ల్యాండవుతూ తిరగబడిన విమానం, ఈ ప్రమాదం ఎలా జరిగింది?

టొరంటో పియర్సన్ ఎయిర్‌పోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టొరంటో పియర్సన్ ఎయిర్‌పోర్టులో ల్యాండవుతూ బోల్తాపడ్డ విమానం

కెనడాలోని టొరంటో పియర్సన్ ఎయిర్‌పోర్టులో ల్యాండవుతూ విమానం వెల్లకిలా పడిన ప్రమాదం నుంచి ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా బయటపడ్డారని ఎయిర్‌పోర్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.

''అందరూ క్షేమంగా ఉన్నారు. చిన్నచిన్న గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి అందరూ బయటపడడం సంతోషం కలిగించింది'' అని గ్రేటర్ టొరంటో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి చెందిన డెబోరాహ్ ఫ్లింట్ అన్నారు.

ప్రమాదంలో ఒక చిన్నారి సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని ఎమర్జెన్సీ సర్వీసు తెలిపింది. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన ఇమేజ్‌లు షేర్ అయ్యాయి. మంచుతో కప్పి ఉన్న రన్ వే మీద విమానం పల్టీ కొట్టి పడిపోయింది. విమానం రెండు రెక్కల్లో ఒకటి ఆ ఫోటోల్లో కనిపించడం లేదు.

మిన్నియాపోలిస్ నుంచి వస్తున్న డెల్టా ఎయిర్ లైన్స్ విమానం ప్రమాదానికి గురయిందని టొరంటోలోని పియర్సన్ ఎయిర్‌పోర్టు తెలిపింది. విమానంలో 76మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విమాన ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ఓ చిన్నారి సహా ముగ్గురికి తీవ్ర గాయాలు

18మందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మూడు ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్లను, రెండు అంబులెన్సులను ప్రమాదస్థలికి తరలించామని ఒంటారియో ఎయిర్ అంబులెన్స్ సర్వీసు తెలిపింది.

గాయపడ్డవారిలో ఓ చిన్నారి, 40 ఏళ్ల మహిళ, 60ఏళ్ల వ్యక్తి ఉన్నారని తెలిపింది.

అత్యవసర సిబ్బంది స్పందించిన తీరుపై టొరంటో పియర్సన్ ఎయిర్‌పోర్టు సీఈవో ఫ్లింట్ ప్రశంసలు కురిపించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటానికి వారే కారణమని ఆయనన్నారు.

విమానంలోని ప్రయాణికుల్లో 22 మంది కెనడియన్లని, మిగిలినవారిలో వివిధ దేశాలకు చెందినవారున్నారని ఫ్లింట్ చెప్పారు.

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రమాదంలో ఓ చిన్నారి సహా ముగ్గురు గాయపడ్డారు.

ప్రమాదానికి మంచే కారణమా?

ప్రమాదం జరిగిన వెంటనే టొరంటో పియర్సన్ ఎయిర్ పోర్టు మూసివేశామని, కాసేపటి తర్వాత 3.30గంటల సమయంలో రాకపోకలు యథావిధిగా మొదలయ్యాయని ఎయిర్ పోర్టు తెలిపింది.

ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపేందుకు ఓ బృందాన్ని ఏర్పాటుచేశామని ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఆఫ్ కెనడా (టీఎస్‌బీ)తెలిపింది.

దర్యాప్తు కోసం రెండు రన్‌వేలు చాలా రోజులపాటు మూసి ఉంచుతామని, విమానాల రాకపోకలు కాస్త ఆలస్యమవుతాయని చెప్పింది.

రన్ వే పొడిగా ఉందని, ఎదురుగాలి వీచిన పరిస్థితులు లేవని టొరంటో పియర్సన్ ఫైర్ చీప్ టాడ్ అయిట్‌కెన్ చెప్పారు. దర్యాప్తులో అన్నివిషయాలు తెలుస్తాయన్నారు.

అయితే ప్రమాదం సమయంలో గంటకు 64 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టు మొదట వార్తలొచ్చాయి.

బోల్తా పడిన విమానం నుంచి ప్రజలు బయటకు వస్తుండడం, అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపట్టడం సోషల్ మీడియాలో షేర్ అయిన ఫుటేజ్‌లో కనిపించింది.

''మేం టొరంటోలో ఉన్నాం. ఇప్పుడే ల్యాండ్ అయ్యాం. మా విమానం ప్రమాదానికి గురయింది. ఓ పక్కకు ఒరిగిపోయింది'' అని ఆ విమానం నుంచి బయటకు వస్తూ వీడియో తీస్తున్న ఓ వ్యక్తి చెప్పారు.

విమానం లోపలినుంచి ప్రయాణికులు బయటకు రావడానికి ఎయిర్ పోర్టు సిబ్బంది సహకరిస్తుండడం, మరికొందరు విమానం ప్రవేశద్వారం దగ్గరనుంచి పరుగులు తీస్తుండడం కూడా వీడియోలో కనిపించింది.

''చాలామంది క్షేమంగా ఉన్నారు. మేమందరం దిగుతున్నాం. అక్కడ కొంచెం పొగవస్తోంది'' అని వీడియోలో ఒక వ్యక్తి చెబుతున్నారు.

ఎయిర్ పోర్టు, స్థానిక అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాట్లాడారని, అవసరమైన సాయం చేస్తారని ఒంటారియో ప్రీమియర్ డాగ్ ఫోర్ట్ చెప్పారు.

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బోల్తా పడిన విమానం

విమానం ప్రమాదానికి గురయిన వెంటనే వేగంగా స్పందించిన సహాయక సిబ్బంది

ప్రమాదం తర్వాత ఎయిర్‌పోర్టు ఎరైవల్, డిపార్చర్ బోర్డులపై విమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించిన సమాచారం కనిపించింది.

విమానాలు రద్దవడంతో తాము టొరంటోలో చిక్కుకుపోయాయని కొందరు ప్రయాణికులు బీబీసీతో చెప్పారు.

''కస్టమ్స్ నుంచి సెక్యూరిటీ దాకా వారు అందరినీ అక్కడినుంచి వెళ్లిపొమ్మన్నారు. దీంతో డిపార్చర్స్ హాల్ జనంతో నిండిపోయింది'' అని జేమ్స్ చెప్పారు.

ప్రమాదానికి గురయిన విమానాన్ని వాళ్లు ఎక్కవలసిఉంది. అది క్యాన్సిల్ అయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక వారి ప్రయాణాలను రీ షెడ్యూల్ చేసుకున్న తర్వాత ఇలా ఆలస్యం కావడం ఇది మూడోసారి.

టొరంటో పియర్సన్ ఎయిర్‌పోర్టును కొన్నిరోజులుగా వాతావరణం ఇబ్బందిపెడుతోంది. ఒంటారియోలో మంచు విపరీతంగా కురుస్తోంది. గడ్డ కట్టే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

బుధవారం, ఆదివారం రెండు మంచు తుపానులు సంభవించాయి. 30 నుంచి 50సెంటీమీటర్ల మేర మంచుకురిసింది.

విమానం ప్రమాదం జరిగే సమయంలో కొద్దిపాటి మంచు కురుస్తోందని బీబీసీ అమెరికా పార్టనర్ సీబీఎస్ తెలిపింది.

ఎయిర్‌పోర్టు దగ్గర గడ్డకట్టే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, భారీ గాలులు వీస్తాయని సోమవారం ఉదయం వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

వారాంతంలో మంచుతుపాను ముంచెత్తడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనావేశారు. మంచుతుపాను తర్వాత 22సెంటీమీటర్ల మంచు తొలగించారు.

గడచిన నెలరోజుల్లో ఉత్తర అమెరికాలో ఇది నాలుగో విమాన ప్రమాదం. ఇటీవల వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టు దగ్గర ప్యాసింజర్ విమానాన్ని మిలిటరీ హెలికాప్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో 67మంది చనిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)