక్వైరీని కేవలం బ్యాంక్స్‌ మాత్రమే ప్రాసెస్‌ చేయగలవు. వాళ్లకు మాత్రమే ఈ డీటైల్స్‌ కనిపిస్తాయి. ఈ హార్డ్‌ ఎంక్వైరీ చేయడం వల్ల కూడా స్కోర్‌ నెగిటివ్‌గా ప్రభావితమవుతుంది.

అందుకే పదే పదే క్రెడిట్‌ ఎంక్వైరీ చేస్తుంటే స్కోర్‌ తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోతే తిరిగి బిల్డ్‌ చేసుకోవడం అంత సులభం కాదు. ఎప్పటికప్పుడు క్రెడిట్ రిపోర్టులు గమనిస్తూ, మీ ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)