బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-మను భాకర్: పడి లేచిన కెరటం

- రచయిత, సౌరభ్ దుగ్గల్
- హోదా, స్పోర్ట్స్ జర్నలిస్ట్
2024 పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు కాంస్య పతకాలు గెలవడం ద్వారా, స్వతంత్ర భారత్‌లో ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది.
అయితే, టోక్యో ఒలింపిక్స్‌లో తనకు ఎదురైన అత్యంత కఠినమైన పరిస్థితులను ప్రస్తావించకుండా కేవలం పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె విజయం గురించి చెప్పడం అర్ధవంతంగా ఉండదు.

గోల్డ్ మెడల్ సాధిస్తుందన్న అంచనాలతో టోక్యో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది మను భాకర్.
ఎందుకంటే, 2018 కామన్ వెల్త్ గేమ్స్‌లో ఆమె గోల్డ్ మెడల్ సాధించింది. అదే ఏడాదిలో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లోనూ సిల్వర్ మెడల్ గెలుచుకుంది.
2021 వరకు వివిధ షూటింగ్ వరల్డ్ కప్స్‌లో 9 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకుందామె.
అయితే, టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న మూడు ఈవెంట్స్‌లోనూ క్వాలిఫైయింగ్ రౌండ్‌ను కూడా దాటలేకపోయింది.
వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఫెవరేట్‌గా బరిలోకి దిగిన మను భాకర్, పిస్టల్ సరిగ్గా పని చేయకపోయినప్పటికీ కేవలం 2 పాయింట్ల తేడాలో అర్హత సాధించలేకపోయింది.
అప్పుడు ఎదురైన విమర్శలే మను భాకర్ మరింత బలమైన పునరాగమనానికి దోహదం చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
షూటింగ్ అలా మొదలైంది
మొదట మను భాకర్ ఒక అథ్లెట్. స్కూల్ దశలోనే బాక్సింగ్, రోలర్ స్కేటింగ్, కబడ్డీ, అథ్లెటిక్స్ వంటి వాటిలో మెడల్స్ సాధించింది. ఆ తరువాత కరాటే, ఇతర మార్షల్ ఆర్ట్స్‌లోనూ జాతీయ స్థాయి మెడల్స్ గెలుచుకుంది.
2016లో మను భాకర్ తాను 10వ తరగతి చదువుతున్న సమయంలో తొలిసారిగా షూటింగ్‌ను సీరియస్‌గా తీసుకుంది.
2007-08 సమయంలో ఆమె తండ్రి ఇంగ్లండ్‌లో మెరీన్ ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్న సమయంలో షూటింగ్ రేంజ్‌కు వెళ్లేవారు. అలా తండ్రి నుంచి మనుకు ఈ ఆటపై ఆసక్తి కలిగింది.
"మెరీన్ అకాడమీలో కొందరు ఇంజినీర్స్ ఒత్తిడిలో ఉన్నప్పుడు షూటింగ్ రేంజ్‌కు వెళ్లేవారు. అక్కడ షూటింగ్ చేస్తూ తమలో ఆవేశాన్ని, ఒత్తిడిని తగ్గించుకునేవారు. ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. పాజిటివ్ ఎనర్జీ పొందడానికి ఇది మంచి ఆలోచనగా అనిపించింది" అని రామ్ కిషన్ భాకర్ తెలిపారు.
ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చాక ఆయన, హరియాణాలోని ఝజ్జర్ సిటీలో తమ కుటుంబం నడిపే స్కూల్‌లో విద్యార్థులకు షూటింగ్‌ను ఒక క్రీడగా పరిచయం చేశారు.
ప్రొఫెషనల్ షూటర్‌గా మారిన మను భాకర్, 2 ఏళ్లలోనే అంటే 16 ఏళ్ల వయసులో ఇండియన్ సీనియర్స్ టీమ్ తరఫున 2018 కామన్‌వెల్త్ గేమ్స్‌లో అరంగేట్రం చేసింది.
అందులో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. అలా అక్కడి నుంచి టోక్యో ఒలింపిక్స్ వరకు ఆమె గ్రాఫ్ పెరుగుతూనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
పడి లేచిన కెరటంలా మను భాకర్ కెరియర్
మను భాకర్ టోక్యో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టే సమయానికి, ఉమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో వరల్డ్ నెం-2 స్థానంలో కొనసాగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ టోర్నమెంట్‌లలో అత్యుత్తమ ప్రదర్శనలతో భారీ అంచనాలతో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిందామె. భారత్ తరఫున మూడు ఈవెంట్లలో అర్హత సాధించిన ఏకైక షూటర్‌గా నిలిచింది.
అయితే, ఒలింపిక్స్ వేదికపై తాను ఒత్తిడికి గురయ్యానని ఆ టోర్నీ అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో మను భాకర్ అన్నది.
"నేను తొలిసారిగా చాలా ఒత్తిడికి గురయ్యాను. రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. ఉదయం వేళల్లో కూడా ఆందోళనకు గురయ్యాను" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మను చెప్పింది.
అయితే, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో తన పిస్టల్‌లో టెక్నికల్ సమస్య తలెత్తడంతో మను భాకర్ పరిస్థితి మరింతగా దిగజారిపోయింది.
ఈ ప్రతికూల పరిస్థితులు ఆమెను తీవ్రంగా బాధించాయి. దీంతో, ఒక దశలో షూటింగ్ వదలిపెట్టాలనుకుంది. ఈ గేమ్ '9 నుంచి 5 గంటల' వరకు చేసే ఉద్యోగంలా అనిపించిందని మను భాకర్ ఒక ఇంటర్వ్యూలో అన్నది.
అయితే, 2 ఏళ్ల తరువాత 2023లో తన కోచ్ జస్పాల్ రాణాతో తిరిగి పని చేయడం మనుకు కలిసివచ్చింది. 2023 ఆసియా గేమ్స్‌లో 25 మీట్లర పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించి ఘనంగా పునరాగమనం చేసింది మను.
ఆసియా గేమ్స్ తరువాత తన కాలేజీలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మను భాకర్ ఒక మాట చెప్పింది.
"కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, విజయానికి సూత్రం ఏంటంటే.. ఎప్పుడూ ప్రయత్నాన్ని వదలకూడదు, విజయాన్ని అందుకోవడానికి నిరంతరం కష్టపడుతుండాలి"

ఫొటో సోర్స్, Getty Images
‘నేను ఎదుగుతూనే ఉంటాను’
"అవాస్తవాలతో, వక్రీకరణలతో నా గురించి చరిత్రలో చెడుగా రాయొచ్చు. కానీ, ఎవరేం చేసినా నేను ఎదుగుతూనే ఉంటాను"
పౌర హక్కుల కార్యకర్త మయా ఏంజెలో రాసిన ఈ కవిత, టోక్యో ఒలింపిక్స్‌లో ఘోర పరాభావం తరువాత మను భాకర్‌లో స్ఫూర్తినింపింది. దీంతో, ఆమె మెడ వెనక " స్టిల్ ఐ రైజ్" అని పచ్చబొట్టు వేసుకుంది.
"క్రీడాకారుల జీవితంలో గెలుపు, ఓటములు సహజం. కానీ, కఠిన సవాళ్లను తట్టుకుని నువ్వు ఎలా పునరాగమనం చేస్తావు అన్నదే ముఖ్యం" అని మను భాకర్ అన్నది.
"టోక్యో ఒలింపిక్స్ ఫలితాలు కఠినంగా ఉన్నప్పటికీ, నేను మళ్లీ సత్తా చాటుతాననే నమ్మకం నాకుండేది. ఆ మాటలు నన్నెంతగానో ప్రభావితం చేశాయి. అందుకే వాటిని పచ్చబొట్టుగా వేసుకున్నాను" అన్నదామె.
పడి లేచిన కెరటంలా మను భాకర్ స్ఫూర్తివంతమైన కథ అద్భుతంగా అనిపించి ఉండొచ్చు గానీ, ఆమెను దగ్గరి నుంచి చూసినవాళ్లకు ఇది పెద్దగా ఆశ్చర్యంగా అనిపించదు.
ఎందుకంటే, 2018 కామన్‌వెల్త్ గేమ్స్‌లో తన బిడ్డ గొప్పతాన్ని తెలియజేస్తూ ఆమె తండ్రి రామ్ కిషన్ భాకర్ ఒక సంఘటన గురించి చెప్పారు.
"అక్కడ ప్రస్తుతం లేదా గతంలో గెలిచిన గోల్డ్ మెడలిస్ట్‌లు సంతకం చేయడానికి ఒక గోడ ఉండేది. పోటీకి ఒక రోజు ముందు, మను భాకర్ అక్కడికి వెళ్లి ఆ గోడపై సంతకం చేసేందుకు మార్కర్ కోసం వెతుకుతోంది. అయితే, నువ్వు గోల్డ్ మెడల్ గెలిచావా? అంటూ ఒక వలంటీర్ ఆమెను అడిగారు. దీంతో, మను సింపుల్‌గా అక్కడి నుంచి వెనక్కి వస్తూ, రేపు మళ్లీ వచ్చి సంతకం చేస్తాను చూడు అని చెప్పింది" అని రామ్ కిషన్ భాకర్ గుర్తు చేసుకున్నారు.
చెప్పినట్లుగానే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో గోల్డ్ గెలుచుకుని తిరిగి అక్కడ అడుగుపెట్టింది మను.
"నేను ఎవ్వరికంటే తక్కువ కాదు" అనే దృక్పథం మను భాకర్‌ను ముందుకు నడిపిస్తోందని ఆమె తండ్రి గర్వంగా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చదువుల్లోనూ గురి తప్పలేదు
అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే తపన ఆమె షూటింగ్ రేంజ్‌కు మించి ఉంటుందని మను భాకర్ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ అమనేంద్ర మన్ అన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌కు ముందు బిజీ షెడ్యూల్ కారణంగా భాకర్ మూడు, నాలుగు సెమిస్టర్ పరీక్షలు రాయలేదని ప్రొఫెసర్ మన్ బీబీసీతో చెప్పారు.
"ఒలింపిక్స్ తరువాత ఒకేసారి రెండు సెమిస్టర్ పరీక్షలు మను రాసింది. 74 శాతం మార్కులతో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో తనే కాలేజ్ టాపర్‌గా నిలిచింది" అని ఆయన చెప్పారు.
అయినా, మను భాకర్ సంతృప్తి చెందలేదు.
"గ్రాడ్యుయేషన్‌లో భాకర్ 78శాతం మార్కులు సాధించారు. కనీసం ఇదే మార్కులను పీజీలోనూ సాధించాలని అనుకున్నారు. తన గురించి చెప్పాలంటే మెడల్స్, మార్కులే కాదు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడానికి వెనకాడని తన ధోరణిని ఇక్కడ అర్థం చేసుకోవాలి" అని ప్రొఫెసర్ మన్ అన్నారు.
ఈయన స్పోర్ట్స్ సైకాలజీలో పీహెచ్‌డీ చేశారు.

‘‘మీ కథను మీరే రాసుకోవాలి’’
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న తర్వాత మను భాకర్ మాట్లాడారు. తనకు అవార్డు లభించినందుకు హర్షం వ్యక్తం చేశారు.
‘‘ఈ గౌరవాన్ని అందించినందుకు మొదట బీబీసీకి కృతజ్ఞతలు. గతంలో నాకు ఎమర్జింగ్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు. ఇప్పుడు స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేతగా నిలిచాను. ఇది ఎత్తుపల్లాలతో కూడిన ప్రయాణం.
నేను చాలా మ్యాచ్‌ల్లో ఓడాను, అలాగే చాలా మ్యాచ్‌లు గెలిచాను. ఇప్పుడు ఈ అవార్డుతో మీ ముందు నిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు కేవలం మహిళా అథ్లెట్లనే కాకుండా జీవితంలో పెద్ద పెద్ద కలలు కంటున్న, జీవితంలో ఏదో సాధించాలని తపన పడుతున్న ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నా.
మీరు పతకాలు సాధించలేకపోతున్నప్పుడు లేదా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మీ ప్రయాణం ముగిసినట్లు కాదు. అది కొనసాగుతుంది. మీరు ప్రయత్నాన్ని ఆపేసినప్పుడు మాత్రమే మీ కథ ముగుస్తుంది. మీ కథను మీరే రాసుకోవాలి. టోక్యోలో విఫలమైనప్పుడు నా కథ ముగియలేదు. అది కొనసాగింది. పారిస్‌లో పతకాలు సాధించడంతో నేను అనుకున్నది సాధించాను. ఇకపై కూడా అలాంటి ప్రదర్శనలే నమోదు చేయాలనుకుంటున్నా. నేను ఇంకా కఠోర శ్రమ చేస్తాను. ఒలింపిక్స్ పసిడి కోసం విరామం లేకుండా కృషి చేస్తాను.
నాకు ఈ పురస్కారాన్ని అందించినందుకు మీకు మరోసారి కృతజ్ఞతలు. ఈరోజు అవార్డులు గెలుచుకున్న అందరికీ అభినందనలు.
మనం ఇంకా చాలా ముందుకు వెళ్లాల్సి ఉంది. ఇక్కడ ఉన్న అందరికీ ఆ విషయం తెలుసు. కానీ, మనం కచ్చితంగా చాలా పురోగతి సాధించాం. 30 ఏళ్ల క్రితం, మహిళలు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. వారి వల్ల ఇప్పుడు మనకు కాస్త సులువైంది. రాబోయే తరాల వారికి, అంటే కేవలం మహిళా అథ్లెట్లకు మాత్రమే కాకుండా ప్రతీ రంగంలో రాణిస్తున్న మహిళలకు మరింత సులభంగా మారుతుందని నేను ఆశిస్తున్నా’’ అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















