చాక్లెట్ దొంగిలించిందనే అనుమానంతో బాలికపై దాడి, ఆమె చనిపోవడంతో ఎగసిన ఆగ్రహావేశాలు

పాకిస్తాన్, బాలిక హత్య, పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అజదేష్ మోషిరి, ఉస్మాన్ జాహిద్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

హెచ్చరిక : ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలవరపరిచే అవకాశం ఉంది.

పాకిస్తాన్‌లో 13 ఏళ్ల బాలికను హత్య చేశారనే అనుమానంతో ఒక జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇంట్లో చాక్లెట్ దొంగింలించిందనే అనుమానంతో బాలికను తీవ్రంగా కొట్టడంతో ఆమె చనిపోయిందని వారిపై ఆరోపణలు వచ్చాయి

ఇక్ర అనే బాలిక బుధవారం గాయాలతో ఆసుపత్రిలో చేరింది. తర్వాత కాసేపటికే చనిపోయింది.

బాలికను తీవ్రంగా హింసించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

రావల్పిండిలో జరిగిన ఈ సంఘటనపై పాకిస్తాన్‌ అంతటా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. #JusticeforIqra హ్యాష్‌టాగ్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌ అవుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాకిస్తాన్, #JusticeforIqra , బాలిక హత్య, పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాలికకు న్యాయం చేయాలని కోరుతూ పాకిస్తానీలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ( ప్రతీకాత్మక చిత్రం)

న్యాయం కోసం ఆన్‌లైన్‌లో పోరాటం

బాల కార్మికుల గురించి పాకిస్తాన్‌లోని వివిధ ప్రావిన్సుల్లో వివిధ రకాల చట్టాలున్నాయి.

ఈ సంఘటన జరిగిన పంజాబ్ ప్రావిన్స్‌లో 15 ఏళ్ల లోపు పిల్లలతో పని చేయించడాన్ని నిషేధించారు.

"పోలీసులు నాకు ఫోన్ చేసి పిలిచారు. నేను ఆసుపత్రికి చేరుకున్నాక, ఇక్రా అపస్మారక స్థితిలో ఉండటం చూశాను. ఆ తర్వాత కాసేపటికే ఆమె మరణించింది" అని ఇక్రా తండ్రి సనావుల్లా బీబీసీతో చెప్పారు.

ఇక్రా ఎనిమిదేళ్ల వయసు నుంచే ఇళ్లల్లో పని చేస్తోంది. తనకు అప్పులు ఉండటంతో కూతురు పని చేయాల్సి వస్తోందని ఆమె తండ్రి చెప్పారు.

ప్రస్తుతం ఆమెను హింసించిన జంట ఇంట్లో ఇక్రా రెండేళ్లుగా పని చేస్తోంది.

వాళ్లింట్లో పని చేసినందుకు గాను, ఆమెకు నెలకు 8,500 పాకిస్తానీ రూపాయలు ( భారత కరెన్సీలో రూ.2,500) వచ్చేవి.

"ఇక్రా చాక్లెట్లు దొంగిలిందని ఆమె యజమాని ఆరోపిస్తూ ఆమెను హింసించాడు. ఆమెను హింసించారని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి" అని పోలీసులు చెప్పారు.

బీబీసీకి లభించిన ఇక్రా ఫోటోలలో ఆమె కాళ్లు, చేతులకు గాయాలు, తలకు తీవ్ర గాయమైనట్లు కనిపిస్తోంది.

పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి‌స్థాయి దర్యాప్తు చేపట్టాలని పోలీసులు వేచి చూస్తున్నారు.

"నా హృదయం రక్తపు కన్నీరు కారుస్తోంది. ఇంకా ఎంతమంది అమాయకులు తమ ఇళ్లలో ఇలా హింసను ఎదుర్కొంటూ ఉంటారు? పేదలు తమ కూతుళ్లను ఇలా సమాధిలోకి నెట్టడం ఇంకా ఎంతకాలం సాగుతుంది?" అని ఈ ఘటనపై స్పందిస్తూ సామాజిక కార్యకర్త షెహర్ బానో ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.

చాక్లెట్ కోసం ఒక బాలికను హత్య చేయడం చూసి పాకిస్తానీలు ఆశ్చర్యపోతున్నారు.

ఆన్‌లైన్‌లో ఓ యూజర్ ‘చాక్లెట్‌కు చావు’ అని రాశారు.

"ఇది నేరమే కాదు. ఇది మన వ్యవస్థ, ఇక్కడ ధనవంతులు పేదలను ఇలాగే చూస్తారు" అని మరో యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాకిస్తాన్, #JusticeforIqra , బాలిక హత్య, పోలీసులు

ఫొటో సోర్స్, x.com/OfficialShehr

ఫొటో క్యాప్షన్, బాలికను హింసించిన దంపతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కస్టడీలో నిందితులు

ఇక్రా యజమాని రషీద్ షఫీక్, అతని భార్య సనాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల ఇంట్లో పిల్లలకు ఖురాన్ బోధించే ఉపాధ్యాయుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక్రా గాయపడిన తర్వాత ఆమెను ఉపాధ్యాయుడు ఆసుపత్రికి తీసుకు వచ్చి, ఆమె తండ్రి చనిపోయారని, ఆమె తల్లి ఆచూకీ తెలియదని చెప్పి ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు చెప్పారు.

తన కుమార్తె మరణానికి కారణమైన వారిని జైల్లో పెట్టాలని ఇక్రా తండ్రి కోరారు.

ఇలాంటి కేసుల్లో దోషులకు శిక్ష పడదు. ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమైన కేసుల్లో నిందితులు కోర్టు బయట పరిష్కారించుకోవడం పాకిస్తాన్‌లో తరచు జరిగే వ్యవహారం.

2018లో, ఒక న్యాయమూర్తి, అతని భార్య, తమ ఇంట్లో పని చేస్తున్న పదేళ్ల బాలికను హింసించినట్లు తేలడంతో వారికి మూడేళ్ల జైలుశిక్ష విధించారు.

తర్వాత శిక్షను ఏడాదికి తగ్గించారు, ఈ కేసుపై పాకిస్తాన్‌లో విస్తృత చర్చ జరిగింది.

ఈ కేసులో బాధిత బాలిక తయ్యబా శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. ఆమె చేతులు, కాళ్లపై గాయాలు ఉన్నట్లు పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలిపింది. ముఖం మీద కోసిన గీతలు, కంటి మీద వాపు ఉన్నట్లు ఫోటోలో కనిపించింది. ఇంట్లో చీపురు కనిపించలేదని ఆరోపిస్తూ తనను కొట్టారని ఆ బాలిక దర్యాప్తు అధికారులకు చెప్పారు.

పాకిస్తాన్ చట్టాల ప్రకారం అనేక తీవ్రమైన కేసుల్లో బాధితుల కుటుంబం నిందితుల్ని క్షమించేందుకు హక్కు ఉంది. ఇందుకోసం వాళ్లు 'అల్లా పేరిట' ఇలా చేస్తున్నామని కోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేయాలి.

అయితే, నిందితులు, బాధితుల కుటుంబానికి డబ్బులు ఇవ్వడం వల్లనే అలాంటి క్షమాపణలు చెబుతున్నారని న్యాయ నిపుణులు అంటున్నారు. బాధిత కుటుంబానికి డబ్బు ఇవ్వడం పాకిస్తాన్‌లో చట్ట వ్యతిరేకం కాదు.

పాకిస్తాన్‌లో 33 లక్షల మంది బాల కార్మికులుగా పని చేస్తున్నారని యూనిసెఫ్ చెబుతోంది. పాకిస్తాన్‌లో ఇళ్లలో పని చేస్తున్న 85లక్షల మందిలో ఎక్కువమంది మహిళలు, పిల్లలు అని అంతర్జాతీయ కార్మిక సంస్థ లెక్కలు చెబుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)